నడక దారిలో-21

-శీలా సుభద్రా దేవి

జరిగిన కథ : పదేళ్ళ వయస్సు లో తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నా చదువు దెబ్బతిని అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్య పఠనంతోనూ, సంగీతం నేర్చుకోవటానికి, బాపూ బొమ్మలు చూసి వేయటం చేసాను. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గౌరవసంపాదకునిగా పేరు చూసి దేవి పేరుతో స్నేహితురాలు ఉషా చిరునామా తో ఉత్తరాలు రాసేదాన్ని. బంధువులు, మిత్రులు కరతాళ ధ్వనులతో, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో వివాహం జరిగింది. పరీక్షలుకాగానే హైదరాబాద్ లో కొత్తకాపురం, నాలుగు నెలల అనంతరం విజయనగరం వెళ్ళాను. మేలో పరీక్షలు ముగించుకుని హైదరాబాద్ శాశ్వతంగా వచ్చేసాను. తర్వాత—

***

          అంతకు ముందు చుట్టపు చూపులా వచ్చి రెండు మూడు నెలలు మాత్రమే వచ్చి పోవటం వలన పూర్తిగా నా యిల్లు అనిపించేది కాదు. ఇప్పుడు పూర్తి హక్కులతో నాయిల్లు, నా కుటుంబం అనుకుంటూ కళ్ళనిండా కోటి కలలతో హైదరాబాద్ లోని ఇంట్లోకి అడుగు పెట్టాను.
         
          జూన్ నెల నుండీ కుటుంబ బాధ్యతలు పూర్తిగా తీసుకున్నాను. ముగ్గురు అన్నదమ్ములు ఇచ్చిన డబ్బుతోని నెలంతా గడపటానికి బడ్జెట్ ప్లానింగ్ తో అన్నీ డైరిలో రాయటం మొదలు పెట్టాను.
 
          జూన్ ఫస్ట్ కి నా కథకి వచ్చిన రెమ్యునరేషన్ లో సగం 10 రూ. నా తొలి సంపాదన గా సంబరంగా అమ్మకి mo చేసాను.
         
          ఒక రోజు ఆఫీస్ నుండి రాగానే “ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త హౌసింగ్ స్కీమ్. HRAని అయిదు సంవత్సరాలు వదులుకుంటే తర్వాత పదహారువేల ఖరీదు చేసే ఇల్లు వస్తుందంట, తర్వాత కొంత వాయిదా పద్ధతిని నెలనెలా కట్టాలిట. అయితే ముందుగా నాలుగు వేలు కట్టాలిట. కాని సత్యవతి పెళ్ళి ఉంది, నీ డెలివరీ ఖర్చు ఉంది. కానీ మధుని రెండువేలు సర్దమంటాను. తర్వాత తీర్చేయవచ్చు” ఎంతో సంబరంగా అన్నారు. కానీ మా పెద్దాడబడుచు భర్త “అంతా ఫిక్సెడ్ లోనే ఉంది, డబ్బు లేదనే”సరికి వీర్రాజు చిన్నబుచ్చుకున్నారు. డబ్బు కొరత వలన అప్లికేషన్ కూడా పెట్టలేదు. అలా సొంత ఇంటి కల మొదటిసారి చెదిరి పోయింది.
     
          వంట గదిలోకి ఆనుకొని ఉన్న రెండు రేకుల గదులు అద్దెకి తీసుకున్నాము. అందులో ఒకటి బెడ్ రూంగా, రెండోది వీర్రాజు ఆఫీస్ రూంగా చేసుకున్నాం.
     
          అయితే స్వంత పడకగది సరదా తీరకుండానే వీర్రాజు మిత్రులు కథక్ మిత్ర పేరు కథలు రాసే వేమూరు నరసింహారావు భార్యతో కలిసి వచ్చి మా ఇంట్లో వారం రోజులు ఉన్నారు. తిరిగి మళ్ళీ మాకు వంటిల్లే గతి అయ్యిందీ.          
 
          కథక్ మిత్ర వాళ్ళకి నగరంలో చూడదగిన ప్రదేశాలు రోజూ తీసుకు వెళ్ళి చూపించాం. అయితే నాకు వాంతులు అవుతుండటంతో నీరసపడి ఉండటాన తిరిగి తిరిగి వచ్చాక వంట పనులు చేయటం బాధ కలిగేది. ఒక్కొక్కసారి చిరాకుగా ఉండేది. అయినా ముఖం మీద చిరునవ్వు  చెదరకుండా పనులు చేసేదాన్ని. వాళ్ళు వెళ్ళాక ఊపిరి పీల్చు కున్నాము.
       
          ఉండుండి వాంతులు అవుతుండటంతో, నీరసంతో లేవలేక పోవటంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను.
 
          రక్తపరీక్ష, మరికొన్ని పరీక్షలు చేసి రక్తంచాలా తక్కువగా ఉందనీ, ప్రోటీన్లు ఉన్న ఆహారం బాగా తీసుకోవాలని చెప్పి, నేను తల్లిని కాబోతున్నట్లు తెలిపారు.
   
          ఆరాత్రి ఆయన నేను ఎన్నో కబుర్లు చెప్పుకున్నాము. మొదట బాబు ఐతే బాగుంటుందని ఆయన అన్నారు. కానీ నేను పాప అయితే రకరకాల దుస్తులు వేసి ముచ్చట తీర్చుకోవచ్చు అని నేనూ వాదించుకున్నాం . ఆఖరుకు నాతో ఏకీభవించారు. అంతే కాదు పాప పేరు పల్లవి అని నేను డిక్లేర్ చేసాను. పల్లవి పేరు చాలా బాగుంది అని  అన్నారు. ఉదయమే అమ్మకు ఉత్తరం రాసాను.
 
          అమ్మ జాగ్రత్తలు చెపుతూ సమాధానం రాసింది.
   
          నాకు మరింత సంతోషకరమైన విషయం నా చిన్ననాటి స్నేహితులు, జానకీ, కుమారీ నాకు దగ్గరలోనే ఉండటం. మరీ చిన్నప్పటి స్నేహితురాలు లత కూడా ఇక్కడే ఉండటం వలన తరచు ఎవరో ఒకరితో రాకపోకలు ఉండటం వలన మనసుతీరా ముచ్చట్లు చెప్పుకోవటానికి అవకాశం దొరికింది.
     
          మేము ఉన్న కాంపౌండులో రత్నం వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవటం మరొక వెసులుబాటు. ఆ ఇంట్లోకి స్వాతి బలరాంగారి మిత్రుడు అద్దెకి దిగారు. అతనూ, భార్య లలిత మాత్రమే ఉండేవారు. లలిత కూడా నా వయసుదే కావటాన మేము మంచి మిత్రులం అయ్యాము.
     
          ఇంట్లో చూస్తే యథాప్రకారమే. ఆయన తన బొమ్మలూ, మిత్రులు, సభలూ, సాహిత్యం తో బిజీ. పగలంతా కనిపించేవారు కాదు. రాత్రి కాసేపు కబుర్లు, తర్వాత అలసిపోయి నిద్రపోయే వారు.
       
          ఒక్కోసారి ఆదివారం మాయింట్లో సాహిత్య సమావేశాలు జరిగేవి. కుందుర్తిగారు ఇతర కవులూ, కథకులూ వచ్చే వారు. వాళ్ళు కొత్తగా రాసిన కథో, కవితో చదివి, చర్చించుకునే వారు. నేను వారితో కలిసి కూర్చోలేక పోయినా, టీలో, టిఫిన్ లో అందిస్తూ వినేదాన్ని. అది నాకు ఎంతో సంభ్రమం గా ఉండేది. నా అభిప్రాయం కూడా పంచుకోవాలనిపించేది.
 
          సమాజం తీరుతెన్నులు,సంఘర్షణలు పట్ల ఒకింత ఆవేశం, ఆక్రోశం కలగలిపి లయాత్మకంగా కవిత్వం చదివే విధానం నన్ను ఆకర్షించింది. పగలు ఖాళీలేక పోయినా ఏ రాత్రి పూటో కవితా సంపుటి తీసి చదివేదాన్ని. విజయనగరంలో చదువుకునేటప్పుడు రాసినవే తప్ప మళ్ళా ఒక్క అక్షరం పేపరు మీద పెట్టలేక పోతున్నానని దుఃఖం వచ్చేది.
     
          పెళ్ళి అయ్యాక ఇద్దరం చదివిన వాటి గురించి సాహిత్య చర్చలు చేసుకోవచ్చు అనుకుంటే ఇద్దరం కలిసి కూర్చుని మాట్లాడటానికే సమయం లేకుండా పోయిందని ఉసూరుమనిపించింది.
       
          ఆ ఏడాది భారత స్వాతంత్య్ర రజతోత్సవం కావటంతో హైదరాబాద్ లోని ముఖ్యమైన భవనాలని దీపాలతో భలేగా అలంకరించారు. చీకటి పడిన తర్వాత చూడటానికి వెళ్ళాం. ఆ దీపకాంతులు మా జీవితం నిండా కూడా వెలగాలని ఆశించాను.
     
          మళ్ళా అశనిపాతంలా నా పరీక్షా ఫలితాలు తెలిసాయి. నేను భయపడుతున్నట్లు గానే ఫిజిక్స్ లో ఫెయిల్ అయ్యాను. నిజానికి కెమిస్ట్రీ గురించి భయపడ్డాను కానీ అందులో బాగా వచ్చాయి, లెక్కలు సరేసరి మంచి మార్కులు వచ్చాయి. మా ఫిజిక్స్ ప్రాక్టికల్స్ సమయంలో ” పెళ్ళైయ్యాక నీ చదువు మీద శ్రధ్ధ తగ్గిపోయింది. అందుకే వివాహం విద్యనాశాయః అన్నారు పెద్దలు” అంటూ ఫిజిక్స్ చెప్పే సీతాకుమారి గారు మందలించటం గుర్తు వచ్చింది. అప్పట్లో థియరీ లో ఫెయిల్ ఐనా, ప్రాక్టికల్స్ ఫెయిల్ ఐనా మొత్తం రాయాల్సిందే. చదువుకోవాలనీ, ఉద్యోగం చేయాలనీ నేను కన్న కలలు నిలువునా కూలిపోయాయి. ఇంట్లో పరిస్థితులు చూస్తుంటే నా ఆశలకు నీళ్ళు వదులు కోవల్సిందే. నాకు చదువు మీద ఉత్సాహం తగ్గిపోయింది.
     
          “పరీక్షకు తిరిగి  వెళ్ళేటట్లైతే మా తమ్ముడుకి పైసలు ఇచ్చి చలాన్ కట్టమను” అన్నారు. అసలే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నానేమో కోపం వచ్చి “పెళ్ళాం పనులు కూడా మీరు చెయ్యలేనప్పుడు పెళ్ళి చేసుకోవటం ఎందుకు?”అనబోయి మౌనం వహించాను. ఏమనుకున్నారో మళ్ళా తానే కట్టారు. కానీ ఏం లాభం పుస్తకం మాత్రం ముట్టుకోలేదు. నా చదువు అటక ఎక్కింది.
       
          ప్రత్యేకించి మేమిద్దరమే చేసిన ఒక ప్రయాణం చెప్పుకోవాలి. వీర్రాజుగారి ఆత్మీయ మిత్రుడు కథక్ మిత్ర శంకరగుప్తంలో ఉంటారు. బాలమురళీకృష్ణ పుట్టిన ఊరు. ఆ ప్రయాణం తీరుచెప్పక తప్పదు.సెప్టెంబరు పదమూడున రైలెక్కి పద్నాలుగున ఉదయం పదిగంటలకి నిడదవోలు చేరాము. కథక్ మిత్ర పదకొండు కి స్టేషనుకు వస్తే ఒంటి గంటకు మరో రైలెక్కి నరసాపురం చేరాం. అక్కడ రిక్షాలు లేవు. అక్కడ పడవెక్కి సఖినేటి పల్లెలో అనుకుంటా దిగాము. అక్కడ నుండి బట్టీలంక వరకూ బస్సు. అయితే మొదటి బస్సు వీర్రాజు ఎక్కగానే కదిలిపోయింది. తర్వాతబస్సులో కథక్ మిత్రా, నేను ఎక్కాము. బస్సులో ఒక ఆమె ఎక్కడ దిగుతారు అని అడిగింది. నాకు తెలియదు అనే సరికి తెల్లబోయింది. ఈలోగా కథక్ మిత్రా, నేను మీరు, మీరు అని ఒకరినొకరం సంభోదించుకుంటూ మాట్లాడుకుంటుంటే మరింత ఆశ్చర్య పోయింది. పల్లెల్లో వారు మాకెందుకని ఊరుకోక అన్ని ఆరాలు తీస్తారని నవ్వుకున్నాను. బట్టేలంక లో బస్సు దిగి అప్పటికే ముందు బస్సెక్కి వచ్చిన వీర్రాజు గారిని కలిసాము. తర్వాత జట్కా లో ప్రయాణం చేసి, తిరిగి పడవలో రక్తకుల్య కాలువ దాటి శంకరగుప్తంలో వాళ్ళ ఇల్లు చేరాము. బాగా అలసిపోయి ఒళ్ళు ఎరగకుండా ఆ రాత్రి నిద్రపోయాను. 
     
          మళ్ళా ఇరవై ఏళ్ళకు ప్రజా జీవితంలోని మార్పులతో ఇన్ని వాహనాలు ఎక్కకుండానే తిరిగి ఆ వూరు వెళ్ళాము. ఆ అనుభవంతోనే 1997 లో ” మార్పువెనక మనిషి” కథ రాసాను ఆ కథ ఎస్వీ విశ్వవిద్యాలయం డిగ్రీ మొదటి ఏడాది తెలుగు పాఠ్యాంశంగా పెట్టారు.
   
          శంకరగుప్తంలో రెండు మూడురోజులు ఉన్నాక నన్ను విజయనగరం బస్సు ఎక్కించి వీర్రాజు హైదరాబాద్ వెళ్ళిపోయారు.
   
          సెప్టెంబర్ నెలాఖరుకే విజయనగరం వెళ్ళాను. ఆ వారం రోజులైనా పరీక్షకి చదువుకుందామని. ఐతే హఠాత్తుగా మా పెద్దమామయ్య హార్ట్ఎటాక్ వచ్చి చనిపోయారు. మా అమ్మకు పెద్ద ఆసరా ఆయనే. ఆయన అంటే మా అందరికీ చాలా ఇష్టం. బేంకులో పనిచేస్తున్న మామామయ్య ప్రతీ సంక్రాంతికి వంద కొత్తనయాపైసలను పాపిన్స్ పేకెట్ లా చుట్టి పిల్లలందరకూ ఇచ్చేవారు. వాటిని ఎంతో అపురూపంగా మేమంతా వాడుకునే వాళ్ళం. అవన్నీ గుర్తు వచ్చి మనసంతా భారమైంది.
         
          చిన్నక్కకు డెలివరీ సమయం కావటంతో అమ్మ కోరుకొండ వెళ్ళింది. కానీ ఈ విషయం తెలిసి హుటాహుటిన విజయనగరం వచ్చేసింది. ఆ రోజు నాకు పరీక్ష. ఇంట్లో అందరూ మామయ్య ఇంటికి వెళ్ళారు. నేను పరీక్ష కు వెళ్తుంటే ఆ ఇంట్లోంచి బాజాలు వినిపిస్తున్నాయి. నాకు ఇష్టమైన మామయ్యని ఊర్లో ఉండి కూడా చూడలేక పోయాను. దుఃఖోద్వేగంతో పరీక్ష రాయలేక పోయాను.
     
          సెప్టెంబర్ నెలాఖరులో చిన్నక్క కు పాపాయి పుట్టింది. నేను పరీక్ష రాసిన తర్వాత పెద్దక్క తో పాటూ కోరుకొండ వెళ్ళి చూసి వచ్చాను.
     
          అక్టోబర్ 12న అన్నయ్య పెళ్ళి కుదిరింది. అమ్మ కోరుకొండ లో ఉండటంతో పెళ్ళి కోసమని ఇల్లంతా, ముఖ్యంగా అన్నయ్య గదిని శుభ్రం చేసాను.పెళ్ళి టైమ్ కి వీర్రాజు, చిన్నాడబడుచు వచ్చారు విశాఖ రిజిస్ట్రేషన్ ఆఫీసులో పెళ్ళి జరిగింది అనంతరం విజయనగరంలో తోటలో విందు. అది అయ్యాక ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్ళి పోయారు. అన్నయ్య వాళ్ళు పెద్దాపురం వెళ్ళి తిరిగి వచ్చే వరకూ సత్యవతిని నన్ను ఉండమని అమ్మ అనటంతో ఉండిపోయాము.
 
          అన్నయ్యా, వదినా వచ్చిన తర్వాత నేనూ, మా ఆడపడుచు తిరిగి హైదరాబాద్ కి వచ్చేసాము.
     
          డిసెంబర్ 7 నుంచి  సమ్మెను మొదలు పెట్టారు ఆంధ్ర ఎన్జీవోలు. ఈ సారి చాలా తీవ్రతరంగా జీతం కట్ చేస్తానన్నా చలించలేదు. వీర్రాజుకి ముఖచిత్రాల వలనా, కథలకు వచ్చే రెమ్యునరేషన్ వలనా అంత ఇబ్బంది లేకపోయినా చాలా జాగ్రత్తగా పొదుపుగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. దానికి తోడూ నిరంతరం వచ్చిపోయే బంధు మిత్రులు ఆర్ధికంగానే కాక శారీరకంగా కూడా అతలాకుతలం అయిపోయాం.
         
          మధ్యతరగతి జీవితాల్లోని ఆర్థిక  ఆటుపోట్ల వలన కలిగే ఒత్తిడులు కుటుంబ పెద్దగా  ఇప్పుడు మరింత అవగాహన కలిగింది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.