రుద్రమదేవి-8 (పెద్దకథ)

-ఆదూరి హైమావతి

          “నోర్ముయ్యరా కుర్రకుంఖా!” నా తఢాఖా తెల్సే మాట్లాడుతున్నావ్ ? నీవు దాని తరఫున మాట్లాడి  నందుకు శిక్ష దానికే పడుతుందని మరచావ్ రా? చూడు ఈ రోజు దాన్నేంచేస్తానో?” అంది కొపంతో రగిలిపోతూ భానుమతమ్మ.

          “అంతా నాఖర్మ, నేనూ అక్కలా ఆడదాన్నై పుట్టి ఉంటే ఇంట్లోనే నీ ముందు మొగుడూ అత్తల పీడ లేకుండా హాయిగా పడిఉండే దాన్ని. నా ఖర్మకాలి  మొగాడిగా పుట్టి ఈ పాపమంతా చూస్తూ మోస్తున్నాను. ఇహ నావల్ల కాదు, నేను మామగారింటికి వెళ్ళి జరిగే  ఘోరమంతా చెప్పేస్తాను, లేదా ఊరందరినీ పిల్చి నీ ఆగడాలు చూపుతాను .” అంటూ బయటి కెళ్ళిపోయాడు లక్ష్మీనరసు.

          “వీడికింత నోరెట్టా వచ్చిందే చిట్టీ ! వీడు అన్నంత పనీ చేస్తే ఏంకాను! దీన్నీరోజే ఖతం చేసేయ్యాల్సిందే!  లేకుంటే మన సంగతంతా బయట పడుతుంది.” అని కూతురితో అనింది భానుమతమ్మ.

          గోదారికెళ్ళిన  ముత్యాలు ఆ బిందె వేసుకుని నడవలేక నీళ్ళలో పడిపోయి, స్పృహ తప్పి పోయింది.

          “పాపం పిచ్చి పిల్లలా ఉంది, రోజూ అంత పెద్ద ఇత్తడి బిందె మొయ్యలేక నానా తంటాలు పడుతున్నది! “

          “ఈ అమాయకపు పిల్లను చూస్తంటే జాలిగా ఉంది వదినా!”

          “జాలిపడటం తప్ప మనం ఏమి చేయగలం చెప్పు వదినా!” ప్రతిరోజూ ఊరి మహిళలు గోదారి వద్ద మొయ్య లేక మొయ్యలేక అంత పెద్ద బిందె నీరు మోసు కెళుతున్న ముత్యాల్నిచూసి జాలి పడేవారు. ఆరోజూ అలాగే తమలో తాము మాట్లాడు కుంటూండగా నీటి కోసం గోదార్లోకి దిగిన ముత్యాలు స్పృహతప్పి పడిపోయింది నీళ్ళలో.

          “అయ్యో! చూడు అక్కా! భానుమతమ్మ కోడలు నీళ్ళలో పడిపోయింది, “

          “అత్తా రండి పట్టండి ఒడ్డుకు తీసుకెళదాం ” అంటూ   ముత్యాల్ను నలుగురు మహిళలు కల్సి ఎత్తి ఒడ్డుకు చేర్చారు.

          “వదినా ఇప్పట్లో ఈ పిల్లకు స్పృహ వచ్చేలా లేదు. ఆ బండిని కేకేయండి ఈమెను ఇల్లు చేర్చుదాం ” అంటూ అంతా కల్సి  అక్కడే ఎద్దులకు నీళ్ళు పట్టించను వచ్చిన పక్కనున్న బండిలో పడుకోబెట్టి ఇల్లు చేర్చారు.

          “భానుమతమ్మా! నీ కోడలు కాలుజారి నీళ్ళలోపడి స్పృహ తప్పింది చూడండి ” అని అప్పగించారు.  

          అమిత కోపంగా ఉన్నా” వద్దే అంటే వినదే! తానే వెళ్ళి గోదారి నీళ్ళు తేవాలంటుం దమ్మా మా కోడలు మహామొండిది, అమ్మింట్లో ఇంత మొండి ఘటంలా పెరిగిందని తెలీక చేసుకుని నానా అగచాట్లూ పడుతున్నానమ్మా! ” అని దీర్ఘం తీస్తూ చెప్పి, వారిని పంపించింది భానుమతమ్మ. . 

          అంతా వెళ్ళి పోయాక ఆమె ఒక కర్ర తీసుకుని ముత్యాలు వీపుపై మోదింది . స్పృహలేని ముత్యాలు ఆ దెబ్బకి మూలిగింది తప్ప పెద్దగా అరవలేక పోయింది.

          “అమ్మాయ్! చెంచులక్ష్మీ! ఇది చచ్చినట్లుంది! పట్టు పెరట్లోని బాదం చెట్టు క్రింది అరుగు పైకి చేరుద్దాం! మీ నాయన గానీ, మీ తమ్ముడు గానీ వస్తే మనల్ని అల్లరి పెడతారు.” అని ఇద్దరూ కాళ్ళూ , తలా పట్టుకుని ముత్యాల్ని అరుగు పైకి విసిరేశారు. ఆమె తల చెట్టుకు తగిలి, రక్తం చిమ్మింది. ముత్యాలు బాధగా మూలిగింది. అదేమీ పట్టించుకోకుండా ఆ పిశాచాలు రెండూ లోపలికెళ్ళి తలుపేసుకున్నాయి. 

          చీకటైందాకా  అటు కొడుకుగానీ ఇటు భర్త గానీ ఇల్లు చేరక పోడంతో, కంగారు పడక పోగా ” అమ్మాయ్ ! చెంచులక్ష్మీ !ఇది చచ్చే ఉంటుందంటావా? వీళ్ళు ఇద్దరూ ఇల్లు చేరేలోగా దీన్ని తీసుకెళ్ళి ఆ గోదాట్లో పడేసి వద్దాం . వాళ్ళొచ్చారంటే ముందు వీళ్ళే విషయం బయటేస్తారు ”  అంది భానుమతమ్మ.

          “ముందు దొడ్లోకెళ్ళి చూడవే ముత్యాలు బతికే ఉంటే గొడవే ఉండదు. లేకపోతే అనర్ధమే! అది ఎవరైనా అడిగితే అన్ని చెప్పేస్తుంది. ” అంది చెంచులక్ష్మి తల్లికి వత్తాసుగా.

          “నిజమేనే నీవన్న మాట! ” అని భానుమతమ్మ ,పెద్ద బానలో నిన్నటి రోజన  బయటి మెట్ల వద్ద కాళ్ళు కడుక్కుని లోపలికి రాను పోసి ఉంచిన పెద్ద బానలోని నీళ్ళు మోసుకుని పెరట్లో కెళ్ళి అక్కడ అరుగుపై మరణావస్తలో ,నిస్సహాయంగా ఉన్న  ముత్యాలు మీద కుమ్మరించింది. జ్వర తీవ్రతతో, తలకు తగిలిన దెబ్బ నుండీ రక్త శ్రావం కాగా, స్పృహలేని ముత్యాలు ఒక్క మూల్గు మూల్గి , శరీరంలో చలనం నిల్చి పోయింది.

          “ఏమే ముత్యాలూ!”, అని పిల్చి, కాలుతో ముత్యాలు శరీరాన్ని పొర్లించి  చూసింది . ” చెంచులక్ష్మీ! ఇది  చచ్చినట్లే ఉంది . ఆ పాలెగాడ్ని బండి కట్టమను , త్వరగా ” అని కూతుర్ని తొందర చేసి ఇంటికి దూరంగా ఉన్న పసువుల కొట్టంలో పశువుల కు మేత వేసి కుడితి పడుతున్న  పుల్లయ్యను ” ఒరే పుల్లా ! బండిపట్టరా ! జరూర్గా వెళ్ళాల” అంటూ తొందర చేసి , ఇద్దరూ కల్సి ముత్యాల్ని బండిలో వేసి తామూ కూర్చుని “తొందరగా పదరా! గోదారి కెళ్ళాల .” అని బండిని త్వరగా పరుగెత్తించి , గోదారి గట్టున బండిని ఆపి ” ఒరే ! మేం స్నానం చేసివస్తాం నీవు బండిని దూరంగా ఆపుకో” అని చెప్పింది భానుమతమ్మ.

          ‘ఇంత చలిలో చన్నీళ్ళ స్నానం ఈ రాత్రప్పుడు!’ ఆశ్చర్యంగా పుల్లయ్య  సైగలు చేశాడు, వాడికి మాటలు రావు , మూగవాడు .

        “నీవు వెళ్ళరా నీకెందుకు ?” అని వాడిని బండికి దూరంగా పంపి ,ఇద్దరూ ముత్యా ల్నిమోసు కెళ్ళి గోదాట్లోకి విసిరేశారు . పిల్లల్ను కన్న  కడుకర్కశపు  గొడ్రాళ్ళిద్దరూ!  పది నిముషాలయ్యాక ఇద్దరూ బండి ఎక్కి పోనిమ్మనగా ‘ కోడలు ఎక్కడనీ ?’పుల్లయ్య  సైగలతో అడిగాడు. వాడికి వంద నోటు చేతిలో పెట్టి ,

          “ఎవ్వరితో ఏమీ అనక “అని సైగతో చెప్పి ఇద్దరూ ఇల్లు చేరారు . ఆ రాత్రి ఎలా వాళ్ళిద్దరూ నిద్రపోయారో! ఆ పిశాచాలు తమ మనస్సుల్ని ఎలా నిలవరించుకున్నాయో! వారిని పుట్టించిన ఆ బ్రహ్మకే తెలియాలి. 

          ఏనాడూ  కోడలొచ్చాక గోదారికి రాని భానుమతమ్మ చిన్న పానకబ్బిందె తీసుకుని మరునాడు పొద్దుటే గోదారికేసి వస్తూ దారిపొడవునా అందర్నీ” ఏంచిట్టెమ్మా! మా కోడల్నేమైనా చూశావా?  ”         

          “ఏం వదినా !మా కోడల్నేమైనా చూశావా? “అంటూ ఏనాడూ లేంది వరసలుపెట్టి పిలుస్తూ అడగసాగింది. అంతా ముక్కున వేలేసుకుని ” నిన్నరాత్రే గదమ్మా భాను మతమ్మా! మీకోడలు గోదాట్లో కళ్ళు తిరిగి పడి పోతే ఇంటికి చేర్చాం! మళ్ళా ఏమైం ది, ఇంతలో ?” అని అంతా చుట్టూచేరి అడుగుతుండగా , ముందుగా తెలతెల వారు తుండగానే వెళ్ళిన స్త్రీలు వెలుగు రేఖలు రాగానే దూరంగా ఒడ్డున కన్పిస్తున్న చీరను  చూసి ” ఇలాగొచ్చేయండర్రా! ఇక్కడెవరో నీళ్ళలో పడి ఉన్నారు. నీటి ప్రవాహం లేదాయె ఒడ్డు కొచ్చేసింది శవంలా ఉంది ” అంటూ కేకలేయగా  అంతా పరుగులు తీశారు. కొందరు  చుట్టుపక్కల పనుల్లో ఉన్న రైతులను కేకలేయగా వారు పరుగు పరుగున వచ్చి శవాన్ని లేవనెత్తి తెచ్చి గట్టున పడుకో బెట్టారు .               

          అంతా ” ఇది భానుమతమ్మ కోడలు ..  భానుమతమ్మ కోడలు .. రాత్రేగా మేము తీసుకెళ్ళి ఇంట్లో వదలి వచ్చాం!మళ్ళా ఎలా నీళ్ళలో పడింది?”అంటూ అనుమానంగా భానుమతమ్మ ముఖాన్ని చూడగా , ఆమె స్టేజ్ యాక్టర్ లా అప్పటి కపుడు రాని ఏడుపు తెచ్చుకుని ” నాకొంప ముంచిదిరా  దేవుడోయ్ ! నా పిల్లాడి కాపురం గంగలో కలిసింది రా! దేవుడోయ్! నా ఇంటి పరువు పోగొట్టిందిరా దేవుడోయ్ !” అంటూ శోకాలు పెట్టసాగింది.

          అంతా దిగ్బ్రమ చెందారు , ఎవ్వరూ ఏమీమాట్లాడక వెళ్ళిపోయారు , అందరికీ అనుమానమే కోడల్ని  భానుమతమ్మే తెచ్చి నీళ్ళలో పడేసి ఉంటుందని .

*****

(ఇంకా ఉంది) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.