శ్రీరాగాలు-1

త్రిశంకుని మీద తిరుగుబాటు

రామవరపు గణేశ్వర రావు 

అందరికీఇష్టమైనయాపిల్పండులాంటిది – ఆ దేశం. ఆ పండుని రెండు చేతులతో కాదు, నాలుగు చేతులతోనూ కొరుక్క తిందామనుకున్న అత్యాశపోతుకి, ఆ చక్కటి తెలుగమ్మాయి ఏం నేర్పిందో వినండి. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నిలిచేలాంటి ప్రాసంగికతతో చక్కటి సందేశాన్నిచ్చిన కథ  రామవరపుగణేశ్వరరావు రచన – “త్రిశంకుని మీద తిరుగుబాటు”

శ్రీనివాస్ బందా

 

***

          అమెరికా నుంచి సుబ్బు రాసిన ఉత్తరాన్ని మరోసారి చదువుకున్నాను.

          “వధువు కావాలన్న ప్రకటనలు ఇచ్చానని రాశావు. ఈపాటికి జవాబులు వచ్చే ఉంటాయి. పదిహేను రోజుల సెలవు మీద వస్తున్నాను. మన ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలంటే ఇప్పటికీ పడిచస్తాను. నీకు తెలీనిదేముంది? నాకు కావలిసింది అసలుసిసలైన తెలుగు పిల్ల!”

          “ఇప్పటికే అరడజను సార్లు చదివారు! అందులో అర్థంకానిదేముందట?” అని మా ఆవిడ అడిగింది.

          “ఈ తతంగమే నాకర్థం కావటం లేదు. పదేళ్ళుగా అమెరికాలో ఉంటున్నాడు. ఇంకా సంప్రదాయాలూ తెలుగు పిల్లా అంటాడు. ఇదెక్కడి గోల!” అంటూ మూలకి చూశాను.
సందుగ పెట్టెలాంటి పెట్టి నిండా మా సుబ్బు కోసం వచ్చిన జవాబులున్నాయి. అవన్నీచదివి, ఓ అరడజను ఏరాలి!

          “మా భాగ్యం మీ ఫ్రెండుకు లక్షణంగా ఉంటుందన్న నా మాట వినిపించుకున్నారు కాదు!” అని నిష్ఠూరం వేసింది.

          “టీచర్భాగ్యమా? నీకేమైనా పిచ్చా? అమెరికాలో ఆవకాయ అమ్ముకునే వాడుకూడా డాక్టరో, ఇంజనీరో కావాలంటాడు!”

          “తెలుగు పిల్లయితే చాలని ఆయనగారు రాయలా?”

          “అంటే అరవ, మళయాళీగాళ్కాదు, నేనన్న వాళ్లలో తెలుగు పిల్లని! “అని అన్నాను.

          “సరేలెండి. ఇక బయలుదేరండి. అన్నట్టు, మనబుజ్జి, బామ్మ కూడా ఏర్‌పోర్ట్‌కు వస్తారట!”

          “వాళ్లెందుకూ! పెళ్ళికి వెళుతూ పిల్లిని…”

          “ఆగండాగండి! మనం పెళ్ళికి వెళ్ళడం లేదు. పెళ్ళికొడుకుని రిసీవ్కో చేసుకోడానికి వెళుతున్నాం. బామ్మని ఎలాగూ ప్లేన్ ఎక్కించమ్. కనీసం ఏర్పోర్ట్ అయినా  చూపిద్దాం. బుజ్జి సంగతి సరేసరి! అమెరికా అంకుల్వీడియోగేమ్ తెస్తాడని, వాడి హడావిడి!” అంది మా ఆవిడ.

          వాడు కనిపించగానే పై నుంచి చేయి ఊపాను. బాగాలావయ్యాడు. బట్టతల వచ్చింది. డాలర్లు వెనకేసిన లక్షణం వాడు లగేజీ అందుకోగానే అందరం జోరుగా చేతులూపాం. వాడు తన కుడిచేతి రెండు వేళ్ళు ‘వి’ఆకారంలోపెట్టి ముందుకెళ్ళాడు. మాసంజ్ఞలు అర్థం అయినట్టు లేదు.

          “ఒరే సుబ్బూ! జబ్బలు పడిపోయేట్లు అందరం చేతులూపి చెప్పినా, నీకు అర్థం కాలేదేమిట్రా? అటు వేపున్నకస్టంస్ ఆఫీసర్‌తో నీ సంగతి ముందుగా చెప్పాం. అటెళ్ళక, ఇంకెటో వెళ్ళావ్! ఎంత వడ్డించాడేమిటి?” వాడు కారులో కూర్చున్నాక, కోపం పట్టలేక అడిగాను.

          “ఎందుకూ? నేనేం తేలేదుగా, గ్రీన్ఛానెల్లోంచి వచ్చాను” అంటూ వెకిలి నవ్వు నవ్వాడు.

          ‘ఆరిపిడుగా’, అని మనస్సులో వాడిని తిట్టడం మొదలెట్టాను. మా బుజ్జి మాత్రం వాళ్ళ అమ్మ ఒడిలో తలదూర్చి భోరుమన్నాడు.

          “నా కోసం హేండ్ఫోన్తెమ్మనమని రాయించానే!” మా బామ్మ బయటకే అంది – పెరట్లో వడియాలు పెడుతున్నపుడు అది అవసరం అట!

          “మన్మోహన్సింగ్పుణ్యమా అని, అక్కడున్నవన్నీఇక్కడ దొరుకుతున్నాయిగా! అదిసరే, మీవాడెందుకు రా… ‘అని వాడంటుండగా, బుజ్జి మళ్ళీ ఏడుపులంకించు కున్నాడు.

          “వచ్చావుగా! చేతులూపుకుంటూ! అందుకని!” అనిమనస్సులోనే అనుకున్నాను.
భోజనాలయి కూర్చున్నాక, “నీకెలాంటి పిల్ల కావాలో నాకైతే తెలీదు. నీ వివరాలతో ఇచ్చిన ప్రకటనకు వచ్చిన జవాబులివిగో!” అని సందుగ పెట్టెవాడి ముందుంచాను.

          “ఏమిటి, ఇంతేనా?”

          “సరేలే! ఇవన్నీ చూడాలంటేనే నెలలు కావాలి. ఇప్పుడు ప్రతీ వెధవా ఫారిన్వెళ్ళి వస్తున్నాడు. ‘తానా’, ‘ఆటా’ అంటూ ఆరు నెలలకొక సారి మద్దెల వాయించే వాడిని కూడా తీసుకెళ్ళి సన్మానాలు చేస్తున్నారాయె! వాళ్ళంతా మీ కథలు ఇక్కడికి మోసుకొస్తున్నారు! దాంతో అమెరికా అల్లుళ్ళ మీద మోజు పోయింది!” అనిఅన్నాను.

          ఉలుకూ పలుకూ లేకుండా ఇంకేదో వింత శబ్దం వచ్చింది. ఏమిటా అని చూస్తే సోఫాలో కూర్చున్నపళంగా నిద్రలోకి ఒరిగిపోయి ఉన్నాడు సుబ్బు. మళ్ళీ వాడు నిద్రలేవడం మర్నాడే! వాడికి మిగిలిందిక పదమూడు రోజులే!
మా వాడి ఉద్దేశం తెలుసు కుంటే, ఎందుకేనా మంచిదని అడిగాను, “ఒరే సుబ్బూ! కట్నం కానుకలు ఎంత ఎక్స్పెక్ట్చేస్తున్నా వేమిటి?”

          “ఒరే! నా నెల జీతం ఎంతో నీకేమన్నా అయిడియా ఉందా?ఇక్కడి వాళ్లు నాకేం ఇవ్వగలరు రా?” అన్నాడు విరగబడి నవ్వుతూ.

          ఇచ్చే వాళ్ళుంటే పుచ్చుకుంటాడన్నమాట, వెధవ! నా లిస్టులో ఉన్న మొదటి నాలుగూ ఉన్న ఊర్లోని సంబంధాలే! ఇద్దరు డాక్టర్లు, ఒక ఇంజనీరు, ఇంకొకరు సి.ఎ… అలా అని రాసిపంపారు!

          ‘సి.ఎ. అని చెప్పుకుంటున్న అమ్మాయి బి.కాం. చేసి, సి.ఏ. పార్టువన్మాత్రం చేసిందట! ‘ఇంజనీరు అమ్మాయి అఘాయిత్యం సరేసరి! ఎ.ఎమ్.ఐ.ఇ స్టూడెంట్‌గా రిజిస్టర్చేయించు కుంది. డాక్టర్మ్మాయిలు మాత్రం, డాక్టర్లే!

          “ఆ మధ్య గిర్ ఫారెస్ట్ కి పిలిచారు. అక్కడున్న అరడజను సింహాలకి ఒకేసారి ఆపరేషన్చేశాను!

          అన్నట్టుఅమెరికాలో సింహాలవీ ఉన్నాయా?” అమాయకంగా అడిగిందా పశువుల డాక్టరు. రెండో డాక్టరు సంస్కృతంలో, ‘కాళిదాసు కావ్యాల్లో భార్యా ప్రశంస’ అన్న థీసిస్రాసింది.

          “మీదృష్టిలో భార్య అంటే ఎలా ఉండాలి?” అని మా వాడిని అడిగి, వాడు జవాబివ్వక ముందే, ‘కార్యేషుదాసీ, కరణేషుమంత్రీ, రూపేచలక్ష్మీ, క్షమయా ధరిత్రీ’ అంటూ శ్లోకం అప్ప చెప్పింది.

          మావాడి తెలుగే అంతంత మాత్రం. అమెరికా వెళ్ళాక అది కూడా మరిచిపోయాడు! శ్లోకం విని ఠారెత్తి పోయాడు. అర్థం నన్నడిగితే చెప్పాను. లక్ష్మి రంభల మాటేమో గాని, నిండుగా భూదేవిలా ఉందీ పెళ్ళి కూతురని! పీటల మీద పెళ్ళికి, పెళ్ళికుమార్తెను తట్టలో కూర్చోబెట్టి పందిరిలోకి తీసుకుని రావాలి. అది ఈ అమ్మాయితో అయ్యే పని కాదని కూడా అన్నాను.

          అమ్మాయిల అర్హతల మాటెలా ఉన్నా, అందానికి ఆమడ దూరంలో ఉన్నారందరూ!

          “మంచి పెళ్ళి సంబంధం చూడరా అంటే, ఇలాంటి నాసిరకంవి నా కోసం చూస్తావా? ఈసారి పెళ్ళాంతో నేను అమెరికా వెళ్ళాలని లేదా? ” అని విసుక్కున్నాడు.

          “నన్నేంచేయమంటావు రా? అందరూ ఎన్నారైలు కోరేవాళ్ళనే షార్ట్లిస్ట్చేసాను. వెయ్యి అబద్ధాలాడి పెళ్ళి చేయండి అన్నారు కదా అని, వీళ్ళిలా ఘోరంగా అబద్ధాలు రాస్తారని కలగన్నానా?”

          “అసలు నా ఉత్తరం సరిగ్గా చదివావా? తెలుగు పిల్ల అని అండర్లైన్చేయలా?” అని అన్నాడు.

          వంటింట్లోంచి అప్పుడే బయట కొచ్చిన మా ఆవిడ ఏదో సైగ చేసింది, వాళ్ళ భాగ్యం గురించి చెప్పమని. నేను పట్టించుకోలా. “అప్పటికీ నేను చెప్తూనే ఉన్నాను చదువు అంత ముఖ్యం కాదని! మా ఆయన వింటేనా!” అంది.

          “అలా అని కాదు, వదినగారూ! అక్కడ ఏంతోస్తుంది? డాక్టర్లు, ఇంజనీర్లు అయితే ఉద్యోగాలు వెంటనే దొరుకుతాయి” అన్నాడు.

          “అసలు సిసలు తెలుగు పిల్ల చాలన్నారు.. అంటే ఒక్క డాక్టరు, ఇంజనీరు మాత్రమేనా?” అంది ఉక్రోషంగా.

          “మన సంప్రదాయాలు జీర్ణించుకుని, తెలుగుదనం ఉట్టిపడుతున్న అమ్మాయి ఒక డాక్టరు, ఇంజనీరు అయితే, ఇంక కావలసిందేముంది?” అన్నాడుసుబ్బు.

          “అమెరికాలో తెలుగుదనం ఎందుకురా? పొద్దున్నవెళ్లే మనిషి రాత్రికి గానీ ఇల్లు చేరుకోరట!” ఈసారి రెట్టించడం నా వంతయింది.

          “ఆఫీసులో అవసరం లేదు. మరి ఇల్లంటూ ఉందిగా! నేనెలా పెరిగానో నీకు తెలుసుగా! ఇప్పటికి తు.చ. తప్పకుండా అన్నీచేస్తున్నాను. నేనే కాదు, అక్కడున్న మనవాళ్లందరూ అంతే!” అన్నాడు సుబ్బు. స్వర్గానికి వెళ్ళినా సవతి పోరుతప్పదన్నట్లు, అమెరికావెళ్ళినా ఆంధ్రులు ఆచారాలు, ఆవకాయలు వదిలి పెట్టరన్న మాట!

          మా ఊరి సంబంధం ఒకటి వచ్చింది. దాని విషయం చెప్పగానే, సుబ్బు ఎగిరి గంతేశాడు. వీడి మూలంగా కొన్నేళ్ళ తర్వాత మా ఊర్లో అడుగుపెట్టాం.
ఊరు మారుతుందని తెలుసు. కాని మా ఊరు చచ్చి పోయింది. కోతి కొమ్మచ్చి ఆడుకున్న తోట లేదు. చెట్లను పీకి కంకర రోడ్డు వేశారు. రామసాగరంలో స్నానంచేసే వాళ్ళం. ఇప్పుడది బీటలు వేసిన భూమి!

          పెళ్ళికూతురి ఇల్లు అట్టహాసంగా ఉంది. వస్తూనే’హాయ్! ఎవిరిబడీ’ అంది పెళ్ళికూతురు.

          మా సుబ్బు ఖంగుతిని జవాబివ్వలేదు.

          ఆ అమ్మాయి గడగడా వాగింది. స్టార్టీవీలోని ఏ ప్రోగ్రాం మిస్ అవదట. ‘అమ్మాయికి అన్నీ నేర్పించాం: గుర్రపుస్వారీ వచ్చు. స్విమ్మింగ్, కారు డ్రైవింగ్, డాన్సులు’ పిల్ల తండ్రి చెప్పాడు. పిల్ల తల్లి’ అమ్మాయికి సినిమా పిచ్చి, ఫిలిం ఇన్స్టిట్యూట్లో అచ్తింగ్ కోర్స్  చేసింది’ అని అంది.

          మేం ఎక్కడ నమ్మక పోతామోనని, వీడియో చూపించారు. అందులోవాళ్ళ అమ్మాయి నడుం అటూఇటూ ఊపాక, పాములా మెలికలు తిరిగింది. విరబోసుకున్న జుట్టును ముందుకు వెనక్కు ఎగరేసింది. చలి జ్వరం వచ్చిన దానిలా ఒళ్లంతా వణికించింది. మా సుబ్బు తలఎత్త లేదు. మా ఆవిడ, వాళ్ళ భాగ్యం తప్ప సుబ్బుకి ఇంకెవరూ పనికిరారని అనుకోవటంతో అంటీ అంటనట్టు కూర్చుంది. మా బుజ్జిగాడు మాత్రం హుషారుగా వీడియో అంతా చూశాడు. ఎలాగో వాళ్ళదగ్గర సెలవు తీసుకొని బయటపడ్డాం. అసలుసిసలైన తెలుగు అమ్మాయిని చూపిస్తానని, భాగ్యం వాళ్ళు ఉన్న గ్రామానికి మా ఆవిడ బయల్దేరదీసింది.

          ఆ గ్రామం అంతా కలిపి వంద గడపలలోపే! భాగ్యం తండ్రి ఎలిమెంటరీ స్కూల్టీచర్గా రిటైర్ అయ్యాడు. ఆ ఉద్యోగం ఇప్పుడు భాగ్యం చేస్తోంది. విశాలమైన ఆవరణ.. ఇంటి ముందు బంతి చేమంతి పూదోట.. కల్లాపు జల్లిన గడపలో ముగ్గులు.. ద్వారానికి మామిడి ఆకుల తోరణాలు! ‘ఇంటిలక్ష్మిని వాకిలి చెబుతుంది’ అని మా ఆవిడ ఒక సామెత పారేసింది. సుబ్బుని ట్ట్రాక్మీదకు తీసుకొచ్చేమొదటి ప్రయత్నం ఆమెది.
కొద్దిగా పసుపు పూసుకున్న ముఖం, కుంకుమ బొట్టు, తల నిండా మల్లెలు, భుజాల మీదుగా కప్పుకున్న చీరలో భాగ్యం మమ్మల్నిలోనికి ఆహ్వానించింది. చక్కగా బూరెలు, బొబ్బట్లు మాచేత తినిపించారు. ‘భోజ్యేషుమాతా, అంటే భార్య అన్నం పెట్టినప్పుడు తల్లిలా ఉంటుందట!’ అని మా ఆవిడ రెండో రాయి వేసింది. భాగ్యం వాళ్ళనాన్న తమ తోటలను చూపించాడు. సొంత ఊరి మీద మమకారంతో అక్కడ ఉండి పోయామని, డబ్బుకు తమకులోటేంలేదని చెప్పాడు.

          “మీ అమ్మాయిని పై చదువులు చదివించలేక పోయారా?” అన్నాడు సుబ్బు. భాగ్యం నచ్చినట్టుందికాని ఆమె చదువు నచ్చినట్లు లేదు వాడికి.

          “భాగ్యం బి.ఎ మాథ్స్‌లో ఫస్టొచ్చింది. తలుచుకుంటే ఏదైనా సాధించగల కార్యదక్షత ఉంది దానిలో!” అని మూడో రాయి విసిరింది మా శ్రీమతి.

          “టీచరు తన పిల్లలు లెక్చరర్లు కావాలని, లెక్చరర్లు తన పిల్లలు ప్రొఫెసర్లు అవాలని అనుకోవడం సహజం! మా అమ్మాయి పెద్ద పదవులకి వెళ్ళాలని ఆశించాను. కాని దానిది వింత మనస్తత్వం! ఇక్కడే ఉంటానంటుంది!” అని నవ్వాడు భాగ్యం తండ్రి.
ఇంకో రోజు ఉందామన్నాడు సుబ్బు. మాకు అర్థమైంది. భాగ్యం వాళ్ళకి అర్థమయ్యేలా ప్రవర్తించాడు మర్నాడు. ఆమె ఏ పని చేసినా మెచ్చుకోసాగాడు. అమెరికాలో కంప్యూటర్కోర్సులెన్నో ఉన్నాయట.  ఓ ఏడాది చేస్తే చాలు, వేలడాలర్ల ఉద్యోగం ఒడిలోకి వస్తుందిట! ఆ సాయంత్రమే భాగ్యంతో, “నేను చాలామందిని చూసాను. అందరిలోకి మీరే నచ్చారు. నాకు అభ్యంతరం లేదు. వెంటనే ముహూర్తం పెట్టించమని మీ నాన్నతో చెప్తాను!” అని సుబ్బు అన్నాడు.

          “నేను మీకు నచ్చాను, సరే! మరి మీరు నాకు నచ్చారోలేదో అడగరేం?” అని భాగ్యం అనడంతో, ఆశ్చర్యపోవడం వాడి వంతయింది.

          “ఈ రెండు రోజులు చూసాక, మీ గురించి ఒక అభిప్రాయానికి వచ్చాను. మీరు క్షమిస్తానంటే అది చెప్తాను. సారీ, సుబ్బారావు గారు! మీకేంకావాలో మీకు సరిగ్గా తెలీదు.
“మీరు నచ్చారు, ‘పెళ్ళి చేసుకుంటా, నాతో ఇక్కడే ఉండిపోండి,’ అని నేనే మీతో అంటే, ఉంటారా? ఉండరు. అమెరికన్‌డాలర్లు వదల లేరు. అక్కడుంటున్న అమ్మాయిలు మీకు అక్కర లేదు. ఎందు కంటే వాళ్ళ డేటింగ్పద్ధతులు మీకు నచ్చవు! పదహారణాల పతివ్రతలు కావాలి. దాని కోసం ఇండియా రావాలి. ఏ డాక్టరో, కంప్యూటర్ఎక్స్పర్టో కావాలి. ఓ వారంలో చూపులు – పెళ్ళి అయి వెనక్కి వెళ్ళిపోవాలి. ఇదేంపెళ్ళి, సుబ్బారావుగారు? ఎ మేరేజ్ఆఫ్కన్వీనియెన్స్!

          “నేను నచ్చాను. మరి నా చదువు నచ్చిందా? అక్కడికొచ్చాక నన్ను ఇంకా చదివిస్తారు. డాలర్లు కనే యంత్రంగా మారుస్తారు. ఔనా? మీరు తెలుగుదనం పై చూపిస్తున్న ప్రేమ పైపైనే – అంతా సూడో! మిసిసిపీలో క్రిష్ణా, గోదావరిలని, కాలిఫోర్నియాలో కోనసీమ కొబ్బరిని, రిచ్మండ్లో రాయలసీమ అందాలని చూడాలను కుంటారు. పిట్స్‌బర్గ్‌లో తిరుపతి వెంకన్న బ్రాంచి ఆఫీసుపెడతారు. హ్యూస్టన్‌లో మీనాక్షికి ఎక్స్టెన్షన్కౌంటర్కావాలంటారు. ‘ఆటా’లో ఆడడానికి, ‘తానా’లో త్యాగరాజ కృతులు పాడడానికి మాత్రమే అచ్చమైన తెలుగు అమ్మాయి భార్యగా కావాలి. అక్కడున్ననలుగురినీ కలుసుకునేందుకు మీ భార్య గౌరీ పూజలు, వరలక్ష్మీ వ్రతాలు చేయాలి, బొమ్మల కొలువులుపెట్టాలి.

          “సారీ, సుబ్బారావు గారు! మీత్రిశంకు స్వర్గం నాకక్కర లేదు. డాలర్ల మీద మోజున్న చాలా మంది మీకు దొరుకుతారు. వారిలో ఒకరిని ఎంచుకోండి. నన్ను మాత్రం ఇలా ఉండ నీయండి!”

          పాపం! మా సుబ్బు పెళ్ళి కాకుండానే ఫ్లైట్ ఎక్కేసాడు.

*****

(వనితమాసపత్రిక: ఏప్రిల్ 1996)

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.