కొత్త అడుగులు – 34

“బాధార్ణవ గీతి – అమూల్య చందు కవిత్వం”

– శిలాలోలిత

          “అమూల్య చందు కప్పగంతు” రాసిన బాధార్ణవ గీతి బాధల పొరలను చారల గుర్రంలా ఒళ్ళంతా చుట్టుకొంది. ఆస్పత్రి మీద నుంచి రాసిన ‘ఒంటి రొమ్ము తల్లి ‘ కవిత్వమిది. పూర్తయ్యేసరికి దు:ఖపు కొండలో ఒలికి పోవడమే కాక, పూర్తయ్యే సరికి విజయాన్ని సాధించిన యుద్ధ నినాదమూ వుంటుందిందులో.

          అమూల్య కవితాక్షరాలు మన ముందు కళ్ళు తెరుస్తాయి. చాలా మంది కళ్ళు తెరిపిస్తాయి కూడా.  శరీరయుద్ధం చేసింది. భయంకరమైన శారీరిక బాధను ఎదుర్కొన్న ప్రతి ఇంచిను కవిత్వ మయం చేసింది. అందుకే పఠితుల హృదయాల్లోకి సరాసరి వెళ్ళిపోతుంది.

          కవిత్వం తనను నరకం నుంచి ఎలా తప్పించిందో, ధైర్యాన్ని ఎలా నింపిందో, ఒంటి రొమ్ముతల్లిలా తానెలా మిగిలి పోవాల్సి వచ్చిందో కరుణాత్మకంగా వర్ణించింది.

          ఇందులో సహజాలంకారం తప్ప మరేదీ లేదు. పోతన ఎందుకు ‘సహజకవి’గా మిగిలిపోయాడో మరింతంగా అర్థమయింది. ఒక్కోచోట మనం కూడా వెక్కిళ్లు పడ్తూ ఆగిపోతాం. తాను రాసేటప్పుడు ఎంత పెయిన్ ను అనుభవించిందో అంతా మన కళ్ళకు కనబడుతుంది.

          నేను మాములు మనిషిని కావడానికి చాలా సమయమే పట్టింది. ప్రపంచం మొత్తంలోనూ భారతీయ స్త్రీలల్లోనే ‘కాన్సర్’ ఎక్కువగా వస్తోందట. ఈ లెక్కలు చూసాక ఒకటే అర్థమయిన విషయమేమిటంటే, తమ గురించి తాము ఆలోచించే స్థితికి చేరుకోలేదని. ప్రధానంగా పౌష్టికాహార లోపం, తన గురించి తాను పట్టించుకోక పోవడం, త్యాగ మూర్తి బిరుదులకు మోసపోయి, మూస పద్ధతిలో జీవించడం, లాస్ట్ ప్రయార్టీ తనకూ, తన ఆరోగ్యానికి, మందుల ఖర్చులకు ఇవ్వక పోవడం అనే నిజాలు కన్పిస్తున్నాయి. 

          బ్రెస్ట్ కాన్సర్ కూడా చాలా సాధారణ మౌతున్న రోజులివి. ఈ పుస్తక ప్రత్యేకత ఏమిటంటే, బాధితురాలే రాయడం.  గతంలో కొన్ని వచ్చినప్పటికీ, ఇంత బలమైన భావ వ్యక్తీకరణ రాలేదు. 

          1999లో అనుకుంటా నా మొదటి కవిత్వ పుస్తకం ‘పంజరాన్నీనేనే పక్షిని నేనే’  వచ్చింది. అందులో కాన్సర్ అని నిర్థారణ ఐన తర్వాత ఆ వ్యాధితో పోరాడి గెలిచిన ఆమెను పేపర్లో చూసి రాసానప్పుడు. మళ్ళీ ఇన్నాళ్ళకు గుర్తొచ్చింది.

ఈ శిథల శరీరంలో
వికసించిన తొలి పువ్వవు నీవు
నీకు నాలా కాళ్ళు లేవు
నాలా చూపులూ లేవు
నిముష నిముషానికి ముకుళించే హృదయమూ లేదు.

అమీబాలా  విస్తరించే నువ్వు
నన్ను నీతో  తీసుకెళ్లి పోతున్నావు.
అన్నింటినీ నీ స్పర్శతో పొందాలనీ
రేపటి ఉదయాల్లో సైతం
నిక్షిప్త కిరణాల్నే చూసిన నేను
నీ స్పర్శతో  నీ ఆగమనంతో
అన్ని రేపుల్లోనూ విరగబడి నవ్వుతున్నాను.
పిరికి కన్నీళ్ళ నదుల్లో  స్నానాలు చేయలేక
బ్రతుకు మొసళ్ళ పంటలో ముక్కలు ముక్కలౌతున్న  నేను
నువ్వొచ్చాక

నువ్వు రోజూ నా నోటి గ్లాసు నిండా
నెత్తుటి షర్బత్ నింపుతున్నా
నా కణాలన్నింటనీ మెలిపెడ్తూ
నా శరీర వేదికపై నువ్వు కథాకళి చేస్తున్నా
నేను నవ్వుతూనే వుంటాను.

ఇప్పుడు నీరాకతో  అన్నింటినీ జయించాను
నువ్వు నా ఆరాధనవి, నా ప్రేమవి
నా ప్రకృతివి, నా స్వప్నానివి.

***

          అని ఎప్పుడో బాధిత హృదయ తన మనో సంచలనాన్ని చెబితే ఇప్పుడు అమూల్య ఒక కొత్త డైమన్ష్ లో  రాసింది.

‘నన్నో నిలువెత్తు గాయంగా మిగిల్చావు
నువ్వు మా ఆడవాళ్ళ శరీరాలను గాయపరిచే
పురుషాధిక్య మూర్తివే కదా!
-అని తేల్చేయడమే కాక,
నేను  శరీరాన్నే కాదు… తప్పక మీ సకల
అహంకారాల్ని, అత్యాచారాల్ని
అవమానాల్ని ఆధిపత్యాన్ని
జయించే విజేతను నేనని
ఆసుపత్రి  మంచం మీదుండి
ప్రకటిస్తున్నా…..

          అని స్పష్టంగా తానేమిటో చెప్పింది.

          జీవితం నేర్పిన ఎన్నో పాఠాలతో ఆమె నుంచి అప్రయత్నంగా వేదాంత ధోరణి మొదలైనట్లుంది. ‘ఇదొక ద్రోహ కాలం’ అంటూ కవిత మొదలుపెట్టి  ‘జీవితమంటే అప్పుడప్పుడు గాజుబొమ్మ’

కొన్ని రోజుల ఆనందం కోసం

మనల్ని మనం కాల్చి బూడిద చేసుకోవాలి

కొన్ని అక్షరాలను బంధించి కవిత్వం

చేయాలంటే  మెదడును రంపంతో కొయ్యాలి.

***

ఇప్పుడో రోగం నా శరీరాన్ని

కఠినమైన ప్రశ్న పత్రంగా మార్చింది’

***

ఖరీదైన రోగాల కెప్పుడూ

మనిషి శరీరం ఒక ఆటవస్తువే..

***

జీవితమంటే కొన్ని కామాలు…
ఇంకొన్ని ఆశర్యార్ధకాలు
చాలావరకు ప్రశ్నార్థకాలు…

సమయమొస్తే
శాశ్వతంగా పెట్టాల్సిన
ఒక ఫుల్ స్టాప్  అంతే –
అని నిర్వేదంలో పలుకుతుంది.

          ఇక, అమూల్య గురించిన వివరాల్లోకి  వెళ్తే, ఆమె ఒక టీచర్. కవయిత్రి, కధా రచయిత్రి. జర్నలిస్ట్, ఎనౌన్సర్. 2000 నుంచి 2020 వరకు జర్నలిస్ట్ గా పనిచేసింది. విశాలాంధ్రలో ప్రూఫ్ రీడర్ గా , సబ్ ఎడిటర్ గా, ఫీచర్స్ రైటర్ గా ఎందరో సాహిత్య వేత్తల పరిచయాలను అందించింది. ప్రజా శక్తి, సాక్షిలో సబ్ ఎడిటర్ గా, ఎపి 24X7 న్యూస్ చానల్ లో స్క్రోలింగ్ ఆపరేటర్ గా, కాపీ ఎడిటర్ గా, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గా,‘ధీర’ అనే శీర్షికతో ఎందరో ప్రముఖమైన మహిళల చరిత్రములు ప్రేక్షకులకు అందించింది.

          ఎన్నో వ్యాసాలు రాసింది. మినీ కవితలు, కథలు ప్రచురితమయ్యాయి. ప్రముఖమైన ఎన్నెన్నో పుస్తకాల్లో రచనలు వస్తూనే వుంటాయి. అవార్డులు, రివార్డులు కూడా ఆమె అర్హతకు లభించాయి.

          మానవత్వాన్ని మరిచిపోయి క్రూరంగా ప్రవర్తించే కొందరిని చూసి, రేడియేషన్ వల్ల కాల్తుండే శరీరాన్ని భరిస్తూ ఆమె ఒక చోట ఇలా అనుకుంది.

‘మనుషుల కంటే రేడియేషన్ మిషన్
నయమనిపించేది ఒక్కో సారి
అది మనలోని కాన్సర్ కణాలను చంపుతుంటే
మనుషులు మాత్రం విషాన్ని చిమ్ముతున్నారు.

ఇప్పుడు నేను చిగుళ్ళు వేస్తున్న
మామిడిచెట్టుగా పచ్చగా మారుతున్నా
నేనిప్పుడు మొదటి మెట్టుని చేరుకున్న
స్వేచ్చా  జీవిని .

          ఇలా చెప్పుకుంటూ పోతుంటే, రకరకాలస్టేజ్ లలో ఆమె పడిన ఘర్షణ, నొప్పి మనను కూడా గాయపరుస్తాయి. ప్రస్తుతం విజయవాడలో ఉంటోంది. పోరాడే శక్తిని సాధించుకొని తనను తాను నిలబెట్టుకున్న  క్రమాన్ని ‘ఒంటి రొమ్ము తల్లి’ – కవిత్వం లో మనం చాలా స్పష్టంగా చూస్తాం. ఆమె పడి లేచిన తరంగం. ఏటికి ఎదురొడ్డి నిలిచింది. కాల్తున్న శరీరాన్ని తిరిగి పునర్నిర్మించుకుంది. ఆ దృఢ చిత్తకు అభినందనలు. కవిత్వం, సాహిత్యం ఊరట కలిగించి, తనను తాను గెలుపు పథానికి నడిచేందుకు సహకరించిన విధం అబ్బుర పరుస్తుంది. మీరూ చదవండి, నాతో ఏకీభవిస్తారు .

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.