మా శృంగేరి యాత్ర!-2

-సుభాషిణి ప్రత్తిపాటి

          ఇది మేఘసందేశమో… అనురాగ సంకేతమో…పాట గుర్తుకు వచ్చింది హోర్నాడు కొండపై. బిర బిరా పొగమంచు లా కదిలి పోతున్న మబ్బుల హడావుడికి ముచ్చటేసింది. ఆ రోజు మూలా నక్షత్రం కావడంతో శారదాంబను దర్శించుకోవాలని వెంటనే శృంగేరి బయలుదేరాము.  జగద్గురు ఆదిశంకరాచార్యులు స్థాపించిన మొట్టమొదటి మఠం దక్షిణామ్నాయ మఠం శ్రీ శృంగేరి శారదాపీఠం. ఋష్యశృంగుని పేర ఈ ప్రాంతానికి శృంగేరి పేరు వచ్చిందంటారు.‌ అమ్మను ఎపుడు చూద్దామా అనే ఆతృత లోపల. చుట్టూ ప్రకృతి మమ్మల్ని తన వైపు లాగేస్తోంది.
 
          రాత్రి కప్పుకున్న చినుకు పూల దుప్పటి లోంచి అపుడే బయట పడిన అడవిపై సూర్య భగవానుడు లేలేత కిరణాల తళుకులద్దుతున్నాడు. చిక్ మంగ్లూర్ జిల్లా లో ఉంది శృంగేరి. అక్కడికి గంటన్నర ప్రయాణం. ఆ కొండ దారంతా చాలా దారుణంగా ఉంది. ఎగుడుదిగుడుగా ఏ మాత్రం సౌకర్యంగా లేదు. అయినా మా కళ్ళకు బోల్డంత పని.
ఆ పడమటి కనుమలలో ఎత్తైన చెట్లు,. వింత, వింత పరిమళాలు చల్లుతోంది ఆ అడవి దారంతా. ఓ వైపు లోయలు మరో వైపు కొండ,. పడి లేచే కెరటాల నవ్వులతో సెలయేటి కుర్రలు. అక్కడక్కడా రోడ్డు పనులు చేస్తున్న వ్యక్తులను చూశాం. ఆ కొండవాలుల్లో వ్యవసాయం జరుగుతున్న తీరు మాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. మెట్లు, మెట్లుగా ప్రకృతి చెక్కిన ఆకొండ వాలుల్లో రకరకాల పంటలు( పోడు వ్యవసాయం), కొద్దిపాటి చదును ఉన్న చోటంతా చుట్టూ తక్కువ ఎత్తులో కంచె, లోపల ఏవో మొక్కలు. కాస్త దూరం వెళ్ళామో లేదో జోరున వాన. మా డ్రైవర్ పేరు తులసీరాం. కన్నడిగుడు. తెలుగురాదేమో అనుకుని తిక్కలోడు  ఒక్క సెలయేరు దగ్గరా ఆపటంలేదని అనేశాం కూడా. ఆ తర్వాత తెలిసింది, అతని కి ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, ఒరియా, ఉర్దూ అన్ని భాషలు వచ్చుట. అక్కడక్కడా చిన్న ఇళ్ళు బొమ్మరిళ్ళలా కనిపించాయి. ఓ కొండవాలులో ఓ పిల్ల ఎదురైంది. రాగి రంగు జుట్టు, నెత్తిమీద తాటాకు గొడుగు, చేతిలో కర్ర , పశువులను అడవికి తోలి వస్తోందనుకుంటా. ఆమె శరీర ఛాయ ఏదో వింతగా తోచింది.. కానీ ఆ పిల్ల నవ్వు మాత్రం మెరుపులా తోచింది, స్వచ్ఛమైన ఆ నవ్వు నాకిప్పటికీ గుర్తే.  మొత్తానికి అంత వానలోనూ ఓ చోట సెలయేరు చూడాల్సిందేనని పట్టుబట్టి జీప్ ఆపించాం. మొదట నేను నా వెనుక మా చెల్లి , పిల్లలు పోలోమంటూ దిగి పరుగుతీశాం. ఆ కొండరాళ్ళపై పడి ఎగిరి పడుతున్న కెరటాలు క్రింద ఉన్న మట్టితో కలిసి రాగి రంగులో మారిన  తెల్లటి రాళ్ళపై జారుతున్నాయి. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, నీళ్ళలో అడుగు పెడుతూనే ఒళ్ళు పులకరించిపోయింది. చినుకులు బలంగా రాలుతున్నాయి. అలాగే కొండ పాదం దాక నీళ్ళలో నడుచుకుంటూ వెళ్ళాం. స్వచ్ఛంగా ఉన్న ఆ నీళ్ళు నోటిలో పోసుకోగానే, తీయగా జిల్లు మనిపించాయి. ఓ పెద్ద రాతిపై కూర్చుని ఫోటోలు తీసుకున్నారు పిల్లలు. గుండ్రంగా ఉన్న ఓ నాలుగు రాళ్ళు గుర్తుగా తీసుకుని ఆ ప్రదేశం వదలలేక వదిలాం. వాన జోరు పెరుగుతుంది, ఉండకూడదని మా తులసీరాం కేకలు పెడుతుండడంతో వాహనంలోకి చేరాం. అప్పుడు గజగజమని చలి మొదలైంది. జీప్లోనే ఉన్న మా వారు కేకలు..చిన్నపిల్లల్లా ఆ తడవటం ఏంటని?? ప్చ్. … కృష్ణ శాస్త్రి గారు పాట వ్రాశారు తెలుసా…ఇలాటి ఏరు చూసే వ్రాసుంటారు ఖచ్చితంగా. కూనిరాగం తీశాను..జలజలనే పారు సెలపాటలో తేటినై….అంటూ.
 
          మరికాసేపటికే పొడి వాతావరణం అలముకొంది. ఆ దారంతటా ఎత్తైన పోక చెట్లు. వాటిని ప్రేయసిలా గాఢంగా పెనవేసుకున్న తీవెలు. మొదట అవి కొబ్బరి చెట్లు అనుకుని కాదు, కాదని ఏమిటా అనుకుంటుంటే మా తులసీరామ్ “వక్క “పేరు తెలియక నానా తంటాలు పడి అవి పోకచెట్లనే జ్ఞానం కల్పించాడు మాకు. ఆ చెట్ల నల్లుకున్న నాగవల్లులను తమలపాకు తీగెలనుకుని ఓ మురిసిపోయాను. ఓ తీవె తెంపడానికి ఆగి చూశాక తెలిసింది, అవి మిరియపు తీవెలని. ఎంతటి అందమో ఆ చెట్లది. దారికిరువైపులా అవే తోటలు. చాలా చోట్ల అరటి వనాలు మనసును మురిపించాయి. మధ్యమధ్య కొన్ని చదరాల్లో పేరు తెలియని తోటలు. మనిషి జాడే కనబడలేదు. 
ఆ రోజు (శరన్నవరాత్రులు ) సప్తమి ఘడియలు ఉండడంతో  వాహనాలను ఆలయానికి చాలా చాలా దూరంగా నే పార్కింగ్ ఇచ్చారు. కొద్ది దూరం నడిచి ఆలయం చేరుకున్నాము. ఆ రాజగోపురం చూస్తూనే ఓ ఉద్వేగం. చిన్నప్పుడు విన్న ఆదిశంకరుల కథ స్మృతి పథంలో కదలాడింది. శారదాంబ అక్కడే కొలువుతీరాలనుకున్నారని, కొన్ని క్షణాలలో అమ్మను చూస్తాను అనుకోగానే తన్మయత్వం ఆవరించింది. మంటప మంతా వేవేల పూలతో అత్యద్భుతంగా అలంకరించబడి ఉంది. లోపల పైకి చూసి ఆశ్చర్య పోయాం. అంతా రకరకాల పండ్ల గుత్తులతో నలుపు, తెలుపు ద్రాక్షలు, కమలా పండ్లు, యాపిల్స్, మొక్కజొన్న పొత్తులతో పందిరివేసి ఉంది.    
 
          ఈ విశేషమైన రోజు మనకు దర్శనం ఎన్ని గంటలు పడుతుందోనని భయపడుతూ వెళ్ళాము. కానీ ఐదు నిమిషాల వ్యవధిలోనే అమ్మ ముందుకు చేరాము. ఆ ఐదు నిమిషాలకు కారణం శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారు, విశేష పూజ చేసిన భక్తులకు ప్రసాదాలు అందిస్తుండటమే. అలా వారి దర్శన భాగ్యం క్యూలైన్ లో ఉండగా కలిగింది.  స్వర్ణమణిమయమైన చదువులమ్మను  విశేష అలంకరణ లో బంగారు వీణెతో చూడడానికి రెండు కళ్లు చాలవు అనిపించింది. నమస్కరించుకుని బయటకు వచ్చాము. తనివి తీరక మరలా క్యూలోంచి చకచకా అమ్మ ఎదురు నిలబడి చూస్తున్నాం…కదలి రాబోతుంటే అక్కడి సెక్యూరిటీ పోలీస్ ఉమెన్ మమ్మల్ని చేతితో అక్కడే ఆపేశారు. ఎందుకో అర్థం కాలేదు, సంతోషిస్తూ అమ్మను చూస్తూ ఏవో శ్లోకాలు చదువుతూ ఉన్నాను…ఇంతలో మా ప్రక్కనుంచే శారదామఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు ఆలయంలోకి ప్రవేశించారు. ఆ భారతికి జోతలర్పించాము. జగద్గురు పరంపర స్వాములను అలా దగ్గరగా చూడగలిగే మహద్భాగ్యం కలిగించినందుకు. చుట్టూ ఉన్న ఉపాలయాలను దర్శించుకున్నాము. పురాతన విద్యాశంకర ఆలయం  అక్కడ విశేషంగా ఆకట్టుకుంది. ఓ వైపు గణపతి, మరో వైపు అమ్మవారు కొలువైన ఈ ఆలయంలో లోపలి స్తంభాలపై పన్నెండు రాశులు చెక్కి ఉండడం కనిపించింది. అలాగే అక్కడి వెలుపల ఉన్న సింహం బొమ్మల నోటిలో ఓ గోళం జారుతున్నట్లు చెక్కి ఉండడం అబ్బురం కలిగించింది. ఆ ప్రక్కనే.  తుంగ నది ప్రవహిస్తోంది. దానిపై ఓ కాలినడక వంతెన ఆవలి ఒడ్డున నరసింహవనం అదే మఠాధిపతుల ఆశ్రమం. అక్కడకు ప్రవేశం నిషేధం. కొద్ది సమయం అదీ సాయంత్రం మాత్రం ఉంటుందట. విశేష సమయాల్లో పూర్తి నిషిద్ధం. అక్కడే పూర్వ మఠాధిపతుల స్మృతి చిహ్నాలు  నిత్య పూజలందుకుంటూ ఉంటాయట. అందుకేనేమో ఆలయంలోనే గురుదర్శనం కలిగిందని సంతోషించాము. అక్కడి నది చాలా లోతని, ఈత నిషేధమనే బోర్డు కనిపించిందక్కడ. ఆలయంలోని భోజనశాలకు వెళ్ళాము. చాలా విశాలంగా ఉన్న ఆ హాలులో అందరూ వరుసగా కూర్చున్నాము. అరటి ఆకుల్లో తొలుత ప్రసాదం, ఆపై ఆవిర్లు కక్కుతున్న భోజనం వడ్డించారు, కదంబం, గుమ్మడి పులుసు,  నిమ్మరసం కలిపిన మజ్జిగ ఆ రుచి వర్ణణాతీతం. ఆ ఆలయ ప్రాంగణంలో కొన్ని కాటేజీలు కనబడ్డాయి . ఎవరో చెప్పారు….కొందరు వానప్రస్థం ఇక్కడే గడపడానికి కట్టించుకుంటారని, మరికొందరు విశేష సందర్భాలలో ఇక్కడ ఉండి వెళుతుంటారని. 
 
          ఆ ఆలయ శిల్ప సౌందర్యం, ఆనాటి అలంకరణ, శ్రీ శారదాంబ కమనీయ రూపం, మంద్రంగా కదులుతున్న తుంగానదీ తోయమాలికల  నుంచి వీచిన గాలి, ఆ కదంబపు కమ్మని రుచి కలిగించిన  మైమరపును హృదయ పేటికలో భద్రం చేసుకుని….మా ప్రయాణాన్ని కొనసాగించాం.
 
          ఎక్కడికా…??
 
          కటకటాల వెనుక కవ్వం పట్టుకు నిలుచున్న వెన్నదొంగ దగ్గరకు. ఏ…క్…క్క డా…
మరో భాగంలో చెప్పేస్తాను మరి
*****
(సశేషం)

 

Please follow and like us:

2 thoughts on “మా శృంగేరి యాత్ర!-2”

  1. చాలా చాలా బావుంది. కళ్ళకు కట్టినట్లు వర్ణించారు.
    నిజంగా అంత అద్భుతంగా, మనోహరంగా, రమ
    ణీయంగా ఉంటుంది. ఆహ్లాదకరంగా,పక్షుల కిలకిలతో
    శోభాయమానంగా ఉంటుంది. మరొక్కసారి శృంగేరి
    యాత్ర చేయించారు.2020 శృంగేరి యాత్ర చేశొము.

  2. Bhale akka..naku sringeri motham kallaki kattinatluga gurthu thecharu..nrishimha vanam lo chandramouleeswara abhishekam gurthochindi. Adoka vibration.. early morning sardamba and paramaguruvula pada darshanam cheincharu🙏🙏 antha chakkaga rachana chese miku aa sarada devi anugraham kuda thodaindemo Sringeri yatra tho annatluga undi..bhale chilipiga mugincharu..venna donga tho.. really loved it

Leave a Reply

Your email address will not be published.