“నెచ్చెలి”మాట 

పాజిటివ్ x నెగిటివ్

-డా|| కె.గీత 

ఎనర్జీలు ఎన్ని రకాలు?
రెండు-
పాజిటివ్
నెగటివ్
ఇంతేనా?
కాదు కాదు మూడు-
పాజిటివ్
నెగటివ్
న్యూట్రల్
మొదటిది నెగటివ్ ని కూడా పాజిటివ్ గా చూడడం
రెండోది పాజిటివ్ ని కూడా నెగటివ్ గా చూడడం
మూడోది రెంటికీ మధ్యలో ఊగిసలాడుతూ
అటో ఇటో తూగుతూ ఉండడం
అన్నట్టు నాలుగు, అయిదు, ఆరు, ఏడు కూడా
ఉన్నాయండోయ్…
నెగటివ్
నెగటివ్
నెగటివ్
నెగటివ్….
అదేవిటి?!
ముందే చెప్పేసేంగా

ఆగండాగండి
పాజిటివ్ ని నెగటివ్ గా
ఆపాదించ గలిగిన వారుండగా
తిమ్మిని బమ్మిగా మార్చగలిగిన వారుండగా
తామొక్కరూ పాజిటివ్ అంతా నెగటివ్ అనుకునేవారుండగా
పైకి పాజిటివ్ ఉపన్యాసాలిస్తూ
లోపల్లోపల గోతులుతీసే
నెగటివ్ ఆలోచనలున్నవారుండగా

ఏడేం ఖర్మ
ఎన్నయినా
పుట్టుకొస్తాయి
…..
అమ్మబాబోయ్
చాలు చాలు
ఈ నెగటివ్ గోల
ఈ రోజు ఏ నెగిటివ్ ముఖాన్ని
చూశానో అద్దంలో –
….

మరి నెగటివిటీని
అరికట్టుట ఎట్లు?
మూర్ఖుల ఆటకట్టించుట ఎట్లు?
గోతులు పూడ్చుట ఎట్లు?
……
హయ్యో
రాజ్యకాంక్ష ముదిరిన
దేశాల్ని ఆపగలమా?
విద్వేషాల్ని ఎగదోస్తున్న
రాజ్యాల్ని ఆపగలమా?
పిచ్చి ముదిరి రోకలి తలకు చుట్టమన్న
నాయకుల్ని ఆపగలమా?
వయసు మీరుతున్న కొలదీ
బుద్ధి వంకర పోయే
బుద్ధి(లేని)జీవుల్ని ఆపగలమా?
…..
అయినా నెగిటివ్ ల పిచ్చి గానీ
తల గోడకేసి కొట్టుకుంటే దెబ్బ తగిలేది ఎవరికి?
ఒక వేలు ఎదుటికి చూపిస్తే నాలుగు వేళ్ళు చూపించేది ఎవరిని?
చుట్టూ గోతులు తవ్వుకుంటే పడేది ఎవరు?
……
మరి
నెగటివిటీని పారద్రోలే
చిట్కాలేవన్నా ఉన్నాయా?

వస్తున్నా
అక్కడికే వస్తున్నా-
నెగటివ్ లని చెప్పుకింద తొక్కి పెట్టగలిగిన
పాజిటివిటీ
దివిటీతోనే వస్తున్నా-


మనల్ని చుట్టుకుంటున్న
ముళ్ల తీగల మధ్యే
గులాబీలు పూయించడం-
మీదికొస్తున్న రాళ్లతోనే
నివాసం నిర్మించుకోవడం-
ముంచేసే కెరటాన్నే
జీవజలంగా
మార్చుకోవడం-

ఏదేమైనా నెగటివ్ ని
“ఎప్పుడూ”
పాజిటివ్ గా మాత్రమే చూడడం –

అన్నిటినీ మించి
అసలు నెగటివిటీని గురించి
కలనైనా తలవక పోవడం
…..
అన్నట్టు
ఎనర్జీ
ఏకవచనం మాత్రమే!
ఎప్పుడూ
పాజిటివ్ ఒక్కటే
నిజం!!
అదేనండీ
అప్పుడే మిగిలేది మరి
ఎనర్జీ!!

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

          ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే   రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటి పైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు. 

          మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.  

          వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి”లో  వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

ఆగస్టు, 2022 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు: విజయభాస్కర్

ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: బండి అనురాధ కథ ‘మేరీ’

ఇరువురికీ అభినందనలు!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.