‘అపరాజిత’ పై అవసరమైన చర్చలు చేద్దాం!

-కొండేపూడి నిర్మల

డా.కె.గీత ఇటీవల వెలువరించిన అపరాజిత స్త్రీవాద కవితా సంకలనంలో 93మంది కవయిత్రులు వెలువరించిన 168 కవితలు ఉన్నాయి. 85 నుంచి ఇప్పటి వరకు కూడా స్త్రీల కవితలు- స్త్రీవాద కవితలు మధ్య వున్న చిన్నసరిహద్దు గీత స్పష్టంగా ఎవరికీ అర్ధంకావడం లేదు. అపరాజితతో బాటూ, ఇంత క్రితం వచ్చిన గురిచూసి పాడే పాట , నీలిమేఘాలు సంకలన సందర్భాలు గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఈ గతం ప్రస్తావించకపోతే స్త్రీవాద , స్త్రీవాదేతర పదాలు అర్ధం కావడం కష్టం.

త్రిపురనేని శ్రీనివాస్ సంకలనం చేసిన “గురిచూసి పాడే పాట” పుస్తకం నాటికి, స్త్రీల కవిత్వం ఒక భిన్న వస్తువు మాత్రమే. అప్పటికి స్త్రీల పేర్లతో రాసిన పురుష రచయితలు వున్నారు. స్త్రీల సమస్యలే రాశారు. దీనివల్ల జరిగిన అన్యాయం ఏమిటంటే , స్త్రీలు రాసినా కానీ అది పురుషులు రాశారనే అభిప్రాయం బాహాటంగానే వినిపించేది. అసలు కవితా ప్రక్రియ అంటేనే అది పురుషుల చేతి వృత్తి గా వుండేది. కాబట్టే స్త్రీలు ఎవరు కవిత్వం చదివినా “వర్ణనీయ వస్తువే తిరగబడి వర్ణించింది” అనేవారు. ఒక వస్తువు మనిషి కావడానికి పట్టిన సమయం, ఆమె వ్యక్తీకరణని గుర్తించడానికి కూడా పట్టింది. ఈ దృక్పథాన్ని సవాలు చేస్తూనే స్త్రీలు రాశారు. కవితా వస్తువే కాక అభివ్యక్తిలో వున్న తీవ్రత, అనుభవాల సారం వీటివల్ల దానికి ఒక ప్రత్యేకత ఏర్పడింది .. అలా వచ్చిన వేర్వేరు కవితల స౦కలనమే “గురిచూసి పాడే పాట”. దీని సంపాదకుడు త్రిపురనేని శ్రీనివాస్. ఇది ఏక వ్యక్తి ప్రయత్నం కాబట్టి సంఖ్యా పరిమితి వుండచ్చు.

          “నీలిమేఘాలు” నాటికి వున్న చారిత్రక సందర్భం వేరు. అప్పటికి రాసేవారి సంఖ్య పెరిగింది. వస్తు వైవిధ్య౦ పెరిగింది. గృహిణిత్వం, మాతృత్వం, దాంపత్య ధర్మ ౦ లాంటి విలువల వెనక వున్న శ్రమని, గౌరవ రాహిత్యాన్ని, ద్వితీయ శ్రేణి పౌరసత్వాన్ని ఎండ గడుతూ రచనలు వచ్చాయి. ఇది భరించలేని కొందరు వీరిని “వొళ్ళు బలిసిన పట్టణ స్త్రీల” రచనలుగా తూలనాడారు. అభ్యుదయ, దిగంబర కవులు సైతం వివక్షకు గురి అయిన ఒక అస్తిత్వ వాదాన్ని గుర్తుపట్టడంలో చాలా వెనకబడ్డారు. స్త్రీవాదం విదేశాలలో వున్న ఫెమినిజం రూపం అని, పెట్టుబడిదారీ సంస్కృతి అని, దిగుమతి సాహిత్యం అని ఆడిపోసుకున్నారు. వాస్తవానికి అప్పటికి విదేశాలు వెళ్ళినవారు కానీ, విదేశీ సాహిత్యాన్ని వంటబట్టించుకున్నవారు కానీ లేనే లేరు. వారి కవిత్వం వారపత్రికల్లో వచ్చి౦ది కాబట్టి వార కవిత్వ౦, లైంగిక హింస గురించి రాశారు కాబట్టి నీలి కవిత్వం అంటూ పేర్లు పెట్టి వెటకరించారు. ఇందుకు ఇంకా పరాకాష్ట ఏమిటంటే కవయిత్రుల మీద బూతు కరపత్రం ఒకటి అచ్చువేసి చలం సభలో పంచిపెట్టారు. ఏ చలం అయితే స్త్రీలపై జరుగుతున్న అణచివేతని అసహ్యించుకున్నాడో ఆ సభలోనే అతని చిత్ర పటం సాక్షిగానే స్త్రీలమీద బూతులు కుమ్మరించిన సందర్భ౦ మరచిపోవడం కష్టం. అందులో వున్న భాషని, భావజాలాన్ని, ఆరోపణల్ని చదివినవాళ్ళు నిద్రపోలేరు. తక్షణమే సంఘటితం అవడం అవసరమని బాధిత స్త్రీలు అనుకున్నారు. ఎదిరించి నిలబడ్డారు, మరింత విస్తృతంగా రాశారు. ధిక్కార స్వరాల్ని ఎక్కుపెట్టారు.

          తమకు ఈ వేదికలు గౌరవప్రదంగా లేవు, అనుకున్నకవయిత్రులు కొందరు వెనక్కి దూరంగా వుండిపోయారు. తమను తాము ప్రత్యేక వర్గంగా భావించుకున్నారు, నేను స్త్రీవాదిని కాదు అని ప్రకటించుకుని రచనలు చేయడం ప్రారంభించారు. స్త్రీవాదం అంటే పురుషద్వేషం అనే భావనను వీరు సైతం అంగీకరించారు, రచనల్లోనూ వేదికల మీదా ప్రచారం చేశారు. స్త్రీ వాదేతర సాహిత్య కారులుగా కొన్ని సంపుటాలు తెచ్చారు. కొ౦దరికి “వాదం” అనే మాట నచ్చలేదు. స్త్రీల కవిత్వం అంటే చాలదా అనుకున్నారు. భార్యకు పేరెందుకు ? ‘ఏమే’ అంటాం కదా అన్నట్టుగా వుంది. ఇతర అస్తిత్వ ఉద్యమాల కు లేని విచిత్ర అభ్యంతరాలన్నీ దీనికి రావడం గమనార్హం .

          ఎక్కడో ఒక సరిహద్దు రేఖ వారికి వీరికి మధ్య అగడ్తలా నిలిచింది. ఈ చీలిక మళ్ళీ ప్రధాన స్రవంతికి బాగా ఉపయోగపడింది. సంప్రదాయ భావజాలం వున్న కవయిత్రుల్ని సన్మానించి, భావ తీవ్రత వున్నవారినందర్నీ అది దూరం పెట్టగలిగింది. నీలిమేఘాలు ఈ మొత్తం చరిత్రని రికార్డు చేసింది.

          నలభై ఏళ్లు గడిచిపోయిన ఇప్పటి వర్తమాన భూమిక అంటే ‘అపరాజిత స్త్రీవాద సంకలనం’ నాటికి వున్న సామాజికత ఇంకా భిన్నమైనది. ఇప్పుడు అసలు స్త్రీలే కాకుండా పురుషులు కూడా విరివిగా స్త్రీల గురించిన సాహిత్యం రాస్తున్నారు. పూర్వం రాసిన సంపుటాలలోంచి స్త్రీల గురించి రాసినవి తీసి ప్రత్యేకంగా ముద్రించు కుంటున్నారు. తనని తాను ఫెమినిస్ట్ గా చెప్పుకోవడానికి ఇష్టపడుతున్న పురుషులు వున్నారు. స్త్రీవాదం ప్రధాన స్రవంతి లోకి చేరింది . సాహిత్యంలోనే కాదు సామాజిక కార్యక్షే త్రాలు అయిన ప్రభుత్వ ప్రభుత్వేతర రంగాలలో జండర్ సెన్సిటీవీ బోధన జరుగుతోంది , విశ్వవిద్యాలయాల్లో జండర్ స్టడీస్ వున్నాయి . జండర్ రిసోర్స్ గ్రూప్స్ అవసరం అయ్యారు. స్త్రీలను కించపరచే భాష, భావజాలం అందరూ గుర్తుపట్ట గలుగు తున్నారు .

          ఇది వెలుతురు మాత్రమే కనిపించే ఒక కోణం మాత్రమే. ఇంకో వైపు భరించలేని చీకటి కూడా పొంచి వుంది. అదేమిటంటే రాజ్య౦లో ప్రజాస్వామ్య లక్షణాలు పోయి మతస్వామ్య శక్తిగా మారిపోయింది . అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ మతానికి బలవుతున్నది స్త్రీలు, దళితులు, మైనారిటీలే కాబట్టి వారి సాహిత్యం ప్రమాదకరం అయిపోతోంది. ఏ మాత్రం ప్రశ్న వేసినా దాడులకి, సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురి అవుతున్నారు. ఈమధ్యనే దీని గురించి మేము అంతర్జాలవేదిక మీద మాట్లాడుకున్నాం. అందరినీ కలుపుకుపోయే ఐక్య కార్యాచరణ లిఖించుకోవాల్సి వుంది . ఇంత జరిగాక ఇప్పుడు ఎవరు నిజ స్త్రీవాదులు , ఎవరు కాదు? అసలు స్త్రీవాద కవిత్వం గొప్పదా, స్త్రీల కవిత్వం గొప్పదా లాంటి ప్రశ్నలకు ప్రాసంగీకత లేదు. ఇది ఇప్పటి కవయిత్రులు అంగీకరించే విషయం అని నేను అనుకోవడం లేదు. గీత ఎంతో శ్రమ తీసుకుని ఇన్నేళ్ల తర్వాత ఒక మంచి ప్రయత్నం చేసింది. అందుకు ఆమెను అభినందిస్తున్నాను. “అపరాజిత” మీద అనవసరమైన చర్చలు మాని, అవసరమైన విషయాలు చర్చిద్దాం.

*****

Please follow and like us:

2 thoughts on “‘అపరాజిత’ పై అవసరమైన చర్చలు చేద్దాం!”

    1. దాదా గారూ! పుస్తకాల కోసం, ఇతర వివరాల కోసం ఇక్కడ ఇచ్చిన ఫోను నంబరుని సంప్రదించండి. *అపరాజిత పుస్తకాన్ని ఎవరైనా కొనుక్కోదలుచుకుంటే నెచ్చెలి ఇండియా ఫోను నంబరు (+917995733652) కి ఒక కాపీకి రూ.300 ఫోను పే ద్వారా గానీ, గూగుల్ పే ద్వారా గానీ పంపించి, మీ అడ్రసు, ఫోను నంబరు తెలియపరిస్తే పుస్తకాన్ని పోస్టులో పంపిస్తాం.

Leave a Reply

Your email address will not be published.