వ్యాధితో పోరాటం-8

కనకదుర్గ

          బాగా అలసటగా వుంది. పొద్దున్నుండి నొప్పికి ఇంజెక్షన్ తీసుకోలేదు. టీలో కొన్ని సాల్టీన్ బిస్కెట్లు (ఉప్పుగా, నూనె లేకుండా డ్రైగా వుంటాయి) నంచుకుని తిన్నాను.

          టీ చల్లారి పోతే నర్స్ బటన్ నొక్కితే టెక్ వచ్చి టీ తీసుకెళ్ళి వేడి చేసి తీసు కొచ్చింది. వేడి టీ త్రాగాను మెల్లిగా.

          ప్రక్క పేషంట్ ని చూడడానికి డాక్టర్లు వచ్చి వెళ్ళారు. ఫోన్ లో ఇంట్లో వాళ్ళకి ఏమేం తీసుకురావాలో గట్టిగా చెబుతుంది.

          “నా బాత్ రోబ్, మేకప్ కిట్, తినడానికి నాకిష్టమైన కుక్కీస్ డబ్బా తీసుకురండి! మర్చిపోకుండా..” అని చెప్పింది.

          కాసేపు కళ్ళు మూసుకు పడుకుందామని ప్రక్కకు తిరిగి పడుకున్నాను. సన్నగా నొప్పి అనిపించింది. నర్స్ ని పిలిచి ఇంజెక్షన్ అడిగితే తీసుకువచ్చి ఇచ్చింది.

          కళ్ళు మూసుకు పడుకుంటే వెంటనే నిద్ర పట్టింది. మూడు రోజులుగా సరిగ్గా పడుకోలేదు. మొదటిరోజు నొప్పి మందు మత్తుకి లేవకుండా పడుకుంది ఆ రాత్రి, పొద్దున. ఆ తర్వాత పిల్లలు, ఇల్లు, జబ్బు గురించి ఆలోచనలతో నిద్రే లేదు సరిగ్గా.

          గట్టిగా నవ్వులు వినపడడంతో మెలుకువ వచ్చింది. ప్రక్క పేషంట్ ని చూడడానికి స్నేహితులో, కుటుంబ సభ్యులో వచ్చినట్టున్నారు. అందరూ జోక్స్ చెప్పుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ గోల గోలగా అనిపించింది. లేచి బాత్రూంకి వెళ్ళి వచ్చి మంచం పై కూర్చొని టీ.వి పెట్టుకున్నాను.  ఇంతలో డాక్టర్ డేవిడ్ వచ్చారు.

           “హౌ ఆర్యూ ఫీలింగ్ టుడే దుర్గా?  ”  అని నా కేస్ ఫైల్ పట్టుకుని కుర్చీ మంచం దగ్గరకు లాక్కుని కూర్చున్నారు.

          “లిటిల్ బెటర్. ఇంజెక్షన్స్ ఎక్కువ తీసుకోవటం లేదు. డాక్టర్ రిచర్డ్ ఈ.ఆర్.సి.పి టెస్ట్ చేసినపుడు అంతా బాగానే వుందన్నారు కదా! మళ్ళీ ఇంత నొప్పి ఎందుకు వస్తుంది? చిన్న పాపని ఇంట్లో వదిలి పెట్టి వచ్చాను తెల్సా? నాకస్సలు ఉండాలని లేదు ఇక్కడ! ఎప్పుడు వెళ్ళొచ్చు ఇంటికి?”

          ” ఐ నో! మీ పాప పుట్టి కొన్ని రోజులే అయ్యింది. ఎలా వుంది? రాత్రుళ్ళు బాగా ఏడుస్తుందా? లేకపోతే మంచి పాపాయా? అందుకే నువ్వు త్వరగా నొప్పి తగ్గించుకొని ఇంటికి వెళ్ళిపోవాలి మరి. తను నిన్ను మిస్ అవుతుంది, నువ్వు తనని మిస్ అవుతున్నావు కదా! ఈ నొప్పి ఎందుకు వస్తుందో తెలియటం లేదు కదా!”

          ” మరి ఏం చేయాలి? ఇలా నొప్పి వస్తుంటే పాపని చూసుకోవడం ఎలాగ? డెలివరీ అయ్యింది కదా! బాడీలో హార్మోన్స్ ప్రభావం ఉంటుంది కదా, దాని వల్ల ఇలా అవుతుందా? కొన్నాళ్ళయ్యాక ఇదంతా తగ్గిపోయే అవకాశం ఉంటుందా?” అని ఆశగా అడిగింది.

          “ఏమో చెప్పలేం దుర్గా. తగ్గొచ్చు, తగ్గక పోవచ్చు. చాలా మంది పేషంట్స్ జీవితాంతం ఈ నొప్పితో, మందులేసుకుంటూ,  ఎంజైమ్స్ తీసుకుంటూ, కొంత మందికి డైబిటిస్ వస్తుంది, వారు ఇన్సులిన్ తీసుకుంటూ ఇలాగే బ్రతుకుతున్నవారు ఎంతో మంది వున్నారు తెలుసా?” అని లేచి, “ఎపుడైతే నువ్వు ఏదైనా కొంచెం తినగలుగుతావో అపుడు డిశ్చార్జ్ చేస్తాము. నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు.” వెళ్ళబోతుంటే, “మరి మళ్ళీ నొప్పి వస్తే ఏం చేయాలి?” అన్నాను కొంచెం విసుగ్గా.

          “మళ్ళీ వస్తే ఇక్కడికి రా… మేము తగ్గేవరకు బాగా చూసుకుంటాం. తగ్గాక మళ్ళీ పంపించేస్తాము.” అన్నాడు నవ్వుతూ.

          “అంతే కానీ దీనికి ఏ పరిష్కారం లేదా? నేనిలా భయంకరమైన నొప్పితో బాధ పడవల్సిందేనా.” అన్నాను కొంచెం కోపంగా.

          “కమాన్! కామ్ డౌన్. రేపొచ్చి చూస్తాను. నీకు బావుంటే ఇంటికెళ్ళొచ్చు!” అని వెళ్ళిపోయాడు డాక్టర్ డేవిడ్.

          పిచ్చి కోపం వచ్చింది..బాధ… చిరాకు..  ఎక్కడ లేని నిరాశ, నిస్పృహలు ఆవరించాయి మనసుని. కర్టెన్ తన వైపుది పూర్తిగా మూసింది ఎవరన్నా బయటి నుండి వచ్చినా కనిపించకుండా! దిండులో తల దాచుకుని వెక్కెక్కి ఏడవడం మొదలు పెట్టింది.

          ఈ  అతి భయంకరమైన నొప్పి, ఎక్స్ క్రుషియేటింగ్ ( excruciating pain) పేయిన్ ని జీవితాంతం భరించాలని చెబుతున్నాడీ మహానుభావుడు.

          తను డాక్టర్ రిచర్డ్ పేషంట్. కానీ గ్యాస్ట్రోఎంటరాలజీ డిపార్ట్మెంట్ లో ఉన్న డాక్టర్ లు అందరూ చూస్తుంటారు. డాక్టర్ రిచర్డ్ ఈ వారం ఆయన ప్రొసీజర్స్ చేస్తున్నారు, అంటే ఈ.ఆర్.సి.పి, కోలనాస్కపి, ఫీడింగ్ ట్యూబ్స్ అవసరమైన పేషంట్స్ కి అవి పెట్టడం లాంటివి చేస్తారు. అలాంటపుడు ఆయన తన కన్సల్టేషన్ పేషంట్స్ ని కొన్ని గంటలు చూసి, ప్రొసీజర్స్ అయ్యాక ఇంటికి వెళ్తారు. హాస్పిటల్ లో వున్న ఆయన పేషంట్స్ ని ఆ వారం డ్యూటీ వున్న వారు చూస్తారు. 

          నర్సులు డ్యూటీలు మారారు. జూన్ 3 నుండి సాయంత్రం 7 వరకుంటుంది.

          “హాయ్! మై డియర్ బ్యూటిఫుల్ లేడీ. హౌ ఆర్యూ డూయింగ్ టుడే? ఈ రోజు లిక్విడ్ డైట్ ఇచ్చారట? ఎలా వుంది తీసుకున్న తర్వాత?” అని అడిగింది. ఐ.వి బ్యాగ్ మారుస్తూనే.

          నాకేం జవాబు చెప్పడానికి రాలేదు. ఇంకా ఏడుస్తూనే వున్నాను. కళ్ళు తుడుచు కుని లేచి కూర్చుంటుంటే చూసింది జూన్. ఆమె వయసు దాదాపు 70 ఏళ్ళుంటుంది.

          చాలా హుషారుగా వుంటుంది, పేషంట్స్ మూడ్స్ ని ఇట్టే పట్టేస్తుంది.

          ఐ.వి బ్యాగ్ పెట్టడం అయిపోయింది. కుర్చీ ముందుకు జరుపుకుని కూర్చుంది.

          “ఏమయ్యింది? పిల్లలు గుర్తొచ్చారా? నొప్పెక్కువగా వుందా? అరే వుండు నీతో ఒకటి షేర్ చేసుకోవాలి. అది చూస్తే నువ్వు వెంటనే నవ్వేస్తావు..,” అని తన నర్స్ కోట్ జేబు లో నుండి ఒక చిన్న కవర్, అందులో నుండి ఒక ఫోటో తీసి నా చేతిలో పెట్టింది. ఒక ప్లాస్టిక్ బుట్టనిండా మడత పెట్టిన బట్టలు, ల్యాండ్రీ బుట్ట అది. ఆ బట్టల పైన ఎనిమిది, తొమ్మిది నెలల ముద్దొచ్చే పాప నవ్వుతూ కూర్చుంది, మడత పెట్టినవి తీసి బయట పడేస్తుంది నవ్వులొలకబోస్తూ…

          అప్పటిదాక ఏడుస్తున్న నేను ఆ పాప అల్లరి పని చూసి నవ్వేసాను.

          “హమ్మయ్య! నవ్వేసావా? మహా అల్లరి గడుగ్గాయనుకో మా మనవరాలు. బట్టలు ఇలా మడతలు పెట్టడం ఏంటి అలా వచ్చేసి అన్నీ పీకేస్తుందనుకో… వాళ్ళ అమ్మని అస్సలు ఊపిరి పీల్చుకోనివ్వదు. రేపు నేను వెళ్ళి ఇద్దరు మనవరాళ్ళని చూసుకుంటున్నాను. నా కూతురి బర్త్ డే రేపు. మా అల్లుడు బయటకు తీసుకెళ్తానంటే ఇది ఇంట్లోనే అందరితో చేసుకుందాం అంటుంది. అంటే నేను చెప్పాను. పొద్దున్న అందరం కలసి ఇంట్లో చేసుకుందాం. సాయంత్రం మీరిద్దరూ కాసేపు బయటకు వెళ్ళి రండి. కాస్త రిలాక్స్ గా వుంటుందని. సరే అంది.”

          ” ముద్దుగా వుంది మీ మనవరాలు జూన్.” అన్నాను.

          “థ్యాంక్స్. ఇపుడు చెప్పు నువ్వెందుకు బాధ పడ్తున్నావు?”

          “ఇందాక డాక్టర్ డేవిడ్ వచ్చి వెళ్ళారు. ఈ జబ్బు ఇంక తగ్గదు. ఇలాగే నొప్పితో బాధ పడ్తూ ఎంతో మంది జీవితాంతం మందులు, ఎంజైమ్స్, కొంత మందికి ఫీడింగ్ ట్యూబ్స్ తో బ్రతుకుతారు అని చెప్పారు. ఎలా బ్రతకాలి జూన్? ఇంత నొప్పితో, పిల్లల్ని ఎలా చూసుకోవాలి? వాళ్ళతో సంతోషంగా వుండగలనా? నా వల్ల కావటం లేదు. పాప పుట్టక ముందు  ప్రెగ్నెన్సీ గురించి అడిగితే ఏం పర్వాలేదు, ఒకోసారి డెలివరీ తర్వాత తగ్గిపోతుంది, అన్నారు. ఇప్పుడేమో ఎప్పటికీ ఇలాగే ఉండాల్సి వస్తుందంటున్నారు? నాకు చాలా భయంగా వుంది జూన్!” అని జూన్ ని పట్టుకొని ఏడ్చేసాను.

          “అలా చెప్పాడా డాక్టర్ డేవిడ్! ఎవరైనా బాధపడ్తున్న పేషంట్ తో అలా మాట్లాడతారా? వెళ్ళిపోయుంటాడు ఇపుడు. నేను ఫోన్ చేసి కడిగి పారేస్తానుండు. ఫోన్ చేసి వస్తాను ఇపుడే,” అని వెళ్ళబోయింది.

          “వద్దు జూన్. నేను నీకు కంప్లేయింట్ చేసాననుకుంటారు. నాకిష్టం లేదు, రెండ్రోజుల్లో డాక్టర్ రిచర్డ్ వస్తారు కదా! ఆయనతో మాట్లాడతాను.”

          “ఎవరైనా సరే పేషంట్ కి ధైర్యం చెప్పాలి కానీ భయపెడతారా?’

          “ఆయన ఉన్న సమాచారం ఇస్తున్నాననుకున్నారేమో?”

          ” తను మాట్లాడింది తప్పు. ఇదొకటే హాస్పిటల్ కాదు అమెరికా మొత్తానికి. ఇది ఒక చిన్న హాస్పిటల్. ఇక్కడ మంచి ట్రీట్మెంట్స్ ఇస్తారు. కానీ ఇక్కడ యూనివర్సిటీ హాస్పిటల్స్ లో ఉన్నన్ని అడ్వాన్సడ్ ఇక్విప్మెంట్ లేవు, స్పెషలిస్టులు లేరు. మీరు ఫిలడెల్ఫియాకి వెళ్తే చాలా పెద్ద హాస్పిటల్స్ వున్నాయి. అక్కడ ట్రీట్మెంట్స్ వేరేగా వుంటాయి. ఇక్కడ అలాంటివి లేవు. మేము ఎంతో మంది పేషంట్స్ ని ఆ పెద్ద హాస్పిటల్స్ కి టెస్టులు, ప్రొసీజర్స్, సర్జరీల కోసం పంపిస్తూ వుంటాము. నీ ట్రీట్మంట్ ఇక్కడే ఆగిపోలేదు. డాక్టర్ డేవిడ్ ఎందుకు అలా చెప్పారో తెలీదు. కానీ నువ్విప్పుడే ఆశలన్నీ వదిలేసి కూర్చోనక్కరలేదు. రేపు వస్తాడు కదా! ఆయనే ఇవన్నీ చెబుతాడు నేను తనకి ఒక క్లాస్ పీకాక. నువ్వేమి కంగారు పడకు. నువ్వున్నది ఒక చిన్న హాస్పిటల్ లో, ఇదీ మంచి హాస్పిటలే. కాదనను. నీకు 8వ నెలలోనే నొప్పులొస్తే బెడ్ రెస్ట్ మీద ఉంచి ప్రతి రోజు చెక్ చేస్తూ బాగా చూసుకున్నారు కదా! 4 పౌండ్లు పుట్టాల్సిన పిల్లని నీ కడుపులోనే ఉంచి మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు కాబట్టి నార్మల్ బరువుతో, ఆరోగ్యంగా పుట్టిందా, లేదా?

          నీకొచ్చే నొప్పి గురించి ఇంకా పరీక్షలు చేసి ఏం చేయాలో నిర్ణయిస్తారు పెద్ద పెద్ద స్పెషలిస్టులు. సరేనా! ఏ ఆలోచనలు పెట్టుకోకు. ఏదో ఒక దారి వుంటుంది సరేనా! నేనెళ్తాను మీ పక్క పేషంట్ ని కూడా చూసి వెళ్తాను. నీకేదన్నా కావాలంటే పిలువమ్మా!” అని ప్రక్క పేషంట్ వైపెళ్ళింది.

          ఆ రోజంతా ఢల్ గానే గడిపింది. మధ్యాహ్నం కాసేపు నిద్రపోయింది. గట్టిగా నవ్వులు, అరుపులు వినపడడంతో గబుక్కున లేచింది.

          ప్రక్క పేషంట్ ని చూడడానికి చాలా మంది వచ్చారు. అందరూ తింటూ, జోక్స్ చెప్పుకుంటూ గోల గోల చేస్తున్నారు. లేచి బయట హాల్లో వాక్ చేయడానికి వెళ్ళింది. బయట నర్సులు, టెక్ లు చూసి పలకరిస్తుంటారు. ఖాళీగా వుంటే కాసేపు మాట్లాడతారు. బిజీగా వుంటే హాల్ చివరన ఉండే గ్లాస్ కిటికీలో నుండి బయటకు చూస్తుంది. హాస్పిటల్ చుట్టూ పచ్చటి చెట్లుంటాయి. ఇది చలి కాలం కాబట్టి ఆకులు రాలిపోయి చెట్లు ఖాళీగా వున్నా వాటి పైన లైట్ గా స్నో పడి అందంగా కనిపిస్తుంటాయి. ఆకులు రాలకముందు రంగులు మారినపుడు చూడటానికి చాలా అందంగా వుంటాయి. వచ్చిన కొత్తలో ఫాల్ సీజన్ లో ఆకులు రంగులు మారుతుంటే ప్రకృతిలో ఇన్నిరంగులుంటాయా? అనిపించేది. జబ్బు చేయక ముందు చైతుని స్కూల్ బస్ స్టాప్ కి తీసుకెళ్ళి వాడు బస్ వచ్చాక వెళ్ళిపోయాక ఆ చుట్టు ప్రక్కల వాక్ చేసేదాన్ని. పెద్ద పెద్ద మేపుల్ (Maple Trees) చెట్లు వాటి ఆకులు ఎర్రటి ఆపిల్ రంగులోకి మారినపుడు చాలా బావుంటాయి. ఫాల్ సీజన్ నుండి ఎండలో వేడి తగ్గిపోయి చలి మెల్లి మెల్లిగా పెరుగుతుంటుంది. దానివల్ల సూర్యుని వేడి తగ్గిపోయి ఆకులకు కావాల్సిన క్లోరోఫిల్ తగ్గిపోవడం వల్ల రక రకాల రంగుల్లోకి మారి రాలిపోవడం జరుగుతుంది. ప్రొద్దున్నే పొగమంచులో చైతుని స్కూల్ బస్ స్టాప్ కి తీసుకెళ్తుంటే హిల్ స్టేషన్ లో ఉన్నట్టుగా అనిపించేది. అపార్ట్మెంట్ ప్రక్క నుండి ట్రెయిన్స్ వెళ్తుంటాయి. అపార్ట్మెంట్స్ నుండి అటు వైపు వెళ్తే స్టేషన్,చిన్న బ్రిడ్జ్, స్టేషన్ దగ్గర రక రకాల గులాబీ పూల మొక్కలుంటాయి. బస్ స్టాప్ లో ఒక చెక్క బెంచీ వుంటుంది. ఒకోసారి బస్ వెళ్ళిపోయాక అక్కడ కూర్చొని వచ్చి పోయే లోకల్ ట్రెయిన్స్ ని చూస్తుంటే మంచి చిత్రకారుడు వేసిన చిత్రం చూస్తున్నట్టుగా వుండేది.  ఆకులున్నపుడు వీపింగ్ విల్లోస్ ( Weeping Willows Trees) చెట్ల మధ్య నుండి ట్రెయిన్స్ ని చూస్తే ప్రముఖ చిత్రకారుడు మోనే ( Monet) బ్రిడ్జ్ చిత్రం, స్నో పడినపుడు, స్నోలో వెళ్తున్న ట్రెయిన్ పేయింటింగ్స్ చూస్తున్నట్టుగా అనిపించేది.

          హాస్పిటల్ లో కిటికీ దగ్గర నిల్చొని బయటకు చూస్తే సమయమే తెలియదు నాకు. వలస వెళ్ళే పక్షులు గుంపులు గుంపులుగా వెళ్తుంటే ఎంత సేపు చూసినా అలసట రాదు. ఒకోసారి పక్షులు చెట్లమీద, ఎలక్ట్రిక్ తీగల మీద కూర్చొని రెస్ట్  తీసు కుంటుంటాయి. సాయంత్రం పూట సూర్యాస్తమయం చాలా బాగా కనిపిస్తుంది ఆ కిటికీ నుండి.  కాసేపు కిటికీ దగ్గర ఐ.వి పోల్ పట్టుకుని నిల్చుని బయటకు చూసి రూంకి వచ్చింది. పక్క పేషంట్ దగ్గరకు వచ్చినవాళ్ళు వెళ్ళిపోయారు.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.