మా కథ (దొమితిలా చుంగారా)- 33

రచన: దొమితిలా చుంగారా 

అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

          “నువు కొద్ది సేపు మాట్లాడకుండా ఉండు. ఇన్నాళ్ళూ దేవుణ్ని మరిచిపోయావు గదూ – కనీసం ఇప్పుడు ప్రార్థన చేసుకో….” అని ఆయన వెళ్ళిపోయాడు.

          నేను కొట్లో మళ్ళీ ఒంటరినైపోయాను. బైటి నుంచి సైనికుల బూట్లు చేస్తున్న టకటక శబ్దం సంగీతంలాగా, జోల పాటలాగా నన్ను నిద్రపుచ్చింది. నిద్రలో, కలలో నాకొక ఎత్తయిన పర్వత శిఖరం కనిపించింది. నేనా శిఖరం పైనుంచి, ఓ పెద్ద కొండ చరియ పైగా జారుతూ ఉన్నాను. నా శరీరమూ, మెదడూ ముక్కలు ముక్కలైపోతున్నాయి. నేనలాగే జారి పడిపోతూ ఉన్నాను. నా ఒంట్లోని మాంసమంతా అక్కడి నల్లని బండ రాళ్ళకు అంటుకుంటోంది. ఒంట్లో ఉన్న కండ అంతా అలా అక్కడ రాళ్ళకే అంటుకు పోయాక నేను అడుక్కు చేరాను. అక్కడ పడిపోయి లేచి నిలబడ్డాను. నేనప్పుడు ఒక తెల్లని నిండు గౌను వేసుకుని ఉన్నాను. ఆ గౌను అంచులు ఎత్తిపట్టుకుని నేను మళ్ళీ పైకి ఎక్కుతూ, అక్కడ రాళ్ళకు అంటుకు పోయిన నా మాంసాన్ని ఏరి ఒళ్లో వేసుకుంటున్నానట. అలా ఆ రాళ్ళ మీది నుంచి పాకుతూ, పాకుతూ మళ్ళీ పైకి చేరాను. తోవలో రక్తపు మరక కనిపించిన దగ్గరల్లా ఆగి దాన్ని నా గౌనుతో తుడిచేశాను. “నేను ఈ కొండకొమ్ము చేరాలి. అక్కడి కాంతి నందుకోవాలి” అంటూ పై పైకి పోతున్నాను. అలా నా మాంసం ఏరుకుంటూ, నెత్తుటి చారికలు తుడిచేస్తూ చివరికి శిఖరం పైకి చేరాను. అక్కడ నాకు కొన్ని గమ్మత్తయిన ముఖాలు కనిపించాయి. ఆ ముఖాలు నావైపే తీక్షణంగా చూస్తూ నా మీదికి రావడం మొదలెట్టాయి. నేను మళ్లీ పడిపోయాను. అలా ఎంత సేపున్నానో నాకు తెలియదు.

          లేచి చూసేసరికి నేను ఆస్పత్రిలో ఉన్నాను. నాకు అంతవరకూ కనిపించిన వికృత రూపాలు క్రమక్రమంగా స్పష్టంగా కనిపించాయి. అవి డాక్టర్ల, నర్సుల ముఖాలు! వాళ్ళ టోపీలు, ముసుగులూ నాకట్లా అనిపించాయి. నాకు కొండకొమ్ము మీద కనిపించిన కాంతి ఆపరేషన్ థియేటర్ లో పైన ఉన్న లైటు. నాకు కలలో అప్పుడప్పుడు నవ్వు కూడ వినిపించింది. నేనా కొండ కిందికి జారిపోయిన ప్రతిసారీ నాకా వికటాట్టహాసం వినబడింది. ఆ నవ్వు నాకు కాపలాగా ఉండి పులి జూదమో, మరొకటో ఆడుకుంటున్న సైనికులది. మెల్లమెల్లగా నాకు చుట్టూరా ఉన్నవన్నీ స్పష్టంగా తెలిసి పోయాయి.

          నాకప్పుడు విపరీతంగా తలనొప్పి వస్తుండేది. వళ్ళంతా నొప్పులుగా ఉండేది. ఏజెంట్లు ఎప్పుడూ నా పక్కనే ఉండేవారు. డాక్టర్ వచ్చినప్పుడు నేను కళ్ళు తెరిచి చూస్తే నన్ను పైనించి కింది దాకా గుచ్చి గుచ్చిచూస్తుండే ఏజెంట్ల మొఖాలు కనిపించేవి. వాళ్ళను నా పక్కన నిలబడి నవ్వుకుంటుండగా చూశాను. నా పక్కన నిలబడి తమ సబ్ మెషిన్ గన్లు సవరించుకుంటుండగా చూశాను. నాకెంత భయం వేసేదో.. వణికి పోతుండేదాన్ని. అలా ఎప్పుడూ నన్ను ఎవరో ఒకరు కనిపెడుతూ ఉండడంతో నాకు సిగ్గేసేది. అలా ఇరవై నాలుగు గంటలూ నా మీద నిఘా ఉండడం నాకు నచ్చేది కాదు. నేను నిండా ముసుగు పెట్టుకుని మంచానికి కరుచుకుపోయి పడుకునే ఉండేదాన్ని. వాళ్ళు మళ్ళీ నన్ను తీసుకెళ్ళి ఆ కొట్లో పడేస్తారనే ఆలోచన తట్టి ఒళ్ళు జలదరించేది అలా అనిపించినప్పుడల్లా స్పృహ తప్పిపోయేదాన్ని.

          అలా అక్కడ నేనెంతకాలం పడి ఉన్నానో నాకు తెలియదు. అలా ఎన్నిరోజులు గడిచిపోయాయో నాకు తెలియదు. ‘ఉన్నదానికి తోడు ఊపిరికుట్టు’ అని, ఈ బాధల్లో నాకు అప్పుడప్పుడు హిస్టీరియా రావడం మొదలయింది. అప్పుడింక ఎడతెగకుండా కేకలు పెడుతుండేదాన్ని. బహుశా నేనప్పుడు నా కొడుకు కావాలని అరుస్తుండే దాన్ననుకుంటా. ఆ రోజుల్లో నాకెప్పుడూ వాళ్ళు నా కొడుకునెక్కడో పారేశారనిపిస్తుండేది. అందుకే నేనెంత వెతికినా వాడు కనిపించడం లేదనిపించేది. నా బంగారు కొండని, నా చిట్టి తండ్రిని లాక్కుపోయి కాళ్ళు విరిచి తినడం మొదలెట్టి మిగిలిన దేహాన్ని చిందర వందర చేసిన ఒక గొరిల్లా వంటి రూపమేదో నా కళ్ళకు కడుతుండేది. వాడిని అందుకో లేని అసహాయతలో నేను కేకలు పెడుతుండేదాన్ని. ఇది నిజంగా జరిగిన సంఘటనలాగే నా మెదడులో నిలిచిపోయింది. అప్పుడు డాక్టర్ వైపు చూస్తే, ఆయన తెల్లని దుస్తులు చూస్తే నా కొడుకు కాళ్ళు తింటున్న గొరిల్లాలాగ కనిపించేవాడాయన. “నా బిడ్డను నాకిచ్చెయ్యి! అయ్యో కొడుకా… నిన్ను వీళ్ళు విరుచుకు తింటున్నార్రా నాయనా… ఎంత పాపిష్టులు రో…” అని పిచ్చిగా అరుస్తూ శోకాలు పెట్టేదాన్ని. ఆ రోజుల్లో నాకు పట్టుకున్న ఈ మూర్ఛ వ్యాధి భయంకరమైంది.. నాకు స్వస్థత చేకూర్చడానికి వాళ్ళు ‘నన్నెప్పుడూ నిద్రబుచ్చుతుండేవాళ్ళు. నేను మెలకువతో ఉన్నప్పుడు మాత్రం నా ఒంటి మీద ఎవర్నీ చెయ్యి వెయ్యనిచ్చేదాన్ని కాదు.

          చివరికి ఆ డాక్టర్ కు నేనంటే జాలి కలిగింది. ఆయన పోలీసులతో నా పక్కన ఎల్లప్పుడూ ఉండొద్దని చెప్పాడు. అందుకనే ఆ తర్వాత డాక్టరు నా పక్కన ఉన్నప్పుడు నేను ఏజెంట్ల వైపు చూసి దాష్టీకంగా “వెళ్లి పొండిక్కడ్నుంచి… నన్ను మీరెప్పుడూ చూడాల్సిన అవసరమేమీ లేదు. నన్ను చూస్తూ పళ్ళికిలించాల్సిన అవసరం లేదు…” అని అరిచేదాన్ని.

          డాక్టర్ కూడ ఏమనుకున్నాడో ఏమో, ఏజెంట్లతో “చూడండి – మీరు పగలగొట్టిన ముక్కలన్నీ తెచ్చి నాకిచ్చి అతికించమన్నారు. అంతసేపైనా ఓపిక లేకపోతే ఎలా? నామీద నమ్మకం లేకపోతే ఆవిడ్నిక్కడికి తెచ్చి ఉండాల్సిందే కాదు. కనీసం ఇప్పట్నించి నేనామెను పరీక్షిస్తున్నప్పుడైనా మీరు పక్కన ఉండొద్దు…” అని గట్టిగా చెప్పాడు. ఆ తర్వాత నాతో తాను డాక్టర్ గా రోగులను బతికిస్తానని ప్రతిజ్ఞ తీసు కున్నానని, అందువల్ల తన ఆస్పత్రిలో నన్ను హింసించడానికి ఉంచుకోవడం లేదనీ, బతికించడానికీ, బాగు చెయ్యడానికి ఉంచు కుంటున్నానని చెప్పాడు. తనను నమ్మమని కోరాడు. ఒక బిడ్డను పోగొట్టుకున్నా, మిగతా పిల్లలకోసం బతకాలని ధైర్యం చెప్పాడు. మెల్లమెల్లగా ఆయన నన్ను ఒప్పించగలిగాడు. “మనిద్దరమూ దోస్తీ – కడదాం” అని ఆయనన్నాడు. తాను నాకు సాయం చేయదలచుకున్నాననీ, ఏజెంట్లు పడనివ్వడం లేదనీ చెప్పాడు.

          ఐతే డాక్టర్ చికిత్స అయిపోగానే వెంటనే ఏజెంట్లు లోపలికొచ్చే వాళ్ళు.

          ఈలోగా నన్ను గుర్తుపట్టే వాళ్ళెవరో చూసి మా కుటుంబానికి తెలియజేశారు. ఔనూ, ఇంత కాలమూ మా కుటుంబం ఎలా గడిపిందో చెప్పనేలేదు గదూ?

          నేను తన ఇంటి నుంచి సెప్టెంబర్ 20న వెళ్ళిపోయాను గనుక అప్పటి నుంచీ సైగ్లో-20 లోనే ఉన్నానని నాన్న అనుకున్నాడు. ఇటు సైగ్లో-20లో నా చెల్లెళ్ళూ, పిల్లలూ నేను ఒరురోలో ఉన్నాననుకున్నారు. ఈ అనుకోవడంతోనే ఎవరూ నా కోసం వెతకలేదు కూడా. సెప్టెంబర్ 30న నాన్న సైగ్లో-20కి వెళ్ళాడట. అక్కడ పిల్లలు “తాతయ్యా! అమ్మేదీ? నీతో కూడా రాలేదేం?” అన్నారట.

          “ఏమిటీ – తనిక్కడ లేదా? 20నే అక్కడ్నించి బయల్దేరిందే…” అని ఆయన ఆందోళనపడ్డాడు. ఇక అప్పట్నించి వెతుకులాట మొదలయింది. చివరికి నేనారోజు ప్రయాణం చేసిన బస్ దొరకబట్టుకున్నారు. ఆ రోజు . నేనెవరినో తెలియకుండానే నన్ను అరెస్టు చేశారని, ప్లాయావెర్డెలో దించేశారని వాళ్ళకు తెలిసింది. వాళ్ళప్పుడు ప్లాయా వెర్డెకు కూడా వచ్చి కనుక్కున్నారు గాని నేను అక్కడాలేనని తెలిసిపోయింది. అక్కడ అరెస్టు చేసిన వాళ్ళందరినీ లాపాజ్ కో, ఒరురోకో, కొచబాంబాకో తీసుకెళ్ళారని తెలిసిందట. నా భర్త నా సంగతి తెలుసుకోవడానికి లాపాజ్ వెళ్ళాడట. అక్కడవాళ్ళు “ఎవరూ? ఓహో ఆ కమ్యూనిస్టా? డబ్బంతా వేసుకుని, ఎవడో ఓ మిండడ్ని వేసుకుని ఎక్కడికో పారిపోయి ఉంటుందిలే, నీ భార్యేనా? పాపం…నీకు డబ్బేమీ మిగల్చకుండా పిల్లల బరువు నీమీద పడేసి వెళ్ళిపోయిందిలే…. కమ్యూనిస్టులంతే – నీతి నిజాయితీలకూ వాళ్ళకు చుక్కెదురు. ఇంకేమేం చేసిందో ఎవరికి తెలుసు” అన్నారట. ఆయన పుట్టెడు అనుమానాలతో ఇంటికి తిరిగొచ్చేశాడట. నాన్నతో మాట్లాడాక ఆయన అనుమానాలన్నీ తీరిపోయాయట. “డబ్బు నాకిచ్చేసే వెళ్లిపోయింది. డబ్బు మొత్తం నా దగ్గరే ఉంది. నా బిడ్డకేదో జరిగింది. వాళ్ళు నా బిడ్డనేమో చేశారు” అని మా నాన్న ఆందోళన పడ్డాడట.

          ఏం చేద్దామని వాళ్ళు ఆలోచిస్తుండగానే వాళ్ళకో యువకుడు కలిసి ఒరురోలో మరెవరికో నా వివరాలు తెలుసునని చెప్పాడట. ఒరురోలో మా నాన్నకు నేనో అస్పత్రిలో జీవచ్ఛవంగా పడి ఉన్నానని, ఇంక నేను బైటికి రావడం అసాధ్యమనీ తెలిసిందట. అప్పటికే లాపాజ్ పోలీసులు నా గురించి అడుగుతున్నారు. నన్ను లాపాజ్ తీసుకెళ్ళి ప్రశ్నించడానికి ఒక డిఐసి ప్రతినిధి బృందం కూడా అప్పటికే వచ్చి ఉంది. ఈ సంగతులు తెలిశాక నాన్నా, రెనె త్వరపడ్డారు. యూనివర్సిటీకి వెళ్లి నా విషయాలన్నీ చెప్పారు. వీలైనంత ప్రచారం చేశారు.

          వాళ్ళు ఒరురో డిఐసి కార్యాలయానికి కూడా వెళ్లి కనుక్కున్నారట. నాన్న అక్కడి వాళ్లమీద గట్టిగా అరిచాడట. “ఇంత అన్యాయం చేస్తారా? ఇంత దుర్మార్గానికొడిగడతారా? నేను దేశం కోసం యుద్ధంలో పాల్గొన్నాను. దేశానికెన్నో ఏళ్ళు . సేవ చేశాను. నా తల పండిపోయింది. నా బిడ్డలకు నేను తగినంత చదువు కూడా చెప్పించలేక పోయాను. నా కూతురట్లా తయారు కావడానికి కారణం నేను. కనుక మీరేమన్నా చేయదలచుకుంటే నన్ను కాల్చేయండి. దానికున్న ఆలోచనలన్నీ నేను కలిగించినవే…”

          నాన్న అలా అరుస్తూ, మొత్తుకుంటూ పిచ్చాడి లాగ డిఐసి కార్యాలయం నుంచి బైటికొచ్చాడని చూసిన వాళ్ళు చెప్పారు. నాన్న ఆ ఆవేశంలో ద్వారం దగ్గర ఓ మనిషిని గుద్దుకున్నాట్ట. ఇంతకూ చూస్తే అతను పులకాయోలో మాకు పరిచయస్తుడే. నాన్న అక్కడ గని పోలీసులకు దర్జీగా పని చేసిన రోజుల్లో అతను పోలీసు కమీషనర్ గా ఉండేవాడు. బహుశా ఇప్పటికి కల్నల్ అయిపోయి ఉండవచ్చునేమో! “బారియోస్… నువ్వు ఇక్కడ…! ఏం చేస్తున్నా విక్కడ?” అని అతనడిగాడట. “నా కూతురికి ఎవరెవరితోనో సంబంధాలున్నా యని వాళ్ళంటున్నారు. గెరిల్లాలతో సంబంధం ఉందంటున్నారు. అలా ఎన్నో అబద్ధాలు చెప్తున్నారు. బహుశా వాళ్లేమన్నా పొరపాటు పడుతున్నారేమో…!” అన్నాడట నాన్న. అతనికి మా నాన్నంటే చాల ఇష్టం. అందుకే మాకు సాయం చేస్తానన్నాడట. కాని నన్ను కుదురుగా ఉంచాలంటే లాయుంగాస్ కు పంపించాలని చెప్పాడట.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.