నారి సారించిన నవల-35

                      -కాత్యాయనీ విద్మహే

          రాజీ లండన్ లో ఉన్న ఆరునెలల కాలంలోనే భారతదేశంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అది 1975 జూన్ 25. ఎమర్జన్సీ కాలంలోనే ఆమె లండన్ నుండి తిరిగి వచ్చింది. విమానాశ్రయంలో దిగేసరికి విపరీతమయిన ఒళ్ళు నొప్పులు, జ్వరం. అక్కడ ఎదురుపడ్డ కరుణాకర్ ఆమె పరిస్థితి గమనించి టాక్సీ లో ఇంటి వరకు తీసుకువచ్చి స్పృహ కోల్పోయిన ఆమెకు అవసరమైన వైద్యం చేయించాడు. రాజీకి. రవికాంత్  ద్వారా పరిచయమైనవాడు కరుణాకర్.

          రవికాంత్ పార్లమెంట్ రాజకీయాలలో ఉన్న వ్యక్తి. మంత్రి అవునో కాదో కానీ మంత్రులతో కలిసి  విధానాలు రూపొందించే  చర్చలు చేయగల పదవిలో ఉన్నాడు అని కథాక్రమంలో తెలుస్తుంది. కథా ప్రారంభానికి నాలుగేళ్ల క్రితం, అంటే ఢిల్లీ ఉద్యోగంలోకి రాకముందే అతను ఆమెను చూసాడు. ఆమె పాటను విని ఆనందించాడు. ఆమె గురించి వివరాలు మామయ్యను అడిగి తెలుసుకొన్నాడు. ఆమెతో పరిచయం ఆశించాడు. కానీ చొరవ చేయలేకపోయాడు. ఢిల్లీలో రాజీ  ఆచూకీ తెలిసి పరిచయం చేసుకొని ఆమె పట్ల తనకున్న అభిమానాన్నిచెప్పుకొన్నాడు. వాళ్ళిద్దరి సంభాషణల వల్ల అతను ఆమె మామయ్యతో పాటు కొంతకాలం సర్వోదయ ఉద్యమంలో పని చేసాడు, అంతకు ముందు కొంతకాలం కలిసి చదువుకున్నాడు కూడా అని తెలుస్తుంది. అతనే ఒక రోజు ఉదయం కరుణాకర్ ను రాజీ ఇంటికి తీసుకువచ్చాడు. మద్రాస్ లో కలిసి చదువుకొన్నామని, సోషలిజం గురించి కలలు కన్నామని, వాళ్ళ మామయ్యకు కూడా తెలుసనీ పరిచయం చేసాడు. అసెంబ్లీ లో మంత్రులకు నిద్ర లేకుండా చేయగల  తీవ్ర విమర్శను  పెట్టె ప్రతిపక్షం ప్రతినిధిగా కూడా పరిచయం చేస్తాడు. ఆ పరిచయం తో రాజీ అతనిని తీవ్ర రాజకీయ వాది అనుకొన్నది. కళా కారుల్ని , ఊహా లోకాల్లో ఊరేగే వాళ్ళనే ఎప్పుడూ చూసీ చూసీ విసుగెత్తిన రాజీకి  యధార్ధంలో బతుకుతున్న మనిషిగా కరుణాకర్ పట్ల అభిమానం  కలిగింది. అతని గురించి గౌరవంగా అనంత్ కు చెప్పింది కూడా.

          ఆ తరువాత కొద్దరోజులకే కరుణాకర్ తో ఉన్న సంబంధాల గురించి ఆరా తీయటానికి పోలీసులు రావటం, విచారణ పేరు మీద వేధించటం, ఉద్యోగంలో ఆమె పై నిఘా పెట్టటం,  కరుణాకర్ తో పరిచయం గురించి ఆమె చెప్పిన వాస్తవాలకు పెడచెవి పెట్టి  తమ కథనం ఏదో వ్రాసుకొని ఆమె సంతకం ఫోర్జరీ చేయటం, ఆమెకు గర్భనిరోధక ఆపరేషన్ చేయించటం, కొన్నాళ్ళు జైలులో పెట్టటం వంటి పరిణామాలు సంభవించాయి. విశ్వవిద్యాలయ విద్యార్థులను, తదితర యువతీ యువకులను  ఎమర్జన్సీ పేరుమీద జైళ్లలో పెట్టి తీవ్రంగా హింసించటం చూస్తూ, బాధను తట్టుకోలేక వాళ్ళు పెట్టె కేకలు వింటూ వేదన పడుతూ కూడా రోజులు నెట్టుకు రావటం  ఆమె వంతు అయింది.

          ఈ విధమైన ఎమర్జన్సీ కాలపు  రాజీ అనుభవం స్నేహలతారెడ్డి అనుభవాన్ని గుర్తుకు తెస్తుంది. బరోడా డైనమెట్ కేసుతో సంబంధం ఉన్నదన్న అనుమానంతో ఎమర్జన్సీ కాలంలో ఎనిమిది నెలలకు పైగా జైలు నిర్బంధానికి గురైన కన్నడ , తెలుగు సినిమా నాటక రంగాల కళాకారిణి స్నేహలతారెడ్డి. స్నేహలతారెడ్డి అరెస్టుకు  కారణం  జార్జ్ ఫెర్నాండజ్ తో ఆమెకు వున్న స్నేహం. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించిన వెంటనే అరెస్ట్ చేయదలచుకున్న వాళ్లలో  జార్జ్ మాత్యు ఫెర్నాండజ్ ఉన్నాడు. అరెస్టు తప్పించుకొనటానికి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన ఆచూకీ రాబట్టటానికి  స్నేహలతారెడ్డిని 1976 మే 2 న  అరెస్టు చేశారు. నవలలో రాజీని అరెస్టు చేసింది కూడా  కరుణాకర్ తో పరిచయం ఉందని, అతని జాడ ఆమె వల్ల రాబట్టాలనే. ఆ రకంగా చూస్తే కరుణాకర్ జార్జ్ ఫెర్నాండస్ కు నమూనా అనుకోవచ్చు.   1974 లో ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ అధ్యక్షుడుగా ఉన్న కాలంలో మే 8 నుండి 27 వరకు గొప్ప రైల్వే సమ్మెకు ఫెర్నాండజ్ నాయకత్వం వహించాడు. ఇందిరాగాంధీ ప్రభుత్వం దానిని అణచివేసింది.

          రాజీ సమక్షంలో రవికాంత్ కు కరుణాకర్ కు మధ్య జరిగిన సంభాషణ లో   ప్ప్రతి పక్షానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అతన్ని ఉద్దేశించి రవి కాంత్  అప్పుడు జరుగుతున్న  రైల్వే  స్ట్రయిక్, రోడ్డు రవాణా స్ట్రయిక్ మొదలైన వాటితో ప్రతిపక్షం అధికారపక్షాన్ని శాంతిగా బతకనియ్యటం లేదని ఆరోపణగా మాట్లాడతాడు. రైల్వే స్ట్రైక్ ప్రస్తావన 1974 నాటి సమకాలీన చరిత్ర వ్యవహారమే. కుర్చీలలో కూర్చుని డబ్బు చేసుకోవడమే ప్రధనాశయంగా ప్రభుత్వం ప్రవర్తిస్తున్నప్పుడు అలా జరగటం అనివార్యమని కరుణాకర్ వాదన. సమ్మెలు చేయించకుండా అసంబ్లీలో, పార్లమెంటులో ప్రశ్నలు వేసి పాలక పార్టీ తప్పులు సరిదిద్దవచ్చుగా అని రవికాంత్ అంటే తప్పులు చేస్తున్నామన్న స్పృహలోనే లేనివాళ్లకు, అధికారబలం నెత్తికెక్కి, దేశాన్ని స్వంత ఆస్తిగా ప్రజలను బానిసలుగా  భావించే పాలక పార్టీకి ప్రతిపక్షం వేసే ప్రశ్నలు లెక్కలేనప్పుడు అసంతృప్త వర్గాలు అలజడులకు దిగక తప్పదని కరుణాకర్ సమాధానం.

          నవలలోని ఈ సంభాషణ ఇందిరాగాంధీ ఎమర్జన్సీ ప్రకటించటానికి ముందర ప్రజలలో పెరుగుతున్న సామాజిక ఆర్ధిక రాజకీయ అసంతృప్తుల ప్రతిఫలం. ప్రజల అవసరాలకు, స్వరానికి ప్రాతినిధ్యం వహించిన ప్రతిపక్షం ఆగ్రహం. దానిని సహించ లేకనే  ఎమర్జన్సీ. భిన్నాభిప్రాయాలను అణచివేయటం. అరెస్టులు, నిర్బంధాలు. ఆ క్రమంలోనే ఫెర్నాండజ్  అరెస్టును తప్పించు కొనటానికి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.  విమానాశ్రయంలో ఎదురుపడిన రాజీని ఇల్లు చేర్చి చికిత్స చేయించిన  సమయంలో కరుణాకర్ ఆమె రేప్ కు గురైన విషయాన్ని గుర్తించి లేడీ డాక్టర్ ను తీసుకొచ్చి చూపించాలని అనుకొన్నప్పుడు ఆమె ఆ సంగతి మరెవరికి తెలియటం ఇష్టం లేదని వారిస్తే తెలిసి డాక్టర్ దంపతుల  దగ్గరకు వెళ్లి అవసరమైన మందులు, పరికరాలు తెస్తానని చెప్తూ ఆమె అనుమానం తీర్చటానికి అన్నట్లు వాళ్ళు వివరాలు అడగరు, అజ్ఞాతవాసంలో ఉన్న శిష్యులకు చికిత్స చూస్తుంటానని వాళ్లకు తెలుసు అంటాడు. ఈ మాటలు    కరుణాకర్   రహస్య జీవిత సంబంధాలలో ఉన్నట్లు సూచిస్తూనే ఉన్నాయి. ఆ రకంగా అతను ఫెర్నాండజ్ కు నమూనా అవుతున్నాడు. అతని ఆచూకీ కనిపెట్టటానికి  స్నేహితురాలు స్నేహలతారెడ్డి మీసా కింద నిర్బంధానికి   గురి అయినట్లుగానే  కరుణాకర్ గురించి రాజీ విచారణకు నిర్బంధానికి  గురైంది. రవికాంత్ ప్రయత్నాలు ఫలించి కరుణాకర్, మామయ్య , దుర్గాబెన్ ల అరెస్టు తరువాత రాజీ విడుదల అయినట్లు కథ నడిపిన తీరు ఫెర్నాండజ్ అరెస్టు (10 జూన్ 1976) తరువాత స్నేహలతారెడ్డి పెరోల్ మీద విడుదల ( 15 జనవరి 1977) అయిన విషయాన్ని దృష్టిలో పెట్టుకునే చేసినట్లు  అనిపిస్తుంది.

          ఈ నవలలో అధికార పక్షపు రవికాంత్ అయినా, ప్రతిపక్షపు కరుణాకర్ అయినా, రాజకీయాలతో సంబంధం లేకుండా తనపని తన ఆశయాల మేరకు చేసుకొంటూ పొయ్యే రాజీ మేనమామ అయినా సర్వోదయ ఉద్యమంతో సంబంధం ఉన్నవాళ్లు గా నవలలో తరచు ప్రస్తావించబడుతూ వచ్చింది.  1950వ దశకంలో గాంధీకి ఆధ్యాత్మిక శిష్యుడు అయిన వినోబాభావే సర్వోదయ ఉద్యమాన్ని నడిపాడు. సమానత్వం అందరికీ చేరువ కావాలన్నది ఆశయం. శాంతియుత సహకార పద్ధతిలో గ్రామీణ ప్రజల సముద్ధరణ జరగాలని ఆకాంక్ష. అందరికీ అవకాశాలు, వనరులలో వాటా ఆచరణ వాస్తవం చేయటానికి చేపట్టిన కార్యక్రమాలలో భూదానోద్యమం ఒకటి. ఎమర్జన్సీ కి వ్యతిరేకంగా ‘సంపూర్ణ విప్లవం’ నినాదంగా  ప్రజాఉద్యమాన్ని నిర్మించటంలో క్రియాశీల పాత్ర వహించిన జయప్రకాశ్ నారాయణ్  సర్వోదయ ఉద్యమంలో పనిచేసినవాడే.  1966 లో ప్రధాని అయిన దగ్గర నుండి  కేంద్రీకృత అధికారం దిశగా ఇందిరాగాంధీ  అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షంలో  ప్రారంభమైన అసంతృప్తి, నిరసన 1974 నాటికి ‘సంపూర్ణ విప్లవం’గా ప్రకటితం అయింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల కొరత వంటి సమస్యలకు ప్రభుత్వంలో పేరుకుపోయిన అవినీతి, లంచగొండితనం, అధికార ధనదాహాలకు ఉన్న సంబంధం అర్ధం అవుతూ జయప్రకాశ్ నారాయణ్ సంపూర్ణ విప్లవానికి  పిలుపును ఇచ్చాడు.  రాజీ మేనమామ లో అప్పుడప్పుడు జయప్రకాష్ నారాయణ్ పోలికలు స్ఫురిస్తాయి.

          ఎమర్జన్సీ కాలపు 20 సూత్రాల పథకం ఇతివృత్తంలో భాగంగా ప్రస్తావనకు వస్తుంది. పేదరికాన్ని అంతమొందించటం లక్ష్యంగా వ్యవసాయ అభివృద్ధికి సంబంధించి, ప్రత్యేకంగా మహిళలు దళితులు , ఆదివాసీల అభివృద్ధిని ఆశిస్తూ చేసిన సూత్రాలు ఇవి. ప్రభుత్వం వీటి ప్రచారానికి  సాంస్కృతిక సమాచార శాఖలను వాడుకున్న తీరు రాజీ అనుభవముఖంగా ఈ నవలలో భాగమయింది.  20 సూత్రాల పథకం పై పాటలు వ్రాయించి రూపకాలుగా ప్రదర్శించే బృందంతో ఆమెను గ్రామీణ ప్రాంతాలకు పర్యటనలకు పంపారు. కుటుంబ నియంత్రణ గురించి చెప్పటానికే వాళ్ళు వచ్చారని , ముందస్తు సమాచారమైనా లేకుండా బలవంతాన గర్భ నియంత్రణ ఆపరేషన్లు చేసేస్తున్నారని , ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారని ఆ పర్యటనలో రాజీకి తెలిసివస్తుంది. వెట్టి వంటి సమస్యలు ఏవీ తీరలేదు అన్న అసంతృప్తి  పోలీసులు ఎదిగివస్తున్న పిల్లలను ఎత్తుకువెళ్లారన్న తల్లిదండ్రుల గోడును  తెలుసుకొన్న రాజీ మనసు వికలమైంది. కరుణాకర్  ఆచూకీ కోసం నిర్బంధించి వేధించిన  పోలీసులు తనకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా చేయించటం రాజీ అనుభవ విషయమే.

          ఈ విధంగా  అనేకానేక మంది యువతను  అనుమానితులను చేసి వేధించిన ఎమర్జన్సీ కాలపు పాలకవర్గపు తీరును రాజీ  అనుభవ కథనంగా నవలలో భాగం చేసి  రమాదేవి సమకాలపు రాజకీయ చరిత్రను తనదైన కోణం నుండి నమోదు చేసి నట్లయింది. ఎమర్జన్సీ ఎత్తివేయటం , తరువాతి ఎన్నికలు , కాంగ్రెస్ ను ఓడించి ప్రతిపక్ష కూటమి గెలవటాన్ని సూచించటంతో రాజీ నవల ముగుస్తుంది.

*****

(ఇంకా వుంది) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.