శ్రీరాగాలు-3

‘నేనొస్తున్నాను’

– పి. సత్యవతి

          నది అవతలి వొడ్డుకి ప్రయాణమౌతూ అద్దంలో చూసుకుంటే నా మొహం నాకే ఎంతో ముద్దొచ్చింది. ఉత్సాహంతో ఉరకలు వేసే వయసు. సమస్త జీవనకాంక్షలతో ఎగిసిపడే మనసు. ప్రపంచమంతా నాదేనన్న ధీమాతో, వెలుగు దారాలతో రంగు రంగుల పూలు కుట్టిన మూడు సంచులని భుజాన వేసుకుని, నా పాటనేస్తాన్ని నా పెదాల పై ఎప్పుడూ ఉండేలా ఒప్పించుకుని, ఈ ఒడ్డున నిలబడి, తూర్పు దిక్కు నుంచి పాకి వస్తున్న సూర్యుణ్ణి విప్పారిన కళ్లతో చూస్తూ నిలబడ్డాను.

          అప్పుడొక పడవ అటుగా వచ్చింది. నిండైన నదిలో అందంగా కనిపించింది.
నడిపే అతను ముసిముసి నవ్వులతో ముచ్చటగా ఉన్నాడు…

          “వస్తావా…” అన్నాడు.

          “ఆసంచు లేమిటీ?” అని ఆరాతీశాడు.

          “నా స్నేహాలు, నా అభిరుచులు, నా జ్ఞాపకాలు, నా ఆశయాలు, నా సరదాలు, నా నైపుణ్యాలు… నాకు మాత్రమే సంబంధించిన ఇంకా కొన్నివిశేషాలు.”

          “ఫరవాలేదు వచ్చేయ్… అవన్నీనీ వెంట తెచ్చుకో! నీ తోడుగా వచ్చిన ఆ పాటని కూడా నీపెదాల మీదే ఉంచుకో… పడవెక్కడానికి నా చెయ్యి అందించనా.”

          “ఏంవద్దు. నేనెక్కగలను. ఆ మాటకొస్తే పడవ నడపటం నాకూవచ్చు. అవునూ… ఎక్కడిదాకా నీ ప్రయాణం” అనడిగాను.

          “నాశక్తి మేరకు పడవ నడుపుతూ, ఎక్కడ అలసిపోతే అక్కడ ఆగిపోతా… నువ్వెక్కడ దిగిపోతానంటే అక్కడదిగు” అన్నాడు.

          ఇదేదో బాగున్నట్లే అనిపించి “సరేపద” అన్నాను. 

          “నా పడవలోకి సుస్వాగతం” అన్నాడు నా కళ్లల్లోకి చూస్తూ. అతని కళ్లల్లో ఆశల దీపాలు కనిపించాయి. పడవెక్కాను. ఒక్కొక్క చోట ఒక్కొక్క తీరైన నదీ ప్రవాహం. దూరపు నీలి కొండలు. ఒడ్డున పచ్చదనం. పైన నీలాకాశం. పెదవుల పై నా పాటనేస్తం. హుషారైన అతని ఈల. అతని మాటలు. వాటిలో అతని ఆశయాలు, అభిప్రాయాలు, కోరికలు, అతని చతుర్లు. అతనిక్కూడా వచ్చిన పాటలు. అలల కలకల. మగత నిద్ర.

          “ఈప్రయాణంఇలా సాగిపోనీ… ఎంతకాలమైనా కానీ” అనుకుంటూ పరవశంతో నా సహప్రయాణీకుణ్ణి, పడవ నడిపే ఆచిన్న వాణ్ణి నా ఆంతరంగిక ప్రపంచంలోకి స్వాగతించాను. మనస్సు విప్పాను. గళం విప్పాను. మనశ్శరీరాల సాక్షిగా ఇద్దరం ఆవలి వొడ్డుకి కలిసే ప్రయాణం చేద్దామని నిండు నది ఎదుట పండు వెన్నెల్లో ప్రమాణం చేసుకున్నాం. అంత వరకూ చెరికాసేపూ తెడ్డు వేశామా – ఇప్పుడతను నా వైపు కైపుతో చూసి “నువ్వు కాసేపు విశ్రమించు ప్రియా! బాగా అలసి పోయావు. అలసిన నీ కళ్ళల్లో మెరపు తగ్గేను” అన్నాడు. అతని శ్రధ్ధకి ఎంత ఆనందించానో!

          నా నేస్తం పాడుతున్న ఒక ప్రణయ గీతం వింటూ, ఒక్క క్షణం మత్తుగా కళ్ళు మూశానోలేదో అతను అదృశ్యమయ్యాడు. … నా పాట అతన్నిపిలిచింది.
“వస్తున్నానుండు” అంటూ హడావిడిగా పరిగెత్తుకొచ్చాడు.

          “ఎక్కడికెళ్లావ్” అన్నాను కంగారుగా.

          “ఇంకా మనం చాలా దూరం పోవాలి కదా. ఇట్లా తెడ్డువేసుకుంటూ కూర్చోడం విసుగ్గా లేదూ…అందుకని ఈ పడవ దానంతటదే సాగిపోవడానికి ఒక యంత్రం తయారు చేస్తున్నాను.”

          “యంత్రం పడవ నడిపితే నువ్వేం చేస్తావ్? నా కళ్లల్లోకి చూస్తూ కూచుంటావా?”
“కాస్త నేల మీదికి దిగిరా తల్లీ. ఇప్పుడంటే వయసులో ఉన్నాం. ఇలా పడవ నడుపు కుంటూ పోతామా ఎల్లకాలం? మనకీ విశ్రాంతి కావాలి. సుఖవంతమైన జీవితం కావాలి. నువ్విలా ఎప్పుడూ ఎండకీ వానకీ కూచుని తెడ్డువేస్తూ ఉంటావా? అందుకోసం నేనిప్పుడే కాస్త కష్టపడి ఏర్పాట్లు చేస్తున్నాను. మనం తీరం చేరి ఒక చక్కని ఇల్లుకట్టుకుని విశ్రాంతితో కూడిన నాణ్యమైన జీవనం గడపాలి కదా? “

          “నాణ్యమైన జీవితమంటే…?”

          “తరువాత చెబుతానుగానీ ముందు ఆకలి సంగతి చూడు.”

          “నువ్వేం తేలేదా తినడానికి…”

          “నేనీ యంత్రం తయారు చేసే వరకూ తిండి బాధ్యత నీదే. పడవ కాసేపు ఒడ్డున కట్టేసి తిండి ఏర్పాటుచూడు.” ఆవులిస్తూ లేచి కొంగు నడుముకు బిగించాను.
“నువ్వేదో పనిమీద హడావిడిగా ఉన్నావ. నేను కాసేపు అట్లా చల్లని గాలిలో తిరిగొస్తా…” అని నా పాట నేస్తం వెళ్ళి పోయింది.

          “నీతో కలిసి పని చెయ్యడం బాగుంటుంది వెళ్ళకు” అని పిలిస్తే “మళ్ళీ వస్తాగా” అంటూ వినిపించుకోకుండా నేస్తం వెళ్ళి పోయింది. నా సఖుడికిప్పుడు నా పాటవినే తీరిక లేదు. నన్నుఆరాధనగా చూసే సమయమూ లేదు. నేను తిండి తయారు చెయ్యడానికి పడవ ఆపినప్పుడల్లా అతను చెట్లల్లో, పుట్టల్లో తిరిగి ఏదేదో తెచ్చి పడవ నింపేస్తున్నాడు. వాటన్నింటినీ పొందికగా సర్దమంటున్నాడు. పోగెయ్యడమే పనిగా పెట్టుకున్నాడు. అతని ఈ కార్యదీక్ష నన్నూ అబ్బుర పరుస్తోంది. ఈ మనిషి సమర్థుడు, శక్తి మంతుడు, ప్రేమాస్పదుడు… అని అతన్ని మరింత ఆరాధించడం మొదలు పెట్టాను. అతని కోసం మరింత శ్రద్ధగా వండడం, అతనికి విశ్రాంతి కల్పించడం కోసం పని పంచుకోడం అలవాటు చేసుకున్నాను. ఎటూ పడవ నడిపే యంత్రం తయారవుతోంది కదా. ఈ కొన్నాళ్ళూ నేనే తెడ్డువేసి అతనికి మరింత సమయం కల్పిద్దామను కున్నాను. ఇదంతా ఇష్టంతో, సంతోషంతో చేస్తున్నాను. పడవ రకరకాల వస్తువులతో నిండుతోంది.

          మేము ఆవల తీరానికి చేరి ఒక చక్కని ఇల్లు నిర్మించుకుని నాణ్యమైన సమయం గడపడానికి అవసరమైన ఇటుకలు, ఇంకా అనేక వస్తువులతో పడవ నిండి పోతోంది… ఎప్పుడో ఏదో ఒక శబ్దం. సుత్తులతో కొడుతూ, రంపాలతో కోస్తూ, సమ్మెటవేస్తూ… ఒకరోజు ఉలిక్కి పడి “అయ్యో నా పాట ఏమైంది… నా చిరకాల నేస్తం అప్పుడనగా వెళ్ళి ఇదిగో వస్తానని మళ్ళీ రాలేదేం” అనుకుని గొంతెత్తి గట్టిగా పిలిచాను. పిలవగా పిలవగా వచ్చింది. నా మీద అది వరకు చూపించే ఇష్టం తన గొంతులో దొరకలేదు నాకు.
“ఏమిటమ్మా అదేపోక పోయావు? పిలిస్తేగానీ వచ్చావు కాదు” అన్నాను నిష్ఠూరంగా.

          “నీ ప్రియుడుచేస్తున్నశబ్దాలు విని భరించే ఓపిక లేదు. కొత్తలో ఆ శబ్దాలలో ఒక లయ ఉండేది. వాటితో పాటునేనూ పాడేదాన్ని. ఇప్పుడది రణగొణ ధ్వనిలా మారి పోయింది… ఎప్పుడూ యంత్రాల మోతే అయితే నా వల్ల కాదు… నే వెళ్ళొస్తా. ఇప్పుడు కావాలంటే నీ కోసం కాసేపుంటా. పద అట్లా చెట్ల మధ్యకెళ్ళి కాసేపు తిరిగొద్దాం” అంది.
“అప్పుడప్పుడూ ఇట్లాగే వచ్చి నీకు సాంత్వన కలిగిస్తాగానీ అచ్చంగానీ పెదాల మీద మాత్రం, ఈ హోరులో నేనుండ లేను” అనేసి వెళ్ళిపోయింది.

          నన్ను పడవలోకి వెలుగు కళ్లతో ఆహ్వానించిన వాడు, నన్ను చెయ్యిపట్టి పడవలోకి ఎక్కిస్తానన్న వాడు, ముసిముసి నవ్వులతో ముచ్చటగా ఉన్నవాడు, నాకు తిండివేళ తప్ప కనిపించటమే లేదు. ఆ నవ్వులూ లేవు. ఆముచ్చట్లూ లేవు. ఏవేవో తెచ్చి పడవ నింపడం, తయారు చెయ్యడంలో నిమగ్నమై పోయాడు.

          ఆమధ్యనొక రోజు ఒకకొత్తదేదో తయారు చేస్తూ కనిపించాడు. అదేమిటని అడిగితే అది ఒక ఆయుధమని చెప్పాడు. మమ్మల్నిమేము రక్షించుకోటానికట.
ఇక అతనితో కాదని – నా పూర్వ స్నేహాలు, జ్ఞాపకాల సరదాలతో, నా జీవితాన్ని కొనసాగిద్దామని నేను తెచ్చుకున్న వెలుగుపూల సంచులు విప్పుకుందామనుకుంటూ వాటి కోసం వెతికాను. పడవంతా కలయ తిరిగాను.
ఒక్క సంచీ కనపడ లేదు. ఇటుకల కింద, మేకుల డబ్బాల కింద, సుత్తుల కింద, శాణాల కింద, వాటి కింద, వీటికింద ఎక్కడ వెతికినా కనపడ లేదు.

          “అయ్యో!! ఏవీ నా స్నేహాలు, నా జ్ఞాపకాలు, నా అనుభవాలు, నా నైపుణ్యాలు? ఎక్కడ… ఎక్కడ” అని ఆక్రోశించాను. అతని పై మోహంతో, ప్రేమతో నన్ను నేను మర్చిపోయానా? నా సంపదనంతా పోగొట్టుకున్నానా?

          “మనం సేకరించిన ఈ సంపదనంతా పడవలో నింపే క్రమంలో అవి అడ్డం వచ్చి ఉంటాయి. నదిలో గిరాటేసి వుంటాం” అన్నాడు నా సఖుడు చాలా తేలికగా… అలా అనేసినా చెయ్యి పట్టుకుని పడవ లోతన కార్ఖానాకి తీసుకుపోయి “ఇన్నాళ్ళ నా శ్రమ ఫలించిందిచూడు. ఇక నీకు పడవ నడిపే పనేలేదు…. హాయిగా విశ్రాంతి తీసుకో… పాపం చాలా కష్టపడ్డావు. చెంపల దగ్గర వెంట్రుకలు తెల్లబడ్డాయి. నేను గమనించ లేదు చూశావా? నీ రంగు కూడా తగ్గింది. ఇక పడవ తనంతటతనే వెడుతుంది. నువ్వు నీ గురించి శ్రధ్ధ తీసుకో… నాకు ఇంకాస్త పనుంది. నేను కనిపెట్టాల్సినవీ, సంపాదించ వలసినవీ కొన్ని మిగిలి పోయాయి. నిజానికి సంపాదించింది చాల్లే, ఇక వీటితో మనం మంచి ఇల్లు కట్టుకుని హాయిగా ఉండొచ్చు అనుకుంటామా ఏదో ఒకటి మళ్ళీ మిగిలి వుంటుంది… ఇదిగో నీ చేతుల్తో ఈ మీట నొక్కు… ఆ తెడ్డు విసిరి నదిలో పడేయ్. ఇదొక్కటే కాదు, ఇంకా చాలా పనులు వాటంతటవే జరిగి పోయేలాగా చేసే యంత్రాలు తయారు చేస్తున్నాను. నీ పనల్లా అలా వేళ్లతో అలవోకగా మీటలు నొక్కటమే. ఇలా కాయకష్టంతో పనుండదు… సరే ముందీ మీటనొక్కు” అన్నాడు.
మీట నొక్కాను. పడవ వేగం పుంజుకుంది. నేను కూచున్నాను. నా పాట పోయింది. నా వెలుగుపూల సంచులు పోయాయి. నా సఖుడు ఎప్పుడు కనపడతాడో తెలీదు. ఇప్పుడు నాకు పడవ నడిపే పనికూడా పోయింది.

          “నేనేం చెయ్యాలిప్పుడు? నా నైపుణ్యాలు పోయాయి. నేనూ నీతో నీకార్ఖానాలో పని చేస్తాను” అన్నాను.

          “ఒద్దొద్దు. నువ్వు విశ్రాంతి తీసుకో… చెదిరి పోతున్న నీ సౌందర్యం కాపాడుకో. నాకు తిండి పెట్టు. నా అవసరాలు చూడు” అన్నాడు.
నీళ్లలో నా ముఖం చూసుకున్నాను. పాటలేని పెదవులు ఎండి పోయాయి. పడవెక్కినప్పుడు నాకే ముద్దొచ్చిన నా మొహం ఇప్పుడు అరిగి పోయినట్లుంది. పడవ రయ్మని నీళ్లని కోసుకుంటూ పరుగులు పెడుతోంది. రానురాను బరువు కూడా పెరుగుతోంది.

          పడవలో మా బంగారు భవిష్యత్తు కోసం, రాజా లాంటి బ్రతుకు కోసం అతనేమేమి నింపుతున్నాడో తెలీదు. అసలు నాకు చిన్నప్పటి నుంచీ ఈ రెండు పదాలూ ఇష్టం ఉండేవి కాదు. రాజాలాగ బ్రతకటం అంటే పని చెయ్యకుండా పది మంది తోకలవకుండా ఆధిక్యతతో వుండాలని కదా. అంటే రాజా ఒక్కడేనా మన నమూనా? అనిపించేది.

          ‘బంగరంలాంటి’ అనే మాట కూడా నాకిష్టం అనిపించేది కాదు. బంగారానికి పరిమళం, రుచీ లేదు. ఖరీదైన వస్తువులే నా మనం కోరుకోవలసినవి అనిపించేది. ఇప్పుడు నా ప్రియ సఖుడు కూడా తరచు ఈ రెండు పదాలే వాడుతూ నాకు విసుగు కలిగిస్తున్నాడు.

          పడవ బరువుపెరుగుతోంది. శబ్దాలహోరుఎక్కువైంది. పాటమ్మ ఏమైందో అయిపు లేకుండా పోయింది. సఖుని దర్శనం అపురూపమైంది. అసలు నేనెక్కడికి బయల్దేరాను? ఏ ఉద్దేశంతో బయలు దేరాను? ఏ గమ్యం కోరుకున్నాను? ఇతను పిలిచీ పిలవగానే సమ్మోహితురాలినై ఈ పడవలో ఎందుకు ప్రవేశించాను… అతనితో పంచుకున్న అనుభవాలు, చెప్పుకున్న ఊసులు, అన్నీ ఒక్కొక్కటే అదృశ్యమై పోయాయి. అవునూ అతగాడు… నన్ను తన సమ్మోహనాస్త్రంతో కట్టిపడేసిన వాడు, తన నవ్వులతో నన్ను ఆకట్టుకున్న వాడు… నా పాటల్ని, నా స్నేహాల్ని పదిలంగా ఉంచుకోమని చెప్తూనే తన వస్తువులకడ్డొచ్చాయని వాటిని నదిలోకి గిరాటు పెట్టిన వాడు, నాకొక అద్భుత ప్రపంచం సృష్టిస్తానన్న వాడు, నేను నా ఆత్మనీ, నా శరీరాన్నీఅర్పించుకున్న వాడు, ఏడి?
ఎక్కడ నుంచో సన్నగా మూలుగు వినపడుతోంది. ఈ పడవలో నేనూ, అతనూ తప్ప మరొకరెవరూ లేరే! ఎవరిదా ఆక్రందన?

          ఉలిక్కిపడి లేచాను. పడవ పరిగెడుతూనే వుంది. తన బరువు తగ్గించమని పడవ అడిగినప్పుడల్లా కొత్తగా సంపాదించిన వస్తువులు, కనిపెట్టాల్సిన యంత్రాల తాలూకు సామాన్లు మాత్రం వుంచి, పాత జ్ఞాపకాలు, అలవాట్లు ఒక్కొక్కటే గిరాటు పెట్టేస్తున్నాం. ఇప్పుడిక పాతవేం లేవు. అన్నీకొత్తవే. పనికొచ్చేవే…

          ఎవరో గట్టిగా నవ్వారు. ఎవరబ్బా వాళ్ళు? అతనూ, నేనూ, యంత్రాలు తప్ప ఎవరూ లేరే ఇక్కడ… మరి నవ్విందెవరు? మూలిగిందెవరు?

          “అవును కదా!! మరి నవ్వింది నేనే!! మూలిగేది ఎవరో తెలిసి పోలేదా?” అంది పడవ నడుపుతున్నయంత్రం.

          “ఇప్పుడు బరువైంది నువ్వే!! అందుకే నువ్వే దూకెయ్… నామానాన నేను పోతాను” అంది కాసేపాగి.

          “ముందు అతన్ని పిలు. దూకితే ఇద్దరం కలిసే దూకుతాం. లేదా ఈ వస్తువులన్నీ గిరాటేసి మేమే హాయిగా తెడ్డు వేసుకుంటూ పోతాం. ముందు నీ పీక నొక్కేస్తాం.”
“అదుగో చూడు. అతను తను తయారు చేసిన వస్తువుల మధ్య ఇరుక్కు పోయాడు. బయటకు రాలేక సతమత మైపోతున్నాడు. ఇక అతను వాటి మధ్యనించే కాదు, ఇంకా తయారు చెయ్యాలనే ఆశలోంచి కూడా బయటికి రాలేడు. అతనలా గింజుకుని గింజుకుని పోవాల్సిందే.”

          “అట్లా వీల్లేదు. ఇదిగో వస్తున్నా వుండు, నేనతన్ని బయటికి లాగుతాను. ఇన్నాళ్ళూ నేనొక భ్రాంతిలో ఉండి పోయాను. అతను మొదటి నించీ నన్నేదో విధంగా సమ్మోహన పరుస్తూనే ఉన్నాడు. నన్నునా సౌందర్యం కాపాడుకో మన్నాడు. అతనంటే మాత్రం నేను గంగిరెద్దులా తల ఊపడమేనా? నా బాధ్యత మర్చి పోడమేనా? అతన్నిఈ తయారీ దాహం నుంచి తప్పించే బాధ్యత నే నెందుకు తీసుకోలేదు? అతనికి ముందు నుంచి నా భావాలు, నా ఆశయాల గురించి నేనెందుకు అర్థం చేయించ లేదు?

          ఎంత అలసత్వం ప్రదర్శించాను? నాకు అవన్నీ కావాలి. నా ప్రియసఖుడూ కావాలి. “అతన్ని బయట పడెయ్యటం ఇప్పుడు నీవల్ల కాదు. చిన్నప్పటి నుంచీ నీవెంట వున్న నీ పాట నేస్తాన్నికూడా పోగొట్టుకున్నావ్… ఇక ఎవరి సాయంతో అతన్ని బయటికి తీస్తావ్? అయినా నేను ఒక పరిమితమైన బరువు వరకే పడవని తేలిగ్గా పోనివ్వ గలను. ఇప్పుడు నువ్వే నాకు బరువు. దిగి ఈదుకుంటూ పోతావో మునిగిపోతావో నీఇష్టం… త్వరగా కానీ!! లేకపోతే నాతోసహా మొత్తం మునిగి పోతుంది” అంది పడవనడిపే యంత్రం.

          నవ్వొచ్చింది… నేనూ, అతనూ లేకపోయాక ఇక పడవమునిగితే నా కేంటి? నడిస్తే నాకేంటి? అయినా అసలు పడవని ఎందుకు మునగనివ్వాలి?
నేను నా గొంతునంతా ఉపయోగించి గట్టిగా నాపాట నేస్తాన్నిపిలిచాను. ఒక పొలికేక పెట్టాను… తనకి ఎంత దయో నా మీద.. వచ్చి నా పెదవుల మీద వాలింది. నా గుండెని శృతి చేసింది. ఇద్దరం కలిసి బయలుదేరాం. యంత్రాల మధ్యకి, అంతులేని వస్తువుల మధ్యకి… అతణ్ణి శోధించడానికి… అతణ్ని కాపాడుకోడానికి. అతని విలువైన ముఖ్యమైన పరిశోధనలతో సహా అతణ్ణి రక్షించు కోటానికి!! నన్ను తన పడవలోకి స్వాగతించిన వాణ్ణి తిరిగి తెచ్చుకోడానికి… నా వెలుగు పూలసంచుల్ని మళ్ళీ తయారు చేసుకోటానికి.
పడవలో అవసరానికి మించిన ఆర్భాటాలన్నీ గిరాటేసి మళ్ళీ సంతృప్తి కరమైన ఒక సుందర జీవితానికి నాంది పలకడానికి. అక్కర్లేని వస్తువులు తయారు చెయ్యకుండా జీవితంలో కొంచెం విశ్రాంతి, కొంచెం భావుకత, ఎంతో ప్రేమా, ఇతరుల గురించిన ఆలోచన ఉండేలా చూసుకోడానికి. వెలుగు పూలసంచులని విలువలతో నింపుకోడానికి…
నాకూ, నా పాటకీ ఆశక్తి సామర్థ్యాలున్నాయని మాకిద్దరికీ ఎనలేని నమ్మకం.
నాసఖుని లాగే,

          అనేకానేక వ్యామోహాల్లో అత్యాశల మాయ జలతారువలల్లో చిక్కుకు పోయిన తమ ప్రేయసుల కోసం చింత పడే ప్రియులు కూడా నాతో గొంతు కలిపితే, మనం మన ప్రపంచాన్ని మరింత జీవన యోగ్యంగా మలుచు కోవచ్చు కదా.


(ఆదివారంఆంధ్రజ్యోతినవంబర్ 2007, కథావార్షిక, 2007)

*****

Please follow and like us:

One thought on “శ్రీరాగాలు- 3 పి. సత్యవతి కథ ‘నేనొస్తున్నాను’”

  1. సత్యవతి గారి కథల పుస్తకం ఈ మధ్యనే కొనుక్కుని చదివాను. సత్యవతి గారి కథల పుస్తకం లో మొదటి కథ. ఎంతగానో నచ్చిన కథ. మనం యాంత్రిక జీవితం లో ఏవేవో వ్యామోహాల రంధిలో అసలైన జీవన మాధుర్యం ఎలా కోల్పాతామో క్రమపద్ధతిలో చెప్పిన కథ.

Leave a Reply

Your email address will not be published.