నారి సారించిన నవల-34

                      -కాత్యాయనీ విద్మహే

          వి.ఎస్. రమాదేవి 1979 లో వ్రాసిన నవల ‘రాజీ’.  నిశ అనే కలం పేరుతో ఎమెస్కో ప్రచురణగా ఆ నవల వచ్చింది. పాతికేళ్ళకు మళ్ళీ అది ప్రచురించబడ్డాక దానికి కొనసాగింపుగా మరో మూడు నవలలు వ్రాసింది రమాదేవి. అవి మలుపులు, మజిలీ, అనంతం. వీటిలో  మజిలీ నవల ఆంధ్రభూమి దిన పత్రికలో ధారావాహికంగా వెలుబడింది. ( రాజీ నవల ఒక్కమాట) రాజీ తో సహా  నాలుగు నవలలూ రాజేశ్వరి  ప్రధాన పాత్రగా ఆమె జీవితానుభవాలు ఇతివృత్తంగా  వచ్చినవే. ఇలా ఒక నవలకు కొనసాగింపుగా కొత్త పాత్రలతో, కొత్త ప్రదేశాలలో కథను పెంచుతూ వ్రాసే తరువాతి నవలలను సీక్వెల్ నవలలు అంటారు. తెలుగులో ఉప్పల లక్ష్మణరావు మూడు భాగాలుగా వ్రాసిన అతడు – ఆమె నవల ఒక రకంగా ఇటువంటి ప్రయోగమే.  అయితే ఆయన ఒకటి రెండు మూడు భాగాలు అన్నాడు కానీ ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క పేరు పెట్టలేదు. తరువాతి కాలంలో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన నవలా రచయిత నవీన్. 1969 లో వ్రాసిన  అంపశయ్య నవల కు కొనసాగింపుగా మూళ్ళ పొదలు(1974), అంతఃస్రవంతి (1991) వచ్చాయి. వి. ఎస్.  రమాదేవి వ్రాసిన రాజీ, మలుపులు. మజిలీ, అనంతం అనే నాలుగు నవలలు ఆ విధమైన సీక్వెల్ నవలలు.    

          రాజీ అని పిలవబడే రాజేశ్వరి జీవితం కేంద్రప్రభుత్వ సమాచార ప్రసార శాఖలో సంగీత నృత్య నాటక విభాగంలో సంగీత కళాకారిణిగా ప్రారంభమై, అదే సమాచార ప్రసారశాఖ మంత్రికి  ఆంతరంగిక  కార్యదర్శిగా , అక్కడి నుండి రాజ్యసభలో అనువాదకురాలిగా , ఆ పై గవర్నర్ ఆంతరంగిక కార్యదర్శిగా డిల్లీ  నుండి హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలను చుట్టుకొని ఢిల్లీకి  తిరిగి రావటం వరకు ఈ నాలుగు నవలలో చిత్రితమైంది. .1974-75  నుండి పాతిక ముప్ఫయి ఏళ్ల భారతదేశ  పార్లమెంటరీ రాజకీయాలు, ప్రభుత్వ పాలనా విధానం  నేపథ్యంగా  ఆయా నవలల ఇతివృత్తాలు రూపొందాయి. రాజీ నవలలో ఎమర్జన్సీ కాలపు హింసామయ దృశ్యం  అత్యంత సహజంగా ఇతివృత్తంలో  భాగం అయింది.  కుటుంబ జీవిత ఇతివృత్తాలు తప్ప స్త్రీల  నవలలకు మరొక వస్తువు ఉండదు అనే అపవాదును తిప్పికొట్టిన నవలలు ఇవి.  రాజేశ్వరి పాత్ర ముఖంగా సామాజిక ఉద్యోగ రంగాలలోకి ప్రవేశించి తనను తాను నిరూపించుకోదలచిన ఆధునిక మహిళ జీవితంలో  అభివృద్ధి చేసుకొనే వ్యక్తిత్వం, సాధికార చింతన, క్రియాశీల చైతన్యం విస్తృతంగా చర్చకు వస్తుంది. ఆ రకంగా ఈ నవలలు ఒక సాధికార మహిళ జీవిత అనుభవాల కథనం, ఆలోచనల కదంబం అని చెప్పవచ్చు.  రాజీ ఉద్యోగ జీవితానుభవాలు … ఉద్యోగరంగ రాజకీయాలు, వ్యవహారాలు చిత్రించటం వల్ల మాత్రమే కాక స్త్రీ పురుష సంబంధాల గురించి కొత్త ఆలోచనలను చర్చకు పెట్టటం వలన, వినూత్న ఆచరణల చిత్రణ వలన కూడా ఈ నవలలు ప్రత్యేకమైనవి.    

          రాజేశ్వరి ఉద్యోగ అవసరాల రీత్యా దేశంలోని వివిధ ప్రాంతాలకు, విదేశాలకూ చేసిన ప్రయాణాలు, ఆయా రాష్ట్రాల దేశాల దర్శనీయ స్థలాల వర్ణనలతో,  ఆయా ప్రాంతాల చారిత్రక ఆర్ధిక సాంస్కృతిక  జీవన విధానాల వివరణలతో ఈ నవలలు యాత్రా చరిత్రలుగా కూడా భాసిస్తాయి. 

          రాజీ గతం  అక్కడక్కడా ఆమె ఆలోచనల రూపంలోనో , ఆమె ఎవరితోనైనా చెప్తున్నట్లుగానో పాఠకులకు  అవగతం అవుతుంటుంది. ఆమె గతం మామయ్య తో ముడిపడి ప్రస్తావన కు వస్తుంటుంది. రాజీని అభిమానించి , చేరువ కావాలని తపించి, జీవితం పొడుగునా ఆమెకు మార్గ నిర్దేశం చేస్తూ , ఆమెను అనుసరిస్తూ తిరిగిన  రవికాంత్,  సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్నప్పుడు , ఆ తరువాత హిమాచల్ కర్ణాటక రాష్ట్ర గవర్నర్ గా పనిచేసినప్పుడు  ఆమెను ఆంతరంగిక కార్యదర్శి గా వేసుకొన్న మూర్తి ఆమె మామయ్యతో కలిసి చదివినవాళ్లు. అతనితో కొంత కాలం సర్వోదయ ఉద్య మంలో పనిచేసినవాళ్లు.  ఎమర్జన్సీ కాలంలో రాజీ  ప్రభుత్వ అనుమానితుల జాబితాలో చేరి నిర్బంధానికి , విచారణకు గురి కావటానికి  ఒక నెపం అయిన కరుణాకర్ కూడా మామయ్య స్నేహితుడే. మంత్రి తదితర అధికారుల ముందు విచారణలో భాగంగా తాను పనిచేస్తున్న సంస్థకు ప్రధాన సలహాదారు అయిన అనంత్ ముందు రాజీ తానుగా మామయ్య తోటి అనుబంధానికి సంబంధించిన తన గతాన్ని చెప్పవలసి వస్తుంది. 

          రాజీ కథనం ప్రకారం ఆమె అమ్మమ్మ తాతయ్య జాతీయోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళినవాళ్ళు. బంధువులు పూనుకొని  రాజీ తల్లికి ఈ వాసనలు ఏమీలేని కుటుంబంలోని యువకుడితో  పెళ్లి జరిపించారు. తాతయ్య అమ్మమ్మ చనిపోవటంతో రాజీ కి పదేళ్ల వయసులో ఉండగా ఆమె మేనమామ వాళ్ళింటికి వచ్చేసాడు. సంఘ సంస్కరణ కార్యకలాపాలలో పని చేయటానికి, హరిజనోద్ధరణ మొదలైన ఉద్యమాలలో పాల్గొనటానికి అక్క అతనిని ప్రోత్సహిస్తుండేది. కానీ అది ఆమె భర్తకు  ఇష్టం ఉండేది కాదు. ఏదో చదువుకొని ఉద్యోగం చూసుకొని కుటుంబాన్ని పోషించుకొంటూ కుదురుగా జీవించటం అతని అభిమతం. కనుక మామయ్య వ్యవహారాల విషయంలోవాళ్లిద్దరూ  గొడవ పడుతుండే వాళ్లు. ఎమ్మెస్సీ పరీక్షలు వ్రాసి సెలవల్లో ఇంట్లోనే ఉన్న అతను తన విషయంలో అక్కా బావా పడే ఘర్షణ చూసి వార్ధా ఆశ్రమానికి వెళ్లిపోయాడు. భూదానోద్యమంలో పనిచేస్తూ హైదరాబాద్ లో ఉండేవాడు. తండ్రి చనిపోయాక ఆమె మకాం తమ్ముడి దగ్గరకు మార్చింది. 

          అప్పటికి రాజీ బిఎ పూర్తి చేసి కర్ణాటక హిందుస్థానీ సంగీతం నేర్చుకొంటూ డిప్లొమా కూడా పొందింది. కాన్సర్ తో మరణిస్తూ తల్లి తాను కట్టించిన ఇల్లు , బ్యాంకు లో డబ్బు కూతురికి అల్లుడికి సమానంగా చెందుతుందని విల్లు వ్రాసి తమ్ముడి చెయ్యి కూతురి చెయ్యి కలిపి మరణించింది. సర్వోదయ , క్రాంతి, గ్రామోద్ధరణ అంటూ  అతను తిరుగుతూనే ఉన్నాడు. ఎన్నికల గొడవలతో అతనికి పని లేదు. మానవత్వం మీద , మనిషి మీద ఎక్కడ లేని నమ్మకం అతనికి. ఒకసారి వార్ధా నుండి ఒక అవివాహిత మాతను ఆత్మహత్య ప్రయత్నం నుండి రక్షించి ఇంటికి తీసుకువచ్చాడు. ఆమె పేరు దుర్గాబెన్. తేరుకున్నాక ఆమె అతనితో కలిసి సర్వోదయ ఉద్యమంలో పనిచేయటానికి సిద్ధపడింది. అక్క చెప్పినట్లు రాజీతో  జీవించటం  సాధ్యం కాదని ఆమె  వ్రాసిన విల్లును చింపేసి రాజీని వేరే పెళ్లి చేసుకోమని చెప్పాడు మామయ్య. తనకు కూడా అతని మీద అలాంటి ఊహలు ఎప్పుడూ రాలేదు కనుక  ఆ   మాట ఆమెకు సహజంగానే తోచింది. దుర్గాబెన్ కు మామయ్యపట్ల ఉన్న ఆరాధన గమనించిన రాజీ ఆమెను పెళ్లిచేసుకోమని అతనికి  సలహా కూడా ఇచ్చింది. రాజీ సంగతి చూశాక ఆలోచిస్తాను అని వాయిదా వేసాడు. ఆ సమయంలోనే ఆమె  ఉద్యోగం కోసం  ఢిల్లీ వచ్చేసింది.   

          అనంత్ తో పరిచయం గురించి గుర్తు చేసుకొంటూ రెండేళ్ల క్రితం తాను డ్యూటీలో చేరిన రెండు నెలలకు అతను తన ఇంటికి రావటంతో మొదలైందని రాజీ అనుకొనటాన్ని బట్టి నవల ప్రారంభానికి రాజీ ఢిల్లీ ఉద్యోగంలో చేరి రెండేళ్లు దాటింది అనుకోవచ్చు. ఆ తొలి పరిచయపు రోజున పక్కింటి మోనా తో జరిగిన సంభాషణలో 1969 నాటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ప్రస్తావన ఉంది కనుక 1970 తరువాతనే రాజీ ఉద్యోగంలో చేరినట్లు. రైల్వే సమ్మె ప్రస్తావనను బట్టి  అది ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా   జార్జి ఫెర్నాండేజ్ నడిపించిన చారిత్రాత్మక రైల్వే సమ్మె ( మే 8- 27) అనుకొనటానికి వీలున్న అవకాశాలను బట్టి కథ 1974  లో నడుస్తున్నట్లు. ఆంటే ఆమె ఉద్యోగ జీవితం 1972 లో ప్రారంభం అయినట్లు. ఉద్యోగ జీవితంలో ఆమె కు ఎదురైన  సమస్యలు, సవాళ్లు  ఏమిటి? సమస్యలు పనిచేసేచోట ఎదురయ్యే ఈర్ష్యాసూయలకు, అనారోగ్యకర పోటీకి, పని విధానాలకు, అధికార రాజకీయాలకు సంబంధించినవి. సవాళ్లు తన శక్తి సామర్ధ్యాలను నిరూపించుకొనటానికి సంబంధించినవి.స్త్రీ కావటం వల్ల ఈ విషయాలలో  తీవ్రతను, ఒత్తిడిని  ఎక్కువగా ఎదుర్కొనవలసి వచ్చిందా?  ముందుగా  పరిశీలించవలసిన అంశాలు ఇవి. 

          స్త్రీలకు ఇళ్లనే కార్యస్థలాలుగా, పెళ్లినే జీవిత పరమార్ధంగా చేసిన సంస్కృతిలో సామాజిక ఆర్ధిక రాజకీయ సాంస్కృతిక కళారంగాలలో తరచు వాళ్ళ ప్రవేశం నిషిద్ధమే అవుతుంటుంది. ఆసక్తితో ప్రవేశించినవాళ్లకు ఎదురయ్యే అవరోధాలు ఎన్నో. వాటిని అధిగమించి ఆయారంగాలలో    తమను తాము నిరూపించుకొనటం కొద్దిమందికే సాధ్యం. కేంద్రప్రభుత్వ సాంస్కృతిక విభాగంలో పాటలు పాడే ఉద్యోగి రాజీ.  చాలా భాషల్లో ట్యూన్లు కట్టి పాడగలగటం, పాటలోని అంతరార్ధం అవగతం అయ్యేట్లు పాడటం, పాటలు వ్రాయటం ఆమె ఆసక్తికి ప్రతిభకు సంబంధించినవి. పాడుతూ  పాటలో జీవించి మైమరచే ఆమె ప్రవృత్తి శ్రోతలను పరవశింప చేస్తుంది. ఆధికారిక  కార్యక్రమాలలో ఆమె ప్రతిభను చూసిన   మంత్రులు , ఉన్నతాధికారులు తమ ఇంటి ఉత్సవాలలో పాడమని ఆహ్వానిస్తే సహోద్యోగులు పెద్దవాళ్ళ ప్రాపకం సంపాదించి ఆమె ఎన్ని ప్రయోజనాలు పొందుతుందో అని ఈర్ష్యపడటం, ఆమె కన్నా ముందు అవకాశాలు అందిపుచ్చు కొనటానికి తొందర పడటం చూస్తాం. వాళ్ళ అనవసరపు సలహాలు, సూటిపోటి మాటలు  చాటుమాటు రాజకీయాలు తలనొప్పిగా ఉన్నా దిగులుపడి మనసు పాడు చేసుకొన కుండా తోసి పారెయ్యటమే పద్దతిగా అలవరచుకొన్నది.  ఎవరికిష్టమొచ్చినట్లు వాళ్ళు అనుకొంటారు , వాళ్ళ అభిప్రాయాలన్నిటికీ తాను బాధ్యురాలిని కాదని భావిస్తుంది కనుకనే తన గురించి ఎవరేమన్నారని తెలిసినా తొణకదు.   

          ఆధికారిక ఉత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాలు చూడవచ్చిన మంత్రుల సతీమణులకు, ఉన్నతాధికారుల భార్యలకు పాటలు పాడి డాన్సులు చేసే మహిళా కళాకారిణుల పట్ల  చెడిపోయిన వాళ్లనో, తమ పురుషులను చెడగొట్టే వాళ్ళనో ఒక అభిప్రాయం ఉంటూ అది  వాళ్ళముఖాలలో మాటలలో వ్యక్తం అవుతుండటం రాజీ వంటి వాళ్ళు ఎదుర్కొనే ఒక సమస్య. పాటవిని ఆనందించిన వాళ్లు వచ్చిన  మగవాళ్ళు అక్కడితో ఆగక ఫోన్ నంబర్ , ఇంటి అడ్రెస్ ఇయ్యమని వెంట పడటం మరొక సమస్య. ఒంటరిగా ఉన్న తనను  అందుబాటులో ఉన్న మహిళగా భావించి చౌక చేస్తున్నారే మోనన్న అనుమానం రాజీకి  మరొక  బాధ. అయితే ఇలాంటి వాటికి ప్రాముఖ్యమిచ్చి బాధపడక పోవటమే ఆమె  అలవర్చుకున్న ఆదర్శం. కానీ అది అనుకున్నంత సులభంగా సాధించగలిగినది కాదని  ఆమెకు తెలుసు. 

          రాజీకి   పొరుగున ఉండే పద్దెనిమిదేళ్ల పంజాబీ అమ్మాయి మోనా అనుభవ కథనం దానినే సూచిస్తుంది. మోనా డాన్సు చేయందే బతకలేననుకొనే అమ్మాయి … పెళ్ళయితే చేసుకున్నవాడు డాన్స్ చేయనిస్తాడన్న నమ్మకం లేదు . వాళ్ళ డాన్స్ టీచర్ అనుభవం నుండి ఆ పిల్లకు ఏర్పడిన అభిప్రాయం అది. డాన్స్ ప్రోగ్రాం కి  వచ్చిన ప్రతివాడు ఆమె అందాన్ని పొగుడుతుంటే భరించలేక పేచీ పెట్టిన భర్త వలన ఆ డాన్స్ టీచర్  రంగస్థల ప్రదర్శనలు ఆపేసి ఇంటి దగ్గర పాఠాలు చెప్పటానికి జీవితంలో సర్దుబాటు చేసుకోవలసి వచ్చింది. మోనా ఈ విషయాలు చెప్పిన సందర్భంలో రాజీ పదిమందిలోకి వచ్చి ఏపని చేద్దామనుకున్నా స్త్రీలకు ఎదురయ్యే ఎన్నో రకాల వ్యాఖ్యానాల గురించి ప్రస్తావించి మనం , మనవాళ్ళు అనుకునేవాళ్లు వీటిని తట్టుకొని నిలబడటం కన్నా మరొక  మార్గం లేదు అని  హెచ్చరించటం కనబడుతుంది. అది  ఢిల్లీ ఉన్నతోద్యోగ వర్గాలలో పనిచేస్తూ వచ్చిన రాజీ   తాను నిలబడటానికి చేసిన నిత్యజీవిత అభ్యాస క్రమంలో నేర్చుకొన్న పాఠం ఫలితమే అయివుంటుంది. 

          మోనా   నృత్య ప్రదర్శనకు ముఖ్య అతిధిగా వచ్చిన ముఖ్యమంత్రి తమ్ముడు ఆమెను ఒంటరిగా డిన్నర్ కు రమ్మని పిలిచిన విషయం గుర్తు చేసుకొని  ఆ విషయం  తెలిసి ఇంట్లో వాళ్ళు ఆమె డాన్స్ మాన్పించి పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టటాన్ని తలచుకొని బాధ పడుతుంది. బెంబేలు పడక నృత్యాన్ని కొనసాగించమని అలాంటివాళ్లకు ఎవరికైనా చెప్పటం తేలికే కానీ ఆచరణకు ఉండే అనేక పరిమితుల గురించిన స్పృహ ఆమెకు లేకపోలేదు.  అవమాన పడే వాళ్ళ బాధ,  దానిని స్వీకరించే పద్ధతి,  తట్టుకొని నిలబడగల చైతన్య స్థాయి, చుట్టూ పరిస్థితులు  మొదలైనవి  వ్యక్తులు తీసుకొనే  నిర్ణయాలను ప్రభావితం చేస్తుంటాయి  అన్న సామాజిక కౌటుంబిక వాస్తవికత ఆమె దృష్టిలో ఉంది.  

అధికార వర్గాలకు దగ్గరై  మెప్పు పొంది పబ్బం గడుపుకొనాలన్న స్వార్ధం, సాటి ఉద్యోగుల  తలమీద నుండి నడిచైనా సరే ఎదగాలనుకొనే  తొందర ఉద్యోగ రంగంలో వ్యక్తులను ఎదుటివాళ్లపై    ఎన్ని అపనిందలయినా ప్రచారం చేసి, ఎంత హాని కలిగించటానికైనా సందేహించని స్థాయికి ఎలా తీసుకువెళతాయో రాజీ పట్ల  మిస్ కుముద్ ప్రవర్తన  ద్వారా  చూపింది రచయిత్రి. చనువుతో చమత్కారంగా మాట్లాడు తున్నట్లే ఉంటూ రాజీ కి పురుషులతో వుండే స్నేహాన్ని ఎత్తి చూపటం , అక్కడితో ఆగక ఎమర్జన్సీ కాలంలో రాజీ గురించి అధికార పోలీసు వర్గాలలో కలిగిన అనుమానాలకు ఆజ్యం పోసినట్లు ఆమె శీలాన్ని గురించి అపవాదులు పుట్టించి ప్రచారం చెయ్యటం వరకు వెళ్ళింది కుముద్. చంద్ర వంటి పురుష ఉద్యోగులు కూడా అనుమానితుల జాబితాలో చేరి అగచాట్లు పడ్డ వాళ్ళే అయినా శీలం గురించిన ప్రశ్న ఆడవాళ్లకు అదనం. 

          ఉద్యోగ జీవితంలో తమను తాము నిరూపించుకొనే  వృత్తిపర అవకాశాలు ఎవరికైనా వాళ్ళ సీనియారిటీని బట్టి, న్యాయబద్ధంగా రావలసినవే కానీ కులాన్ని బట్టో, ప్రాంతాన్ని బట్టో, భాషను బట్టో , పరిచయాన్ని బట్టో పై అధికారుల ప్రాపకంవల్ల రావలసినవి కావన్న దృష్టి రాజీ ది. తమ యూనిట్ ముఖ్య సలహాదారుడు అయిన అనంత్ తెలుగువాడు కనుక  దానిని వాడుకొని విదేశాలకు వెళ్లటానికి సిఫారసు చేయించుకోమని కుముద్ ఇచ్చిన సలహాను త్రోసి పుచ్చటం అందువల్లనే. ఆ ప్రయోజనాలకోసమే అధికారుల ఇళ్లకు వెళ్లి వాళ్ళ  భార్యలతో స్నేహం చేసి చెప్పించుకొనే వ్యవహార సరళి పట్ల కూడా ఆమెకు ఏవగింపే.   తనకు వచ్చిన అవకాశాలలో వాటి ప్రమేయం ఏమీ లేదు కదా అని ఎప్పుడూ తనకు  తాను హెచ్చరికగా  ఉంటుంది.  సంగీత అకాడెమీ పక్షాన లండన్ లో జరిగే ఆరు నెలల  ట్రైనింగ్  కు ఎంపిక అయిన సందర్భంలో తన ఎంపిక కారణాల గురించి అనంత్ ను తరచి తరచి అడగటం అందులో భాగమే.

*****

(ఇంకా వుంది) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.