నాతి చరామి (కథ)

(తృతీయ ప్రత్యేక సంచిక కథ)

– కవితా స్రవంతి

          నేను ప్రేమరాహిత్యాన్ని ప్రేమిస్తున్నాను అంది ఇందిర
          యధాలాపంగా వింటున్న లత , ఏమిటీ అంది ఉలిక్కిపడి
          నేను ప్రేమరాహిత్యాన్ని ప్రేమిస్తున్నాను మళ్లీ అన్నది ఇందిర
          లత ఇందిర నుదిటి మీద చెయ్యి పెట్టి చూసింది. నిన్న ఎండన పడి తిరిగావా?
అడిగింది అనుమానంగా

          నేను సుబ్బరంగా వున్నాను. వెధవ డౌట్ లు ఆపి చెప్పేది విను. అని విసుక్కుంది ఇందిర .

          ఏమిటే వినేది? ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. ముత్యాల్లాంటి పిల్లలు వాళ్ళు చక్కగా సెటిల్ అయ్యారు పెళ్ళయ్యి పాతికేళ్ల తరవాత ఇప్పుడు ప్రేమ రాహిత్యం ఏమిటి? దాన్ని నువ్వు ప్రేమించడం ఏమిటి? అసలా వాక్యమేమిటి? నీ మొహం !!! అని గయ్యిమని లేచింది లత .

          ఓహో ! చెప్పింది అర్థం కాలేదా? అలా చెప్పి ఏడవచ్చు కదా నా జీవిత గాధ ఎందుకు కూల్ గా అంది ఇందిర

          నిజం గానే అర్థం కాలేదు. ఏమయ్యింది? కార్తీక్ తో గొడవ పడ్డావా ? ఐయినా కార్తీక్ గొడవ పడడే !.సర్దుకు పోతాడు . నీలాంటి తిక్క దాంతో ఆ అబ్బాయి కాబట్టి వేగుతున్నాడు అంది లత.

          ఇందిర, లత, సుధ,రుక్మిణి చిన్ననాటి స్నేహితులు..ఏ సమస్య అయినా సందడి అయినా పంచుకోకుండా ఉండలేని స్నేహం వాళ్ళది.

          నువ్వు నా ఫ్రెండ్ వా? కార్తీక్ ఫ్రెండ్ వా ? ఎప్పుడు అతన్ని వెనకేసుకు వస్తావు అంటూ ఇంతెత్తున లేచింది ఇందిర. అస్సలు నువ్వు నా ఫ్రెండ్ వి అనుకుని నీకు చెప్పాను చూడూ నాది బుద్ధి తక్కువ. అంటూ లేచి వెళ్లిపోవడానికి సిద్ధమైంది.

          ఏదో సమస్య ఉందని అర్థమైంది లత కి… బయటకు డిన్నర్ కి వెళదామని అన్నప్పుడే అనుమానం వచ్చింది. కానీ ఇందిర మాట్లాడిన మాటలతో విషయం అంత సీరియస్ కాదేమో అనుకుంది . అందుకే తాను కూడా అంత పట్టించుకోలేదు.
కానీ ఇప్పుడు నిజంగానే ఇందిరా ఏదో గంభీరమైన విషయం మాట్లాడటానికి పిలిచింది అని అర్థమయ్యింది.

          సారీ ఇందిరా ! నువ్వేదో సరదాగా అంటున్నావు అనుకున్న అసలేమైందో చెప్పు అంటూ ఇందిర చేయి పట్టుకుని ఆపింది లత.

          ముందు ఏదైనా ఆర్డర్ ఇవ్వు. వచ్చి చాలసేపు అయింది అంటూ మళ్ళీ కూర్చుంది. ఇంకా సుధ రాలేదేంటి అంటూ వాచ్ చూసుకుంది ఇందిర. సూప్ ఆర్డర్ చేసి ఇప్పుడు చెప్పు అంది లత.

          నేను కార్తీక్ నుండి దూరంగా వెళదామనుకుంటున్నాను అన్నది ఇందిర.

          ఎక్కడికి వెళదామనుకుంటున్నావు? అసలు ఏమైంది ? మొన్ననే కదా అమెరికా వెళ్లి వచ్చారు ఇద్దరు. అంతా బాగానే జరిగింది కదా? నువ్వేదో మీ కొలీగ్స్ తో ప్లాన్ చేశానన్నావు. దాని గురించి చెపుతున్నావా అన్నది లత.

          కాదు నేను నిజం గానే కార్తీక్ నుంచి దూరంగా వెళుతున్నాను. నాగాలాండ్ లో పోస్టింగ్ తీసుకున్నాను అన్నది ఇందిర.

          నాగాలాండ్? నీకేమైనా పిచ్చా? ఎక్కడ ఉన్నదో మర్చిపోయి అరిచింది లత.

          ఇందిర!! మధ్యతరగతి కుటుంబం లో పుట్టి చిన్న వయస్సు లో ఉద్యోగం లో చేరి తన కృషి తో అంచలంచలు గా ఉన్నత స్థానం లో కి వెళ్లింది. ప్రేమించి పెళ్లి చేసుకుంది. కార్తిక్ కి ఇందిరా అంటే ప్రాణం. ఆమె ఏమి చెప్పినా కాదనడు. ఇందిరను సంప్రదించకుండా ఏమి చేయడు. ఇందిరా అంతే! ఒకరికొకరు అనే ఆదర్శ దాంపత్యం వాళ్ళది. ఒక నాలుగు రోజులు కార్తిక్ ఏ పని మీద అయినా ఊరు వెళ్లవలసి వచ్చినా ఇందిరకి తోచేది కాదు . మరి అల్లాంటిది ఇప్పుడు…..

          హుష్ హుష్ ఏమిటా అరుపులు. ఎవరికి పిచ్చి. అంటూ దగ్గరికి వచ్చింది సుధ.
సారీ. కొంచం లేట్ ఐయింది . ఏమిటి మళ్ళీ మీ ఇద్దరి గొడవ? అడిగింది సుధ.
లత కి ఇందిరకి మధ్య చిన్న చిన్న గొడవలు వాళ్ళకి అలవాటే. లత కొంచం ఆవేశం గా కొంచం ఖంగారు గా అప్పటిదాకా జరిగింది చెప్పింది.

          మొత్తం విని సుధ అసలు దాన్ని మొత్తం చెప్పనీయకుండా ఏమిటి నీ గోల? అని లతని ఆపి, అయినా సడన్ గా ఎందుకింత పెద్ద నిర్ణయం తీసుకున్నావు? అని అడిగింది

          నిజం గా మా ఇద్దరి మధ్య ఏ గొడవ లేదు. నాకే నాకంటూ కొంత స్పేస్ కావాలనిపిస్తోంది. చదువు, వుద్యోగం, అక్కల పెళ్లిళ్లు , మా ప్రేమ, పిల్లలు, అత్తగారు, ఆడబడుచులు, బాధ్యతలు ,సమాజం లో ఒక స్థాయికి రావటానికి,స్టేటస్ పెంచు కోవడానికి మేము పడిన కష్టం ఇవన్నీ ఒక ఎత్తు. ప్రతిసారి మేమిద్దరం ఒకరికి ఒకరు తోడుగా వున్నాం. కష్టపడ్డాము . ఒక స్థాయికి వచ్చాము .

          కానీ నాకే ఏదో కోల్పోయిన ఫీలింగ్. నేను నేనుగా లేను. నేను ఒక ప్రదర్శనా వస్తువు గా అనిపిస్తున్నాను. ఆ ఇంట్లో ఉన్నంతసేపు అది నన్ను బంధిస్తుంది . సర్దినవే సర్దుతూ తుడిచినవే తుడుస్తూ నేను పంజరం లో పక్షి లాగ మారిపోయాను. ఒకప్పుడు ఆనందాన్ని ఇచ్చిన నగలు బట్టలు నాకు విసుగ్గా వున్నాయి. నేను ఏదో పోగొట్టుకున్నాను. దాన్ని వెతుకుతూ వెళ్తున్నాను . అంతే. అంది ఇందిర.

          తన గొంతులో వినిపించిన వాక్క్యూమ్ స్నేహితుల గుండెల్ని తాకింది. మరి కార్తీక్ అడిగింది సుధ .

          ఒప్పుకోలేదు. వాదించాడు. మొండిదాన్ని కదా. విననని వదిలేసాడు నవ్వేసింది ఇందిర.

          సుధా, లతా కూడా నవ్వేశారు. కానీ ఆ నవ్వు ఎప్పటిలాగా మనస్ఫూర్తిగా లేకపోవడాన్ని అందరూ గమనించారు.

          ఓ నిమిషం ఆగి నేను మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను నెమ్మదిగా అంది లత.

          ఏమిటి ? ఒక్క సారే అడిగారు ఇందిరా, సుధలు.

          నేను రాఘవ నుంచి విడిపోతున్నాను. అంది మెల్లిగా.

          విడిపోవడం అంటే కొంచెo తీవ్రం గానే అడిగింది ఇందిర.

          అంటే వేరే ఇల్లు తీసుకుని విడి గా వుండబోతున్నాను. నెమ్మదిగానే అయిన స్థిరంగా చెప్పింది లత.

          ఎందుకు ఇప్పుడు? అంతా బాగానే వుంది గా అడిగింది సుధ కొంచం సంకోచం గానే.

          బాగుందా? ఏమి బాగుంది సుధా? నా జీవితం లో జరిగిన అన్ని విషయాలు నీకు తెలుసు. ప్రతి నిమిషం ఎంత నలిబిలి పడ్డానో, అతని కోసం అతని తో జీవితాన్ని గడపడం కోసం ఎన్ని త్యాగం చేసానో ఎంత క్షోభ అనుభవించానో మీకు తెలియంది ఏమి లేదు. ఇపుడు నా జీవితాన్ని నాకు నచ్చినట్లు గా గడపాలనుకుంటున్నాను. అంది లత
లత ది పెద్దలు కుదిర్చిన పెళ్లే! కానీ పెళ్లి అయిన క్షణం నుంచి ఏవో గొడవలు. దానికి కారణం కట్నాలు కానుకలు కావు. రాఘవ అమ్మ, నాన్నలది అదో మనస్తత్వం . కోడలు కు తనకంటూ ఒక గుర్తింపు ఉండటం నచ్చలేదు. ప్రతి చిన్నదానికి తప్పులు ఎంచటం , చివరికి పిల్లలిని కనాలో వద్దో కూడా వాళ్ళే నిర్ణయించటం , రాఘవ కూడా వాళ్ళ ప్రతి మాటకి వత్తాసు పలకడం తో గొడవలు ముదిరి విషయం విడాకుల దాకా పోయింది. పెద్దవాళ్ళ ప్రమేయం తో కలిసి ఉన్న అది కేవలం సమాజం కోసం ఇంకా చెప్పాలంటే వాళ్ళ అబ్బాయి కోసం మాత్రమే!! తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి తన కళలకు మెరుగు పెట్టడం మొదలు పెట్టింది. అదే తన జీవితం, జీవనాధారం అయ్యింది.

          ఎంత స్వార్థo నీకు? అంది ఇందిర కోపంగా. ఇన్నాళ్లు అతని తో ఉండి ఈ వయస్సు లో అతనిని వదిలేసి వెళ్తావా? నీకు అస్సలు మనస్సాక్షి ఉందా? ఒక్కదానివే వెళుతున్నవా లేక ఏ స్నేహితుడైన తోడుగా వుంటున్నాడా వ్యoగ్యం గా అడిగింది ఇందిర.

          ఇందిర అభియోగానికి దెబ్బ తిన్నట్టు చూసింది లత.

          ఏమి మాటలవి ఇందిరా అంటూ మందలించిన సుధను ఆపి., పర్లేదులే సుధా దాని మాటలు నాకు కొత్త కావు అని, ఇందిరతో..

          నువ్వు చెప్పింది నిజమే ఇందిరా నేను స్వార్థపరురాలినే. ఒక ఇంట్లోనే ఉన్నామన్న మాటేగాని . ఎంత ప్రయత్నించినా అతని జీవితం లో భాగం కాలేక పోయాను. ఎందుకంటే అతనికి నా అవసరం లేదు. అతని కుటుంబం వేరు. అతని లోకం వేరు. ఇన్నాళ్లు నా తిండి నేను తింటూ నాకు కావలసినవి నేనే కొనుక్కుంటూ ఎప్పటికైనా అతడు మా బంధాన్ని గుర్తిస్తాడేమోనని ఒక మిధ్య లో జీవించాను. కానీ అది జరగదని అర్థమయింది . అతను నా బిడ్డకి తండ్రి. భార్య,భర్తలు గా మేము ఉండక పోయినా పర్లేదు కానీ తల్లిదండ్రులు గా మేము వాడికి కావాలి. ఇప్పుడు వాడు పెద్దవాడు అయ్యాడు. లోకం తీరు అర్థం చేసుకోగలడు.

          సీతాదేవి కూడా పిల్లల బాధ్యత రాముడికి ఇచ్చి తన తల్లి దగ్గరకు వెళ్ళిపోయింది. నాకు అన్నీ నేనే కనక విడిగా వెళ్లిపోతున్నాను. ఇంక స్నేహితుని విషయానికి వస్తే ఆ స్నేహం ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. వెన్నెల్లో తడిసిన పచ్చగడ్డి మీద నడిచినట్లు. అంతే అన్నది.

          నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటావేమో అని నాకు భయం . అందుకే అలా అన్నాను అన్నది ఇందిర. తన మాటలని సమర్థించుకుంటూ. మళ్ళీ తానే ఆ పచ్చగడ్డి కింద ప్రేమ ముళ్ళు అయితే లేవు కదా అన్నది కవ్విస్తున్నట్లు.

          ఖంగారు పడకు ఇందిరా నా చర్మం చాలా మందం. అయినా నేను చేయడానికి చాలా పనులు ఉన్నాయి. ఒకవేళ నాకు స్నేహాన్ని మించి కావలనిపిస్తే నీకు చెపుతాలే కొంచం కోపంగా, చిరాగ్గా అంది లత.

          ఇంకాచాల్లే ఆపు ఇందిర ఎందుకు అలా మాట్లాడి దాని నొప్పిస్తావు అంటూ విసుక్కుంది సుధ. ఇందిర ఇంక మాట్లాడ లేదు.

          మాట మార్చడానికి అన్నట్లు నేనూ ఒక విషయం చెప్పనా అంది సుధ.

          నువ్వు కూడానా అన్నట్లు అదిరిపడి చూసారు ఇద్దరు.

ఇక్కడ సుధ గురించి కొంచం చెప్పాలి.

          తనకు తొందరగా కోపం రాదు. ఆవేశం అస్సలు లేదు. ఏదైనా చెప్పాలనుకుంటే చాలా కామ్ గా తన మనసులో మాట చెప్పేస్తుంది. తొణకదు బెణకదు . చాల సామాన్యంగా కనిపించే అసామాన్యురాలు .పెద్ద మాటలు వుండవు. చేయాలనుకున్నది సింపుల్ గ చేసేస్తుంది. సహాయం అడిగితే కుదిరితే చేస్తుంది . లేకపోతే లేదు. అంతే . ఇంటి విషయాల్లో గొడవ పడటం కానీ , వాదించటం కానీ చేయదు. ఎప్పుడో తప్ప గుప్పిట విప్పదు . గిరి గీసుకొని ఉండదు కానీ ఎవరిని గీత దాటనివ్వదు

          అలాంటిది …… ఇద్దరిలో కొంచం ఆశ్చర్యం !!

          నువ్వేమి చెప్పబోతున్నావు అంది ఇందిర.

          విను, లత. నాది పెద్దలు కుదిర్చిన పెళ్లే. అది మీకు తెలుసు. పెళ్లి ఐన కొత్తల్లో సారధి గారు నేనూ ఎన్నో ఒడిదుడికులు ఎదుర్కొన్నాము. వాటిలో కొన్ని మీకూ తెలుసు.
నా ఉద్యోగం. , అమ్మ,నాన్నల బాధ్యత అన్నిటిని నేను సారథి గారికి చెప్పే చేసాను. వాళ్ల కుటుంబ బాధ్యతల్లో నా అవసరం అనుకున్న చోట ఆయన నాతో సంప్రదించారు. లేకపోతే లేదు. అదే మీరు అనే స్పేస్ ఇచ్చుకోవడo అనచ్చు. ఆయన కొంచం ఎక్కువ ప్రొటెక్టీవ్. అది నాకు ఒకరకం గా సుఖాన్ని ఇచ్చింది. నాకు కావాల్సినవన్నీ తెచ్చి పెడుతుంటే నేను హైరానా పడక్కర్లేదు కదా. పిల్లల చదువులు అయినా ఆస్తులు కొనడమయినా నాకు చెప్పే చేశారు. నా సలహా అవసరం అనుకుంటే అడిగారు అది నా వ్యక్తిత్వాన్ని తగ్గించుకోవడం అని నేను అనుకోలేదు. నా పరిధిలో ఆయనకి ఇబ్బంది లేకుండా చేయగలిగినవి అన్ని నేను అనుమతి కూడా తీసుకోకుండా చేస్తాను. ఆయన కూడా నన్ను అడగరు. ఆయనకు నచ్చనివి నేనూ చేయను. ఇది ప్రేమో బాధ్యతో నాకు తెలీదు.

          మేమిద్దరం సమాంతర రేఖల్లా అలా సాగిపోతున్నాం. నా నుoచి ఆయన తననుంచి నేను ఏమి కోరుకోవట్లేదు. తాను నాకోసం ఏదన్నా చేస్తే అది నాకు బోనస్ నేనేదైనా చేస్తే తనకు బోనస్. మేమిద్దరం ఒకరికి ఒకరo అలవాటు అయిపోయాం. ఒక్కళ్ళమే ఉండే బదులు తోడు ఇంకొకరు. కన్ను నొచ్చినా కాలు నొచ్చినా మనతో వాళ్లు ఉన్నారన్న ధైర్యం. జీవితంలో మనమెప్పుడు ఒంటరి వాళ్ళమే. మన యుద్ధం మనమే చేయాలి. ఉన్నన్నాళ్లు ఒకరికి ఒకరం. 

          లత,ఇందిరా నిశ్శబ్దంగా వింటుండి పోయారు.

          మాటల్లో పడి ఏమి తిన్నామో కూడా . మర్చిపోయాము. బిల్ పే చేయడం కూడా అయిపోయింది ఇంక వెళదామా , అన్నట్లు ఇందాకటి నించి రుక్మిణి ఫోన్ లో నే వుంది మాట్లాడు అంటూ ఫోన్ ఇందిర కి ఇచ్చింది సుధ. ఫోను స్పీకర్ లో పెట్టి ఏంటి డిన్నర్ కి రాలేదు కొంచం కోపంగా అడిగింది.ఇందిర.

          అలేఖ్య పాపతో వచ్చిందే. పాప ని ఇక్కడ వదిలేసి అది వాళ్ళ ఆయన సినిమా కి వెళ్లారు. అందుకే అంది రుక్మిణీ.

          అదేంటి మన ప్రోగ్రాం ముందే ఫిక్స్ అయ్యి ఉంది కదా అలా ఎలా అంటుంది చిరాగ్గా అంది ఇందిర.

          అది అంతా రేపు చెప్తా గాని భోజనాలకి ఇక్కడికి వచ్చేయండి . రేపు మాట్లాడుకుందాం అన్నది రుక్మిణి. వస్తాం లే కానీ నువ్వు ఊరికే అన్నీ  చేయకు. మేము తలా ఒకటి పట్టుకుని వస్తాం. నువ్వల పులిహోరా బొబ్బట్లు అంటూ ఎదో చెప్తున్న
లతను ఆపి దాని దగ్గర తిండి గురించి చెప్పకు, అడిగావంటే అడ్డు ఆపు లేకుండా చేస్తూ ఉంటుంది. నువ్వు ఏదో ఒకటి చేయి అంటూ ఫోన్ పెట్టేసింది సుధ.

          మర్రోజు 10 గంటల కల్లా రుక్మిణి ఇంట్లో చేరారు అందరూ. రాగానే వేడిగా మంచి కాఫీ ఇచ్చింది రుక్మిణి. అద్భుతః అన్నది లత తన్మయత్వంతో. ఇంతకూ నువ్వుల పులిహోరా చేసావా అడిగింది లత ముక్కుపుటాలు ఎగరేస్తూ. చేసాను. నీకు ఇష్టమని ఆవడలు కూడా చేశా. సరేనా. ఇదిగో నీకు ఇష్టమైన మినపసున్ని. అంటూ ఒకటి చేతిలో పెట్టింది రుక్మిణి.

          నీకు ఎంతైనా అదంటేనే ఇష్టమే రుక్కు. మేమేవరం కనపడం అంటూ వుడుక్కున్నారు ఇద్దరు.

          వాళ్ళ మాటలకి నవ్వేస్తూ మీకు ఇష్టమని వంకాయ ముద్దకూర, ఆలుగడ్డ వేపుడు సాంబారు కూడా చేశాలేవే ఊరికే దాన్ని ఆడిపోసుకోకండి .అంది రుక్మిణి

          ఆలేఖ్య ఏది అడిగింది లత. దానికేదో ఆఫీసులో పని ఉందని వెళ్ళింది. పాపాయి పడుకుంది. ఇప్పుడే లేవదులే టెన్షన్ పడకండి అన్నది నవ్వుతూ ఇంతకీ నీ సీతారముడేడి. ఇక్కడే ఉన్నారా లేకపోతే మళ్ళీ జర్మనీ కో జపాను కో వెళ్ళారా ఆడిగింది సుధ.

          ప్రస్తుతం దేశంలోనే ఉన్నారులే. అయినా పాపo ఏమి చేస్తారు ఉద్యోగం అలాంటిది అన్నది రుక్మిణి.

          అవునే నీకు అందరూ పాపమే. మీ ఆయనకు పాపం, నీ పిల్లలకు పాపం, మీ అత్తగారి పాపం. ఇంకోసారి వీళ్ళని వాళ్ళని పాపం అన్నవంటే పాపం పుణ్యం చూడకుండా నిన్ను పొడిచేస్తా అంది కోపం గా ఇందిర.

          రుక్మిణి కి అందరికంటే ముందు పెళ్లి అయ్యింది. వాళ్ళ బావతో. బాల్య వివాహం అని మిగిలిన ముగ్గురు ఏడిపించినా ఏమి వుడుక్కోదు. పోన్లేవే ఓ పని అయిపోయింది అంటుంది నవ్వుతూ. తన సంసార సాగరం లో పడి ఈదుతూ ఉంటుంది. నిండు కుండ. సీతారాముడు అని పిలుచుకునే వాళ్ళ ఆయన అసలు పేరు రాంమోహన్. ఎపుడు ఆఫీస్ పనిమీద తిరుగుతూ వుంటారు. రుక్మిణి పిల్లలతో పెద్దవాళ్ళతో సమర్థించుకుంటూ ఇల్లు చక్కదిద్దుకుంటూ ఉంటుంది. వీళ్లిద్దరి కాపురం సీతారాముల వనవాసం అని ఆ పేరు పెట్టింది లత.

          ఇంతకీ ఏమిటి మీ గొడవ అన్నది రుక్మిణి. ఎదో చెప్పబోతున్న ఇందిరను ఆపి నేనoతా విన్నాలే నిన్న సుధ మొబైల్ ఆన్ లోనే ఉంచింది.

          ఎందుకు ఇందిరా నువ్వు అంత దూరం వెళ్లడం. వెళ్లినా కార్తీక్ ని వదిలి నువ్వు వుండగలవా? ఉన్న వ్యాపకాలు బోరు కొడితే వేరేవి వెతుక్కో. ఒక నాలుగు రోజులు ఎక్కడికైనా వెళ్ళిరా. కానీ ట్రాన్స్ఫర్ చేయించుకుని అంత దూరం వెళ్లడం కరెక్ట్ కాదేమో ఒక్క సారి ఆలోచించు అన్నది అనునయంగా.

          నీకు అర్థం కాదులే రుక్కు నేను ఇన్నేళ్లు చాలా కష్టపడ్డాను . నాకు కొంత విశ్రాంతి కావాలి. అది ఇక్కడ దొరకదు. అందుకే నేను అందరినించి దూరం గా వెళ్ళాలి అనుకుంటున్నాను. అన్నది అసహనంగా . ఇంకా ఈ విషయం మీద నేను ఎవ్వరి అభిప్రాయాలూ వినను. అంతే అన్నది ఇందిర .

          అయిన వాళ్ళ నుంచి దూరంగా వెళ్లడం అశాంతి ని పెంచుతుంది కానీ ఆనందాన్ని ఇవ్వదు. నువ్వు కష్టపడ్డది నీజీవితాన్ని నీకు నచ్చినట్లు మలుచుకోవడం కోసం. నువ్వు చాల అదృష్టవంతురాలివి. కార్తీక్ నీకు తోడు గా వున్నాడు. భగవంతుడి దయ వల్ల నువ్వు కోరుకున్న జీవితాన్ని పొందావు . ఎంత కష్ట పడ్డ జీవితం లో పైకి రాలేని వాళ్ళు లేరా . ఎందుకు కోరి ఇబ్బందులని తెచుకుంటావు అన్నది రుక్మిణి .

          నీ ప్రపంచం చాల చిన్నది రుక్మిణి కాబట్టి సులువుగా ఇలా చెప్పేస్తున్నావు . నీకేమి తెలుసు పెళ్లి సంసారం తప్ప అన్నది ఇందిరా.

          ఎందుకంత పరుషం గా మాట్లాడుతావు ఇందిరా నీకోసమే గా చెపుతోంది. ఎందు కంత అహం అన్నది లత కొంచం విసురుగా

          ఊరుకో లతా మధ్యలో మాట్లాడకు అని మందలించి, నువ్వు అన్నది నిజమే ఇందిరా నాకు మీ ఆఫీస్ లో టెన్షన్లు ప్రమోషన్ ల గొడవలు తెలియవు. కానీ వాటి మధ్య గడిపి వచ్చిన మనిషిని ప్రశాంతం గా ఉంచడం వచ్చు. ఈ ఇంటికి నేనే ఆర్ధిక మంత్రిని , కనుక ఆర్ధిక స్వాతంత్రం నాకు లేదన్న మాటే వర్తించదు. నాకు వంట చేయడం ఇష్టం. కాబట్టి నేను చేస్తాను. ఈ ఇల్లు నాది . నేను ఎవ్వరికి చూపించడానికి దాన్ని సర్దను . నేను నా పనులు నా కోసం చేస్తాను . నేను ఇద్దరు ఆడ పిల్లలిని చదివిస్తున్నాను ఇప్పుడు వాళ్లు పదో తరగతిలో వున్నారు. వాళ్ళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా వాళ్ళ చదువుల బాద్యత నాదే.
ఇంకో విషయం చెప్పనా, కాదు చూపిస్తాను రండి అంటూ పెరట్లోకి తీసుకుని వెళ్ళింది రుక్మిణి..

          అక్కడ చిన్న కుండీలలో బోలెడు మొక్కలు . ఇవన్నీ నేను అంటు కట్టి పెంచినవే . మొన్న ఆ మధ్య ఎదురు అపార్ట్మెంట్ లో అమ్మాయి ఆంటీ చేమంతి మొక్క ఇస్తారా అని అడిగింది. మంచి మొక్కని తీసి కుండి లో పెట్టి ఇచ్చాను. అది బోలెడు పూలు పూస్తోందిట. ఆ విషయం చెప్పి ఆంటీ మా ఫ్రెండ్స్ కి కూడా ఇస్తారా?
నర్సరీ లో కొన్న మొక్కలు అంత బాగుండటం లేదు అని అడిగింది. వద్దు అంటున్న వినకుండా డబ్బు ఇచ్చింది. నాకు ఇదేదో బాగుందని అనిపించింది. తోట పని నాకు చాల ఇష్టం దానితో ఆదాయం వస్తుంటే కాదు అనడం ఎందుకు అనిపించింది . అలా నా బృందావనం నర్సరీ మొదలయింది అన్నది సంతోషం గా

          ముగ్గురు స్నేహితులు ఒక్కాసారిగా రుక్మిణి కావలించేసుకున్నారు. ఇంక నా సీతారాముడి గురించి అంటావా! అతను కష్టపడేది ఇంటి కోసం .నా కోసం. నేనున్నాను అన్న ధైర్యం తోనే అతను ఇంటిని వదిలిపెట్టి వెళ్లగలుగుతున్నాడు. అలేఖ్య ని పాపని చూసుకోవడం ఇష్టం. అందుకే చేస్తాను.నేను ఇదంతా ఇష్టం తో చేస్తాను కాబట్టి నాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు.

          అయినా నేను సన్యాసినిని కాదు నాకూ కోపం వస్తుంది. విసుగు పుడుతుంది మౌన పోరాటాలు మాటల ఈటెల విసుర్లూ ఉంటూనే ఉంటాయి . జీవితం అంటే అదే గా! మనమేమి వాటికి అతీతులం కాము. లతా నువ్వు రాఘవ కి ఒక్క అవకాశం ఇచ్చి చూడు.
ఇందిరా నువ్వు రెండు నెలల కల్లా వెనక్కి రాకపోతే మేమే అక్కడికి వస్తాం నేచర్ ని ఎంజాయ్ చేయడానికి అన్నది రుక్మిణి

          మరి మీ సీతారాముడికి కుదరక పోతే నవ్వుతూ అడిగింది సుధ . ఏవుంది రుక్మిణి సత్యభామ అవుతుంది అన్నది. మరి ఇంక భోజనం చేద్దామా నవ్వుతూ అన్నది రుక్మిణి
మరే అసలే ఆత్మారాముడు గోల చేస్తున్నాడు పదండి అన్నది లత.

          మరే మరే మనమసలే భోజన ప్రియులం అన్నది ఇందిర లత వంక చూస్తూ
సరే సరే ఇంక మళ్ళీ మొదలు పెట్టకండి అన్నది సుధ. అందరు ఒక్కసారి గా నవ్వేశారు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.