మెరుపులు- కొరతలు

రాజా అంబటి కథ “గ్రీవెన్స్”

                                                                – డా.కే.వి.రమణరావు

          ఇదొక చిన్న కథ. విశాఖపట్నం జిల్లాలోని మారుమూల ప్రదేశాన్ని నేపధ్యంగా తీసుకుని గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికీ కొనసాగుతున్న వర్ణవివక్షను చూపించిన కథ. జిల్లా ఆఫీసులోని సహృదయుడైన ఒక చిన్న ఉద్యోగి పరంగా ఈ కథ చెప్పబడింది.
స్థూలంగా కథేమిటంటే, విశాఖపట్నం కలెక్టరాఫీసులో గుమాస్తాగా పనిచేస్తున్న విజయ్ అనే ఉద్యోగి కొండల్లోవున్న సురవరం అనే పల్లెనుంచి దొన్ను అనే వ్యక్తి రాసిన ఫిర్యాదును ఒకరోజు చూస్తాడు. ఆ ఫిర్యాదు పాత కాగితంలో రాసినప్పటీకీ చాలా పద్ధతిగా రాసివుండటంతో ఆతనికి ఆసక్తి కలిగి చదువుతాడు. సురవరంలో తాముండే ప్రాంతానికి తాగునీళ్లు రావడం లేదని, ఆ సౌకర్యం కల్పించమని దొన్ను పెట్టుకున్న అర్జీ అది. ఆ అర్జీ పెట్టుకుని రెండేళ్లైవుంటుంది.

          విజయ్ కి జాలి కలిగి దొన్నుతో మాట్లాడి, రెండేళ్లైనా ఇంకా ఆ సమస్య పరిష్కారం కాలేదని తెలుసుకుని, వెంటనే అరవింద్ అనే ఆవూరి పంచాయతి సెక్రటరికి ఫోన్ చేసి దొన్నువాళ్ల కాలనీకి నీటి సరఫరా ఏర్పాటు చేయమంటాడు. అరవింద్ అక్కడ నీళ్లు వస్తున్నాయని చెప్తాడు. అయినా విజయ్ ఆ గ్రీవెన్స్ ని ముఖ్యమంత్రి చూసే అవకాశం ఉందని చెప్పి వెళ్లి చూసి ఆ సమస్యను తీర్చమంటాడు. అరవింద్ ఆ మరుసటిరోజే వెళ్లి ఆ పంచాయతి ఆఫీసు దగ్గర కొత్తబోర్లు వేయించి, అకాలనికి కొత్త పైపులైన్లు ఏర్పాటు చేసినీటి సరఫరాను పునరుద్ధరించి ఆవిషయం విజయ్ కి చెప్తాడు.
ఆ తరువాతిరోజు సెలవు అవడంవల్ల విజయ్ వ్యక్తిగత ఆసక్తితో అక్కడికి అరవింద్ ని తోడు తీసుకుని వెళ్లి చూస్తాడు. దొన్ను ఊర్లో ఉండడు. ఊర్లో బోర్లు, ట్యాంకులు, పైపులు బాగానే పనిచేస్తుంటాయి. దొన్నువాళ్లుండే చివరి కాలనిలోని పైపుల్లో మాత్రం నీళ్లు రావు.
అక్కడేవున్న ఒక ఆడమనిషిని అడిగితే ఆమె ‘అదే పైపుల్లోని నీళ్లు కాలని వాళ్లు తాగితే అవి మైల పడతాయని ‘పెద్దక్యాస్టు’వాళ్లు ఆ కాలనికొచ్చే పైపులను పగలగొట్టేసారని, పంచాయతి అఫీసులోవున్న బోరు దగ్గరికి వస్తే చంపేస్తామని చెప్పారని, అందుకని వాళ్లు పది కిలోమీటర్లు వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నారని, ఇదంతా చేస్తున్నాడని దొన్ను పైన కత్తి గట్టారని, అందుకే ప్రస్తుతం అతను భయంతో దూరంగా వెళ్లిపోయాడని చెప్తుంది.

          షాక్ కి గురైన విజయ్ నిసృహతో విశాఖపట్నానికి తిరిగి వెళ్లిపోతాడు. సోమవారం రోజున పై ఆఫీసరు ఒత్తిడిమీద ఆ ఫిర్యాదును పరిష్కరించినట్టుగా చూపించి ఫైలు మూసేయడంతో కథ ముగుస్తుంది.

          ఈ కథను రచయిత సంప్రదాయ శిల్పంలో రాసారు. కథ నడిచిన సమయం మొత్తం నాలుగురోజులు. మొదటినుంచి చివరికి సరళరేఖలో నడుస్తుంది. కథను ఒక ప్రభుత్వ ఉద్యోగి దృష్టికోణంలో రాయడం జరిగింది కాబట్టి చాలాచోట్ల కార్యాలయ భాష, సాంకేతిక పదాలు, వివరణ కనిపిస్తాయి. దొన్ను, వాళ్ల కాలనిలోని ఆడమనిషి ఆదివాసిలు మాట్లాడే తెలుగులో మాట్లాడతారు. యాస అసంపూర్ణంగా ఉంది. రచయిత ఈ విషయం మీద శ్రద్ధ పెట్టినట్టు కనపడదు.

          రచయిత మరికొన్ని విషయాలను అంతగా పట్టించుకున్నట్టు లేదు. అందులో ముఖ్యమైనవి; దొన్ను సరిగ్గా చదువుకోని ఆదివాసి ఐనా అతని ఫిర్యాదు పక్కా అధికారిక పద్ధతిలో చక్కటి దస్తూరితో విద్యావంతుడు రాసినట్టు ఉంటుంది, పంచాయతి సెక్రటరి అరవింద్ ఒక్కరోజులోనే స్వంత ఖర్చులతో బోర్లు, కాలనికి కొత్తపైపులు వేయిస్తాడు. ఆవూరిలోనే సంబంధిత ఉద్యోగం చేస్తున్నా అరవింద్ కి వివక్ష గురించి తెలియదు. సమస్యకు కారణం వివక్ష అని తెలియక ముందు తీసుకున్న శ్రద్ధ విజయ్ ఆ తరువాత చూపించకుండా పని పూర్తైందని ఫైల్ మూసేస్తాడు. ఐతే ఇవన్నీ కథ ద్వారా చెప్పదల్చుకున్న విషయానికి అంత ముఖ్యం కాదని రచయిత అనుకుని ఉండొచ్చు.
కథనం సాఫీగా నడవడమేకాక కొన్నిచోట్ల వర్ణనలు సున్నితంగా సాగుతాయి. ఉదా; ‘వెలిసిపోయిన నీలిరంగులా, ఒకవైపు రాస్తే మరోవైపు కనిపించేలా’.. ‘పచ్చని కొండలని కప్పేసిన మంచును వెలిగిస్తున్నాడు సూర్యుడు తన లేలేత కిరణాలతో’..
పెద్దక్యాస్టువారు పైపులు పగలగొట్టడం గురించి కాలనిలోవున్న ఆడమనిషి కొంత భయంగా చెప్పిన మాటలు వివక్షను తమదైన గొంతుతో సహజంగా ఇలా వివరిస్తాయి. “ఆ బోరు దగ్గరికి రానియ్యార్ సారూ. ఏంకంటే వారు పెద్దకేస్టు వారంట, మేము, వారూ ఒకా నీరు తాగాడం ఈలయ్యాదట. మేము బోరుకు వస్తే సంపివేస్తురు సారూ. ఈ టాపుకి నీరస్తే నీళ్లు మైలైతాయంటలే. సక్రటరి దగ్గరుండి పని చేయించిడి, సారూ. కాని, నిన్నరాత్రి గొట్టాలు నరికి వేసారు. ఈదంతా దొన్ను చేస్తున్నాడని దొన్నుపై కత్తి పెట్టేర్, సారూ. ఏమైనా చేస్తార్ అని భయానికి పారిపోయాడు, సారూ. ఈరోజు గొట్టాలు నరికేసారు, రేపేమో మాకి నరికి వేస్తారట”

          కథా విషయానికొస్తే రచయిత తీసుకున్న అంశం, దాన్ని చెప్పిన తీరు ఆసక్తికరంగా, హృద్యంగా ఉన్నాయి. పాఠకుల్లో ఒక అవగాహనతో పాటు నిసృహ, ఆవేశం కలుగుతాయి. ఇంకా వదలని వివక్ష గురించి విజయ్ పాత్ర ద్వారా రచయిత లేవనెత్తిన ప్రశ్నలు ‘నీళ్లు ఎవ్వరి సొత్తు? ఎందుకిలా జరుగుతోంది? ఇంకా ఏ కాలంలో ఉన్నాం మనం?’ పాఠకులను సూటిగా తగులుతాయి. ‘ఈ వివక్ష దేనికీ బెదరట్లేదు’ అంటూ ప్రకటించిన ఆవేదన ఆలోచింపజేస్తుంది. ఐతే అక్కడ దౌర్జన్యం చేస్తున్నవాళ్లని ఇదివరకు బెదిరించినట్టు గాని లేక సమస్య పరిష్కారానికి ఉన్న ఇతర మార్గాలనేమైనా అనుసరించవచ్చా అన్నదిగాని రచయిత ప్రస్తావించలేదు.

          ఇలాంటి కథాంశాన్ని ప్రభుత్వపరంగా పాజిటివ్ దృక్పథంతో చెప్పిన కథలు అరుదు. అలా రాయడమేకాక ప్రభుత్వోద్యోగుల్లో సంస్కరణాభిలాషులుంటారన్న వాస్తవాన్నికూడా చూపించారు రచయిత. కథ చిన్నదైనా పొందిగ్గా సూటిగా ఉండడంతో అది పాఠకులను చక్కగా చేరుతుందనడంలో సందేహం లేదు. రచయిత అభినందనీయుడు.         

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.