కొత్త అడుగులు – 36

‘మట్టిలోని మాణిక్యం’ – సునీత గంగవరపు

– శిలాలోలిత

          కవిత్వమంటేనే  మనిషిలో వుండే సున్నితమైన భావన. సాహిత్యాభిమానులందరికీ తమ నుంచి వేరుగాని, భావోద్వేగాల సమాహారమే కవిత్వం. ప్రతి ఊహలోనూ, ఆలోచనలోనూ అంతర్మధనంలోనూ కలగలిసి నిలిచిపోయే శక్తి కవిత్వం.

          సునీత గంగరరపు ఇటీవల రాస్తున్న కవయిత్రులలో ఎన్నదగినది. 

          ఆమె కవిత్వం గురించి  ఏమనుకుంటుందంటే –

          “కలలు కనాలి అవి ముక్కలవ్వాలి. మళ్ళీ అతుక్కోవాలి కష్టాలు తెలియాలి. కన్నీళ్ళు రావాలి. ఒక అసంతృప్తి నీడలా వెంటాడాలి. ఓ ఆలోచన ఆత్మీయంగా సేదతీర్చాలి. పగిలిపోయిన కలల శకలాలు కొన్ని హృదయాన్ని గాయపరచాలి. ఓ బాధ గుండెలో నిరంతరం సంఘర్షిస్తూ ఉండాలి. ఓ నిరాశ సునామీలా బతుకునంతా చుట్టేయాలి. మనసునంటుకున్న ఓ అనుభూతి స్పర్శ… ఉద్వేగ తరంగమై మనోదేహాలను ఆక్రమించు కోవాలి. వీటన్నింటిని నా జీవితంలోకి సమృద్ధిగా చేరవేసిన హితులు, సావిత్యాభిమానులు ఎందరో నా రచనకు ప్రోత్సాహాలు గా నిలిచారు.”

          కీ.శే॥ ఎండ్లూరి సుధాకర్ గారు ఎంతో ఆత్మీయంగా, ‘వెన్నెల చివుళ్ళు’ కవితా సంకలనానికి ముందు మాట రాశారు. ఇది 2018లో వచ్చింది. వెయ్యేళ్లు తెలుగు సాహిత్యంలో స్త్రీల ప్రాతినిధ్యం అంతంత మాత్రమే.

          అందులో అంటరాని స్త్రీల స్థానం అదో  లోకమే. అదో శోకమే. తెలుగు కవయిత్రుల  స్థానం వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు.

          వేశపోగు గుల్భానమ్మ నుంచి జూపాక సుభద్ర వరకు లెక్కిస్తే పట్టుమని పదిమంది  కూడా తేలరు.

          నీ దిండు కు కూడా మనసుందేమో….

          అది నా తలనే కాదు

          తలపుల్ని కూడా మోస్తుంటుంది

          కలల్నే కాదు.. కన్నీళ్లను కూడా

          తనలో యిముడ్చుకుంటుంది

          ‘కృష్ణ బిక్కి’ గారు కూడా  ముందుమాట రాసారు.

          స్త్రీపట్ల జరిగిన చారిత్రక విద్రోహాన్ని ప్రస్తావించారు.

          – పురుష ప్రమేయంలేకుండా

          ఎదగలేని పెరటి మొక్కను – ఇంకొక  చోట

          ‘మనువు చెక్కిన పురాపంజరంలో ప్రాణం లేని శిల్పాన్ని’ అని తేల్చేస్తుంది.

          పొత్తూరి సీతారామరాజు గారు ముందు మాట రాశారు.

          మనల్ని కదిలించేది కవిత్వం కాదు. జనాల్ని కదిలింఛేది కవిత్వం అన్నారు.  విపరీతమైన ఆనందం, బాధ కలిగినప్పుడు పొందే భావోద్వేగం సునీత కవిత్వంలో మనం చూడగలం అన్నారు.

          సునీత మొదట పుస్తకం ‘ఇట్లు…. ఓ ఆడ పిల్ల’

          రెండవది ఇప్పుడు చర్చించుంటున్న ‘వెన్నెల చివుళ్ళు’ పుస్తకం .

          77 కవితలలో ఒకచోట వెన్నెలంతా, లే చివుళ్ళతో కుప్పబోసినట్లుగా వుంది. ఒక స్పష్టమైన అవగాహన, పరిణితి. సమాజాన్ని బాగుచేయాలన్న  తపన పదే పదే  చాలా విధాలుగా కన్పిస్తుంటుంది.

          -జీవించడ మంటే

          శ్వాసించడం కాదని

          సమాజానికి సరికొత్త సందేశం ఇవ్వాలనేదే సునీత తపన.  కవితా శీర్షికలు కూడా ఆమె లోతైన తాత్వికతను చెబ్తూ పోతుంటాయి.  సామాజిక ప్రయోజనం కలిగి ఉండటం తో పాటు సాధారణ జీవిత సత్యాల్ని ఆవిష్కరించగలగాలి.   కవిత్వం కూడా మెత్తదనాన్ని, కొత్త దనాన్ని, సొంత సౌందర్యాన్ని  కలిగివుండాలి.

          మొదటి పుస్తకమైన ‘ఇట్లు.. ఓ ఆడపిల్ల ‘ – స్త్రీలు ఎదుర్కొంటున్నఅనేక సమస్యలను ఇతివృత్తంగా తీసుకొని రాసింది. ఇక, రెండవ పుస్తకమైన ‘వెన్నెల చివుళ్ళ’ కొచ్చే సరికి  అనుభూతి ప్రధానమైన ప్రేమ, భావోద్వేగాలతో పాటు ఇతర సామాజిక అంశాలతో కూడిన కవితలున్నాయి.

          దీనికి కడప జిల్లా సాంస్కృతిక సంస్థ వాళ్ళు ‘శ్రీ శ్రీ ‘ పురస్కారాన్ని 2019 లో ఇచ్చారు. 

          సునీత నాలుగు ఐదు తరగతులు చదివేటప్పుడే చిన్న చిన్న కథలు రాసేది.  వ్యాసాలు ఉపాధ్యాయుల మన్ననలు పొందడం తో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇప్పటికీ వందలకు పైగా కవితలు యాభై వరకు కథలు రాసింది. 

          సునీత జోసెఫ్, చల్లగాలి కృపమ్మల కుమార్తె.  వాళ్ళిద్దరూ హెచ్. ఎమ్ లు గా రిటైరయ్యారు.  తల్లితండ్రుల ప్రోత్సాహం సునీత పై చాలా వుంది.  ఎమ్.ఏ (హిస్టరీ ), ఎమ్.ఏ (సోషియాలజీ) ఎమ్.ఏ (తెలుగు) బి.యి.డి. పి.జీ.డి.జై (పీజీ డిప్లొమో ఇన్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం) ఇంతగా చదువు పట్ల శ్రద్ధ వున్నందున నిత్య విద్యార్ధి గానే కొనసాగిందనుకోవచ్చు.  స్వగ్రామం ‘దేవరాజుగట్టు’.   ప్రాథమిక విద్య మార్కాపురం చుట్టుపక్కలే కొనసాగింది.  ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డులెన్నో గెలుచుకొంది.

          అనేక మూఢ నమ్మకాలతో బతుకుతున్న పిల్లలను పాటల ద్వారా, నాటికల ద్వారా చైతన్య వంతుల్ని చేసింది.

          6, 7 తరగతులు చదువుతున్న పిల్లలకు పెళ్ళిచేయడం ఆమెనెంతో  కలచివేసింది. పిల్లలకు ఇష్టం లేకపోయినా, పెద్దల మాట కాదనలేని పరిస్థితుల్లో పిల్లలు బాల్య వివాహాలకు మెడలు వంచాల్సి వచ్చేది. ఎనిమిదవ తరగతి చదువుతున్న సోమిత, అనూరాధ అనే ఇద్దరి బాలికలకు ఒకేసారి పెళ్లి  జరుగుతుండటంతో, ‘చైల్డ్ కేర్’ అధికారులకు సమాచారమిచ్చి రప్పించింది. వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి వివాహాలు ఆపారు. ఆ క్రమంలో సునీత ఎంతో ఒత్తిడికి గురైనప్పటికీ ఇద్దరు పిల్లల జీవితాన్ని కాపాడగలిగాను కదా! అనే తృప్తి మిగుల్చుకుంది.

          ఆడపిల్లలతో చర్చాగోష్ఠి జరుపుతూ వాళ్ళను చైతన్యవంతుల్ని చేస్తూ, చదువు పట్ల ఆకర్షితులను చేసి వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించే దిశగా ప్రయాణిస్తోంది.

          అనేక అవార్డులు ఆమె నిర్మలమైన కృషికి అలవోకగా వచ్చాయి. ఇంతటి సామాజిక నేపథ్యం వున్న సునీత కవిత్వం నిండా ఆ ఛాయలు కన్పిస్తూనే వున్నాయి. ఈ రోజు సునీత గంగవరపుని పరిచయం చేయడం నాక్కూడా ఎంతో తృప్తిగా వుంది.

*****

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.