గౌరి వెళ్ళిపోయింది (కథ)

-డా. ప్రసాదమూర్తి

          ఆమె వెళ్ళిపోయింది. అదేమీ ప్రపంచ వార్తల్లో పతాక శీర్షిక కాదు. కానీ మా అపార్టుమెంట్ లో అందరికీ అది కలవర పరచే వార్తే. కారణం  ఆమె గౌరి. గౌరి అంటే అందరికీ అనేక రకాల ఇష్టంతో కూడిన అభిమానంతో కలిసిన ప్రేమలాంటిది ఉంది. ఆమె  వెళ్ళిపోవడానికీ.. రావ్ సాబ్ ఆత్మహత్య చేసుకోవడానికీ ఏమైనా సంబంధం ఉందా అని మాత్రం ఎవరికీ ఎలాంటి అనుమానమూ అణువంత కూడా రాలేదు. నాకు గౌరి నుంచి ఫోన్ కాల్ వచ్చే వరకూ లోపలేదో పురుగు పరుగులు తీస్తున్నట్టే వుండేది. ఆ కాల్ వచ్చాక గౌరి నాకొక కథాంశమై పోయింది.  కథ ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తూనే వున్నాను. “ ఎప్పుడూ ఏం దొరుకుతుందా కథ రాసేద్దాం అని గోతికాడ నక్కలా కాసుక్కూచుంటారే మీ రచయితలు..” అని రత్నం అనబడే నా భార్య నా మీద ఓ రాయి విసిరి సంబరపడింది. ఏది రాసినా నా తొలి శ్రోత తనే కాబట్టి పెద్దగా అలాంటివి పట్టించుకుంటే మెయిన్ వర్క్, వర్కవుట్ కాదు. ఈ గౌరి కథ మాత్రం ముందు నుంచే మా మధ్య ఏదో చిచ్చు పెట్టడానికే చూస్తున్నట్టు నాకు అనుమానంగా వుంది. సరే కథలోకి వెళదాం.

          గౌరి, మహేష్ నేపాల్ నుంచి హైదరాబాద్ వచ్చారు. మా అపార్ట్ మెంట్ లో మహేష్ వాచ్ మేన్. గౌరి కొన్ని ఫ్లాట్స్ లో మెయిడ్ గా పని చేస్తుంది. ఈ యువ జంటకు ఒక చిన్నారి పాప కూడా వుంది. దాని పేరు కిరణ..  గౌరి అలా వచ్చిందో లేదో  మా అపార్ట్ మెంట్ కి ఇలా యవ్వనం వచ్చింది. ధగధగా మెరిసిపోయే మంచు కురిసే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు. ఇక వాళ్ళ అందచందాల గురించి వర్ణించేదేముంది చెప్పండి. గౌరి మెడలో  నల్లపూస ఉండదు. కానీ ఆమె నిలుచున్న చోట ఎంత చీకటిలో నల్లపూస ఉన్నా, ఆ పూస ఒళ్ళు దాచుకోలేదు. 

          “ ఏవండీ..ఆ పిల్లకి అంత పంతం ఏంటి? ఏదో తప్పు చేశాడు. సర్దుకుపోవాలి కదా అని  ఒక  బోడి   సలహా నేనిచ్చినట్టు కథలో  రాసేరు. అదేదో మీరే ఇచ్చినట్టు రాసుకోండి. తరం మారింది. ఆడాళ్ళే ఎందుకు సర్దుకోవాలి? డైలాగులు ముందు మార్చండి. మీకు తెలిసింది తెలిసినట్టు రాస్తామన్నారు గౌరి కథ. తొందరగా పూర్తి చేయండి సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నా.”  మా ఆవిడ రత్నం ఆజ్ఞాపించింది. 

          నిజమే గౌరి కథ ఉన్నదున్నట్టుగా  రాయాలనుకుంటున్నా. గౌరి వెళ్ళిపోవడానికి కారణాల్లో ఒకటే నేను నా  శ్రీమతికి చెప్పాను. వేరే కారణం నా మనసులోనే వుంది. అది గౌరికీ నాకూ తప్ప మరెవరికీ తెలియదు. తెలిస్తే మనుషులకు మంచితనం మీద నమ్మకం పోతుంది. అయినా కథ చదివాక నా రత్నానికి ఎలాగూ విషయం రివీలై పోతుందనుకోండి. 

          “ ఏమైనా.. ప్రపంచంలో గౌరిలాగా అందరూ  భీష్మించుకుంటే ఇక మగవాళ్ళ బతుకులన్నీ భీష్మ బతుకులే.” ఇలా  అన్నానో లేదో  ‘ అలాగే జరగాలి. పీడ విరగడై పోతుంది.’ ఆవిడగారు ఫైరైంది. అప్పుడు పురుషుడి మీద శతాబ్దాల కసిని,  కత్తిలా దింపుతున్న కాళికలా అనిపించింది తను.  

          “ గౌరి చదువుకోలేదన్న మాటే గాని, తానూ కష్టపడి సంపాదిస్తుంది గనుక ఆర్థిక స్వాతంత్య్రం వలన కాళ్ళకీ, చేతులకీ, మనసుకీ ఎక్కడా సంకెళ్ళు ఉండవని కనిపెట్ట గలిగింది. అందుకే వాడు తాగి తగలేస్తాడని తన సంపాదన జాగ్రత్త చేసుకునే మార్గాన్ని తనే తెలుసుకుంది. రిటైరైన తర్వాత గానీ, నా డబ్బు అనుకోవడంలో ఉన్న స్వేచ్ఛ ఏంటో అర్థం కాలేదు. నా కంటే అదే నయం. సాధికారత కేవలం చదువుతో రాదు, దానికి తెగింపు కావాలి.” 

          ఉపన్యాసం లంకించుకుంది నా కులసతి.  గౌరి కథ నా చావుకొచ్చినట్టుంది. ఆగేలా లేదు. 

          “ సరేలే ఇప్పుడు మన గొడవెందుకు రత్నం? పానకంలో పుడకలాగా? అయినా వాళ్ళిద్దరి మధ్యా గొడవకు కారణం  అది కాదని నీకు తెలుసు కదోయ్.”

          “ ఏంటీ నా గొడవ వచ్చేసరికి పానకంలో పుడకయ్యిందా? గౌరి విషయం మాత్రం సామాజిక సమస్య అయిందా?”  ఉక్రోషంగా చూసింది అర్థాంగి. 

          “అబ్బా రాస్తున్నది గౌరి కథ కదా. కథ సైడ్ ట్రాక్ పట్టదా మన గొడవ పెడితే చెప్పు? బుజ్జగిస్తూ అంటే తను కన్విన్స్ అయింది. 

          “ ఇంతకీ ఏమంటారు? వాడిని అది ఈ ఒక్కసారికీ క్షమించేయమంటారా?” 

          ఈ ప్రశ్నకు సమాధానం నా దగ్గర లేదు. గౌరి దగ్గరే వుంది.  బక్కగా ఎటు తిప్పితే అటు తిరిగే రబ్బరు శిల్పంలా వుంటుంది గౌరి.  రక్తనాళాల్లో రక్తం కనిపేంచేంత తెల్లని ఉల్లిపొర చర్మం తనది. అంత అల్పమైన శరీరంలో ఎంత పట్టుదల వుంది? గౌరి కథను నా ఇష్టమొచ్చినట్టు ముగించడానికి వీలు కాని వజ్ర సమానం ఆమె హృదయం అని నాకు తను వెళ్ళిపోయిన తర్వాతే ఎక్కువగా అర్థమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను రానంది. నేనన్నా, నా భార్య అన్నా ఆమెకు చాలా గురి. మహేష్ కూడా మా  మాట వినే వాడు. మా మధ్య సంభాషణ హిందీలో సాగుతుంది.  ఈ సారికి  అతన్ని క్షమించేయమన్నాను. ‘ఎందుకు క్షమించాలి సార్’ అని ఎదురు ప్రశ్న వేసింది. ‘తను నిన్ను చాలా బాగా చూసుకునే వాడు కదా’ అన్నాను. అప్పుడు ఆ చదువుకోని అమ్మాయి నవ్విన నవ్వులో అర్థాన్ని ఏ చదువులూ విప్పి చెప్పలేవు.

          కథలో డ్రామా లేపోతే మీకూ బోరు కొడుతుంది. అలాగని గౌరి కథలో లేని డ్రామాని చొప్పించడానికి నా మనసును ఒప్పించడం నా వల్ల అయ్యేపని కాదు. దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను సుమా. 

          గౌరి మా ఫ్లాట్ కి పనికోసం వచ్చేసరికి సరిగ్గా మా ఫ్లాట్ ముందే మహేష్ కూడా ఏదో పనిచేస్తూ కనిపించేవాడు. వీళ్ళ టైమింగ్ భలే వుందే అనుకునే వాడిని. ఇంకా విచిత్రం ఏమంటే, గౌరి మా కుడిపక్క బాల్కనీలో గిన్నెలు తోముతున్నప్పుడు అదే సమయంలో కారిడార్  పక్కనే వున్న ట్యాప్ దగ్గరకు వస్తాడు మహేష్. మా బాల్కనీ గ్రిల్ కి  ఆనుకుని ఉన్న గోడకి  వుంటుంది ఆ ట్యాప్. అక్కడ మాప్ వేసే కర్రను కడిగిందే కడుగుతూ వుంటాడు.  అప్పుడు గౌరి ఇటు వైపు అంట్లు తోముతుంటుంది. ఇద్దరూ నేపాలీ భాషలో ఏవో వేళాకోళాలు ఆడుకుంటారు. ఈ ముచ్చట గుర్తుకొచ్చి ‘ నీ మీద నీడ పడనిచ్చే వాడా ‘  అని నేను ఒకసారి ఫోన్ చేసినప్పుడు అంటే గౌరి, ‘ అది ప్రేమ కాదు సార్ అంతా అనుమానం అని నాకు తెలిసింది.’  

          “ సరేలే తల్లీ ఏదో మగబుద్ధి. ఈ సారికి పసిదాని మొహం చూసైనా కాపురం చేసుకో.” అన్నాను. దానికి గౌరి చెప్పిన సమాధానం మా ఆవిడకు చెప్తే మగవాడి పరువంతా గ్రైండర్ లో వేసి రుబ్బినట్టు  అరగంటదాకా నవ్వుతూనే వుంది. ఆ నవ్వులో గ్రైండర్ శబ్దం వుంది. క్లుప్తంగా గౌరి మాటలు ఇవి. గౌరి మొగుడితో గొడవపడి వెళ్లి పోయిందని, ఆమెతో  నా సంభాషణ గూర్చి నేనెప్పుడు ప్రస్తావించినా అదంతా సెల్ ఫోన్ లో జరిగిందే అని మీరు మర్చిపోకూడదు. 

          “ వాడితో చేస్తేనే కాపరమా సార్. వాడి కంటే కుక్కని  కట్టుకుంటే నయం”  అని  గౌరి అంది రత్నం! ఏం కాలమొచ్చింది’  అని నేనంటే,  రాహు కాలం అని సాగదీస్తూ నా వైపు చూసింది నా ఇల్లాలు. 

          “ ఒకసారి క్షమిస్తే వందసార్లు క్షమించాలి. నా కష్టం నాది, నా జీవితం కూడా నాది  కావాలి. పక్కలోకి నేను కావాలి. పక్క దారుల్లో  కులాసాలకి   నా డబ్బు కావాలా “ అని ఖంగున ప్రశ్నించింది గౌరి. అప్పుడు మంచుకొండలో కూడా అగ్ని వుంటుందని  అర్థమైంది నాకు. 

          ఫోన్లో ఎప్పుడైనా  రావ్ సాబ్ గురించి నేను ప్రస్తావన తీసుకువస్తే గౌరి వైపు నుంచి ఏ శబ్దమూ రాదు. అలా ఎంతసేపైనా మౌనమే సమాధానం. నేను మాత్రం గౌరి కళ్ళలోంచి కారే నీరు ఏరైపోయే దృశ్యాన్ని ఊహించుకుంటాను.  మా ఫ్లోర్ లో చివర ఫ్లాట్ లో వుంటున్న రావు సాబ్ మిలటరీలో 30 ఏళ్ళుండి వచ్చారు. ఆయనకు కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు ఉన్నారు. భార్య లక్ష్మి ఈమధ్యే  చనిపోయింది.  ఆయన హుందాతనం, దేశం చూసిన ఆయన అనుభవం, ఆయన పట్ల అందరికీ ఎంతో గౌరవాన్ని పెంచాయి. గౌరి ఆయన దగ్గర నేపాలీలో మాట్లాడుతుంది. ఆయనకు చాలా భాషలు వచ్చు. ఖాట్మండు బోర్డర్ లో ఆయన చాన్నాళ్ళు పనిచేశారు. రావు సాబ్ ఫ్లాట్ లో గౌరి రెండు పూటలా  పనిచేస్తుంది. . ఆయన కొడుకూ కోడలూ ఆఫీసులకు, పిల్లలు స్కూలుకి వెళ్ళక ముందే, ఉదయమే గౌరి ఇంటి పనీ వంట పనీ చేసేస్తుంది. సాయంత్రం మూడున్నరకి మళ్ళీ రావు గారి ఫ్లాట్ కి వెళుతుంది వంట చేయడానికి. మీరు కన్ ఫ్యూజ్ కావొద్దండి. మనం గతం నుంచి వర్తమానంలోకి, వర్తమానం నుంచి గతంలోకి వెళుతూ వుంటాం.  

          ఆ ఘటన జరిగాక  గౌరి నేపాల్ లో ఉంటున్న తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళలేదు. కలకత్తాలో ఎవరో తెలిసిన వారుంటే వారి దగ్గరకు వెళ్ళింది. అక్కడే నాలుగిళ్ళు చూసుకుని పని చేసుకుంటూ పాపను ఆత్మగౌరవం ఉన్న గొప్ప విద్యావంతురాలుగా చేయాలని కలలు కంటోంది. అసలేం జరిగింది? గౌరి ఎందుకు వెళ్ళిపోయింది?  ఇప్పుడు మనం కథ క్లైమాక్స్ కి వెళుతున్నాం. మా ఆవిడకు కూడా తెలియని ఘటన ఒకటి వుంది.  అదే  ఈ కథలో కీలకం.

          మా అపార్ట్ మెంట్ లో ఒక రోజు  రావు సాబ్ ఆత్మహత్య చేసుకున్నారు.  భార్య లేని ఒంటరితనాన్ని భరించలేక తాను కూడా వెళ్ళిపోతున్నానని ఆయన రాసి పెట్టారు. అది జరిగిన కొన్ని రోజులకి గౌరి తన బిడ్డను ఎత్తుకుని నేపాల్ వెళ్ళిపోయింది. ఏం జరిగిందని మహేష్ ని  అడితే, “ క్యా సాబ్.. క్యా మాలూమ్..పాగల్ లడకీ హై. భాగ్ గయీ. హోగా కోయీ బాయ్ ఫ్రెండ్  “ అన్నాడు. తాగి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వాడిని పనిలోంచి తీసేశారు మా అపార్ట్ మెంట్ కమిటీ వారు. 

          అలా అప్పుడు  కొన్నాళ్ళకు  కలకత్తా నుంచి మొదటిసారి నాకు గౌరి నుంచి  ఫోన్ వచ్చింది. గౌరి మాట్లాడింది. వెక్కి వెక్కి ఏడుస్తోంది. తాగుబోతు మొగుడితో పడలేక వెళ్ళిపోయిందని అనుకున్నాం. కానీ జరిగింది మరొకటి. ఈ తర్వాత నేనూ గౌరీ చాలాసార్లు ఫోన్లో మాట్లాడుకున్నాం. నా సలహాలూ ఆమె జవాబులూ ఇప్పటికే మీరు విని ఉన్నారు కదా. అసలు విషయం ఇప్పుడు చెప్తా. గౌరి చెప్పిన దాంట్లో అక్షరం ఎక్ స్ట్రా లేకుండా చెప్తాను. 

          గౌరికి అందరిలానే రావ్ సాబ్ అంటే చాలా గౌరవం. ఆయన మాటలంటే ఇష్టం. ఆయన పాటలంటే ఇష్టం. ఎప్పుడూ తన పట్ల ఆయన ఎలాంటి అనుమానానికీ తావిచ్చేట్టు బిహేవ్ చేయలేదు. అతను తన తండ్రిలానే వ్యవహరించేవారు. గౌరి కూడా సొంత బిడ్డలానే ఆయనికి కావలసినవి అన్నీ చేసి పెట్టేది. ఆయన మాట్లాడే నేపాలీ భాష కూడా ఆమెకు అతనితో ఇంత చనువు పెరగడానికి కారణమైంది. మిలటరీ వ్యక్తి కదా అతని బాడీ చాలా ఫిట్ గా వుండేది. అరవయ్యేళ్ళ మనిషైనా నలభై అంటే నమ్మేట్టు ఉంటారు.. అతని మార్నింగ్, ఈవెనింగ్ వాక్ ..అతని క్రమశిక్షణ అంటే అందరికీ బెదురు. ఎదురుపడితే ఏందయ్యా ఆ పొట్ట..కాస్త ఎక్సర్ సైజ్ చేయరాదూ అనే వారు.” “గౌరీ! నేపాల్ అంటే ఇప్పటిదాకా హిమాలయాలనే గుర్తు. ఇక నేపాల్ అంటే మా గౌరి అని గుర్తు చేసుకుంటాం “ అని రావు గారు అంటే గౌరి నవ్వుకునేది. 

          ఏమైందో గాని, ఒకరోజు యథాప్రకారం మూడింటికి వెళ్ళేసరికి రావు గారు బాగా తాగి వున్నారు. మిలటరీ సరుకు తెచ్చుకుని తన రూం కబోర్డ్స్ లో పెట్టుకుంటారు. ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడే ఆ బాటిళ్ళకు విముక్తి. తాను ఒంటరిగా తీసుకోరు. భార్య చని పోయాక అప్పుడప్పుడూ కాస్త పుచ్చుకుంటున్నారు. గౌరి చూసింది. ‘ ఏం రావ్ సాబ్ అలా ఉన్నారు? ‘ అని అలవాటుగా అడిగింది నేపాలీ భాషలో. గౌరి వంక తదేకంగా చూస్తున్నారు రావు గారు. “ నువ్వీ రోజు చాలా అందంగా వున్నావు గౌరీ” అన్నారు. 

          “సార్ మీరు రోజూ అదే మాటంటారు కదా” అని గౌరి,  ఈ పూట ఏం కూరలు చెయ్యాలని ఫ్రిజ్ దగ్గరకు వెళ్ళింది. డోర్ తీసి కూరగాయలు చూస్తోంది. గౌరిని అలా వెనక నుంచే రెండు చేతులతో ఎత్తుకుని తన రూంలోకి తీసుకుపోయారు రావు సాబ్. గౌరి గట్టిగా గింజుకుంది. కళ్ళు తెరవకుండా  లక్ష్మీ ..గౌరీ  అంటూ రావ్ సాబ్ తన చేతుల  పట్టు విడవలేదు. రావ్ సాబ్ చేయి కొరికి గౌరి పట్టు విడిపించుకుంది. రావ్ అలా చూస్తూ విగ్రహంలా నిల్చుండిపోయాడు. “  నేను మీ కూతుర్ని కాదా, మీరు మా నాన్న కాదా “ అని ఆయన బనీను పట్టి గట్టిగా చించి మరీ అడిగింది. వారి సంభాషణంతా నేపాలీలోనే. అతను అలాగే కొయ్యబారిపోయాడు. 

          వెంటనే గౌరి పరుగు పరుగున సెల్లార్ లో తమ రూం వైపు వెళ్ళింది.  తలుపు తీస్తే అక్కడ  సీను చూసి ఎవరో  అమాంతం  వెన్నులో పొడిచినట్టు అలాగే నిలబడిపోయింది. మూడేళ్ళ పాప ఒకపక్క నిద్రపోతోంది. ఇంకో పక్కన, పక్కలో మరో వాచ్ మేన్ పెళ్ళాంతో తన మహేష్. దిమ్మతిరిగిపోయింది. ఏ అలవాటున్నా తనంటే మహేష్ కి ఎంతో ప్రేమ అని.. తను ఎటు వెళితే అక్కడే వెంట వెంటనే ఉంటాడంటే, తన మీద నీడ పడకుండా కాపాడుకుంటున్నాడని  ఇన్నాళ్ళూ అనుకుంది. తనను నీడలా వెన్నంటి వుండే భర్త దొరకడం  ఎంత అదృష్టం అని అనుకుంది. తను మోసపోయానని, తన మీద భర్తకు ప్రేమ కాదు, అనుమానం  అని, అది రక్షణ కాదు, నిఘా అని  కనిపెట్టడానికి ఆ ఒక్క క్షణం సరిపోయింది గౌరికి. ఆ క్షణం రేపిన తుఫాను గౌరిలో యుక్తాయుక్త జ్ఞానాన్ని చంపేసింది.

          అంతే వెంటనే వచ్చిన దారినే రావ్ సాబ్ ఫ్లాట్ వైపు వెళ్ళింది. తలుపులు ఎప్పుడూ తీసే వుంటాయి. లోనికి వెళ్లి చూస్తే ఒళ్ళంతా చెమటలు పట్టి అలా  నిలబడే వున్నారు రావ్ సాబ్. అతని ముందు నిలబడి, పైన చున్నీ తీసి గిరాటు వేసి చేతులు చాపింది గౌరి. నీరుగారి పోయాడు రావ్ సాబ్. అలా చూస్తూనే వున్నాడు. లక్ష్మీ లక్ష్మీ అంటున్నాడు. నేను గౌరిని. రండి అంటూ భుజం మీద చేతులు వేసి ఆహ్వానించింది గౌరి. రావ్ సాబ్ గట్టిగా ఆమెను విసిరాడు. “ నేను నీ తండ్రిని కాదా? నువ్వు నా కూతురివి కాదా “అన్నాడు. గౌరి వణికిపోయింది. షాక్ నుంచి తేరుకుని అలా రావ్ గారినే చూస్తుండిపోయింది. తన మీదే కుండపోత వర్షం కురుస్తున్నట్టు నిలువెల్లా తడిసిపోయింది. ఆయన కాళ్ళ మీద పడి భోరున విలపించింది. అతను అలానే కుర్చీలో కూలబడిపోయాడు. గౌరి మరబొమ్మలా  తిరిగి తన రూంకి వెళ్ళేసరికి మహేష్ లేడు. పాప అప్పుడే లేచినట్టుంది. గదిలో ఒంటరిగా కూర్చుని ఆడుకోవడం ఆ పాపకు అలవాటే. అమ్మ రాగానే మా అనుకుంటూ వాటేసుకుంది.

          ఆ తెల్లవారే రావ్ సాబ్ ఆత్మహత్య వార్తతో అపార్ట్ మెంట్ దద్దరిల్లింది. రెండు రోజులు మౌనంగా ఉన్న గౌరి ఒక రాత్రి పూట పాపను తీసుకుని వెళ్ళిపోయింది.  గౌరి గురించి మహేష్ వాగిన మాట నిజమైతే బావుండునని అనుకున్నాను. గౌరికి ఎవరో బాల్య స్నేహితుడు వుంటే, అతని దగ్గరకే గౌరి వెళ్ళిపోతే, మహేష్ చెంప మీద ఒక చరిత్ర నమోదు అయ్యేది కదా అనుకున్నాను. ఎప్పుడో తన నుంచి ఇలాంటి ఫోను కూడా ఒకటి  వస్తుందని ఎదురు చూస్తున్నాను. కానీ తన నుండి  ఫోన్ మరో రకంగా వచ్చింది. ”  సార్ నాకు మగాడి రక్షణ అవసరం లేదు. నా ఇంటికి కాపలా కాసే మగాడు దొరికినప్పుడు ఆలోచిస్తాను.”

          గౌరి  ఇలా అన్నది అంటే నా సహచరి సగర్వంగా నవ్వుతూ “ మీరు మగాళ్ళు కాబట్టి మీ ఆలోచన మగాడి దగ్గరే ఆగిపోయింది. మారింది కాలం కాదండి, ఆడపిల్ల.  గౌరి ధిక్కారంతో కథను ముగిస్తున్నారు బాగుంది. ఇంతకీ ఆ రావ్ సాబ్ విషయంలో మీరు కొంచెం సాఫ్ట్ గా ఉన్నట్టున్నారెందుకో..? “ నేను ముందే చెప్పాను కదా, ఈ కథ నాకే అగ్ని పరీక్షలా మారింది .  అంత పెద్ద ఇష్యూ కాదు గానీ..సరే నేనేం చెప్పానో మీరే చదవండి.

          “ అదేం కాదు నేను ఈ కథలో నిమిత్తమాత్రుడనే సుమా.  ఆయన విషయంలో గౌరి తానే అపరాధిలా కుంగిపోతోంది. మొగిడి మీది తక్షణ కోపం గౌరిని కొన్ని ఘడియలు పిచ్చిదాన్ని చేసింది. ఆ ఉక్రోషమే తాను తిరిగి రావ్ సాబ్ దగ్గరకు వెళ్ళేలా చేసింది. అలా జరిగి వుండకపోతే ఈ అనర్థం జరిగి ఉండేది కాదని గౌరి బాధపడుతోంది. తెల్లారాక  రావు గారు   చల్లబడి  వున్నప్పుడు మామూలుగా వెళ్ళి, ఏమీ ఎరగనట్టే ఆయన్ని నవ్వుతూ పలకరిస్తే, తన పశ్చాత్తాపాన్ని వ్యక్తం  చేసుకునే ఒక అవకాశం ఇచ్చి వుంటే, ఆయన బతికి వుండేవారు “ అని గౌరి అనుకుంటోంది. నా మాటలు విని మా రత్నం తన కళ్ళలోంచి నా కళ్ళలోకి చూస్తూ అలా కాసేపు ఉండిపోయింది. ఇక వెంటనే జాగ్రత్త పడాలనిపించింది.  “ సరే గాని రత్నం, ఆ   అవకాశాన్ని తన భర్తకు కూడా ఇచ్చి చూడొచ్చుగా” అని ఒక చిన్న పాయింట్ ఏదో లాగుతున్నట్టు అన్నాను. 

          “ ఏవండోయ్. ఇది జీవితం. మన లాజిక్కులేమీ దాని దగ్గర పనిచేయవు.  ఏ విద్యా లేని గౌరి వివేచన ముందు మన చదువులన్నీ బలాదూర్ .  అయినా కొన్ని ఘటనలు మన విచక్షణా శక్తికి అందవు. వాటి పట్ల ఏ తీర్పులూ చెప్పలేం. కాలం ఇచ్చిందే ముగింపు.” ఇలా అని ఊరుకుంటే తను మా రత్నం ఎందుకవుతుంది చెప్పండి.

          “ ఏంటి నన్ను డైవర్ట్ చేయడానికి ఏదో మహత్తరమైన ప్రణాళికే వేసినట్టున్నారు. పైకి పెద్దమనుషులుగా కనిపించే వారంతా అంత పెద్దమనుషులేం కాదు, అవకాశం కోసం ఎదురు చూస్తున్న పెద్దపులులే. రావుగారి ఉదంతంతో నాకు అర్థమైంది అదే. మీరు రావ్ సాబ్ ని కనీసం బోను కూడా ఎక్కించకుండా ఎందుకు వదిలేసినట్టు? ఎంతైనా మగవాళ్లు కదా.”  కుర్చీలో ఇంకా వెనక్కి జారబడి నన్నే చూస్తోంది రత్నం. 

          “ పోన్లే రత్నం.. పాపం ఆత్మహత్య చేసుకున్నాడు కదా, అంటే తనను తాను శిక్షించుకున్నట్టే. మనమెవరం శిక్షలు విధించడానికి? గౌరే క్షమించేసింది కదా?  ఇంకెందుకు రాద్ధాంతం?” ఇలా ఇంకా ముగించానో లేదో కుర్చీలోంచి ధడాల్మని లేచి, కథలు రాస్తే సరిపోదు. కథలో పాత్రల్నే కాదు, ఒక్కోసారి  మనల్ని కూడా బోనులో నిలబెట్టుకోవాల్సి వచ్చినా జంక కూడదు. అలా అంటూ విసురుగా తన బెడ్ రూంలోకి వెళ్ళి మరింత ధడాల్మని తలుపేసుకుంది. చెప్పాను కదా, కథతో తల గోక్కోవడం అంటే ఇదే. 

*****

Please follow and like us:

2 thoughts on “గౌరి వెళ్ళిపోయింది (కథ)”

 1. ఈ కథ రొటీన్ కథలకు భిన్నంగా ఉంది.. అతి సీరియస్ అంశాన్ని చాలా సులువుగా, సరళంగా, ఆసక్తికరమైన కథనంతో నడిపారు. హాస్యమూ జోడించారు.

  ఇదులో రెండు కథల్ని సమాంతరంగా నడిపారు రచయిత..

  1) గౌరి కథ 2) ఆ కథకి స్త్రీవాద తాత్త్వికతని వర్తింపచేసే భార్యాభర్తల మధ్య సంవాద సంభాషణా .. సమాంతరంగా నడిచాయి.

  కథలో guiltiness వల్ల అనర్థాలు జరిగాయి..
  రావ్ సాబ్ gultiness ని తట్టుకోలేకనే suicide చేసుకున్నాడు.
  ఈ అపరాధ భావన ముందు తన మిలిటరీ భౌతిక మానసిక పటుత్వమూ కొరగాకుండా పోయాయి.

  పైకి కనబడదు గానీ గౌరినీ dominate చేసిందీ ఈ గిల్టీనెస్సే.
  ఇదే తను వెళ్ళిపోయేట్లు ప్రేరేపించింది. దానికి మహేష్ అకృత్యమూ తోడయ్యింది..

  విడిపోవడమే స్త్రీ సాధికారతకి లక్ష్య లక్షణం కాకూడదు.. అంత చైతన్యమూ గౌరికి లేదు గానీ సంపాదనతో బతికేయొచ్చు అనుకుంటుంది..

  భర్త కేవలం భార్య రక్షణకు మాత్రమే పనికొచ్చే ఒక పరికరంగా భావించడం గౌరి తప్పుడు చైతన్యానికి symbol.

  మహేష్ బతుకు .. తన సంబంధంలోకొచ్చిన ఆ స్త్రీ తదుపరి బతుకూ .. ఇక మనం ఊహించుకోవల్సిందే..

  మొత్తానికి, ముందే నుడివినట్లు.. ఇది రొటీన్ కథ కాదు .. వెరైటీ కథ.

  గౌరి రావడంతో ఆ అపార్ట్మెంట్ కి యవ్వనం వచ్చింది.. నల్లపూఅస చీకట్లోకూడా వళ్లు దావ్హుకోదు వగైరా కవితాత్మక వర్ణనలు మంచి భావానుభూతినిస్తాయి.

  గౌరి వెళ్ళిపోవడానికీ రావ్ సాబ్ ఆత్మహత్యకు సంబంధం ఉన్నట్లు/లేనట్లు ముందే చెప్పడం .. ముగింపు ముందుగానే తెలిపినట్లయింది గదా అనిపిస్తుంది.
  రచయితకీ, ‘నెచ్చెలి’ కీ అభినందనలు..

 2. విశ్లేషణాత్మక కథనం.అరుదైన కథనం.కథ పాతదే ఐనా,కథనం చాలా ఆసక్తికరంగా ఉంది 🌻

Leave a Reply

Your email address will not be published.