సముద్రమంత మనసు

-ఆదూరి హైమావతి 

          అనగా అనగా ఒక అడవి. ఆ అడవిలో చాలా జంతువులూ, పక్షులూ ఇంకా చీమ వంటి చిన్న జీవులూ కూడా కలసి మెలసి ఎవరి పనులు వారు చేసుకుంటూ జీవించేవి.
చీమలు చాలా శ్రమజీవులే కాక, జాగ్రత్త కలవికూడా, వాటికి ముందుచూపు ఎక్కువ. నిరంతరం పనిలోనే ఉంటాయి.

          రోజంతా అడవంతా తిరుగుతూ వర్షాకాలం కోసం ఆహారం మోసుకు తెచ్చుకుని తమ పుట్టలోని అరల్లో దాచుకుంటుంటాయి. అడవిలో ఎక్కడెక్కడ ఏ తినే వస్తువులున్నోయో ఒకదాని కొకటి చెప్పుకుని అడవిలో చకచకా సైనికుల్లా కవాతు చేస్తూ పోతుంటాయి.

          అడవి జంతువుల్లో అతిపెద్దదైన ఏనుగు నడుస్తుంటే చీమలు దాని కాళ్ల క్రింద పడి చనిపోయేవి.

          ఒకమారు చీమలరాజు, చీమల రాణి చెట్టు కింద నుండీ నడుస్తున్న పెద్ద గజరాజును చూసి ఎదురుగా ఉన్న చెట్టు కొమ్మపై మాటేసి కూర్చుని పెద్దగా అరిచాయి.
“ఏనుగన్నా! ఏనుగన్నా! మాకేసి చూడు, మా మాట విను అన్నా!”అని. ఏనుగుకు పెద్ద చెవులు కదా బాగా అందరి మాటలూ వినాలని దేవుడు ఏనుగులకు పెద్ద చెవులు ఇచ్చాడుట. అందుకే ఏనుగు తాను అతిపెద్ద జంతువైనా, అతి చిన్న చీమల మాటలు ఆలకించింది.

          ఆ చెట్టు క్రింద ఆగి తలెత్తి చీమలకేసి చూసి “చెప్పండి చిట్టి చెల్లాయీ, చిన్నారి తమ్ముడూ! ఎందు కోసం నన్ను ఆపారు? నాకేం చెప్పాలను కుంటున్నారూ? ” అని అడిగింది ప్రేమగా.

          వెంటనే చీమలరాణి, చీమలరాజూ ఒకే స్వరంతో పెద్దగా ” గజరాజన్నా! మీరు నడుస్తుంటే మా జాతి చీమలు, మా ప్రజలు మీ పాదాల క్రింద పడి మరణిస్తున్నాయి. ఇలా జరుగుతూ పోతే, మా జాతి మిగలదు అన్నా! మీరేమో అతి పెద్దవారు. మేమేమో అతి చిన్నవారం, ఐనా మీరు మా మాట విని ఆగారు చూడండీ! అదే మీ గొప్పదనం, మీ గొప్ప మనస్సు , మీ ప్రేమ హృదయం, మీ గొప్ప సంస్కారం. అన్నా! నడిచేప్పుడు కాస్తంత చూసి నడవండి అన్నా! మాజాతి మరణించ కుండా ఉంటుంది, ఇది మా ప్రార్థన అన్నా! ఎప్పుడైనా మాకు చేతనైన సాయం చేస్తాం అన్నా! మేము చిన్నవారమని తలంచకండి. ఎప్పుడైనా ఎవరి తోనైనా పని కలుగవచ్చు” అని వేడుకున్నాయి రెండు చేతులూ జోడించి.

          ఏనుగు ” చిన్నారి తంబీ! చెల్లీ! నా పొరపాటును మన్నించండి. నేను ఎదురుగా చూస్తూ నడుస్తుంటాను. అందువల్ల మీ జాతి చీమలు నా పాదాల క్రింద పడే విషయం నేను గుర్తించనేలేదు. కావాలని ఏ జీవికీ బాధ కలిగిచడం మా జాతి లక్షణం కాదు. మేము శాఖాహారులం కదా! ఎవ్వరినీ బాధించం. ఎవ్వరికీ హానిచేయం. ఈ రోజునుండీ మీజాతి చీమలను వెళ్ళేప్పుడు దారికి ఎడం వైపూ, తిరిగి మీ పుట్టకు వచ్చేప్పుడు కుడివైపూ నడవ మని చెప్పండి. నేను మధ్యగా నడుస్తాను, అప్పుడు మీజాతి వారికి ఏహానీ నావలన జరుగదు. సరా! మీరు ఇంత చిన్న వారైనా మీ మనస్సు ఎంతపెద్దది! మీరు నాకు సాయం చేస్తాననడం మీ ప్రేమకు, గొప్ప దనానికీ నిదర్శనం. మంచిది వెళ్ళి రండి బంగార్లూ ” అని హామీ ఇచ్చి సాగిపోయింది ఏనుగు ఆహారం వెతుక్కుంటూ.
అలా చీమల జాతి ఏనుగు పాదాల క్రింద పడకుండా చీమల రాజూ, రాణీ తమజాతి ప్రజలను కాపాడుకోను ప్రయత్నించి సఫలమయ్యాయి. నాయకుల ధ్యేయం తమ ప్రజలకు సౌకర్య వంతమైన జీవనం, భయంలేని జీవనం అందించడమే కదా!

          కాలంగడుస్తున్నది.కొద్దికాలానికి వర్షాభావం ఏర్పడింది. అనావృష్టి వలన అడవంతా పచ్చదనం కోల్పోయింది.చెట్లన్నీ మోడువారిపోయాయి. ఎక్కడా పచ్చగడ్డి లేదు. శాకాహార జంతువులకు తిండిలేక కృశించిపోతున్నాయి. కొన్ని చిన్న జంతువులు పక్కనే ఉండే గ్రామలకేసి వెళ్ళి తిండి సంపాదించుకుని జీవిస్తుండగా , పెద్ద జంతువులు మానవ నివాసాల దగ్గరకెళ్ళ లేక ఆకలికి తట్టుకోలేక బాధపడుతున్నాయి.

          ఒక రోజున ఏనుగురాజు దిగాలుగా నడచిపోతుండగా చీమల రాణీ చీమల రాజూ చూశాయి.

          ” ఏనుగన్నా! అలా ఉన్నవేంటీ!అంత మెల్లిగా నడుస్తున్నావ్!” అని అడిగిందానికి, ఏనుగు” చీమ చెల్లాయ్!చీమ తంబీ! ఏముందీ చెప్పుకోను కొత్తగా! వర్షాల్లేక మాకు తిండి కరువైన విషయం మీకు తెలిసిందేగా! ఆకలికి తాళలేక పోతున్నాను. ఈ నదిలోనూ నీరు అంతంత మాత్రంగానే ఉంది. నేను నది దాటి అవతలికెళితే ఏమన్నా తిండి దొరుకుతుందేమో అని వెళ్ళాలన్నా నాకు ఒంట్లో శక్తి లేదు.అందుకే మెల్లగా నడుస్తున్నాను. ఓపిక లేకపోయినా” అంది ఏనుగు.

          వెంటనే చీమలరాజూ, రాణీ ఒకే స్వరంతో” ఏనుగన్నా! ఉండన్నా కొద్దిసేపు ఉండు” అని తమపుట్ట లోపలికెళ్ళాయి. కొద్దిసేపటికి చీమలన్నీ తమనోటితో గడ్డి పోచలను పట్టుకు వచ్చి ఒకచోట కుప్పగావేశాయి.ఆశ్చర్యంగా ఏనుగు చూస్తుండగా కొద్ది సమయాని కంతా అవి తెచ్చి అక్కడ వేసిన పచ్చి గడ్డిని చూసి ఏనుగు ఆశ్చర్యపోయింది. చీమల రాజూ రాణీ ” ఏనుగన్నా! వెనుక మీరు మా జాతికి చేసిన సహాయానికి మేము ఎప్పటికీ ఋణపడి ఉంటాం. మీరు ఈ పచ్చి గడ్డి భుజించి కాస్తంత ఆకలి తీరుతే ఆతర్వాత మీకు నదికి అవతలిగట్టున కడుపు నిండా ఆహారం లభించవచ్చు. దయచేసి ఈ మా ఆతిధ్యం స్వీకరించండి.” అని కోరాయి.

          ఏనుగు ఆశ్చర్యంతోనూ, వారి ఆప్యాయతకు ,ఆదరానికీ కంటనీరు కారగా ” ఓనా చిన్నారి నేస్తాల్లారా! మీరు ఆకారంలో చిన్నవారైనా , సహాయం చేయడంలో ఈ అడవిలో ఉండే అన్ని జంతువులకన్నా అతి పెద్దవారు. మీ మనస్సులు సముద్రజలమంత.మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పు కోవాలో తెలీడంలేదు. నా ఆకలి తీర్చను మీరు ఏడాదంతా దాచుకున్న ఆహారం నాకు ఇచ్చేస్తే మీకెలా? వద్దు వద్దు మిత్రులారా! నేనెలాగో నదిదాటి వెళ్ళి దొరికినదేదో తింటాను.”అంది ఏనుగు ఎంతో ప్రేమగా.

          చీమల రాజూ,రాణీ” ఎనుగన్నా! మీరు మా ఆతిధ్యం స్వికరించకపోతే మేము చాలా బాధపడతాం.మీకు మా పుట్టలో ఉండే గదులూ, వాటిలో మేము దాచుకునే ఆహారమూ చూడనందున మీకు తెలియదు. మేము మాపుట్టలో పంట వేసుకుని పండించుకుంటాం. మాపుట్టలో పంట చేలుంటాయి. మేము ఆహారం దాచుకునేది వర్షాకాలానికి, ఎండా కాలంలో మాకు ఆహారానికే కొదువా ఉండదు. దయచేసి మా ఆతిధ్యం స్వీకరించ మనవి” అని కోరగానే చీమలన్నీ వెనుక కాళ్ళమీద నిల్చుని నమస్కరించాయి.

          వెంటనే ఏనుగు తల ఊచి ఆ చల్లని పచ్చి గడ్డి తన తొండంతో పట్టుకుని నోట్లో వేసుకుని నమలసాగింది. దాని కళ్ళ నిండా నీరు. చిన్న జీవులైన చీమల మనస్సు ఎంత పెద్దదో బోధపడింది ఏనుగుకు.

          చిన్నారి పిల్లలూ !మనం ఎవ్వరినీ చులకన చేయకూడదు. ఎప్పుడైన ఎంత చిన్నవారితో నైనా మనకు పని కలుగవచ్చు. అందుకే అందరినీ ఆదరిచాలి, గౌరవించాలి. అందరిమాటలనూ మన్నించాలి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.