సగం మనిషి !

(నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో మొదటి బహుమతి రూ.2500/- పొందిన కథ)

-రాయప్రోలు వెంకట రమణ శాస్త్రి

          “లతా… ఏంటి మాట్లాడాలని మెసేజ్ పెట్టావ్ ?”

          “నువ్ ఫ్రీ అయితేనే చెప్పవే రమణీ,…  ఓ పది నిముషాలు మాట్లాడాలి, అందుకని”.

          “ఫర్లేదు, ఫ్రీనే, ఆదివారమేగా! ఇప్పుడే టిఫిన్లు అయినయ్ . కానీ నువ్వు ముందు మీ టీవీ వాల్యూమన్నా తగ్గించు, లేదా పక్క గదిలోకైనా రా! ఫోన్లో ఏం వినపడట్లేదు ఆ టీవీ సౌండులో”.

          “ఇదిగో వాల్యూమ్ తగ్గించేస్తున్నా”.

          “ఆ… ఇప్పుడు చెప్పు”.

          “మన పాత ఆఫీసర్ గిరిబాబు లేరూ…”

          “వాడేగా సగం మనిషి, సగం పశువు!”

          “అబ్బబ్బ… మరీ అట్లా తిట్టకే, ఆయన పేరు ఎత్తితేనే భగ్గుమంటావు నువ్వు “

          “చెప్పు ఏమైందేవిటి వాడికి? కరోనా మృతుల లెక్కల్లోకి చేరాడా?”

          “పెద్దవాడు కదే… ‘ఆయన’ అనచ్చుగా!”

          “బుద్దిలోనూ పెద్దైతే అనేదాన్నే. వాడి ఎడ్డి చూపులూ వాడూను. వాడికి వళ్ళంతా కళ్ళే, అవీ ఎక్సరే కళ్ళు”.

          “మీ ఇద్దరికీ మొదట్నుండీ కుదర్లేదు లేవే”.

          “నువ్వే వాడ్ని సరిగ్గా అర్ధం చేసుకోలేదు. నాకు మొదట్లోనే తెల్సిపోయింది. నువ్వేమో అందర్నీ నమ్మేస్తుంటావ్, భరిస్తుంటావ్ .”

          ” తోటి ఉద్యోగిని అనుమానిస్తూ  ఎలా పనిచేస్తామే?”

          “అనుమానించడం కాదు, ప్రవర్తన అర్థం చేసుకోవాలి అంటాను”

          ” ఈ విషయంలో నీ అంత నేర్పరి కానులే నేను”

          ” కోపమొచ్చిందా?”

          ” అవును… నీకు ఇచ్చినంత తెలివి నాకు ఇవ్వనందుకు ఆ దేవుడి మీద!”

          ” మనం ఆడవాళ్ళం వస్త్రం లాంటి వాళ్ళం లతా. ప్రతి మగవాడు ఒక గడ్డివాము గానీ, ముళ్ళ కంప గానీ అయివుంటాడు. వాళ్ళతో కలిసి పనిచేయడం వెళ్లి గడ్డివాము మీదనో, ముళ్లకంప మీదనో పడడం లాంటిది! ముళ్ళకంపలకి దూరంగా మసలాలి వస్త్రం, లేకపోతే చిరుగులే జీవితం!”

          ” అంతేనా… ఇంకేవైనా రకాల మగవాళ్ళు ఉన్నారా?”

          ” ఉన్నారులే మూడో రకం వాళ్ళు కూడా, మన గిరిబాబు లాగా. వీళ్ళు పచ్చి పాల లాంటి వాళ్ళు! చూపులకి ఏవీ తెలియదు. కాస్త వేడి చేసాకనే, అంటే మాటలు పెరిగాకనే, తెలుస్తుంది మంచి పాలా? లేక విరిగిన పాలా ? అన్నది.”

          ” పీ జీ చెయ్యకుండానే, డాక్టరేట్ చేసేసావే నువ్వు”

          ” చిన్నప్పటి నుండి చుట్టూ వాళ్ళతోనే కదే బ్రతికేది. వయసు వచ్చినప్పటి నుండి మన బ్రతుకు రీసెర్చ్ లాంటిదే! ఎవరు ఏ ఉద్దేశ్యంతో మాట్లాడుతున్నారా అని సగం బుర్ర దాని మీదనే పెట్టాలాయే! దీనికి ప్రత్యేకంగా పెళ్లి అనే పీ జీ చెయ్యక్కర్లేదు”.

          ” నీతో మాట్లాడడం ఒక గైడ్ చదవడం లాంటిది. అందుకే ఫోన్ చేసే ముందే అడిగాను ఓ పది నిముషాలు పడుతుందని”.

          “అందరితో ఇలా నీతోలాగా ఉండలేం లతా! మనసుకి దగ్గరైన వాళ్ళతోనే ఇలా ఉండగలం. సరే ఇంతకీ ఏమైందో చెప్పు మిస్టర్ గిరిబాబు, రిటైర్డ్ కథ”.

          “ఈ మధ్య వాట్స్యాప్ మెసేజ్ లు తెగ పెడుతున్నాడు. గుడ్మార్నింగులూ, గుడ్నైట్లూ. బాగుండదు పెద్దాయన, ఎంతైనా మన ఎక్సు బాసు కదా అని నేనూ రిప్లైలు పెట్టేను”.

          ” అవును మరి… పాపం! పాపం!”

          “నువ్వు విను, కామెంట్లు వద్దు!”

          “సరే చెప్పు”.

          ” ఈ మధ్యన కొన్ని జోకులు, శృంగారపు కవితలూ పెడుతున్నాడు. ఒక్కోసారి రొమాంటిక్ జోకులూ పంపిస్తున్నాడు”

          “నువ్వేమో చూసి ఊరుకుంటున్నావ్ . కదా! ఫిదా సినిమా బాన్సువాడ భానుమతి, సింగిల్ పీసు చేసినట్టు, చెప్పు ఒకటి ఫోటో పెట్టుండాల్సింది.”

          “మొన్న పెట్టిన ఒక మెసేజ్ ఏంటో తెల్సా”

          “చెప్పుకోండి, చెప్పుకోండి మేడమ్ ! చాలా ఇన్ట్రస్టింగ్ గా ఉంది”

          ” రిటైరైన తర్వాత జీవితం ఉత్సాహంగా , ఉల్లాసంగా ఉండాలంటే అక్రమ సంబంధం ఒకటి నడుపుతుండాలట”.

          “ఎంత తెలివిగా అప్లికేషన్ పెట్టాడే! మెచ్చుకోవాల్సిందే ఆ సగం మృగాన్ని”.

          “ఈ రోజు సెలవేగా ? ఏ టైమ్ లో ఫోను చేయచ్చూ – అంటూ ఈరోజు పొద్దున్నే మెసేజ్ పెట్టాడు. – లేద్సార్ … సెలవైనా, ప్రీ ఆడిట్ వర్కు చూసుకోవడానికి ఆఫీసు కెళ్ళాలి – అన్నాను. పోనీ లంచ్ కి బయటి కెళ్దాం వస్తాను – అన్నాడు. నేను భోంచేసే బయల్దేరతాను ఆఫీసుకి – అని చెప్పాను. ఏదో ఒక టైమ్ లో వస్తాను, బయటికెళ్ళి ఐస్ క్రీమ్ తినొద్దాం – అంటున్నాడే. పైగా – నువ్వు లతవి అల్లుకు పోవాలి గానీ ఇంత అడిగించుకుంటావేంటీ- అంటున్నాడు”.

          ” కూతురు వయసు ఉండే అమ్మాయితో మాట్లాడాల్సిన మాటలేనా అవి.”

          ” పోనీలే పెద్దాయన బాగుండదు అని ఫోన్ ఎత్తుతానా,

          ఆయన వంకర మాటల్తో చిరాకు, భయం పుడుతున్నాయి”.

          ” భయం ఎందుకు? నేనైతే ఇంటికి పిల్చి, రాగానే అప్పటిదాకా స్టౌ మీద కాల్చి ఉంచిన అట్లకాడతో వెనకాల సీటు మీద అటొకటి ఇటొకటి అంటించేదాన్ని, నాతో సంబంధం పెట్టుకోవాలన్న దానికి గుర్తుగా. ఆ తర్వాత ఇంక నెల రోజులు వాడు బోర్లా పడుకొనే అన్ని పనులూ చేసుకోవాలి. పాంటు వేసుకోలేడు, పంచ కట్టుకోలేడు!”

          “నువ్వేం చేస్తావో తెల్సుకోడానిక్కాదే నీకు ఫోను చేసింది. నేనేం చెయ్యాలో చెబుతావని”.

          “సరే… నేను ఆలోచించి ఏంచేయాలో చెబ్తాను. నువ్వు వాడికి మాటల్లో, ప్రవర్తనలో మర్యాదకి ఏ లోటూ రానీయకు. అదే వాడికి ఎర. అప్పుడే వాడు వల్లో చిక్కుతాడు”.

***

          ఆ రోజు సమయం మధ్యాహ్నం నాలుగ్గంట లవుతుంటే గిరిబాబు తన పాత ఆఫీసుకు వచ్చాడు. లత పని చేసుకుంటున్న క్యాబిన్ లోకి వచ్చి “హలో లతా… ” అంటూ చేయి చాచాడు కరచాలనం కోసం.

          చేయిచాచి, “కూర్చోండి సర్ ” అంటూ కుర్చీ చూపించింది లత.

          “వాటర్ కావాలా సర్ ?” అంటూ నీటి సీసా గిరిబాబు ముందుంచింది.

          గిరిబాబు నీళ్ళు తాగబోతూ, “తాగుతాను… నువ్వు ఎంగిలి పడ్డ నీళ్ళు ఎంత తీయగా ఉంటాయో తెలియాలంటే తాగాలిగా మరి” అన్నాడు.

          లత కొంచెం ఇబ్బందిగా కదుల్తూ, కుర్చీలోంచి లేచి బీరువాలు ఉన్న వైపు వెళ్ళింది. గిరిబాబు నీళ్ళు తాగి బాటిల్ మూస్తుండగా లత ఒక ఫైలుతో వచ్చి కూర్చుంది.

          “ఒక్క దానివే వచ్చావా?” అన్నాడు చుట్టూ చూస్తూ గిరిబాబు.

          ” అటెండెర్ కూడా వచ్చాడు సర్, లంచ్ కి వెళ్ళాడు” లత సమాధానం ముక్తసరిగా ఉంది, ఫైల్ లోకే చూస్తూ.

          ” ఎలా ఉంది ఆఫీసు? మీ కొత్త బాసుకి చిలక్కొట్టుడు ఎక్కువట కదా?” అడిగాడు గిరిబాబు ఓ వెకిలి నవ్వుతో.

          ” సమాధానం దాటవేస్తూ ” కాఫీ నా, టీ నా సర్ ఏది తీసుకుంటారు?” అడిగింది లత.

          ఆమె మాట ముగుస్తుండగా ఫోను మ్రోగింది. తీసి చూసి, గిరిబాబుతో, ” మీరీ పుస్తకం చూస్తుండండి సర్ ..” అంటూ అతని ముందు ఒక మేగజైన్ ఉంచి క్యాబిన్  బయటకి వెళ్ళింది. గిరిబాబు పుస్తకం చూడసాగాడు. పదిహేను నిముషాల తర్వాత లత వచ్చి కూర్చుంది.

          “ఈ సెలవ రోజుల్లో కూడా ఆఫీసేంటీ? పనేంటీ? హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేయకుండా?” ఓ వ్యాఖ్య విసిరాడు లత వంటిని కళ్ళతో తడిమేస్తూ గిరిబాబు.

          “ఏం చెయ్యాలి సర్ ! బదిలీ అయి వెళ్ళిన వాళ్ళ ప్లేసుల్లో ఎవరినీ ఇవ్వట్లేదు. రిక్రూట్ మెంట్ మీరున్నప్పుడే ఆపేసారు కదా!”

          “నిజమే అనుకో. అలాగని ఇంక జీవితమంతా ఆఫీసే అయిపోతే ఎట్లా? పర్సనల్ జీవితానికీ, నా లాంటి స్నేహితులకీ కూడా కొంత సమయం ఉండాలి కదా మీ దగ్గర?” మరింత వెకిలిగా నవ్వుతూ పలికాడు గిరిబాబు.

          మరో పదిహేను నిముషాలు గిరిబాబు ద్వందర్ధాల మాటలను, తినేసే చూపులనూ భరిస్తూండగా, ఆఫీసు తలుపులు త్రోసుకొని ఇద్దరు కానిస్టేబుళ్ళూ, ఒక మహిళా ఎస్సై, లత కాబిన్ లోకి వచ్చారు. వస్తూ నమస్కారం చేసిన కానిస్టేబుల్స్ కి తిరిగి నమస్కారం చేసి, ఎస్సై కి నమస్కారం చేసి “కూర్చోండి మేడమ్ ” అన్నది లత లేచి నిలబడి.

          హఠాత్తుగా క్యాబిన్లో మారిన వాతావరణానికి గిరిబాబుకి ఏమీ అర్ధం కాక మెల్లగా చెమటలు పట్ట సాగాయి.

          “వచ్చాడా వాడు మీకు ఫోను చేసి సతాయిస్తున్న వాడు?” లతతో అంటూ ఎస్సై, గిరిబాబు వైపు తిరిగి “మీరెవరు?” అని అడిగింది.

          ఆమె ప్రశ్నకు బెదిరి పోయిన గిరిబాబుకు సమాధానం కంటే ముందు తడారిన గొంతు నుండీ దగ్గొచ్చింది, పొలమారి.

          మంచి నీళ్ళ బాటిల్ ఆయన ముందుకు తోస్తూ ఎస్సైతో అంది లత, “ఆయన మా పాత ఆఫీసరుగారు, గిరిబాబు గారని”.

          నీళ్ళు తాగి కర్ఛీఫ్ తో ముఖం మీది చమట తుడుచుకో సాగాడు గిరిబాబు. అరికాళ్ళలో పట్టిన చమటని చెప్పుల్లోంచీ కాళ్ళు తీసి క్రింద నేలకి రాయసాగాడు.

          “ఈ రోజు సెలవు కదా? ఈయన ఎందు కొచ్చాడిక్కడికిప్పుడు” ఇంటరాగేట్ చేసినట్లు అడిగింది ఎస్సై.

          “నేను ఇటు నుండీ వెళ్తూంటే ఆఫీసు తెరిచి ఉండడం చూసాను. నా పర్సనల్ ఫైల్ లో ఒక కాగితం అవసరం కూడా ఉంది. అది తీసుకోవచ్చేమో వీలైతే అని వచ్చాను” గిరిబాబు గొంతు ఆగాగి వణుకుతూ పలికింది అబద్దాన్ని.

          “టీయా? కాఫీయా మేడమ్, ఏం తీసుకుంటారు ?” అడిగింది లత ఎస్సైని.

          ఎస్సై వద్దంటున్నా సెల్ లో, “అయిదు కాఫీ వేడిగా, బాగా చేసి తీసుకురా” ఆర్డరిచ్చింది లత, ఆఫీసు ప్రక్కనే ఉండే కాఫీ దుకాణం అతనికి.

          “ఎందుకండీ ఇట్లా రిస్కు తీసుకుంటారు సెలవు రోజుల్లో ఒక్కళ్ళూ ఆఫీసుకు వచ్చి? మీ దగ్గర చిల్లీ స్ప్రే గానీ, పెప్పర్ స్ప్రే గానీ ఉందా లేదా?” అడిగింది ఎస్సై లతను ఉద్దేశించి.

          “లేదండీ అటెండర్ కూడా వచ్చాడు. లంచ్ కని బైటి కెళ్ళాడు. అర్జెంట్ ఆడిట్ ఉండడం వల్ల రావలసి వచ్చింది” చెప్పింది లత.

          “మీరింకెంత సేపు వర్క్ చేయాలి?” అడిగింది ఎస్సై.

          “ఇంకో గంట పనుందండీ”

          “మేడమ్ కి ఒక చిల్లీ స్ప్రే బాటిల్ ఇవ్వండి” కానిస్టేబుల్స్ కి ఆర్డరిచ్చింది ఎస్సై.

          బాటిల్ తీసుకొని అయిదు వందల నోటు తీసి ఇచ్చింది కానిస్టేబుల్ కి. అతను జేబులో పెట్టుకున్నాడు, చిల్లర తిరిగి ఇవ్వకనే.

          “మిమ్మల్మి సతాయిస్తున్న వాడేమంటాడు? ఎం కావాల్ట వాడికి? వాడి నెంబర్ నోట్ చేసుకున్నారా?” అడిగింది ఎస్సై.

          గిరిబాబు పై ప్రాణాలు పైనే పోయినయ్ ! లేచి నిలబడి, “అమ్మా లతా నేను మళ్ళీ వస్తాలేమ్మా… ఇప్పుడు అటెండర్ కూడా లేడు గదా” ఎండిన పెదాలను తడుపుకొని చెప్పాడు.

          “సర్ కాఫీ ఆర్డరిచ్చాను మీక్కూడా” అంటున్న లతతో, “మరో పనుందమ్మా వెళ్ళాలి” మరో అబద్దం చెప్పి బయటకి నడిచాడు గిరిబాబు.

          వచ్చిన కాఫీలు తాగి, కాసేపటి తర్వాత, “ఇంకా గంట పనుందంటున్నారు కదా. మా కానిస్టేబుల్ ఒకర్ని ఇక్కడ ఉంచుతాను మీకు తోడుగా” అంటూ లేచి, “జాగ్రత్తగా చూస్కో. ఏ అవసరమైనా వెంటనే కాల్ చేయి” అని కానిస్టేబుల్ ఒకతనికి చెప్పి, మరో కానిస్టేబుల్ వెంటరాగా బయటికి నడిచింది ఎస్సై.

          ఒక అరగంటకి అటెండర్ వచ్చాడు. తర్వాత ఇంకో అరగంటకి ఆఫీసు మూసి అందరూ బయటికొచ్చేసారు.

***

          బయటకు వచ్చి ఆటోలో ఇంటికి వెళ్తూ రమణికి ఫోను చేసి చెప్పింది లత, “రమణీ…. మనం అనుకున్నట్లే అయింది. పోలీసులని చూడగానే బిక్క చచ్చి పోయాడు, పాపం రొమేంటిక్ గా తయారై వచ్చిన పాత బాసు! పనుందంటో పలాయనం చిత్తగించాడు. చాలా బాగా స్క్రిప్ట్ చేశావు కథని”.

          “మరి మనకి సహాయానికి ఎవరూ లేరనుకుంటూ, రారనుకుంటూ వేధించే మృగాలతో ఇట్లాగే పోరాడాలి. ఇంక నీ ఊసు వాడి మదిలోకి రాదు చూడు” భరోసా ఇచ్చింది రమణి.

          ” రమణీ… నా లాంటి ఆడవాళ్ళు బయట పనిచేయాలంటే నీలాంటి స్నేహితురాలు ఉంటేనే అవుతుంది” కృతజ్ఞతా పూర్వక ప్రశంస చేసింది లత.

          “మగవాళ్ళ మధ్యన పనిచెయ్యడం అంటే సాము గరిడీ లాంటిది మనకు. కొంచెం కలుపుగోలుగా వుంటే లింకులు అంటగడతారు. కరుకుగా వుంటే పొగరు, గయ్యాళి అని టాగ్ తగిలిస్తారు. వ్యక్తిత్వానికి మచ్చ రాకుండా మసలుకోవడం కత్తి మీద సామే!” రమణి మాట పూర్తి అవుతుండగా ఆటో లత ఇంటి ముందు ఆగింది.

          నిజంగానే గిరిబాబు లోని మృగం మళ్ళీ లత వెంట పడలేదు.

          ఆ రోజు రమణి వేసిన పథకం – గిరిబాబు ఆఫీసుకు వచ్చాక లత క్యాబిన్ నుండి ఏదో ఫైలు తీసుకోవడానికన్నట్లు బయటకి వచ్చి రమణికి మిస్సుడు కాల్ ఇవ్వాలి. రమణి ఇంటి నుండి బయటకి వచ్చి పబ్లిక్ బూత్ నుండీ లతకి ఫోను చేసి పది నిముషాలు మాట్లాడి పెట్టేయాలి. వెంటనే లత షీ టీమ్ పోలీసులకి ఫోనుచేసి ఎవడో పోకిరి వెధవ ఫోను చేసి వేధిస్తూ, బెదిరిస్తున్నాడని చెప్పాలి.

          అంతా సవ్యంగా జరిగితే ఆఫీసు కొచ్చిన గిరిబాబుకి మహిళని వేధిస్తే ఏం చేస్తారో ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తుంది!

*****

Please follow and like us:

4 thoughts on “సగం మనిషి (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో మొదటి బహుమతి రూ.2500/- పొందిన కథ)”

  1. అన్యాపదేశంగా మగాడిలోని మృగాన్ని భయపెట్టి అతడ్ని పూర్తి మనిషిగా కొనసాగే విధంగానూ, ఇలాంటి వారినుంచి ఉద్యోగినులు ఎలా తప్పించుకోవాలో తెలియజేసే ఉపాయంతో అలరించింది ఈ కథ.

  2. బాగుంది. వయసు తో నిమిత్తం లేకుండా, వంకర బుద్ధులు కలిగిన మగ వారికి సరైన గుణపాఠం. ‘దులపర బుల్లోడా’ అనే భానుమతి గారి పాట గుర్తుకు వచ్చింది. ప్రథమ బహుమతి అందుకున్నందుకు అభినందనలు శాస్త్రి గారూ.

Leave a Reply

Your email address will not be published.