మోగని తీగ వెనుక
ఆగిందా? ఆగి ఉందా?
అని పిలుపు కోసం వెతుకులాట.
ప్రతీ వాగ్దానపు కర్ర మీద
ఒక ఆశాలత పాకించి పొంగిపోయిన మనసు
తీగకు అల్లుకునే గుణం ఉంటుంది
మంచు పేరుకుపోయాక మాత్రం
వసంతం వచ్చేదాకా వేచి చూడాలి .
పదాలు పై తొడుగులు,
చెప్పీ,చెప్పక కొన్ని భావాలు దాచి పెడతాయి
తాబేలు పెంకు వెనక దాక్కుంటుంది!
అవకాశం ఉంటే ఇదే బ్రతుకు
ఇలాగే గడుపుతావా?
అవునేమో! కాదేమో!
గడియారం కేసి చూస్తూ
వెలుగు పారబోసినందుకు
కాలం ఏడాది చివర్లో
ఓ సారి గుచ్చి వెళ్ళిపోతుంది
ఉన్న చోటు పదిలం
అని తెల్లవెంట్రుక నవ్వుతూ చెప్పింది.
మూగబోయిన గొంతులన్నీ
మరుపు పొరల్లోకి జారిపోతాయి.
రోజూ వచ్చే బంధువు ఉదయపు కాఫీ
శుక్లాలు తీసేసిన గాజు కళ్ళతో
నీలం,నలుపు వేలాడదీసిన
విశాలమైన ఆకాశంలోకి
కాళ్లు నడుచుకుంటూ వెళ్తాయి.