నిజాయితీ నిద్రపోదు

-ఆదూరి హైమావతి 

          మంతినవారి పాలెంలో ఉండే షాహుకారు శీనయ్య పట్టు చీరలు కొనను ధర్మవరం వెళ్ళవలసి వచ్చింది. శీనయ్య చాలా పీనాశి. బండితోలను మనిషినిపెట్టుకుంటే జీతమూ, బత్తెమూ వృధా అవుతాయని తానే బడితోలుకుంటూ బయల్దేరాడు. 

          ఒక్కడే మూడు రోజులు బండి తోలుకుంటూ వెళ్లడం,ఆ ఎద్దులకు నీరూ, గడ్డీ వేసి, వాటిని కడగడం అన్నీ ఇబ్బందిగానే భావించి, ఏదో ఒక ఉపాయం దొరక్కపోతుందా అని ఆలోచిస్తూ బండి తోలుకు వెళుతుండగా దేవుడు పంపించినట్లు, ముందు ఒక మనిషి నడిచి వెళ్ళడం చూశాడు శీనయ్య. తన పంట పండిందని భావించి వేగంగా బండి తోలు కుంటూ వెళ్ళి, అతని సమీపాన బండి ఆపి వెళ్ళే మనిషిని పలకరించాడు.

          “ఓ నువ్వేనా నాగయ్యా! ఎక్కడిదాకా ప్రయాణం, ఎక్కడికైతేనేం ఒంటరిగా వెళుతున్నావ్ రా!రా! నా బండెక్కు. నేనూ ఒంటరిగానే వెళుతున్నాను.” అన్నాడు .

          దానికి నాగయ్య “ఎందుకులే బాబయ్యా! మీరెక్కడ? నేనెక్కడ, మీ బండిలో నేను ఎక్కడమేంటీ! మూడు దినాలే ప్రయాణం ధర్మవరందాకా,  పట్టు నూలు కొందామని వెళుతున్నా”  అన్నాడు.

          మనస్సులో మురిసిపోతూ “నేనొక్కడినే వెళుతుంటే  నడిచిపోతున్న నిన్నుచూస్తూ కూడా వదిలేసి వెళ్ళడం మర్యాదా నాగయ్యా!  రారా! నీకంత బండిలో కూర్చోను ఇబ్బందైతే ముందు కూర్చుని బండి తోలు సరిపోయె, కబుర్లు చెప్పుకుంటూ వెళితే ప్రయాణం చేసినట్లే ఉండదు.  “అంటూ బలవంతం చేయటాన “ సరే బాబయ్యా! మీరు లోగా కూర్చోండి, నేబండి తోలతా” ” అంటూ బండెక్కి, తన గోతాం మూట పక్కనే పెట్టుకుని , పగ్గాలందుకుని బండి తోలసాగాడు నాగయ్య. ఉచితంగా తనకు జీతం, బత్తెం ఇవ్వకుండానే బండితోలే వాడిని పంపినందుకు  భగవంతునికి ధన్యవాదాలు చెప్పుకున్నాడు శీనయ్య .

          ఆ మాటా ఈ మాటా మాట్లాడుకుంటూ మధ్యాహ్నానికి మల్లంపల్లె చేరారు.” నాగయ్యా! భోజనం చేసి బయల్దేరు దామా! “అన్నాడు శీనయ్య.

          “ఔనయ్యా! ఎద్దులు బాగ అలసిపోయినై, వాటిక్కాస్తంత తిండీ, నీరూ పట్టాల, అప్పుడే హుషారుగా పరుగు పెడతాయ్” అంటూ బాట పక్కనే ఉన్న చెట్టు క్రింద బావిని చూసి బండాపి, ముందుగా ఎద్దులకు నీరుపట్టి, బండి క్రింది జాలీలోని గడ్డి తీసి వాటి ముందు వేసి, శీనయ్యకు ఒక బొక్కెన నీళ్ళు తోడిచ్చాడు. ఆయన కడుక్కున్నాక తానూ కాళ్ళూ ముఖమూ కడుక్కుని , భార్య ఇచ్చిన కొన్ని రాగులను ఆమె చెప్పినట్లే ఒక ఆకులో పోసి చెట్టు క్రిందపెట్టి, తాను తెచ్చుకున్న రాగి సంకటి ముంత మీది మూకుళ్ళో పెట్టుకుని , ఉల్లి కారంలో అద్దుకుని తినేసి, నీళ్ళు త్రాగి, తన గోనె పరుచుకుని పడుకున్నాడు.

          బండిలో కూర్చున్న శీనయ్య తన భార్య కట్టిచ్చిన బెల్లం పొంగలి, పులిహోర, పెరుగన్నం నిమ్మ ఊరగాయ , అరిటాకు పరుపు మీద పరుచుకుని నంచుకుంటూ , సుష్టుగా ఆరగించి బండిలోంచే చేతులు కడిగేసుకుని, తానూ పరుపు మీద పడుకుని తలగడ మీద తల ఆంచుకుని హాయిగా కునుకు తీసాడు. కనీసం ఒక చెంచాడైనా ప్రసాదంగానైనా  నాగయ్యకు పెట్టలేదు.   

          ఎద్దులు నెమరు వేస్తున్నశబ్దం వినగానే నాగయ్య లేచి తన వస్తువులన్నీ గోనె సంచీలో సర్దుకుని , ఎద్దులను బండికి కట్టేశాడు. బండిలో నిద్రపోతున్న శీనయ్యను, పాదాల మీద తట్టి “అయ్యా! బయల్దేరుదాం.. ఎద్దులు మేతమేసి హుషారుగా ఉన్నాయ్” అన్నాడు.

          “ఓరినీ తస్సాదియ్యా! మంచి నిద్ర చెడగొట్టావ్ గదయ్యా! బండి కదిలించొచ్చు కదా నన్ను లేపేకంటే.” అని విసుక్కున్నాడు. “క్షమించండయ్యా, మీ బండి మీకు చెప్పకుండా కదిలించడం న్యాయం కాదు కదయ్యా, మీరు చెప్పుంటే అట్లే తోలుకెళ్ళే వాడిని. మీకేం హాయిగా కునుకు తీయండి నేను ఉషారుగున్న ఎడ్లను తోల్తాను”  అంటూ ఒక్క ఎగురున బండెక్కి , ఎద్దులను అదలాయించాడు. తిండీ, నీరు పడటాన ఎద్దులు పరుగందుకున్నాయి.

          సూర్యాస్తమయానికి సూర్యంపల్లి చేరారు. అక్కడున్న ధర్మసత్రంలో శీనయ్య ఒకగది తీసుకుని, తన పరుపూ ఇతర సరంజామా అంతా నాగయ్య చేతే మోయించుకుని, ఒక గదికి డబ్బుకట్టి మంచి భోజనానికీ సొమ్ము చెల్లించి హాయిగా  వారు పెట్టిన భోజనం చేసి నిద్రపోయాడు. కనీసం ‘నీకు తిననేమైనా ఉందా, ఎక్కడ పడుకుంటావూ’ అనైనా అడగలేదు శీనయ్య , నాగయ్యను. 

          నాగయ్య ఎద్దులకు కుడితి పట్టి, గడ్డివేసి చెట్టుకు కట్టేసి, మిలిగి ఉన్న సంకటి తిని, కుండలు కడుక్కుని సత్రం ముందున్న అరుగుమీద పడుకున్నాడు.

          తెల్లారేసరికి నాగయ్య లేచి కాలకృత్యాలు తీర్చుకుని, తనవద్ద ఉన్న రాగిపిండిని ఎండు పుల్లలు ఏరుకుని సంకటి ఉడికించుకుని, కొద్దిగా ఉల్లిపాయ నంచుకు తినేసి,  మిగిలి ఉన్న సంకటి కుండ గోనె సంచిలో  సర్దుకుని  ఎద్దులను కడిగి తయారు చేసి బండికి కట్టేసాడు.

          శీనయ్య కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. శీనయ్య సత్రంలో సొమ్మిచ్చి వేడి నీటితో స్నానం చేసి, వారు పెట్టిన వేడి వేడి పొంగలి తినేసి బయటకొచ్చి “నాగయ్యా!” అని కేకేశాడు.

          “వస్తున్నా బాబయ్యా!” అంటూ నాగయ్య వెళ్ళి శీనయ్య కట్టి ఉంచిన అతని సరంజామా అంతా తెచ్చి బండిలో సర్దాడు.

          శీనయ్య బండెక్కాక ఎద్దులను అదిలించాడు. “ఏమన్నా తిన్నావా!” అనికూడా అడగలేదు. 

          మధ్యాహ్నానికి ముసినేపల్లి చేరారు. అక్కడా శీనయ్య భార్య కట్టిచ్చిన మిగిలున్న పులిహోర, లడ్డూ, జంతికలతో తినేసి పడుకున్నాడు. నాగయ్య తిండి విషయమే పట్టించు కోలేదు.

          సాయంకాలానికి సోమేపల్లి చేరారు. అక్కడ సత్రం వంటి దేమీ లేదు. నాగయ్య చెట్టు క్రింద ఊరి సమీపాన బండి ఆపి, తనవద్ద ఉన్న సంకటి తినేసి, పశువులకు మేత నీరుపట్టి, చెట్టు క్రింద గోనె పరుచుకుని  పడుకున్నాడు.

          శీనయ్య తనవద్ద మిగిలి ఉన్న పులిహోర, బెల్లం పొంగలి మూత తీయగానే వాసన  వచ్చింది. పాడైపోయాయని గ్రహించి అవి తినకుండా, క్రింద పారేసి, మిగిలున్న తినుబండారాలన్నీ తినేసి ఆకలి తీర్చుకుని పరుపు మీద బండిలోనే  పడుకున్నాడు. 

          తెల్లారి లేచి తన పధ్ధతి ప్రకారం ఎండు పుల్లలు ఏరుకుని, సంకటి చేసుకుని , తినబోతూ శీనయ్యకేసి చూశాడు నాగయ్య. అతడు తననే చూస్తుండటం  గమనించి “బాబయ్యా! ఏమి తిన్నారూ! సంకటేమన్నా తింటారా ! నేను ఉల్లిపాయనంచుకు తింటున్నాను. నంజుడుకేమీ లేదు. ” అనగా కడుపులో ఆకలి దహిస్తున్నందున “సరే కొద్దిగా పెట్టు నాగయ్యా! తినమంటే కాదనడం మర్యాద కాదు కదా!”అని నాగయ్య ఇచ్చిన వేడి వేడి సంకటి అరిటాకులో పెట్టించుకుని, తనవద్ద ఉన్న నిమ్మ ఊరగాయతో అద్దుకుని కమ్మగా తిన్నాడు. బండి కదిలింది.

          మధ్యాహ్నానికి మణుగూరు చేరారు. అక్కడా సత్రం లేదు. నాగయ్య తనవద్ద మిగిలిన రాగి సంకటి శీనయ్యకూ పెట్టి , ఆయన తినగా మిగిలింది తానూ తినేసి, కాస్త ఎద్దులకు విశ్రాంతినిచ్చి బయల్దేరారు.

          ఆ రాత్రి ఆనందపల్లి అనే గ్రామం చేరగా  అక్కడ ఒక మంచి ధర్మసత్రం ఉండటాన వెనకటిలాగే శీనయ్య లోనికెళ్ళి తన వసతి, తిండీ చూసుకున్నాడు. తనకు రెండు పూటల ఆకలికి తిండి పెట్టిన నాగయ్యను పట్టించుకోనే లేదు.

          మంచి వర్షం పడుతుండటాన నాగయ్యకు వండుకోను ఎండుకట్టెలు దొరక లేదు. వర్షం వలన ఎక్కడ ఉండాలో తెలీక చెట్టు క్రింద తడుస్తూ ఉన్న నాగయ్యను, సత్రం యజమాని చూసి ఛత్రి  వేసుకెళ్ళి లోనికి తెచ్చాడు. తన వద్ద ఉన్న పొడి బట్టలు ఇచ్చి మార్చుకోమని  వేడి వేడి అన్నం, సాంబార్ తో భోజనం పెట్టి, పడుకోను హాల్లో ఒక మంచం కూడా ఇచ్చాడు.

          నాగయ్య, ” అయ్యా ! ఏవేవో ఇస్తున్నారు. మీరు ధర్మాతుల్లా ఉన్నారు, నావద్ద మీకిచ్చుకోను ఏమీ పైసల్లేవు. మారు బేరానికి ధర్మవరం పట్టు నూలు తెచ్చుకుని చీరలు నేసి వాటిని వారికే అమ్మి జీవనం గడుపుతున్న పేద వాడిని.” అని చెప్పగా, ఆ ధర్మసత్రం  యజమాని ధర్మయ్య…

          ” నాయనా! ఇది ధర్మ సత్రం ,బాటసారులందరికీ ఉచితం, కొందరు ఎక్కువ సొమ్మిచ్చి ఈ సత్రం నడిపే వారిని మాయ చేస్తుంటారు.” అని నాగయ్యతో మాట్లాడుతూ, ప్రశ్నలేస్తూ  అతని వద్ద నుంచీ  విషయమంతా రాబట్టి, “పడుకో నాయనా! తెల్లారి మాట్లాడుకుందాం” అని చెప్పి, వెళ్ళాడు.

          తెల్లారాక శీనయ్యతో “ఏమయ్యా! నీ బండి ఉచితంగా, జీతం భత్యం లేకుండా తోలి, సంకటి వండుకు తింటుంటే, కనీసం  తిన్నావా అని కూడా అడక్కుండా , ఇంత వర్షంలో తడుస్తుంటే , లోనికి కూడా  పిలవకుండా, నీ సంగతి నీవు చూసుకుని, నీతోటి మనిషి, నీకు ఉచితంగా సేవచేస్తున్న వ్యక్తి  గురించీ పట్టించు కోకుండా వున్నావు ! ఏం మనిషివయ్యా నీవు!   ఇంత స్వార్థం ఉండ కూడదు”అనగా..

          నాగయ్య “అయ్యా! వారిదేం తప్పు లేదు. నాకే ఈ బాబయ్య సాయం చేసాడు. నేను  నడవకుండా కాళ్ళు  నొప్పెట్టకుండా తన బండిలో నన్ను ఇంతదాకా తేవడమే వారు చేస్తున్న గొప్ప సాయం.  నాకే వారు సాయం చేశారు.”అనగానే, సత్రం యజమాని ధర్మయ్య” నాగయ్యా! నీబోటి అమాయకులు ఉండటాన ఇలాంటి  స్వార్థపరులు పెరిగి పోతున్నారు.  నేను నిజానికి ఈ జమీ జమీందారును. అప్పుడప్పుడూ ఇలా సత్రాల నిర్వహణ గురించీ వచ్చి చూస్తుంటాను. ఈ శీనయ్య లాంటి వారు లంచం మరిపి ఉచిత సత్రాన్ని బాడుగ సత్రంగా మార్చేసారు. నాదే తప్పు, నా జమీలో తిరిగి నీ లాంటి నిజాయితీ పరులకు,పేదలకూ, నేతగాళ్ళకు సాయం చేయలేకపోడం.  నీవీ రోజు నుంచీ ధర్మవరం వరకూ వెళ్ళక్కర లేకుండా, నేను నా మనుషులచేత నీకు పట్టు నూలు పంపిస్తుంటాను. నీవు చీరలు నేసి నా మనషులు వస్తే వారిచేత నాకు పంపు, నీకు సొమ్ము నేను ఇస్తుంటాను. నీలాంటి నిజాయితీ పరులైన నేత వారికి సాయం చేయాల్సిన బాధ్యత నాది “అని చెప్పి వెళ్ళాడు ధర్మయ్య జమీందారు. 

***** 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.