మార్పు

-ఆదూరి హైమావతి 

          ఆరోక్లాస్ చదివే ఆనంద్ కు చదువుకంటే ఆటలంటేనే ఎక్కువ మక్కువ. తల్లి అన్నపూర్ణమ్మ ఎంతచెప్పినా చదువు జోలికే వెళ్ళడు. క్రికెట్ వాడికి ఆరోప్రాణం. క్రికెట్ మ్యాచ్ ఎక్కడజరుగుతున్నా తిండి సైతం మానేసి, బడిఎగ్గొట్టి, టి.వి.కి అతుక్కు పోతాడు. వాడి మూడునెలల పరీక్షల ప్రోగ్రెస్ కార్డ్ చూసి తండ్రి నాగేశం  ఎంతో బాధపడి వాడిని కోప్పడ్డా ఆనంద్ లో మార్పు లేదు.

          నాగేశం వాడిస్కూల్ కెళ్ళి క్లాస్ టీచరైన  గణపతి మాస్టార్ తో మాట్లాడాడు.

          గణపతి మాస్టర్  “ఏం బాధపడకండి నాగేశంగారూ! ఇప్పటి పిల్లలిలాగే ఉన్నారు. నాశాయశక్తులా వాడిలో మార్పుకై  ప్రయత్నిస్తాను. “అని చెప్పిపంపాక, గణపతిమాస్టర్ క్లాస్ లో ” పిల్లలూ! శ్రధ్ధగా వినండి. రానున్న అర్ధ సంవత్సర పరీక్షల్లో పాసు మార్కులు రానివారిని సంవత్సరాంతపు పరీక్షలకు కూర్చోనిచ్చేది లేదు.అందువల్ల వారు ఏడో తరగతికి వెళ్ళక తిరిగి ఆరో తరగతి లోనే ఉండవలసి వస్తుంది.జాగ్రత్త ” అని హెచ్చరించారు.

          అది వినగానే పిల్లలందరికీ దడ పుట్టుకు వచ్చింది. మిగిలిన వారంతా పై తరగతికి వెళితే తాము ఆ తరగతిలోనే  క్రింది వారితో కలసి ఏడాదంతా చదవాలంటే సిగ్గుగా ఉంటుందనే భయంతో ఆరోజు నుండీ అంతా ఆటల పిరీయడ్ లో కూడా చదవసాగారు. బడి తోటలో చెట్ల క్రింద చేరి. ఆనంద్ వారితో పాటు కూర్చున్నా వాడికి ఒక్కటీ తలకెక్కడం లేదు. మొదటి పాఠాలన్ని రాకుండా చివరివి అర్ధం కాక, పరీక్షల్లో ఎలాగైనా పాస్ మార్క్ తెచ్చుకోను అడ్డదారి వెదకసాగాడు. అర్ధ సంవత్సర పరీక్షలకు ముందు జరుగే నెల పరీక్షలు రానేవచ్చాయి.

          ఆనంద్ పక్కన ఇందు పడింది పేర్ల ప్రకారం. ఆనంద్ పంట పండింది.ఇందుకు ఒక పేపర్ రాసి దాన్ని పక్కన పెట్టి మరోపేపర్ రాసే అలవాటు . ఆమె అలా ఒక్కో పేపరూ రాసి పక్కన పెడుతుంటే, ఆనంద్ దాన్ని మొత్తం కాపీ చేయసాగాడు. అలా అన్ని పరీక్షల్లో కాపీ చేసిన ఆనంద్ కు అన్నిసబ్జక్ట్స్ లో యాభై పైన మార్కులు వచ్చాయి. తల్లి దండ్రుల తో పాటుగా గణేశం మాస్టర్ ఆశ్చర్యపడ్డారు. వాడిలో ఇంతదీక్ష ఉన్నందుకు.

          తరగతిలో వాడిని అభినందించి “చూశారా పిల్లలూ ! మీరంతా ఆనంద్ ను ఉదాహరణగా తీసుకుని చక్కగా చదవాలి మరి. మొన్నమొన్నటి వరకూ చదువంటే పట్టని ఆనంద్ ఈపరీక్షల్లో మంచి మార్కులు సంపాదించాడు. పట్టుదల అంటే అలా ఉండాలి మరి.”అని క్లాప్స్ ఇప్పించి, భుజం తట్టారు.

          తల్లి వాడికి ఇష్టమైన జీడిపప్పు పాయసం చేసి కొసరి మరీ మరీ తినిపించగా,తండ్రి  కొత్త షర్ట్ కొని ఇచ్చాడు. ఆనంద్ కు మంచి మార్కులు వస్తే ఇంతలా పొగడ్తలు, గౌరవం, ప్రేమ దక్కుతాయని తెలిసివచ్చింది. కానీ కష్టపడి చదవడ మంటే మాటలు కాదు. అందుకే ఇలాగే అన్నిట్లో కాపీకొట్టేసి మార్కులు సంపాదించాలని అనుకున్నాడు.

          అర్ధసంవత్సర పరీక్షలు రాగానే మునపటిలా’ ఇందు ‘పేపర్లో కాపీ చేయసాగాడు. మాస్టర్ వాడి తీరు గమనించి ఆఖరిదైన ఇంగ్లీష్ పరీక్ష రోజు’ ఇందును దూరంగా వేరే కూర్చోబెట్టారు.

          ఆరోజు ఆనంద్ కాపీకొట్టను పక్కన ఇందు లేనందున ఏమీ రాయలేక పోయాడు. గణేశం మాస్టర్ వాడిని నొప్పించక వాడితప్పు ఒప్పించి వాడిని సరిచేయాలని తలంచి,

          ” పిల్లలూ! పరీక్షలన్నీ ఐపోయాయి గనుక పదండి అందరం ప్లే గ్రౌండ్ కెళ్ళి ఆడుకుందాం” అని అందరిని బయటికి తీసుకెళ్ళారు.అందరూ వరుసగా నిల్చునారు

          ” పిల్లలూ ఆటల్లోనైనా,చదువులోనైనా దేన్లోనైనా మనం ముందంజ వేయాలంటే ఏకాగ్రతతో సాధన చేయాల్సి ఉంది. ముందుగా మనలోని దురభ్యాసమైన బధ్ధకాన్ని తొలగించుకోవాలి. బధ్ధకం మనకు ప్రధమ శతృవు. దాన్ని పక్కకు నెట్టి మన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనలక్ష్యాన్ని చేరే ప్రయత్నంచేయాలి. క్రికెట్ కానీ , ఛెస్ కానీ , షూటింగ్  కానీ , ఐ.ఏ.ఎస్ కానీ ఏదైనాసరే లక్ష్య సాధనా మార్గంలో ముందుకు సాగితే విజయం తధ్యం. దానికై ముందుగా మన బుధ్ధిని సరైన మార్గంలో పెట్టు కోడం మన చేతుల్లో పనే! చూడండీ బడితోట లోని పూలమొక్కలు, కూర పాదులూ..మనం శ్రధ్ధగా తలో పిరీయడూ కేటాయించుకుని  తోటపని చేయడం వలన చక్కని బడితోటను మనం ఇలా చూస్తున్నాం. పూలమొక్కలకు పాదులు చేసి, నీరు పెట్టినందున చక్కని అందమైన రంగు రంగుల పూలను ఇస్తున్నాయి. టమోటా, వంగ, బెండ మొక్కలు మంచి ఫలసాయాన్ని అందిస్తున్నాయి. అలాగే కూర పాదులు చూడండి , బీర కాకర, పొట్ల పాదులు పందిరినిండా కాయలు దిగి ఉన్నాయి. ఐతే ఆపొట్ల పాదు చూడండి, ఆకాయలకు చిన్నవిగా ఉన్నపుడే వాటి చివర తాడుతో చిన్న రాళ్ళు కడుతున్నాం. ఎందుకు? చెప్పగలరా” అని గణపతి మాస్టర్ అడగ్గా,పిల్లలు” తెలీదు మాస్టారూ!

          ఆకుల్లో కలసి పోయి కనిపించవనా ?”  “కాదు కాదు ఆపొట్ల కాయలు మన బుధ్ధి వంటివి. వాటికి రాళ్ళు కట్టక పోతే అవి వంకరలు తిరిగి పోతాయి , కాయ నేరుగా పొడుగ్గా పెరిగేందుకే కాయల చివర రాళ్ళు కడతాం. అపుడు అవి నేరుగా పొడవుగాపెరిగి మంచి రేటు పలుకుతాయి.

          మన బుధ్ధిని కూడా వాటికి రాళ్ళు కట్టి నట్లుగా,లక్ష్య సాధన వైపు మళ్ళించాలి. సమయాన్ని వృధా చేయక సరైన రీతిలో మన మనస్సును ఉంచి విజయం సాధించాలి. టెండూల్కర్ గాని , గోపీచంద్ గానీ ఇంతటి విజయాలు సాధించను ఎంతటి సాధన చేసి ఉంటారో ఆలోచించండి. సాధారణంగా మన మనస్సు చెడువైపు సులువుగా మళ్ళు తుంది, దానికి రాయికట్టి సరైన మార్గంలో ఉంచితే మనమూ ఘన విజయం సాధించవచ్చు. సరే ఇహ పదండర్రా ! ఈరోజు ఫుట్ బాల్ ఆడదాం “అని అందర్నీ ఆటవైపు మళ్ళించారు. స్కూల్ లాంగ్ బెల్ మోగగానే అంతా తమ సంచులు తీసుకుని ఇంటికి బయల్దేరగా, ఆనంద్ గణపతి మాస్టారున్న గదిలోకివెళ్ళి ఆయన రెండు కాళ్ళూ పుచ్చుకుని…

          “మన్నించండి  మాస్టారూ ! తప్పుచేశాను.”అంటూ పెద్దగా ఏడ్వ సాగాడు . మాస్టారు వాడిని లేపి…

          “ఆనంద్ ! నీలో మంచి మార్పుకోసమే నోయ్ నా తాపత్రయమంతా . మంచిది , ఇహలే, వెళ్ళి నీ మనస్సుకు రాయి కట్టుకుని సరిచేసుకుని విజయమార్గం వైపు నేరుగా సాగు.”అని తలనిమిరి పంపారు.

          అదన్నమాట పిల్లలు తమలో మార్పుకోసం చూసుకోడం, మాస్టార్లు పిల్లలలో  మార్పుకోసం సహకరించడం.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.