కథా మధురం 

శ్రీమతి డి.వి.రమణి

‘జగమంతా దగా చేసినా, చిగురంత ఆశ చూసిన ఓ స్త్రీ కథ!’

 -ఆర్.దమయంతి

***

          కొంత మంది స్త్రీలు తమ ప్రమేయం లేకుండానే ఒంటరి అగాధపు లోయలోకి తోసేయబడతారు. కారణాలు అనేకం. ఎదిరించలేని పరిస్థితులు, చుట్టూ నెలకొన్న కుటుంబ వాతావరణం కావొచ్చు. ఆ పైన నిరాశ, నిస్పృహలకు లోను కావడం, పోరాడ లేక ఓటమిని అంగీకరిస్తూ విషాదంలో మిగిలి పోవడం జరుగుతూ వుంటుంది. తత్ఫలితంగా తమ చుట్టూ కమ్ముకున్న చీకట్లోనే నిస్సహాయులుగా మిగిలిపోతుంటారు.

          కానీ ప్రయత్నించి చూస్తే, ఒక దీపాన్ని వెలిగించుకుని, చీకట్లను తరిమికొట్టే అవకాశం ఉండకపోదు.

          దాని కంటే ముందు – నీ సుఖం, నీ ఆనందం కోసం రవంత స్వార్ధమూ ముఖ్యమనే సంగతి మరచిపోకూడదు. నువ్వు కోరుకుని, ప్రయత్నిస్తే , ఆకాశమంత వెలుగులో ఓ చిన్న వెలుగు రేఖని నీకివ్వనంటాడా దేవుడు మాత్రం? ఆలోచించమంటోంది ఈ కథ!

***

అసలు కథేమిటంటే :

          కావేరి తన కథని వ్యధని మనకు చెప్పుకుంటూ వుంటుంది.

          చిన్నప్పుడే తల్లి పోవడం, మేనత్త దగ్గర పెరగడం, ఉన్న ఒక్క చెల్లీ, దూరంగా వెళ్ళి పోవడం, మనసు లేని బావతో పెళ్ళి, అతని ముభావం, అత్తగారి ఆరళ్ళు, ఆ పైన వాళ్ళూ కాలంలో కలిసి పోవడం, కడుపున పుట్టిన ఒక్కగానొక్క కొడుకూ దుష్టుడుగా మారడం.. జీవితంలో అన్నీ ఎదురుదెబ్బలే. చేదు అనుభవాలే.

          ఇక సమాప్తం అనుకున్న జీవితం లో –  కేశవ్ ఎదురవుతాడు.  – చేయందిస్తూ..!! అందుకోవాలా వొద్దా అనే మీమాంస లో అంతర్ ఘర్షణా సంఘర్షణలో..తీసుకున్న నిర్ణయమే ఈ ‘రవ్వంత స్వార్ధం.’ 

ఇది ఒక స్త్రీ కథ. మనో వ్యధ.

తప్పక చదవండి.

***

కథలోని స్త్రీ పాత్రలు, స్ఫూర్తిదాయక లక్షణాలు :

కావేరి :

          ఈమె ఒక ఇంట్రావర్ట్.

          ఆమె అలా మారడానికి కారణం పూర్తిగా కాలము, చుట్టూ వున్న మనుషులు, తలొంచక తప్పని పరిస్థితులు అని చెప్పాలి. అన్నిటికీ తలొగ్గడమే తెలిసిన స్త్రీ. అంతకు మించి, గిరి దాటి వెళ్ళాలన్న తలంపు కూడా ఎరగని మహిళ. మన సమాజంలో అధిక శాతం సామాన్య స్త్రీల మనస్తత్వాలకి చాలా దగ్గరగా అగుపిస్తుంది.

స్త్రీ తనని తాను ప్రశ్నించుకునే తత్వం ముఖ్యం: –

          ప్రతి స్త్రీ ఈ లక్షణం కలిగి వుండాలని పరోక్షం గా చెప్పిన పాత్ర కావేరి.

          తనకి జరుగుతున్నది న్యాయమా అన్యాయమా? తను ఆలోచిస్తున్న వైనం సరైనదేనా కాదా?  అంతర్లీనం గా అనుభవిస్తున్న వేదన కి గల కారణం – నిజమేనా కాదా? తన మనసింత బాధ పడుతోందంటే అందుకు కారణం తనా?, లేక తన వారా? ఎవరు బాధ్యులు? ఎంత వరకు కారకులు? అయితే ఈ అగాధం నించి బయట పడేందుకు తను తీసుకోవాల్సిన నిర్ణయం ఏమిటి? తీసుకోకపోతే కలిగే నష్టం కానీ, ఒక అడుగు ముందుకేసాకా, దాని వలన కలిగే పర్యవసానాలు కానీ ఎలా వుంటాయి? అందుకు తను సిద్ధం గా వుండ గలదా?

          ఒంటరిగా పోరాడాల్సి వస్తే అన్నీ తానై తనకు తాను నిలబడగలదా?

          అన్నిటి కంటే ముఖ్యం గా సమాజం ఆమోదం లేకున్నా ఎదిరించి నిలబడగలదా? ఆ అత్మస్థైర్యాన్ని తను సమకూర్చుకోగలదా?

          అనేటు వంటి ప్రశ్నలు కావేరీ ని వేధిస్తున్నాయీ అంటే అవి సాధారణ స్త్రీలందరకీ వర్తించేవే అని చెప్పిన పాత్ర.

          నిరంతరం..అనునిత్యం..అనుక్షణం కావేరి బుర్ర నిండా తన జీవితం గురించిన ఆలోచనలు, సమస్యలు, కుటుంబ సభ్యుల వల్ల తనకు కలుగుతున్న మనస్తాపాలు, ఎదిరించి గడప దాటి వెళ్లలేని నిస్సహాయతలు, నిట్టూర్పులు, విధి చేతిలో కీలు బొమ్మనై పోయానన్న వేదనా భరిత దుఃఖాలను..చూస్తాం.

చచ్చి పోవాలనిపించినా..అది మాత్రం కూడదని చెప్పిన పాత్ర :

          తను పూర్తిగా వొంటరిదై పోయిందనిపించినప్పుడు, తన ఉనికికి విలువ శూన్యం అని అర్ధమై పోయినప్పుడు, చీకటి మాత్రమే శాశ్వతం అని వెలుగిక రాదనీ, లేదని అవగతమై పోయినప్పుడు ఏ మనిషి కైనా బ్రతుకు మీద విరక్తి పుడుతుంది. సరిగ్గా ఆ బలహీన క్షణం లోనే.. వెంటనే  ఆత్మహత్యకు పాల్బడుతుంటారు. కానీ, కావేరి అలా చేయదు. ఆ ఆలోచన వచ్చినా,  దాని నుంచి దూరం గా జరుగుతుంది. ఎన్ని కష్టాలు రాని, నష్టాలు జరగనీ..బ్రతకాలి..ఏదో సాధించి ఉద్ధరించడం కోసం కాదు..నీ కోసం నువ్వు బ్రతకాలి అని చెబుతుంది.

ఈ ప్రపంచం లో నేను మాత్రమే దురదృష్టవంతురాలిని అనుకునే సెల్ఫ్ పిటీ మానేయ మంటుంది :

          నిజానికి కావేరి అంత దురదృష్టవంతురాలు మరొకరుండరనిపిస్తుంది కథ చదువుతుంటే!

          చిన్నప్పుడే తల్లి పోవడం తో అమ్మ ప్రేమ కి దూరమౌతుంది.

          వున్న ఆ ఒక్క చెల్లెలూ – తన దారి తను చూసుకుని మాయమై పోతుంది. అత్తయ్య దగ్గర పెరుగుతుంది కానీ ఆవిడ కి నోరెక్కువ. మనసు చెడి వున్న బావ తో పెళ్ళి, అతని ముభావం తో కాపురం ఓ నరకం. అంతలోనే అతని మరణం. ఆ వెనకే అత్త గారి నిందలూ, ఇదిలా వుంటే..మరో పక్క తన రేపటి ఆశ అనుకున్న కొడుకు దుష్టుడిలా తయారవడం ఆమెని మరింత కృంగ దీస్తుంది.

‘మన నీడే మనకు తోడు’ : అని చెప్పిన పాత్ర : 

          రాత్రి లేని పగలు, అమావాస్య లేని మాసమూ వుండదు. అలాగే కష్టాల్లేని బ్రతుకునూ!

          నిజానికి కష్టాల కంటేనూ నిజమైన దుర్దృష్టం ఏమిటంటే – నీ కష్టాన్ని పంచుకునే మనిషంటూ ఒక్కరూ లేకపోవడం! 

          చుట్టూ సముద్రమే.  తాగేందుకు గుక్కెడు నీళ్ళు మాత్రమే కరువు అనే చందాన, మన చుట్టూ మనుషులే. కానీ, మనసెరిగిన వారు మాత్రమే శూన్యం.

          ఇలాటి పరిస్థితి ఎదురైనప్పుడు ఎం చేయాలి?

          నీ నీడే నీకు తోడు గా చేసుకుని బ్రతకాలి అంటుంది కావేరి. అనడమే కాదు, తాను అలానే బ్రతికి చూపిస్తుంది.

          కన్న వాడే దుష్టుడైతే..ఏం చేయాలో చెబుతుంది కావేరి

          కన్నె పిల్ల గా, ఉద్యోగినిగా, భార్యగా, కోడలిగా, తల్లిగా అన్ని పాత్రలూ అపజయాలై పోయినా స్త్రీ నోరు మెదపదు. తలొంచుకునే నడుస్తుంది. ఖర్మ అని, గతజన్మ లో చేసిన పాప ఫలితమని సర్ది చెప్పుకుంటుంది. కానీ కన్న కొడుకు దుష్టుడై, అప్రయోజకుడుగా మారినప్పుడు మాత్రం జీవచ్చవమౌతుంది. కావేరి  పరిస్థితి కూడా అంతే అయింది.

          ఇప్పటికీ ప్రతి మాతృమూర్తి తల్లి గా ఫెయిల్ అవడాన్ని తట్టుకోలేదు.

          ఇది మన భారత స్త్రీ లో గల గొప్ప లక్షణం.

కుటుంబం లో ధర్మ పాలనకి ప్రతీక గా నిలిచిన స్త్రీ :

          తన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా జీవితం – ఇతరుల చెప్పుచేతల్లో నడిచి పోతున్నా..క్షణ కాలం పాటు సుఖమయినా లేకపోయినా..అలాగే కాపురం చేసిందామే. అయినా, ఏ నాడూ ఆమె తన  తన ధర్మా  నిర్వర్తిన మరవలేదు.

          ఏ ఇంటి ఇల్లాలు  కుటుంబ ధర్మాన్ని పాటిస్తుందో..ఆ ఇల్లు శాంతి సుఖాలతో వర్ధిల్లు తుందని అంటారు.

          తన పట్ల తన వారందరూ అధర్మమే చూపారు. కానీ కావేరి మాత్రం అలా ధర్మాన్ని పంచుతుంది.  చివరికి, కొడుకు పెడదారి పట్టి పోయినా..అతను తిరిగొస్తే బ్రతకడం కోసం చేయాల్సిన ఏర్పాట్లన్ని  చేసి వుంచుతుంది.

          చాలా కుటుంబాలల్లో చూస్తుంటాం..కొంత మంది తల్లులు తమకంటూ ఎంతో కొంత మిగుల్చు కోవడం అనవసరం అని భావిస్తుంటారు. అలాటి వారిలో కావేరి కూడా!

వాకిట నిలుపుకున్న వసంతం :

          ప్రతి మనిషి జీవితంలోనూ ఏదో ఒకనాడు అనుకోని వెలుగైన  మలుపు – ఒకటుంటుంది.  కాకపోతే, ఓర్పు గా వేచి వుండాలి అనడానికి సాక్ష్యం గా నిలుస్తుంది కావేరి.

          జీవితంలో ఎదురయ్యే అనేకానేక సమస్యలను ఢీ కొనలేక ఇక అయిపోయింది లైఫ్ అనుకుంటూ ఉస్సూరుమంటుంటారు కొందరు.

          కానీ ముందు కాలం – మన కోసం ఏం దాచి వుంచిందో తీపి తాయిలం ఎవరికి తెలుసు!

          కావేరి కల్లోల జీవితం లో ప్రవేశించిన రిటర్డ్ ఆర్మీమాన్ – కేశవ్  రాక ఆమె జీవితం లోకి ఓ కొత్త వసంతాన్ని తీసుకొస్తుంది. 

          కొంత ధైర్యం, మరి కొంత సాహసం, కొంచెం తెగింపు, ఇంకొంచెం విచక్షణా జ్ఞానం ఇవన్నీ కలబోసుకుని తీసుకునే నిర్ణయమెప్పుడూ సత్ఫలితాన్నే ఇస్తుంది. – అని చెప్పిన పాత్ర.

          జీవితం లో  అన్ని మలుపులా –  అందమే దాగుంటుంది. అన్ని మజిలీలు ఆనందాల ప్రయాణాలే అవుతాయి..అంటూ సందేశమిచ్చిన పాత్ర కావేరి పాత్ర.

          కష్టాలు పడే స్త్రీలకు స్వాంతన చేకూర్చుతూ, ఆశాదృక్పథాన్ని  కలిగించిన స్త్రీ పాత్ర కావేరి అని చెప్పాలి.

***

          నాకు నేను చాలా ముఖ్యం..ఆ తర్వాతే ఇంకెవరైనా..’ అని చెప్పే పాత్ర శ్రావణి.  (కావేరి చెల్లెలు)

          అక్క కి పూర్తి విరుద్ధ స్వభావం కల స్త్రీ ఈమె. తల్లి తర్వాత తల్లి అక్క అనే భావన ఆమెలో ఏ కోసానా వుండదు. మేనత్త ఇంట పెరుగుతూ వుంటుంది బావ మనసు పడుతున్నా ఆమె చలించదు. తన భవిష్యత్తుని అప్పటికే నిర్ణయించుకుందో ఏమో ఓ రోజు ఇంట్లోంచి మాయమై పోతుంది. ఆ తర్వాత ఎక్కడా కనిపించదు. చాలా సార్లు కావేరి చెల్లెలి గురించి ఆవేదన పడుతుంది. వస్తుందేమో అని ఆశపడుతుంది. కాని తిరిగి రాదు.

          కొంత మంది అమ్మాయిలు గడప దాటి వెళ్ళాక ఇక వెనక్కి రారు. అందుకు రెండు కారణాలుంటాయి.

          ఒకటి – అతి గొప్ప ఐశ్వర్యం వల్ల, రెండోది అతి దుఃఖ కారణం వల్ల. ఈ కథలో శ్రావణి తిరిగి ఇంటికి రాకపోవడాని కారణం  ఏమో. తెలీదు.

          కథలో కనిపించే ఆ కాసేపు అయినా ఆమె పూర్తి స్వతంత్రురాలిలా అగుపిస్తుంది.

***

‘స్నేహానికి చిరునామా’ లా వుండే  వర్ధని పాత్ర :

          కావేరి తో స్నేహమైన కొద్ది కాలం లోనే ఆమె పరిస్థితిని అర్ధం చేసుకుని, చల్లని మాటై, కష్టం లో తోడై, అస్వస్థత బారిన పడ్డ సమయం లో సేవకురాలిగా ..తన స్నేహితురాలికి అండగా నిలుస్తుంది – వర్ధని.

          మనం బావున్నప్పుడు మన చుట్టూ వుండే జనాన్ని  చూసి మనకేం తక్కువ అనుకుంటాం. కానీ కష్టమొచ్చినప్పుడు గాలి కి కొట్టుకు పోయే ప్లాస్టిక్ సామాన్లా ఎటో వెళ్ళిపోతారు. దరిదాపుల్లో ఒక్కరూ కనిపించరు. నిజమైన స్నేహం ఒక్కటే ఆసరాగా నిలుస్తుంది. వర్ధనిలా.

          మంచి మాటలతో కావేరి మనసు మార్చి,  వరసకు అన్న అయిన కేశవ్ తో వివాహం జరిపించి పెద్ద ముత్తైదువే అవుతుంది.

          కొందరితో స్నేహం అలా సూర్యకాంతిలా జీవితమంతా వెలుగై నిలుస్తుందనడానికి వర్ధని పాత్ర ఓ ఉదాహరణ గా పేర్కొనాలి.

          ఇలాటి మిత్రురాలు ఒక్కరున్నా చాలు అనిపించేంత తృప్తిని ఇచ్చిన పాత్ర.

          స్నేహం అంటే చేయూత నివ్వడం అని సందేశాన్ని అందించిన పాత్ర.

***

రచయిత్రి గురించి :

          వినూత్న కథాంశాలకు కేరాఫ్ అడ్రెస్ గా పేరొందిన రచయిత్రి శ్రీమతి డి.వి. రమణి గారి కలం నించి మరెన్నో ఆణిముత్యాల్లాంటి కథలు రావాలని కోరుకుందాం.

          నెచ్చెలి కోసం – అడిగిన వెంటనే మంచి కథనందించిన రచయిత్రికి పత్రిక తరఫున  ధన్యవాదాలతో బాటు అభినందనలు అందచేస్తున్నాను.         

***

          ఇవండీ! ఈ కథలో పాత్రలూ, వారి భావాలు, స్వభావాలూ!

          వచ్చే నెల మరో మధురమైన కథ తో కలుసుకుంటాను.

ఫ్రెండ్స్!

          కథ పై, కథామధురం  పై మీ విలువైన హృదయస్పందనలను నెచ్చెలితో పంచుకుంటారు కదూ!

శలవ్ మరి.

అందరకీ శుభాకాంక్షలతో..

ఆర్.దమయంతి.

***

రవంత స్వార్ధం

– శ్రీమతి డి.వి.రమణి

ఇన్ని సంవత్సరాల్లోఒక్కసారికూడా నా గురించి నేను ఆలోచించుకోలేదు. ఇప్పుడూ, ఆలోచించేదాన్నికాదేమో! కానీ, ఎంతమంది! స్వార్ధం గా వాడుకుంటున్నా, ‘ పోనిలే, వాళ్లకి సాయపడుతున్నాను.’ అనే అనుకుంది తప్ప, వేరేవిధం గా అనుకోలేదు.  బహుశా “ఇదేంటి “ అని ప్రశ్నించకోకపోవటమే నా నేరమేమో! తెలీదు. గుండెల్లో బాధ నిండిపోయింది. కన్నీళ్లు కూడా రావటం లేదు. జరిగిన సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి తరిమి నన్నీ స్థితి కి తెచ్చి పడేశాయి అనిపిస్తూ ఉంటుంది.

***

      చిన్నప్పుడే అమ్మ పోతే నన్ను, చెల్లి శ్రావణి ని మా పెద్ద అత్త పెంచింది మా కోసం ఒక రూపాయి ఖర్చు పెడితే నాన్న అంతకు రెండు రేట్లు ముట్టచెప్పేవారు , నాకు అంత చిన్న వయసులోనే ఆమె మనసు తెలిసింది.  కానీ,ఎవరితో అనే సాహసం చెయ్యలేదు, నాన్న అడిగేవారు,” కావేరి,ఇక్కడ మీరు బాగున్నారా , ఏ ప్రాబ్లెమ్ లేదుగా ?”

ఆయనతో ఏమిచెప్పగలిగేది కాదు…ఎలా చెప్పగలదు చెప్పేస్తే వేరేగా ఉండేదేమో ! మరి అంత ధైర్యం లేదు.తర్వాత కూడా సాహసం చెయ్యలేదు, అందుకే మౌనంగా భరించటం అలవాటు అయింది . 

  శ్రావణి చాలా తెలివైంది, చలాకీగా,చురుకుగా అందంగా, పాలరాతి బొమ్మలా అన్నింట్లో ఫస్ట్ ఉండేది , బావ చాలానే ఇష్టపడటం చూసింది. తప్పేముంది వరసైనది, మనసు పడ్డాడు, అది నాకు తెలుసు. తేలినట్టే ఉండేదాన్ని. ఈ విషయం శ్రావణి ని అడిగితే “ఛీ బావనా?! నేను ఎప్పటికి చేసుకోను.“ అని గట్టిగానే చెప్పింది.   

 డిగ్రీ ఫైనల్  ఇయర్ లో, ఎవెర్నో ఇష్టపడి, బావని ఒక తన్ను తన్ని వెళ్ళిపోయింది. అప్పుడు అత్త చేసిన హంగామా ఇంత అంతా కాదు 

    బావ కోసం చాల డబ్బున్న అమ్మాయి రావాలని , బోలెడంత కట్నం తో రావాలని అనుకోవటం లో తప్పు లేదుగా ! సగటు అలాగే అనుకునే తరం వాళ్ళది, రోజు చెప్పేది ఆ మాట. విన్నా, విననట్టు ఉండటం అలవాటు చేసుకుంది . 

   మనకంటే గొప్పవాళ్ళు కావాలి అనుకుంటే, గొప్పవాళ్ళు కూడా మన కంటే గొప్పవాళ్ళని కోరుకోరా! తప్పుకాదుగా ! ఆశ పడొచ్చు కానీ అత్యాశ ఉండ కూడదు, అని నాకు ఎప్పుడూ అనిపించేది. నేనే ఒక ఇంట్రావర్ట్ ని. గమనింపే తప్ప మాటల్లేవ్!   

బావకి, అత్త కి, మామకి.. వెరసి నచ్చినవాళ్లు దొరకలేదు, మరి అప్పట్నుంచి బావ  ఉదాసీనంగా అయిపోయాడు. 

నేను పెళ్లి అనే ఆలోచన చెయ్యలేదు. ఎందుకంటే షుమారుగా ఉండే నాకు నేను కోరుకునే అవకాశం ఇస్తారా ? బుద్దిగా చదువుకున్నాను. 

      ఏమైందో తెలీదు, ఒక రెండు రోజులు చాలానే మాటలను కున్నారు,అరుచుకున్నారు, బావ కి గట్టిగా ఏమి చెప్పారో మరి!

ఊరునించి నిన్న, శకుంతల పిన్ని బాబయ్య ,చిన్నత్త మామయ్య, ఇంకా పెద్దలు కొందరు వొచ్చారు, నన్నెవరు ఏమి అడగలేదు. వారం లో ముహూర్తం పెట్టటం, పెళ్లి జరగటం జరిగిపోయాయి ..

 .నాన్న పాతిక ఎకరాల మాగాణి , వనస్థలిపురం లో ఇల్లు ఇచ్చేసారు. అప్పుడు నాకు కాస్త ఇంట్లోకొత్తగా  విలువ వొచ్చింది. ఏమి లాభం. మొదటిసారి నాన్నకూడా దూరమయ్యారు అనిపించింది.  అదివరకు పక్కన కూచోబెట్టుకుని ప్రేమగా అన్ని అడిగేవారు. దూరంగా, నిలబడి ఒకసారి చూసి వెళ్ళిపోయేవారు. చిన్నప్పటినించి చూసారు అని ఎదో ఒకలా ఋణం తీర్చుకున్నారేమో! అనిపించింది. తర్వాత నాన్న రాలేదు, తెగతెంపులు చేసుకున్నారేమో మరి, చాలా ఏడ్చేదాన్ని ఒంటరిగా. నాన్న ఒక్కరే ఎవెరితో ఏమి చెప్పుకోకుండా బతికేసారు.. 

శ్రావణిఎక్కడుందో ఎవరికి తెలీదు,టచ్ లో లేదు.  చిన్నప్పటినించి అక్కాచెల్లెళ్ల లో ఉండే ప్రేమల్లేవు అందుకే అంతగా బాధ పడలేదు. అయినా గుర్తొచ్చేది ఎలా ఉందొ అని! తనకి నేను గుర్తొస్తానా? 

      మనసు పంచుకునే ఒక్క నేస్తం కూడా లైఫ్ లేకపోవటం కన్నా శాపం ఏముంటుంది ? అలాగే నిస్సారంగా గడిచిపోతోంది లైఫ్.

 బావ బ్యాంకు లో జాబ్ సంపాదించారు. పొద్దునే వెళ్ళిపోతే ఎప్పుడు ఇంటికొస్తారో తెలీదు.  వొచ్చాక కూడా తనపాటికి తాను ఉంటాడు.  నాను పేరు పిలవడు, అత్తయ్య కూడా ఏమిటి అని అడగదు…. పైగా ఇంటెడు చాకిరీ చెయ్యాలి వాళ్ళు ముగ్గురు తిన్నకే నేను తినాలి కొలిచి గట్టుమీద పెడుతుంది అవే వండాలి, కొన్నిసార్లు సరిపోయేవికావు… ఈ మజ్జిగో తాగి పడుకునేది ఈ సాధింపు దేనికో తెలిసేది కాదు, డబ్బు అంత ఇచ్చాక కూడా! 

 నన్ను కలుపుకోలేదు ఎప్పడు చెప్పటానికి కూడా సిగ్గు గా అనిపించే సంఘటనలెన్నో …ఏ  రాత్రో, ఏ చీకటి వేళలో ఏ మూడో పలకరిస్తే కళ్ళుమూసుకుని నాతో ఉంటున్న  గడుపుతున్న బంధానికి పేరుందా? లేదు , సిగ్గుమాలి సహకరించే శరీరాన్ని కత్తి తో పరపర కోసేసు కోవాలి అనేంత బాధకలిగి, చచ్చిపోదామంటే కూడా ధైర్యంలేక ఏడుస్తూగడిపిన రాత్రులెన్నో! కనిపించని అమ్మని తలుచుకుని ఏడ్చేదాన్ని.   

 ఎలాగో, ఒక వారసుడిని కన్నాను, అత్త వాడ్ని చేసిన గారానికి ఎంత మొండిగా తయారయ్యాడు అంటే మాటల్లో చెప్పలేనంత! స్కూల్ కి పంపటం చాలానే కష్టం అయ్యేది, ప్రతి రోజు ఎదో ఒక కంప్లైంట్.

      వాడికి అయిదేళ్ళు వొచ్చేసరికి ఆక్సిడెంట్ లో బావ పోయాడు. అత్త దానికి కూడా నావల్లనే బావ కి ఆక్సిడెంట్ అయింది అని, నేనొక నష్టజాతకురాలిని అని తిట్టేది.  ఆ దిగులుతోనే ఏడాది లోపే మామ, అత్త  కాలం చేసారు.. బావ జాబ్ నాకొచ్చింది. ముందు చేరొద్దు అనుకున్నాను కానీ,ఒంటరిగా ఎలా కాలం  గడపాలి? నా  అన్నవాళ్ళు ఎవరు లేరు , కాలం చేసిన గాయం ఇది! బంధువుల రక పోకలు అంతంత మాత్రమే… నాకంటూ ఒక రొటీన్ ఉంటుంది అని అలోచించింది మొదటిసారి .

మొదటిసారి నాకుగా నేను నిర్ణయం తీసుకోవటం చాలానే టైం పట్టింది.

       నాన్నకి బాగాలేదు అని కబురొస్తే భూపాల పల్లి కి బయలుదేరాను కొడుకుని తీసుకుని, అమ్మనగలు న చేతిలో పెట్టి నాన్న  కన్ను మూసారు అయన ఊర్లో ఆస్తులన్నీ అమ్మేయమని బాబయ్యకి చేప్పి వొచ్చేసాను. ఇంకా ఆ ఊరితో నాకే సంబంధం ఇంక మిగిలి లేదు అని మనసుకి అర్ధం అయింది…. ఎవరికోసం రావాలి ? వాస్తవం అంగీకరించటానికి మనసు ఒప్పని నిజం !బాబయ్య పలకరిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. 

       కొడుకు ఆనంద్ 7వ తరగతి లోకి వొచ్చాడు ఒక ఆరు నెలలు గా పర్స్ లో డబ్బు పోవటం గమనించాను.  పనివాళ్లని తిట్టటం వాళ్ళ నాన్నలా  అరవటం చూస్తుంటే అర్ధం అయింది.  ఇక్కడే నాతో ఉంటే నేను వాడిని  చెక్ చెయ్యలేను. చిన్నత్త తో మాట్లాడి, బాబయ్య సలహా తీసుకుని మరి, వాడిని బోర్డింగ్ స్కూల్ లోవేసేసాను. వాడేంత తిట్టాడంటే నన్ను! అమ్మతో ఇలా ఎవరు మాట్లాడారు అనిపించి  కుంగిపోయాను. అమ్మ అనికూడా పిలవడు. అయినా, వాడికోసమే వాడికి దూరంగా ఉండాలి కష్టమైనా సరే అని  అనుకున్నా. కన్ననేరానికి  వాడి జీవితం నిలబెట్టాలి అది నా  బాధ్యత అంతే . అంతకి మించి నా మనసు కి వేరే ఆలోచన లేదు. 

***    

           నాకు తెలుసు నేనేమి నష్టపోయానో ఎవరికి నేను చెప్పలేను. ఇంకొకటి, మనసులోని వ్యధ ని చెప్పుకునేంత దగ్గరగా ఎవరూ లేరు. ఆఫీస్ లో కొందరున్నా ఆఫీస్ వరకే పరిమితం. సమయం సరదాగా గడుస్తుంది అందుకు సందేహం లేదు.  కానీ ఒక బాధ, వేదన గుండెని చుడుతూ అశాంతి కి లోను చేస్తూ ఉంటె మెరిసిపోయే ప్రయత్నం చేస్తూ కాలం గడుపుతూ ఉంటాను. 

తప్పు ఎవరిది?  నాదా? నా గురించి ఆలోచించని అమ్మ నాన్న లదా?పెళ్లి చేసుకున్న బావదా? టిపికల్ అత్త మామలదా? నా స్వభావమే నా ? చేతకాని తనమా? తెలీని ఒక స్థితి అంతే అది నన్ను ఏవిధం గా ఆనందం గా ఉండనీదు!

***

     ఉన్న ఇల్లు కొంచెం బాగుచేయించుకుని పైన ఇంకో అంతస్థు కట్టించి అద్దె కిచ్చేసాను.  మా ఆఫీస్ లో ఒకరికి తక్కువ అద్దె కి ఇచ్చాను. 

నాలుగు వీధుల కి అవతలున్న వర్ధని తో మంచి స్నేహం కుదిరింది. అందులో నా గొప్ప ఏది లేదు. వర్ధని అంత స్నేహ శీలి.  నా సెల్ లో నేనుండిపోయిన ఏకాంతం లోంచి నాకొక కొత్త లోకం కల్పించింది 

   బోర్డింగ్ స్కూల్ నించి ఆనంద్  వొచ్చాడు. వాడి కోసం క్షణాలు లెక్క పెట్టుకుంటూ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చుసేను.  కానీ వాడి ప్రవర్తన స్వభావం ఎంత మాత్రం మారక పోవటమే కాదు, ఇంకా జటిలంగా అయ్యాడు! ఇది నేను ఊహించనిది. మానసికంగా చాలా దెబ్బ నాకిది. ఎలా వీడు నా కొడుకు గా పుట్టాడా అనిపించేది! అంత యాత్రికంగా ఎలా ఉన్నాడు? స్కూల్ లో నేర్చుకున్నది ఇదేనా! ఎవర్ని తప్పు పట్టగలదు? వాడ్ని ఎలా బాగు చేయగలనా.. అనే ఆలోచన తప్ప ఇంకేమి లేదు. చదువుకుంటే ఎంతైనా చదివించగలదు.   

      డొనేషన్ కట్టి మెడిసిన్ చదివిద్దాము అంటే చదవాలిగా. ఇంకా వొచ్చినప్పటి నించి ఎదో బిజినెస్ చేస్తానని, ఇంక చదవనని, డబ్బు ఇమ్మని ఒకటే పోరు పెడుతున్నాడు. కాదంటే,మాటలనటం, విస్తుపోయి చూస్తున్నాను.  మొదటిసారి అనిపించింది, ‘ ఎందుకు కన్నానా వీడ్ని..’ అని!  నిస్సహాయంగా ఉంది నా పరిస్థితి.  వీడు ఎవరి మాట వినలేదు అందరి చేత చెప్పించి అలిసి పోయాను.  బాబయ్య, చిన్న మావయ్య.  శకుంతల పిన్ని. అంతా ఫ్రెండ్స్ కూడా ట్రై చేసారు. అందర్నీ దులపరించేసాడు. సిగ్గు తో చచ్చిపోయాను. వాళ్ళ కళ్ళలోకి చూడలేక అంత ఘోరంగా మాట్లాడాడు.

వర్ధని  వాళ్ళ అన్నతో విషయం చెప్పి తీసుకొచ్చింది. అప్పటికే అతనితో పరిచయం నాకుంది కానీ, నాకొడుకి కి లేదు గా !

“నేను మాట్లాడనా?” మర్యాదగా అడిగాడు కేశవ్ ఇందులో వొద్దు అనేందుకేముంది ? 

“ కేశవ్ మరోలా అనుకోకు, వాడికి నేను మర్యాద నేర్పలేకపోయాను. నిన్ను కూడా ఏమన్నా అంటాడేమో నని భయంగా ఉంది “ చాల బాధ పడుతూ అన్నాను. 

“ ఫర్లేదు కావేరి, ఆర్మీలో ఉండి  వొచ్చిన వాడిని.  అంత తొందరగా రియాక్ట్ అవునులే. చూద్దాం. ప్రయత్నం చెయ్యాలిగా “ అన్నాడు నమ్మకం కల్పిస్తూ, కొద్దిపాటి ఆశ కలిగింది.  

“ ఆనంద్, నీతో మాట్లాడాలి రా “ అని కొంచెం గట్టిగా పిలిచాడు. 

గదిలోంచి వొచ్చి హాల్ లో కూచున్నాడు, మొహం గంటు పెట్టుకుని ఎక్కడ పలకరింత  గాని,  ఒక మర్యాద గాని లేవు చిరాకుగా చూస్తూ నన్ను, కేశవ్ ని, వర్ధనిని మార్చి మార్చి చూస్తూన్నాడు.  నాకు టెన్షన్ గా ఉంది.  

    అప్పుడు కేశవ్ మర్యాదగా అడిగాడు,” ఏమిటి నీ గోల్? ఏమిచేద్దామని అని” అన్నాడో లేదో.. అంతే. విరుచుకు పడ్డాడు కేశవ్ మీద ,” హూ ది హెల్ అర్యు ?” అంటూ ఎంత  అవమానంగామాట్లాడాడో!  

నాకు కళ్ళలో నీళ్లు ఆగలేదు చెప్పలేనంత కోపం వొచ్చి, లేచి వాడిని చెంప మీద గట్టిగా కొట్టి “ఫస్ట్ లెర్న్ ది మానేర్స్ “ అని గట్టిగా అరిచాను.  

వర్ధని నన్ను ఆపింది “వొద్దు కావేరి కంట్రోల్ చేసుకో.  వాడు ఏమి అర్ధం చేసుకునే పరిస్థితి లో లేడు.“ అంది 

“ ఎలా చెప్పు వీడి భవిష్యత్తు ఏమిటి? ఇలా ఉంటె ఎవరన్నా జాబ్ ఇస్తారా?ఉన్నది అంత ఖర్చుపెట్టుకుంటే ఎలా బతుకు తాడు ? “ నాకు ఏడుపు ఆగటం లేదు. ఆనంద్ ఇంట్లోనించి వెళ్ళిపోయాడు ఎక్కడికి అని నేను అడగలేదు వాడు చెప్పలేదు.

   కొంతసేపు ఉండి, వాళ్ళు ధైర్యం చెప్పి వెళ్లారు, కానీ నేనే వాడి ప్రవర్తనకి షాక్ అయ్యాను కోలుకోలేకపోయాను, ఒక వారం సెలవు పెట్టేసాను.  వాడు రెండు రోజులదాకా ఇంటికి రాలేదు “ఎక్కడకి వెళ్లావ్?” అంటే నాతో కూడా మాట్లాడకుండా లోపలి వెళ్ళిపోయాడు.

ముందు ప్రవర్తన కన్నా ఇప్పుడు మరి అద్వానంగా అయిపొయింది.. 

నాకు హై ఫీవర్ వొచ్చేసింది వాడిచ్చిన ఝలక్ కి.

మూసిన కన్నుతెరవలేదు. వర్ధని మర్నాడు సాయంత్రం పిలిచేవరకు!

నన్ను హాస్పిటల్  లో చేర్చింది. 

“ఆనంద్ ,” అని కలవరిస్తుంటే కూడా చెప్పలేదు ఏమి జరిగిందో ? ట్రీట్మెంట్ అయి ఇంటికి వొచ్చేసరికి నాలుగు రోజులైంది అప్పుడు కూడా చెప్పలేదు. 

హఠాత్తుగా వాడు ఎక్కడికి ?ఎలా? వెళ్లిపోయాడో! తెలీలేదు, ఇంట్లో ఉన్న డబ్బు, అమ్మ నగలు తీసుకెళ్లాడు.  

పోలీస్ రిపోర్ట్ ఇస్తామంటే నేనే ఆపాను. వాడికి అంత తెలివి లేదు ఎవరో వాడి చేత చేయించారు అని అర్ధం అయింది. కుమిలి కుమిలి ఏడ్చాను. 

కేశవ్ వర్ధని చాలా ఓదార్చారు నన్ను విడిచి పెట్టకుండా నాతోనే ఉంటూపది రోజులైంది. ఆనంద్ వెళ్ళిపోయి ఇంట్లో ఉండటం లేదు. ఆఫీస్ కి ఆ తర్వాత ఏటోఅటు ఒక వైపు వెళ్లి అలిసిపోయి వొచ్చి  నిద్ర పోవటం. అయినా మనసు మధన పడుతూనే ఉంది.

    కల లా ఉంది. కళ్ళు తెరిచి చూస్తే, కల కరిగి పోతుందేమో? అనే భయం. సండే కావటం తో ఆఫీస్ లేదు ఆలస్యంగా లేచాను. కాఫీ కలుపుకుని హాల్ లో టి. వి చూస్తూ కూచున్నాను. 

కేశవ్ వర్ధని వొచ్చారు. ” కావేరి లంచ్ వండకు. బయటకి వెళ్దాం. ఇదిగో ఇడ్లి తెచ్చాను తినెయ్ “ అని చేతికి ఇచ్చింది, “ఎందుకు ఇవన్నీ ఇప్పుడు అవసరమా ?నాకెక్కడికి రావాలని లేదు వర్ధని, కేశవ్.  ప్లీజ్ అంత ప్రేమ చూపించొద్దు నేను భరించలేక పోతున్నాన్న “ మొహం కప్పేసుకుని ఏడ్చేసాను. అది సానుభూతి అయితే నాకసలు వొద్దు.

వర్ధని అనునయంగా ” ఎందుకంత పరాయిగా  ఫీల్ అవుతావు? నాకు ప్రతి విషయం తెలుసు. అలాగే కేశవ్ కి కూడా నాకు అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోతే ఈ కేశవ్ అన్నయ్యే చూసుకున్నాడు నాకు సొంత అన్న కాదు అయినా అంతకంటే ఎక్కువ. నాకు పెళ్లి చేసేదాకా చేసుకోనని పెళ్లి కూడా చేసుకోలేదు. ఒకరికి ఒకరు ఉండటమేగా జీవితం, మీ చెల్లెలు శ్రావణి ఎక్కడుంది ? ఇంతవరకు ఎప్పుడన్నా ఫోన్ చేసిందా కలిసేందుకు ప్రయత్నించిందా? ఎందుకే అలాంటి వాళ్ళు? కేవలం బంధుత్వం చెప్పుకుందుకే”

 “…… “ నాకు కన్నీళ్లు ఆగటం లేదు తుడిచేస్తుంటే వొస్తున్నాయి 

“లే కావేరి ఈ రోజు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి ఫ్రెష్ అయి రా “ కేశవ్ నెమ్మదిగా చెప్పిన చాల దృఢంగా చెప్పాడు. 

కేశవ్ వైపు చూస్తే అతని చూపులు చాలా చల్లగా ఉన్నాయి.. 

నాగురించి ఆలోచిస్తున్న మొదటి వాళ్ళు ఇద్దరు! నేను ఆలోచించని నా  జీవితం గురించి నా కంటే ఎక్కువగా ఆలోచిస్తుంటే…ఎలా రియాక్ట్ అవలో తెలీలేదు 

***

   చాలా సేపే గడిపాము. చాలా విషయాలు చర్చించుకున్నాము. ఏమి చెయ్యాలి? అని ఇంతవరకు నా  ఒంటరి జీవితం లో ఎటువంటి అలజడి లేనిది ఒక నిశ్శబ్దం, దుఃఖం, వేదన, నిస్సహాయత తప్ప ఎటువంటి ఆశ లేదు. కానీ అది జీవితం కాదు ఒక మార్పు రావాలి అది ప్రయోజనకారి కావాలి… అని ఇద్దరు నాకు నచ్చచెప్పారు.

     లాయర్ దగ్గరకి వెళ్లి మాట్లాడాము ఒక విల్లు రాయించారు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆనంద్ మిస్ అయ్యాడని రిపోర్ట్ ఇచ్చాము. సాయంత్రానికి ఇంటికి వొచ్చాము,

   “ఒక క్లారిటీ వొచ్చిందా కావేరి?” కేశవ్ అడిగాడు.  తల ఊపాను “ఆ “ అన్నట్టు 

“నేను మీకేవిధం గా సాయం చెయ్యగలను కేశవ్? ఇంతగా నాకు హెల్ప్ చేస్తున్నారు ?” అన్నాను మనసు కృతజ్ఞత తో నిండిపోతుంటే. 

వాళ్లిద్దరూ మొహాలు చూసుకున్నారు. కాసేపు మౌనంగా ఉన్నారు 

నాకు అర్ధం కాలేదు. “చెప్పు వర్ధని ఏంటి ఎదో చెప్పాలని ఆగిపోతున్నావ్?” అనడిగాను… 

“కావేరి నిన్ను ఇలా వొదిలి వెళ్ళాలి అని లేదు, నాతో మా ఇంటికి తీసుకెళ్లాలి, ఎలా? అని ఆలోచిస్తున్నానోయ్ “ అంది నవ్వుతూ 

“నన్ను తీసుకెళ్లటమేమిటి?’ ఆశ్చర్యం గా అడిగాను 

“చూడు నీ ఆస్తి అంతా మరి ని కొడుకుకి ఇచ్చేసావు కదా ! ఇప్పుడన్నా కొంచెం స్వార్ధం గా నీ గురించి ఆలోచించుకుని ఒక మంచి పని చెయ్యాలి గా” అంది.

“ అవును ఆ మంచి పనేమిటో అది నువ్వే చెప్పు“ అన్నాను నవ్వుతూ,

“ నాకు మా బావ తో పెళ్లి కుదిరింది ఆ పెళ్లి నువ్వు చెయ్యాలి” అంది ప్రాతిపదికగా 

“అంటే? ఎలా?”

ఎలా ఏముంది మా కేసవన్నయ్య ని పెళ్లి చేసుకో మీ ఇద్దరు పీటలమీద కూచుని నా పెళ్లి చెయ్యండి. అన్నయ్యకి నువ్వు నీకు అన్నయ్య తోడు ఉన్నారని నేను నిశ్చింతగా పెళ్లి చేసుకుంటాను. మీ ఇద్దరి గురించి నాకు చింత తగ్గుతుంది.  “ కావేరి నా వైపే చూస్తూ అడిగింది. ఆశ్చర్యంగా కేశవ్ వైపు చూసాను. అప్పటివరకు ఇటు  చూస్తున్న కేశవ్ చూపు తిప్పుకున్నాడు 

   “అదేంటి వర్ధని నాకెప్పుడూ ఆ ఆలోచన లేదు. కేశవ్ గురించి నాకు ఆ ఆలోచన లేదు. నీకు ఎందుకు అనిపించింది? ఈ నాలుగు నెలలలో మీతో చాల హ్యాపీ గా ఉన్నాను సందేహం లేదు కానీ… “

“ అదే కావేరి, నీకు ఎప్పటికి ఆ ఆలోచన ఎవరి దగ్గర రాని  విధంగా నువ్వు గాయపడ్డావ్. ఈ ఆనందం శాశ్వతం చేసుకోవచ్చు కదా. రవ్వంత స్వార్ధం ఉంచుకో తప్పులేదు. నీ కొడుకు తిరిగి వొస్తే వాడి ఇల్లు వాడికి ఉంది ఫిక్స్డ్ డిపోజిట్స్ ఉన్నాయి. వాడికి నువ్వు కావలి అనుకుని వొస్తే అన్నిఇద్దాము. వాడు రావాలె గాని మేము అన్ని వాడికి చెప్పి దగ్గరకి తీస్తాము. ఆ చింత పెట్టుకోకు  “ అనునయంగా అంది. 

“ కావేరి, నిన్ను నేను ప్రేమిస్తున్నాను ‘విల్ యు మేరీ  మీ?’ అని సినిమా బాణీ లో అడగను ఒక మంచి కంపెనీ ఇస్తాను. తోడుంటాను. నాకు నీ తోడు అవసరం ఫ్రెండ్స్ లో ఒకింట్లో ఉందాము. పెళ్లి లేకుండా ఉండటానికి నాకు నీకు కూడా నచ్చదు ఇంకా మీవాళ్లు ఏమనుకుంటారో అనే ఆలోచన వొద్దు. నీ కష్టం లో గాని అవసరం లో గాని తోడు లేరు అనుకోని, ఆలోచించుకుని నిర్ణయానికి రా ఆంతే నేను చెప్పేది” కేశవ్ సూటిగా చెప్పేసరికి ఆలోచనలో పడ్డాను. 

 పదిహేను రోజులు అలోచించి నానిర్ణయం చెప్పాను “కావేరి” అంటూ హత్తుకునేసింది, ‘వదినా.. వదిన’ అంటూ చేతులు పట్టుకుని తిప్పేసింది. ఆ సంతోషాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నాను నమ్మలేక!

***

  తర్వాత ఒక నెల కి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని పెద్ద ఆర్భాటం లేకుండా కేశవ్ ఇంటికి అతని భార్యగా అడుగుపెడుతుంటే ఒకలాంటి భయమే ఎక్కువ కలిగింది. వనస్థలిపురం లో నా ఇల్లు సూపర్ మార్కెట్ కి అద్దెకి ఇచ్చేసాను.  పైన పోర్షన్ లో రెండు గదుల్లో సామాన్లు పెట్టాను. ఎప్పటి కైనా ఆనంద్ వొస్తే ఇవ్వటానికి.

 ఇంకో నెల కి వర్ధని పెళ్లి జరిగింది తర్వాత కొన్ని నెలలకి రాజమండ్రి వెళ్ళిపోయింది. 

మొదటిసారి జీవితం లో కొంచెం రిలాక్స్ అయ్యాను దుఃఖం లేకుండా ఈ సంతోషాన్ని జీవితాంతం నిలుపుకోవాలని. 

  నేను ఆఫీస్ కి వెళ్తున్నాను మొదట్లో ఎవరిని చూసినా, నా గురించే మాట్లాడుకుంటున్నారు అనిపించేది. క్రమంగా అలవాటు అయింది. కానీ ఆనంద్ వెళ్ళిపోయినా లోటు మర్చిపోలేదు ఎప్పటికి.  ఒక చిన్న ఆశ, ఏదో ఒక రోజు తన తప్పు తెలుసుకుంటాడు అని, అలా ఎదురు చూస్తూనే ఉంటుంది కదా ! 

***

      “కావేరి ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా “ నా  కళ్ళలోకి చూస్తూ  అడిగాడు కేశవ్.  జవాబుగా  అతన్ని అల్లుకుని “అవును హ్యాపీ నే” అన్నాను. మనస్ఫూర్తిగా. 

“ అందుకే మన గురించి కూడా మనం ఆలోచించుకోవాలి “ అన్నాడు. 

“ సారీ కేశవ్ నేనాలోచించను” అన్నాను. 

“ఎందుకు?” విస్మయంగా అడిగాడు . 

“ఎందుకంటే, నా గురించి నువ్వు ఆలోచిస్తావ్ గా నేనెందుకు ఆలోచించాలి? చెప్పు. ఇన్నాళ్ళూ చాలానే ఆలోచించాను. ఇంక అది నా  పని కాదు. నీ పని. ఒకే” నవ్వుతూ అన్నాను 

“ సరే మంజూరు బేగం “ గట్టిగా హత్తుకుంటూ అన్నాడు కేశవ్.

అపురూపంగా అల్లుకుంటూ అనుకున్నాను తృప్తిగా..ఈ జన్మకీ భాగ్యం చాలని!

***** 

శ్రీమతి డి.వి.రమణి పరిచయం :

నా గురించి.

          నా పేరు డి.వి.రమణిగా సాహిత్య ప్రపంచానికి పరిచయం. పూర్తి పేరు  దర్భా వెంకట రమణి.

          దర్భా భాస్కరమ్మ, శివకామ సుబ్రహ్మణ్య శాస్త్రి  గార్ల రెండో అమ్మాయిని. మా అమ్మగారు మంచి కవయిత్రి, రచయిత్రి. ఆమె అందించిన వారసత్వమే నా సాహిత్య ప్రయాణం.

          పుట్టింది నర్సాపురంలో, గోదావరి జిల్లా. పెరిగింది చదువుకున్నది గుంటూరు. బి.హెచ్ స్కూల్ లో. చాలా చిన్నతనంలో వివాహం అయిపోయింది. ఇంటర్ తో ఆపేసిన చదువు. చదువు కోవటమే కలగా తర్వాత చదువు కోవటం జరిగింది.

          బి.ఏ. ఓపెన్ యూనివెరైటీతో మొదలు. ఎం.ఏ.హిందీ, ఇంగ్లీష్, లింగ్విస్టిక్స్ లో డిప్లొమా, టీచింగ్ ఇంగ్లీష్ లో డిప్లొమా, ట్రాన్సలేషన్   లో డిప్లొమా, తర్వాత పి.హెచ్.డిలో కొంత వరకు చేసి కొన్ని వ్యక్తిగత కారణాల వాళ్ళ ఆపివేయటం జరిగింది.  

          మా వారు బ్యాంకులో పనిచేసే వారు. వారే నన్ను చదివించారు. పిల్లలతో బాటు చదువుకుని లెక్చరర్ గా, ప్రిన్సిపాల్ గా కొన్ని ఏళ్ళు గడిచాయి…

          సాహిత్యం అంటే ఉండే మక్కువతో హిందీ, ఇంగ్లీష్ తెలుగు భాషలలో పాండిత్యం పొందాక రాయటం మొదలు పెట్టాను.

          మొదటి కథ “నర్తకి” నవ్య లో పబ్లిష్ అయింది. ఇంచు మించు 20 కధలు పబ్లిష్ అయ్యాయి. వాటిలో – ‘రంజని’వారు నిర్వహించిన కథల పోటీ లో ‘సుందర స్వప్నం’ అనే కధ మొదటి బహుమతి గెలుచుకుంది.  

పబ్లిష్ అయిన రచనలు :

          తెలుగు లో- 1. రమ్య గీత మాలిక – కవితల సంకలనం 2. భగవద్గీత -ఒక వ్యాఖ్యానం. 3. జీవన వేణువు అనే కధల సంపుటి (దీనికి శ్రీ గిడుగు రాంమూర్తి పంతులు గారి స్మారక అవార్డు వచ్చింది)  

ఇంగ్లిష్ లో- 1. రమణీయం అనే పేరు మీద కవితా సంపుటి. 2. భగవద్గీత కి వ్యాఖ్య.

ఇంకా రాస్తున్నవి ఉన్నాయి.

          రచన అనేది ఒక వ్యాపకంగా కాకుండా ఒక పరిశోధనగా నిజ జీవితంలో జరిగే సంఘటనలని ఆధారం చేసుకుని దానికి సైకాలజీ జత చేసి విశ్లేషించటమే నా రచనల ఉద్దేశ్యం.

          హిందీలో రాసినవి ప్రచురణలో వున్నాయి.

          తెలుగు రచనలను నా అనువాదం ద్వారా – తెలుగు మాధుర్యాన్ని ప్రపంచానికి అందించాలని ఆశయం.

అందరకీ నా వందనములు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.