కథా మధురం 

నందు కుషినేర్ల

‘ఇది ఒక రచయిత్రి నిజ జీవిత కథాకావ్యం !’

 -ఆర్.దమయంతి

***

          ఇంటి స్త్రీ విలువ గానీ , ఆమెలో దాగిన కళా తపన కానీ, విద్వత్తు కానీ చాలా మంది మగవాళ్ళకు తెలీదు.  తెలిసినా గుర్తించరు. ఆమె – తల్లి కావొచ్చు. సోదరి కావొచ్చు. లేదా భార్య కావొచ్చు. వారిలో దాగిన కళని వెంటనే గుర్తించి, ప్రోత్స హించి , వెలుగులోకి తీసుకు వచ్చే ప్రయత్నం లో మన మగాళ్ళు ఇంకా వెనకంజలోనే వున్నారని చెప్పాలి. 

          ‘ఏమండీ! నేను బాగా పాడతానని నా ఫ్రెండ్స్ అందరూ మెచ్చుకుంటున్నారండి..’ అని అనంగానే వెంఠనే కిసుక్కున ఒక నవ్వు వినిపిస్తుంది. ‘భయపడి  అలా అని వుంటార్లే..” అని  పైగాఎద్దేవా చేస్తూ వొదిలే డైలాగ్ ఒకటి..

          ‘మీ ఆవిడ అద్భుతం గా వంటలు చేస్తుందండి..’ అనే ప్రశంసకి..’అవునండి.’ అనే మాట వెంటనే రాదు. “అదొక్కటే గా ఆవిడకొచ్చిందీ ..” అంటూ నవ్వుతాడు. అదేదో జోక్ అన్నట్టు.

          అలాగే నాట్యం, నాటక ప్రదర్శన, నటన, సంగీతం, హరికథ, బుర్రకథా వంటి అనేక కళలు నేర్వాలని, ప్రదర్శించాలని కళా తపన వున్నా, చేయూతనిచ్చే వారు లేక ఎందరో కళాకారిణీలు నిస్సహాయంగా నిలిచిపోయారు..ముందుకెళ్ళలేక.

          చాలా మంది కళాకారులు తమకున్న కళలని  ప్రదర్శించే అవకాశం లేక  నిరాశ నిస్పృహలకు గురి అవుతారు.  ఈ కొరత అలానే మిగిలిపోతుంది మనసులో. చివరికి, భర్తని ఎదిరించి అయినా తమ పిల్లలకి ఆ కళల పట్ల ఉత్సాహాన్ని కలిగించి, శిక్షణ ఇప్పించి, సాధన చేయించి, వేదిక మీద ప్రదర్శనలో చూసి ఉప్పొంగి పోతుంటారు – తల్లులు.

          ఏ కళ అయినా సరే, అర్హులైన స్త్రీలందరికీ అందక పోవడానికి, ముఖ్యం గా వివాహితులు వెలుగులోకి రాలేకపోవడానికి  ముఖ్య కారణం – కొంత మంది భర్తలకు మనసులో పాతుకుపోయిన  చిన్న చూపు వల్లే అని చెప్పాలి. అంతే కాదు హేళన. లెక్కలేని తనం. ‘ఆ! దాని ముఖం. దానికేం వొచ్చు?’ అనే ధోరణి ఇంకా కొనసాగుతూనే వుంది అని చెప్పడానికి ఈ ‘కావ్యం’ కథ  – ఒక నిదర్శనం  గా నిలుస్తుంది.

          మా స్నేహితురాలికి భరత నాట్యం అంటే చాలా ఇష్టం. దాని పోరు పడలేక తల్లి తండ్రులు ఎంతో ఖర్చు చేసి, నేర్పించారు. ప్రదర్శనలు కూడా ఇచ్చేది.

          పెళ్ళయ్యాక ఆట కట్టు. భర్త గారికి ఇష్టం లేదు . ఆయన ఒక్క సారి నో అన్నాడంటే జన్మంతా అదే రాతి శాసనం అన్న మాట. ఉరిశిక్షనించి తప్పించమని రాష్ట్రపతిని బిక్ష అడిగినా ఫలితం వుంటుంది కానీ.. మొగుడు గారి నించి మాత్రం ముఖ్యం గా ఇలాటి వాట్లలో ఎలాటి మినహాయింపు వుండదు. మరి మరి వాదిస్తే..హీనకరమైన మాటలు వినాల్సి వస్తుంది కూడా.

          మరో స్నేహితురాలు సినిమా పాటలు పాడేది. అచ్చు ప్రొఫెషనల్ సింగర్ లా పాడేది.  పెళ్ళయ్యే దాకా స్టేజ్ పెరఫార్మన్సెస్  కూడా ఇచ్చేది. పెళ్ళయ్యాక పూర్తి గా మానేసింది. అయితే ఆమె భర్త కి ఇష్టమే. కానీ, మామగారు చంఢ శాసనుడు. ఆమె వేదిక ఎక్కి పాడితే, పరువు ప్రతిష్టలు మంటగలిసి పోతాయని హుంకరించడం తో ఆమె అక్కడే ఆగిపోయింది. ఇటీవలే మామగారు పోయారు. ‘ఇప్పుడు పాడొచ్చు కదా హాయిగా ‘ అని ఎవరైనా అంటే, విరక్తి గా నవ్వుతుంది. ‘గాత్రం శ్రుతి తప్పుతోంది. తారాస్థాయి ని అందుకోలేక పోతున్నా..’ అంది. మధురమైన గాయని అలా మాయమైపోయింది ఆమెలోంచి.

          అయితే ఈ కథలో కావ్య ఎవరంటే –  ఆమె ఒక రచయిత్రి.

***

అసలు కథేమిటంటే :

          కావ్య అభ్యుదయ భావాలు గల స్త్రీ. రచయిత్రి గా మారి, సమాజ శ్రేయస్సు కోసం రచనలు గుప్పించాలని తపన పడుతుంది. పరిస్థితుల దృష్ట్యా పెళ్ళి చేసుకుని అత్తారింట్లో అడుగు పెడుతుంది. ఆమె కల విరుగుతుంది. రాసుకునే స్వేచ్ఛ కోసం ఎదిరిస్తుంది.  భర్త చేతిలో దెబ్బలు తింటుంది.  పరిస్థితులకి ఎదురీదలేక ఆత్మహత్య చేసుకుందామని కూడా అనుకుంటుంది. కానీ చివరికి గెలుస్తుంది. అటు రచయిత్రిగా, ఇటు ఇల్లాలిగా. ఎలా అన్నది కథ చదివి తెలుసుకోవచ్చు.

***

కథలోని స్త్రీ పాత్రల విశేషాలు :

          కథలో ని  ప్రధాన స్త్రీ పాత్ర కావ్య.. స్వభావ స్వరూపాలు, ఆదర్శ భావాలు :

          ఒక కావ్యమైన కథ కి రూపం లా వుంది ఈ కథానాయిక. అందరి ఆడపిల్లలాంటి అమాయకురాలే కానీ అమాయకత్వం వెనక గట్టి పట్టుదల, స్వచ్చమైన హృదయం, స్వేచ్చా భావనలు అన్నీ కలబోసిన ఆడబిడ్డ ఈమె.

          ఆడపిల్ల – కుటుంబ పెద్ద కి మర్యాద ఇవ్వడం అనేది ఈ రోజుల్లో చాలా అరుదైన విషయం కానీ, కావ్య పెద్దనాన్న కి ఎంతో విలువ ఇచ్చి మాట్లాడుతుంది. ఆయన సలహా మేరనే వివాహానికి ఒప్పుకుంటుంది.

          కొన్ని కుటుంబాలలో హద్దు అదుపులు ఎంత కఠినంగా వుంటాయంటే..గీసిన గీత దాటి వెళితే బ్రతుకే మిగలదు అన్నంత గా! అలాటి కుటుంబంలో పుట్టి పెరిగిన కావ్య.. ఒకానొక సందర్భం లో ఆ పెదనాన్ననే నిలదీసి ప్రశ్నిస్తుంది. ఇలాటి సంబంధమా చూసి చేసావ్? సుఖపడతావ్ అని అన్నది నువ్వేనా అని!

          అవును. నిలదీయాలి. ప్రశ్నించాలి. జవాబు ని రాబట్టాలి. శూన్యమై కుర్చోకు అని చెబుతుంది కావ్య.

          ఆవేశం ఆక్రోశం గా మారితే ఆడదీ, తుఫాను నాటి సముద్రమూ రెండూ ఒకటే..అని అనిపిస్తుంది కావ్య!

          ఒకానొక తీవ్ర మనస్తాప దశలో – తనకు ఈ ఇల్లూ వొద్దూ, ఈ మొగుడూ వొద్దు, ఈ సంసారమసలే వొద్దు అని విరక్తి చెందుతుంది.

          ఆశలు తీరక, నిరాశే ఇక మిగిలిందని నిర్ధారించుకున్నాక..భవ్యిష్యత్తే లేదని తేలిపోయాక..చచ్చిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఆత్మహత్యే దిక్కని భావిస్తుంది.

          ఆ క్షణంలో ఆమె కేవలం ఒక స్త్రీ మాత్రమే..మామూలు సాధారణ స్త్రీ గా ఆలోచిస్తుంది.

          అయితే, స్త్రీలు తీవ్ర నిరాశలో వున్నప్పుడు..తమని తాము ఓదార్చుకుని, వెన్ను తట్టుకునే విద్య ఒకటి నేర్చుకుని వుండాలి అని చెబుతుంది కావ్య.

          ఏ తోడూ లేని నాడు నీ నీడే నీకు తోడు అని కవి అన్నట్టు..కావ్య తన బలహీన మనసుని బలం గా ధృఢం గా చేసుకుని, మనో నిబ్బరం తో నిద్రపోతుంది ఆ రాత్రికి.

          కథా నాయిక అంటే  మచ్చలేని చందమామ అనట్టు ప్రవర్తించాలనుకుంటారు.. కానీ నిజమైన హీరోయిన్ కావ్య. ఎలా అంటే..తన తొందరపాటు వల్లే ఇంట్లో గొడవలు అవుతున్నాయని గ్రహిస్తుంది. అందుకు క్షమించమని అడుగుతుంది భర్తని. అతను అంత సంస్కారి కాకున్నా, తన ధర్మాన్ని తాను నిర్వర్తించడం మంచి వ్యక్తిత్వమున్న స్త్రీ లక్షణం అనే సందేశాన్నిస్తుంది కావ్య.

          రచయిత్రులకి ఒక తీరని ఆశ వుంటుంది. వ్యక్తిగతం గా నాకూ వుంది ఈ దురాశ.

          ఇంటి పనులు, వంట పనులు, వంటిల్లు సర్దుకోవడాలు వంటివేమీ లేకుండా ఎంచక్కా, ఒక గది, కిటికీ పక్కన టేబులు, వీస్తూ గాలి, ఇంట్లో ఎవరైనా అప్పుడప్పుడు వేడి వేడి టీ   తెచ్చిస్తే హాయిగా కథలు, నవలలు రాసుకోవచ్చనీ, కేవలం రచనలు చేయడానికో, నవలలు చదువుకోడానికొ ..మాత్రమే బ్రతికితే ఎంత బావుణ్ణు అని చెప్పలేనంత కోరిక వుంటుంది. ఊహకే ఎంత బావుందో. ఇక నిజమైతే పట్ట శక్యమే? హ హా.

          కానీ అది అసాధ్యం. ఇప్పుడు మనకున్న పేరున్న రచయిత్రులకు కూడా ఇలాటి అవకాశం వుండటం అరుదేమో!

          అయితే కావ్య తనకున్న ఇంటి బాధ్యతలను నెరవేరుస్తూనే..తనకంటూ  బాల్కనీ నే ఒక ఆఫీస్ రూంని, రాసే పని వేళలంటూ ప్రత్యేకమైన రాత్రి సమయాలను కేటాయించు కోవడం చూస్తే ముచ్చటేస్తుంది. ఎందరో రైటర్స్ కి  కావ్య ఒక గొప్ప స్ఫూర్తి దాయిని అని చెప్పాలి.

          అత్త ఒక మాటన్నదనీ, ఆడపడుచు నవ్విందనీ, మామ కోప్పడ్డాడనీ, భర్త కోపం లో చేయి చేసుకున్నాడని ..వివాహితలు విడాకుల వరకు వెళ్తున్న ఈ కాలం లో కావ్య వారిని చిరునవ్వుతో గెలుచుకోవడం ఆశ్చర్యమనిపిస్తుంది.

          పెళ్ళయిన ఐదేళ్ళంట.. కొత్త కోడలు  అత్తింటి వారి మాట వింటే , ఆ తర్వాత జీవితమంతా ఈమె మాట వాళ్ళు వింటారుట. ఒక నానుడి వుంది. అది నిజమనిపిస్తుంది కావ్య ని చూసాక.

          రైటర్స్ కి పాఠకాభిమానులకి మధ్య గల అందమైన అనుబంధానికి  కావ్య వంతెన లా నిలిచిందని చెప్పాలి.

          చాలా మంది రచయిత్రులకి అభిమానులని అంతరంగ స్నేహితులుగా చేసుకోవడం తెలిసి వుండాలి. నిజమైన అభిమానుల ఓదార్పు కానీ, ప్రోత్సాహం కానీ ఎంత గా చేయూతనిస్తాయంటే..విజయ పథం వైపు దూసుకుపోయేలా..అని చెప్పడానికి కావ్య ఒక చక్కని ఉదాహరణ.

          డైరెక్ట్ నవలలు రాయడం, వాటిని పబ్లిషింగ్ హౌస్ కి పంపడం ఆమె చేసే ఒకకొత్త ప్రయోగం గా చెప్పుకోవాలి. ఇది రైటర్స్ కూడా అనుసరించదగినది.

          జీవితం లో పడ్డ వాళ్ళెప్పుడూ పడిపోయే వుండరు – తిరిగి లేచి నిలబడతారు..కాదు పరుగులుగా సాగిపోతారు ముందుకి..మున్ముందుకి..అనే చందాన, కావ్య జీవితం కూడా పరుగందుకుంటుంది.

          భర్త ఒకప్పుడు..’ఆఫ్ట్రాల్ నువ్వెంత?’ అంటూ గర్జించిన వాడు, ఇప్పుడు భార్య విలువ తెలుసుకున్నాడు. గడ్డి పోచ అనుకున్నాడు. కాదు హిమవన్నగం అనే  జ్ఞానం కలుగుతుంది. అతన్ని మనిషి ని చేస్తుంది. తన పశు ప్రవర్తనకి సిగ్గు పడి, పశ్చాత్తాపం తో ఆమె ముందు మోకరిల్లుతాడు.

          ఇది  కావ్య వ్యక్తిగా సాధించిన అసలైన విజయం.

          మరో విజయం..సామాజిక స్పృహ గల రచనలతో పాఠకుల హృదయాలను గెలవడం.

          రెండు విజయాలు ఎలా సాధ్యం అవుతాయి అని తెలుసుకోవాలనుకునే వారు కావ్యని చదివితే తెలుస్తుంది.

          కథలో మరి కొన్ని స్త్రీ పాత్రలూ వున్నా, అవి  అంత ప్రాధాన్యాన్ని సంతరించు కున్నవి కావు.

          ఇవండీ !ఈ నాటి కావ్యం కథలో ని  కథ, కథనం, కావ్య పాత్ర లోని ఔన్నత్యం.

***

కథాకావ్యం!

-నందు కుషినేర్ల

          “ముందు అయితే పెళ్ళి చేసుకో. తర్వాత మెల్లి మెల్లిగా నీ గోల్స్ గురించి ఆలోచిద్దువు గానీ ..” అన్నాడు రమణ తన కూతురు కావ్య తో.   కావ్య పెళ్ళికి ఓకే చెప్పడంతో ఆమె  అన్న చేతన్ ఆనందంలో మునిగి తేలుతున్నాడు. వాస్తవానికి అతని పెళ్ళే ముందు జరగాలి. కానీ , వస్తున్న సంబంధాలలో పెళ్ళీడుకొచ్చిన ఆడపిల్ల ఉందనే కారణంతో సంబంధాలు వెనక్కి వెళ్తున్నాయి.   మరి కొందరేమో కట్నం దగ్గర పూర్తిగా ఎసరుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

          కాబట్టి ముందుగా ఏదో ఒక రకంగా కావ్యని  దాటించేస్తే తన దారి పూలదారి అవుతుందన్నది అతని ఆశ. సహజంగానే తల్లిదండ్రులు కూడా తమ కూతురికి పెళ్ళి చేస్తే బాధ్యత తీరిపోతుంది అన్నట్టుగానే ఉంటారు. కానీ, స్వతంత్ర మనస్తత్వం గల కావ్యను ఒప్పించటమే కష్టం. అందుకే పెదనాన్న గోపాల్  పెద్దరికం అవసరమైంది. 

          కావ్య ఊఁ అన్న మరునాడు పొద్దున్నే ఒక సంబంధాన్ని తెచ్చి పెళ్ళి చూపులు ఏర్పాటు చేసిండు. తన ఫ్రెండ్ కి తెలిసినవాడు. పేరు రాజేష్. సాఫ్ట్ వేర్ ఇంజనీర్. నెలకు లక్షవరకు జీతం. సొంతిల్లు, ఒక్కడే కొడుకు , ఇంటర్ చదివే చెల్లెలు పేరు సుప్రియ. తండ్రికి  బిజినెస్ , కూర్చుని తినగలిగేంత స్థాయిలోనే ఉంది ఆర్థిక స్థితి. ఇట్ల ఉన్నపుడు ఇక తల్లిదండ్రులకు ఈ సంబంధం అన్ని విధాలుగా నచ్చే తీరుతుంది. తల్లిదండ్రుల తో పాటు పెదనాన్నకి కూడా నచ్చిన సంబంధం . కావ్య సరే అంది. 

          రెండు వారాల వ్యవధిలోనే ఘనంగా పెళ్ళి కూడా జరిగిపోయింది. అత్తవారింట్లొ అడుగు పెట్టింది కావ్య. వేరే ఊరేం కాదు. పుట్టి పెరిగినదంతా చైతన్య పురి అయితే , మెట్టి జీవించవలసింది కూకట్ పల్లి. ట్రాఫిక్ లేకుంటే గంట ప్రయాణం. ఉంటే ఎన్ని గంటలో తెలియదు.

          ఇంక కావ్య ఈత మొదలైంది సంసార సాగరంలో. చూస్తూ ఉండగానే ఆరునెలలు గడిచిపోయినయ్. ఇంత కాలంలో తాను చేసింది ఏముంది అని నెమరు వేసుకుంటే ఏమీ తోచలేదు. అట్లాగని ఎపుడూ పదినిమిషాలు కూడా తీరిక లేదు. వంట చేయటం , బట్టలు ఉతకటం , అందరికి ఏమేం కావాలో చూసుకోవటం , భర్తకి , అత్తమామలకి అన్నీ సమయానికి అందివ్వటం.  ఇవేవీ చెప్పుకోడానికి  గొప్పగా అనిపించేవి కావు. కాలం గడిచే కొద్ది ఇదే దినచర్య. ఇంకా.. ఇంకా ..తనని  కనిపించని ఒక పిడికిటిలో నలిపేస్తున్నట్టుగా అనిపిస్తున్నది తన మనసుకి. తనకి సరదాగా అనిపించిన ప్రతీ చిన్నపనీ పెద్దతప్పే. ‘ఇదేం పద్దతి ..’ అని  ఈసడింపులు ఇంతేనా జీవితం ? ఇదేనా బ్రతుకంటే ? వారు తిన్న ఎంగిలిని శుభ్రం చేయటం , వారి బట్టలకి అంటించుకున్న మరకలని తొలగించటం. ఇదేనా నా జీవిత పరమార్థం.? అని మనసులో ఏవేవో ప్రశ్నలు .

          ఒక గొప్ప అభ్యుదయ రచయిత్రిగా సమాజంలో ఎదగాలన్న తన కోరిక ఎటు పోయింది.? సమాజం లో ఉత్తేజం కోసం కృషి చేయవలసిన నేను ఇదే సమాజపు మగతలో మనిగి పోతున్నాను. నేను ఎంచుకొని బుడిబుడి అడుగులు వేసిన దారి నుండి తప్పిపోయి ఎక్కడ వచ్చి పడ్డాను ? అని తనలో తనే మథన పడింది.

***

          మరునాడు పనులు త్వరత్వరగా ముగించుకొని , తాను ఇంటి నుండి తెచ్చుకొని ఇంత వరకూ ఒక్కసారి కూడా తెరవలేక పోయిన బ్యాగ్ ని తెరిచింది. తన నోట్ బుక్స్ అన్నీ తీసి ఏవేం రాతలు ఎక్కడెక్కడ ఆగిపోయినయో చూసుకున్నది. అందులో ఒక చిన్న కథని తీసుకొని త్వరత్వరగా పూర్తి చేసి పోస్ట్ చేసింది.

          ఆశ్చర్యం! అది ఆదివారం మ్యాగజైన్ లో అచ్చు అయింది. చదివిన పాఠకులు ఫోన్ లు చేసి అభినందిస్తున్నారు. ఎన్ని రోజులైంది ఈ నిండైన ఆనందాన్ని ఆస్వాదించి అనుకున్నది మనసులో.

          ఆ మ్యాగజైన్ ని తీసుకొని పోయి రాజేష్ కి చూపించి , ఫోన్ లో వస్తున్న అభినందనల గురించి  ఆనందం గా చెప్పింది. అతను ఆ పేపర్ ని సరిగ్గా చూడకుండానే ‘ఓహో ! కంగ్రాట్స్ ‘అని మళ్ళీ కంప్యూటర్ వైపు మల్లిండు. ఒక్కసారిగా  ఆమె ఉత్సాహం మీద నీళ్ళు గుమ్మరించినట్టు అనిపించింది.

          అలాగే మొఖం వేలాడేసుకొని సుప్రియ దగ్గరికి పోయి చూపించింది. ‘ఈ కాలంలో ఇవేంటి వదినా ! ఫూలిష్ ‘గా అన్నది. మామయ్యకి చెప్పింది ‘గీ పొద్దుపోని పనులు మనకెందుకమ్మా వేస్టు.’ అన్నాడు. అత్తకి చూపింది దీని వల్ల ఏం ఒరిగింది ఇపుడు నీకు ? బి.పి పేషంట్ కి చేసే కూరలో ఉప్పు కారం ఎంత  వేయాలనో తెలుసుకో ఫస్టు. అన్నది.

          వెళ్ళి వంటగదిలో కూర్చున్నది. కళ్ళలో నీళ్ళు ఆగటం లేదు. అసలు నవ్వే చాన రోజులైందంటే , ఇవాళ ఇంకా హీనంగా అనిపించింది మనసుకి.

          పెదనాన్న కాల్ చేస్తున్నాడు. ఎత్తబుద్ది కాలేదు. కాల్ కట్ చేసి కూరగాయలు కోయటంలో మునిగిపోయింది.

          మధ్యాహ్నం భోజనం అత్తమామలు ముందుగా  తిన్నారు. సుప్రియా తర్వాత తింటానన్నది. రాజేష్ ఫ్రెండ్స్ పార్టీ ఉంది అని చెప్పి వెళ్ళిపోయిండు. ఒక్కతే కూర్చుని తింటుంది. బాధతో నిండి ఉన్న గొంతులోకి మెతుకులు దిగటం లేదు. రెండు ముద్దలు బలవంతంగా మింగి చేతులు కడిగేసుకున్నది.

          వెళ్ళి బెడ్ పైన పడుకుంది.  ఏడుపు ఆగటం లేదు. మళ్ళీ పెదనాన్న నుండి ఫోన్ . ఫోన్ ని దూరంగా పడేసింది. బెడ్ లైట్ పక్కనున్న మ్యాగజైన్ ని చూసే సరికి కోపం రెట్టింపై దాన్ని కసిగా ముక్కలు ముక్కలుగా చించి పోసింది. “కావ్యా ! నిన్న చెప్పిన కషాయం కలిపి తీసుకురా. అని అత్త పిలుపు వినిపించింది.  రివ్వున లేచి, జుట్టు సవరించుకొని వంటగదిలోకి పోయింది.

          అత్తకి కషాయం ఇచ్చివచ్చి మళ్ళీ మంచం ఎక్కబోతుండగా ఫోన్ మోగింది. చూస్తే కొత్త నెంబర్. లిఫ్ట్ చేసింది.

          “హలో ! మేం విశాఖపట్నం నుండి మాట్లాడుతున్నామండి. నా పేరు వైష్ణవి.  మీరు కావ్య గారే కదా ? ” అన్నది.

          ” అవును.”

          “మేడం మీరు రాసిన కథ చాలా బాగుందండీ.”

          “థాంక్స్ అండీ..”

          “అబ్బో !  ఎంత అంకితభావంతో రాసారో మీరు. ఇది మీ పూర్తి కల్పితమా? లేక ఎక్కడైనా నిజ జీవిత సంఘటన నుండి స్పూర్తి పొంది రాశారా ?”

          “లేదండీ . పూర్తిగా కల్పితమే”

          “నిజమా ? నమ్మలేకపోతున్నానండీ. అసలు ఇంత క్రియేటివ్ గా ఏట్టా ఆలోచించారు మీరు ? మీలో గొప్ప రచయిత్రి అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయండీ. ఇట్టాగా రాయటం కంటిన్యూ అవ్వండి. మా లాంటి పాఠకులు ఎంతో మంది మీకు అభిమానులవుతారు.” అంటూ ప్రశంసలతో ముంచెత్తింది ఆ అభిమాని.

          కావ్య మనసు ఏంతో తేలికయింది. వైష్ణవి గారు మీరేమనుకోనంటే నాదొక చిన్న రిక్వెస్ట్. అన్నది.

          “అయ్యో ! దాందేముందండీ అడగండి. పర్లేదు.”

          “నేను అపుడపుడూ ఫోన్ చేసి సరదాగా మాట్లాడొచ్చా ?”

          “భలేవారే ! అది మా అదృష్టమండీ బాబు.”

          “థాంక్సండి. చనువు తీసుకుంటున్నానుకోకపోతే

          నేనూ మిమ్మల్ని ఒకటి అడగొచ్చా?”

          “అడగండి దాందేముంది?”

          “మీరు మీ కుటుంబంతో సంతోషంగా లేరా ? సాటి ఆడదాన్ని  కదండీ. మన బాధలు మనకు కాకుండా మన మగవాళ్ళకు అర్థమవుతాయటండీ?”

          కావ్యకి నవ్వు వచ్చింది. ఆమె చొరవకి, చనువుకీ.

          “ఏం పర్లేదు. ఇక నుండి మనం బెస్ట్ ఫ్రెండ్స్.”

          ” థాంక్స్”  చెప్పి, నవ్వుకుంటూ ఫోన్ పెట్టేసింది కావ్య. ఇపుడు తన మనసు ప్రశాంతంగా ఉంది. మిద్దె పైకి పోయి పెదనాన్న కి ఫోన్ చేసింది.

          “హలో ! తల్లీ….. ఉదయం నుండి ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు. యాడికైనా బయటికి పోయిన్రా బిడ్డా ?” అడిగాడు ఆప్యాయంగా.

          “ఆఁ ! నా బతుక్కు అదొక్కటే తక్కువ. అసలు నా భవిష్యత్తు గురించి మీరు చెప్పిందేంది ? ఇపుడు జరుగుతున్నదేంది.? నిజం చెప్పు పెదనాన్న వాని పెళ్ళికి అడ్డం ఉన్న అనే కదా నాకు డబ్బున్న పెళ్ళి చేసి ఇక్కడ కు పంపారు?” అని అడిగింది ఉక్రోషంగా.

          ” అదేం లేదు నాన్న. అసలు ఇపుడేమయింది ? ఎందు కింత కోపం వచ్చింది ?”

          ” నాకంత ఓపిక లేదు. అయినా చేతులు దులిపేసుకున్న వాళ్ళకి ఇటు వంటివి చెప్పినా అర్థం కావులే. నేనేం చెప్పినా నువ్వేం చెప్తావో నాకు తెలుసు. అనవసరంగా నీ నెత్తి నొప్పి రుద్దుకొని నీ మెదడేం పాడుచేసుకోవాల్సిన అవసరం లేదు. మందులేసుకొని టైం కి తిను. వుంటా” అని కాల్ కట్ చేసింది.

          కొన్ని నిమిషాల తర్వాత ఒక గట్టి నిర్ణయానికి వచ్చింది.

***

          ఆ రోజు నుంచి కావ్య వండటం , తోమటం , ఊడ్వటం లాంటి ముఖ్యమైన పనులు మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నది. ప్రతీదీ చేతికందివ్వడాలు. కళ్ళ ముందే తిరుగుతూ , కాళ్ళ వద్దే ఉండటం మానేసింది. ఎవరేం అడిగినా “కొంచెం పనిలో ఉన్నాను. మీరే తెచ్చుకోండి ప్లీజ్.” అనే సమాధానం మాత్రమే ఇవ్వసాగింది.

          పెన్ను , పేపర్ల తోనే పూర్తి సమయం గడపసాగింది. ఇది ఇంట్లో వాళ్ళు మూడు రోజులు భరించిన్రు. అత్తమామలకు ఈమె పద్దతేమీ నచ్చలేదు. చిన్న చిన్నగా మాటలు అనుకోవటం , కసిరింపులు , ఈసడింపులు కొనసాగినయ్. ఒకరోజు రాజేశ్ తనని ఏకంగా చెంప మీద కొట్టిండు కూడాను. అన్ని తలకాయ నొప్పుల మధ్యలో కూడా తన నవలని పూర్తి చేసి పరిశీలన కోసం పంపింది. రెండో నవల సగం వరకు వచ్చింది. గొడవలు ఇంకా ముదిరినయ్. ఆఫీస్ నుండి ఆ రోజు వచ్చి చూడగానే కావ్య ఏదో రాస్తూనే కనిపించింది. రాజేశ్ వాళ్ళమ్మ ఓకవైపు నుండి తిడుతూనే ఉంది కావ్యని. ఆమె ఆ మాటలు పట్టించు కోకుండా తన పనిలో మునిగి ఉన్నది. అప్పటికే  చికాకు పరాకాష్టలో వున్న  రాజేశ్ కి ఈ దృశ్యం ఇంకా ఇరిటేషన్ పెంచింది. కోపంగా పోయి కావ్య చేతిలో ఉన్నవే కాక , సెల్ఫ్ లో ఉన్న బుక్స్ ని , పేపర్స్ ని అన్నింటనీ తీసుకపోయి బయట పడేసి తగలబెట్టిండు. కావ్య కాళ్ళు పట్టుకొని ఎంత బ్రతిమాలినా వినలేదు.  అవి కాలి పోతుండాగా కావ్యని జుట్టు పట్టుకొని ఇంట్లోకి ఈడ్చుకొచ్చిండు.  పెద్ద గొడవ సర్దుమణిగాక..

          కావ్యకి ఇక బ్రతకటం అవసరమా అనిపించింది. దెబ్బలు తిన్నందుకు బాధలేదు. తాను తిప్పలు పడి ఇష్టంగా రాసుకున్నవన్నీ  కళ్ళ ముందే కాలిపోతుంటే తనే అంటుక పోతున్న భావన కలిగింది.  వీళ్ళతోని ఉంటే నా గమ్యాన్ని చేరనివ్వరు. వీళ్ళ నుండి విడిపొతే అమ్మనాన్నలు బాధపడతారు. విడాకులు తీసుకున్న రమ్య , శ్వేత లని సమాజం , చుట్టాలు ఎంత హీనంగా చూసేవారో తన కళ్ళతో చూసింది. అది వేస్ట్. అయితే వాళ్ళ కోసమో లేదా వీళ్ళ కోసమో అయితే నేను బ్రతకటం ఎందుకు ? నాకంటూ ఒక గుర్తింపుని ఒక ఉన్నతిని సాధించుకోలేనపుడు బ్రతకటం ఎందుకు? అంటూ అనేక రకాల ప్రశ్నలు తన మనసును గుచ్చుతున్నాయ్.  ‘చనిపోవటమే ఉత్తమం..’ అని నిర్ణయించుకున్నది. చాలా మంది స్త్రీలు తాము వేరు, తమ ఆశయం వేరు అని అనుకోలేరు. రచనలు చేయడం ఆమెకి ప్రాణం. అదే లేకపోయాక, ఈ దేహం వుండీ వృధా అని అర్ధమై పోయింది. పేపర్స్ కాలుతున్న మంటే ఇంకా తన కళ్ళలో నుండి అదృశ్యం అయిత లేదు. ఇంతలో స్నానం చేసి వచ్చిన రాజేశ్..” ఏయ్ ! దయ్యం లాగ ఏం చూస్తున్నవ్ కూర్చుని? వంట చెయ్ పో  నడువ్. అని ఇదో రకం మెంటల్ ది జతయింది నా బతుకుకు . నా ఖర్మ ..” అని తిట్టుకుంట హాల్లోకి పోయిండు. అతని మీద తల్లి చెప్పుడు మాటల ప్రభావం ఎంత తీవ్రం గా వుందో చెప్పడానికి ఈ ఒక్క సీన్ చాలు. ఆమె చూపుల్లో ఏ భావాలు లేవు.

          సరిగ్గా అపుడే కావ్య ఫోన్ రింగ్ అయింది. కొత్త నెంబర్. నిరాసక్తిగా లిఫ్ట్ చేసింది.

          “హ..లో ! “

          “కావ్య గారా ?”

          “అవును. మీరు ?”

          “నా పేరు వాసవి అండీ. మీరు మా పబ్లిషింగ్ హౌస్ కి నవల పంపారు కదా ! దాని పరిశీలనా భాద్యత నాకే అప్పజెప్పింది మా ఆఫీస్. చదివేసినానండీ. అద్భుతంగా సృజించారు మీరు నవలని. ఎక్కువగా పొగుడతున్నాననుకోకపోతే చరిత్ర సృష్టించేంత గొప్ప నవలని రాసారండీ..” అపరిచితురాలి గొంతు నిండా ఆరాధనా భావం తొణికిస లాడుతోంది. ఒక రచనలోని మధురిమ ఏ స్థాయిలో వుంటుందో..పాఠకుల ఆస్వాదన తర్వాతే తెలుస్తుంది..ఇదిగో ఇలా ఆరాధకుల మాటల్లో జీవం పోసుకుని ..రైటర్ హృదయం లో ఒక జీవ నది లా మారి ప్రవహిస్తూ..

          అంత విషాదమూ క్షణాల్లో మాయమై, ఏదో కొత్త చైతన్యం శరీరం నిండా నిండి పోతోంది ..”అవునా..” అని మాత్రం అనగలిగింది ఆనందంతో.

          “అవునండీ . వాస్తవానికి ఇటు వంటివి మేం ఆఫీస్ టైం లోనే  ఇంఫార్మ్  చేస్తాం. కానీ నాకు  మీతో మాట్లాడాలన్న కోరికతో, ఉత్సాహాన్ని  తట్టుకోలేక ఇపుడే కాల్ చేసిన. మేం మీకు మళ్ళీ రెండు రోజుల్లో అఫీషియల్ గా తెలియ  చేస్తాం. అపుడు ఆఫీస్ కి రండి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అన్నది ఆమె.

          కావ్య వెంటనే ఈ విషయాన్ని తన అభిమాని వైష్ణవి కి ఫోన్ చేసి చెప్పింది. ఆమె కూడా ఎంతో సంతోషించింది.

          “అమ్మా దొరసాని ! తినబుద్దికాకపోతే నీవు మాడపెట్టుకో. మా కడుపులు ఆగం చెయ్యకు. ” అని అత్త పిలుపు వినిపించింది. ‘నా బతుక్కు ఈ సాధింపు మాత్రం తప్పదు కదా ! ‘ అనుకుంటూ పోయి వంట చేసింది. అందరూ తిని పడుకున్నారు. అపుడు మైండ్ ఫ్రెష్ గా ఆలోచించసాగింది. ‘ఛ …! సమాజాన్ని మేల్కొలపాలనీ, అదనీ ఇదనీ అనునుకున్న తను.. పిరికి దానిలా ఆత్మహత్య చేసుకోవాలనుకోవటం ఏమిటి ? ఎంత మూర్ఖంగా ఆలోచించింది నా మనసు? నా కథల్లో నా పాత్రలని నేను పెట్టే హింసలో సగం కాదు ఇవాళ జరిగింది. బహుశా కాలం నన్ను పరిస్థితులనే రాళ్ళ మీద సానబెడతుందేమో. నేను పదును దేరాలి కానీ , పరిసమాప్తం కాకూడదు . అనుకుని ప్రశాంతంగా నిద్రపోయింది.

***

          మరుసటి రోజు శనివారం రాజేష్ ఇంట్లోనే ఉన్నాడు. సాయంత్రం అతను ఫ్రెండ్స్ తో ఫోన్ లో మాట్లాడుతూ కాస్త ఉత్సాహంగా కనిపించేసరికి ఇదే సరైన సమయం అనుకున్నది కావ్య. అతను ఫోన్ మాట్లాడటం పూర్తైనాక వెళ్ళి అతని ముందు నిలబడింది. ఆమె లోపల భయం భయంగా కనిపించిందతనికి

          “ఏంది విషయం ? ఏమైనా అడగలనా ? ” అన్నాడు.

          “అవును.”

          “చెప్పు.”

          నిన్న జరిగినదాంట్లో నాదే తప్పు.  ఇంకెపుడూ ఇట్ల బిహేవ్ చెయ్యను.

          “నీలాంటి వాళ్ళకి అట్ల ట్రీట్ మెంట్ చెస్తనే అర్థమైతదని నాకు తెలుసు . రోగం ఇపుడు కుదిరిందన్నమాట.”

          ఏం మాట్లాలేక మౌనంగా నిలబడింది.

          “ఇది చెప్పనింకె వచ్చినవా?”

          “అంటే , ఇక నుండి మీకు ఎవరికీ ఏ ఇబ్బంది రాదు. మీ అవసరాలు తీర్చాకే,  నా పనిచూసుకుంటాను.”

          “అబ్బో  !  అయితే ?”

          “నేను ఎప్పటిలాగా రాసుకోవచ్చు కదా ! అందరి పనులు చేసిన తర్వాత ఖాళీ దొరికితే మాత్రమే పెన్ను ముట్టుకుంటాను. అందుకు.. ఎవరినీ నిర్లక్ష్యం చేయను. ప్లీజ్.” బ్రతిమాలుకుంది.

          “సరే  రాసుకో. ”  అన్నాడు.          

          “నాకు ఇంకొక పర్మిషన్ కావాలి. ” అని అడిగింది సన్నటి స్వరంతో.

          “మళ్ళీ ఏంది ?”

          “నేను ఇంతకు ముందు రాసిన నవలని ఇపుడు ముద్రించాలని పబ్లిషింగ్ కంపనీ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారంట. రేపో ఎల్లుండో మాట్లాడటానికి పిలుస్తారు. రెండు మూడు సార్లు వెళ్ళాల్సి వస్తుంది. ఇంట్లో అన్నీ చక్కబెట్టిన తర్వాతనే వెళ్తాను. తొందరగానే వచ్చేస్తాను. ఇది నా చిన్న నాటి కల. ఇపుడు తీరబోతోంది.”  మాటల్లో తెలీని ఆనందం ఉప్పొంగింది.

          అతడు గట్టిగా నవ్వుతూ “నువ్ రాసిన పుస్తకాన్ని పబ్లిష్ చేస్తున్నారా ! సదివేటోళ్ళ ఖర్మ ఫో. సరే, పోయి రా. ” అన్నాడు. అతనికి నవ్వు ఆగటం లేదు. ఆమెకు ఆ నవ్వు చూస్తుంటే  అవమానమైంది. తన మీద తనకే ఏదో తెలియని చిరాకు కలిగింది. 

          ఆ రాత్రి తినేటపుడు కూడా ఇదే ముచ్చటని చెప్పుకుంటూ,  అందరూ  హేళనగా నవ్వుకున్నారు.

          మౌనం గా తలొంచుకుంది.

***

          తను అనుకున్నట్టుగా పుస్తకం రిలీజ్ అయింది. నవల పేరు ‘మీన మీటిన వీణ ‘ – ఆడపిల్లల పై  సమాజం యొక్క దృక్పథాన్ని కళ్ళకడుతూ సాగే కథ అది. మీన అనే దగా పడ్డ అమ్మాయి తనకంటే చిన్నదైన వీణ అనే అనామకురాలిని చేరదీసి సంఘంలో ఒక గొప్ప విద్యావంతురాలిగా తీర్చిదిద్దుతుంది. ఎంతో ఎత్తుకు ఎదిగిన వీణ స్త్రీ అభ్యుదయం కోసం తన జీవితాన్ని అంకితం చేసి. ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాల్లో వెలుగు తెస్తుంది.” అందులోని కథాంశం.

          ఆ పుస్తకాన్ని తెచ్చి ఇంట్లో వాళ్ళకి చూపించింది. మళ్ళీ అవే ఎగతాళి నవ్వులు. వాళ్ళ అమాయకత్వాన్ని , మానవతా స్పూర్తిలేని మానసిక మగతని చూసి కావ్య వాళ్ళ కంటే ఎక్కువే నవ్వుకుంది లోన.  కొన్నాళ్ళకి మరో నవలని కూడా ప్రచురించారు.  అలా నవలా రచయిత్రి గా వెలుగులోకి వచ్చింది.

          పాఠకులు నుండి అభినందనలు సరేసరి. అభిమానుల నుండి వచ్చే ఉత్తరాలతో ఆకాశంలో తేలినట్టనిపిస్తుంది తనకి.

***

          ఆ రోజు –   తన టీమ్ మేనేజర్ ఇచ్చిన వర్క్ ఫినిష్ చేసి ఆమె పిలుపు కోసం ఏదురుచూస్తూ కూర్చున్నాడు రాజేష్. అరగంట తర్వాత  ఆమె ఫోన్ చేసి క్యాబిన్ కి రమ్మని పిలిచింది. టీమ్ మెంబర్స్ అంతా కలిసి లోపలికి పోయి నిలబడ్డారు. ఆమె ఫోన్ లో మాట్లాడుతుండగా ఆమె ముందు ఒక పుస్తకం కనిపించింది రాజేష్ కి. దాన్ని ఎక్కడనో చూసినట్టనిపించింది. కొంచెం పరిశీలనగా చూస్తే పేరు కనిపించింది కన్నీటి జలపాతాలు. దాని కింద “మలిపాటి కావ్య రాజేష్” అని ఉంది. ఆశ్చర్యంతో తల తిరిగినట్టయింది అతనికి. ఆమె ఫోన్ సంభాషణ పూర్తయి, వివరణ తీసుకొని పంపించింది. 

          రాజేష్ మళ్లీ వెనక్కి వచ్చి “మేడం ! ఆ పుస్తకం ? ” అన్నాడు.

          “ఓహ్ ! ఇదా ? మా అత్తమ్మ ఇచ్చింది చదవమని . నాకు ఇక్కడికి రావడానికి గంటన్నర ప్రయాణం కదా ! కార్ లో చదవొచ్చని తెచ్చుకున్నాను. వీలైతే మీ ఆవిడకి కూడా ఈ బుక్ నికొని గిఫ్ట్ గా  ఇవ్వండి.  ఆవిడకి పుస్తకాల పట్ల అభిరుచి ఉంటే, ఇంత కంటే గొప్ప గిఫ్ట్ ఆమెకి మీరు  ఇంకేదీ ఇవ్వలేరు లైఫ్ లో..” అంది.

          “అవునా ? మీరు ఇటు వంటి పుస్తకాలు కూడా చదువుతారా ?

          “ఏంటి రాజేష్ అంత మాట అనేశారు మీరు ?   అయినా పుస్తకం గురించి ఎందుకు  అలా అడుగుతున్నారు?”

          “అది తెలుగు నవల కదా..మీ చేతిలో చూసి..” 

          “సాహిత్యం లో భాష  కాదు, రాజేష్ . దాని లోతుని చూడాలి. సమాజ అభ్యున్నతి పట్ల మహోన్నతమైన అభిలాష గల మనస్తత్వం ఉన్న గొప్పరచయిత్రి రాసిన నవల ఇది. నాకు మొదట్లో సాహిత్యం పట్ల అవగాహన లేదు. మా అత్త గారి ద్వారా నాకూ అబ్బింది.  అంతే కాదు.       

          ఆమెకి ఒక కోరిక కలిగింది. కావ్య రాజేష్ గారి నవలని ఇంగ్లీష్ లో అనువదించి, తనూ రచయిత్రి కావలని కోరుకుంటోంది..” అంటూ గలగలా నవ్వేసింది.                    

          రాజేష్ కి మెదడు స్థంభించింది. యాంత్రికం గా సెలవు తీసుకుని బయటపడ్డా, మనసు సందిగ్దంలో పడినట్టయింది. ఇంటికి పోయినాక , తినబుద్ధి కాలేదు. నిద్ర పట్టలేదు. పిచ్చెక్కినట్టయింది. అనుకోకుండా పక్కకి మల్లితే నిద్రపోతున్న కావ్య ముఖం కనిపించింది. మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపించింది.  బెడ్లాంప్ వెలుగులో కావ్య ముఖాన్ని చూస్తూనే ఉండిపోయిండు. పెళ్ళైన దగ్గరి నుండి ఆమెని తాను పెట్టిన చిత్రహింసలు. గాయపరిచిన తన మాటలు అన్నీ గుర్తుకు వస్తున్నాయి. మనసులోనే పశ్చాత్తాప పడుతున్నాడు. ఇంతలో అలారం మోగింది. ఆమెకి మెళుకువ వచ్చే సరికి అతను కళ్ళు మూసుకున్నాడు.

          టైం రెండు అయింది. లేచి అలారం ఆఫ్ చేసింది. రాజేష్ వైపు చూసింది అతను పైన దుప్పటి సరిగ్గా కప్పి,  ప్రేమగా తల నిమిరుతుంటే..   అతని కళ్ళు తడిసాయి.  ఆమె పేపర్స్ , పెన్ను తీసుకొని బాల్కనీ లోకి వెళ్ళి పోయింది. అతను లేచి కూర్చున్నాడు. ఎటూ తోచటం లేదు. పక్కనే టేబుల్ మీద కావ్యకి వచ్చిన ఉత్తరాలు కనిపించినయ్. ఒక్కొక్కటి చదివేకొద్దీ కావ్య ఇంకా ఇంకా ఎత్తున ..ఎత్తైన శిఖరాన కనబడుతోంది అతనికి.

          అన్నీ చదవటం అయిపోయిన తర్వాత కావ్య వైపు చూసిండు. ఆమె నీళ్ళ బాటిల్ తీసుకుంది . కానీ అందులో నీళ్ళు లేవు. అలాగే   దాన్ని కింద పెట్టి మళ్ళీ రాతలో మునిగి పోయింది. రాజేష్ వెంటనే వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళి “ఇదిగో”  అంటూ ఆమె ముందు నిలబడ్డాడు.

          ఆమె కళ్ళు ఇంతింతలయ్యాయి..ఆశ్చర్యం తో ఆనందంతో ..                       

          ఆమె ముందు – మోకాళ్ళ పైన కూర్చుని  “ఇన్నాళ్ళ నా ప్రవర్తన మీద నాకే అసహ్యం వేసింది. నన్ను క్షమించగలవా ?*” అన్నాడు పశ్చాత్తాపం నిండిన స్వరంతో.                       

          నీవు నన్ను పెళ్ళి చేసుకోక పోయుంటే ..నీ ముందు నా స్థాయి ఎంటో నాకు ఇవాలే తెలిసింది. భర్త ని కాబట్టి నీ పక్కన నిలబడగలిగే అర్హత నాకు కలిగింది. పూర్వ జన్మ సుకృతమేమో !” మనస్ఫూర్తిగానే అన్నాడు.

          “మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం అయిత లేదు.”

          “సరే , వదిలేయ్ ఆ విషయం. ఈ రోజు నుండి ఇట్ల మద్యరాత్రి నిద్ర పోకుండా తిప్పలు పడటం మానేయ్.  పాత పనిమనిషినే మళ్ళీ పిలిచిన. రేపటి నుంచి పనులన్నీ ఆమెనే చూసుకుంటది. నీ పనులు కూడా చేసిపెడుతది. నీవు చక్కగా ప్రశాంతంగా రాసుకోవచ్చు. “ఉన్నట్టుండి మీలో ఈ మార్పు . నాకేమీ అర్థం కావటం లేదు.”

          “మనుషులు అన్నాక మార్పు సహజం. ఆ విషయం మీ లాంటి సృజనాత్మకత గల వారికే బాగా తెలుస్తుంది. నేను మీకు చెప్పేంతవాడను కాను. ఇంకో విషయం . ఇంకెపుడూ ఏ విషయంలోనూ నన్ను పర్మిషన్ లు అడిగి నీ స్థాయిని అవమానించుకోకు. నీకు నచ్చినట్టుగా ఉండు.  సహనంలో నువ్వు  సముద్రంలాంటి దానివి.

          ఇవన్నీ మన సుప్రియకి కూడా నేర్పవా ! రేపు అది కూడా నా లాంటి వాడు దొరికితే నీలాగే వేగాలి కదా ?”  అన్నాడు..నవ్వుతూ.

          కావ్య కళ్ళలో ఆనంద భాష్పాలు ఆగటం లేదు. మరుసటి రోజు ఈ విషయం వైష్ణవికి ఫోన్ చేసి చెప్పింది.

***

          రాజేష్ ఒకరోజు వాళ్ళ టీం మేనేజర్ ని సకుటుంబ సపరివారంగా ఇంటికి పిలిచి కావ్యను పరిచయం చేసి , సర్ప్రైజ్  చేసి , విందు ఇచ్చాడు. ఆ పరిచయం వల్ల ‘మీన మీటిన వీణ ..” ఆంగ్లం లో కూడా ప్రచురించబడింది.

***

నందు కుషినేర్ల గారి పరిచయం :

పేరు : నందు కుషినేర్ల

చదువు :-ఎమ్.ఏ తెలుగు

ఉద్యోగం :- చైల్డ్ హెల్ప్ లైన్ జిల్లా టీం మెంబర్. నాగర్‌కర్నూల్ .

తల్లిదండ్రులు :- లక్ష్మి , రామాంజనేయులు గౌడ్.

స్వస్థలం :- ఉయ్యాలవాడ , నాగర్‌కర్నూల్ జిల్లా

అభిరుచులు : పుస్తకాలు చదవటం , రచనలు చేయటం.

రచనలు :- సామాజిక అంశాల మీద వ్యాసాలు, కథలు, కవితలు రాస్తుంటాను. ఎక్కువగా ఫేస్‌బుక్ లో రాస్తుంటాను.

*****

Please follow and like us:

2 thoughts on “కథామధురం-నందు కుషినేర్ల”

  1. ఈ కథ చదివాక మనసు ఆనందంతో పొంగి పోయింది. ఇంట్లో అందరూ కలిసి హేళన చేసినా, భర్త కొట్టినా, పట్టుదలతో వ్రాసి,తన సత్తా ఏమిటో నిరూపించుకుంది.ఇలాంటి కథల వల్ల స్త్రీలు స్ఫూర్తి పొంది తాము అనుకున్నది సాధిస్తారు.అభినందనలు.

  2. నందు కుషినేర్ల కథా పరిచయం .. ఎప్భిలో ఎంతో కొంత తెలుసును అనుకున్న నందు గారిని కొత్తగా పరిచయం చేసింది. తరాలు మారినా ఆడపిల్లల రాతలు మారనే లేదా అని అనిపించినపుడు ,యువ రచయిత నందు రచన ఆశావహంగా ఉంది సుమండీ. దమయంతి గారూ మంచి పరిచయానికి మీకు, మా రచయితకు అభినందనలు.

Leave a Reply

Your email address will not be published.