జ్ఞాపకాల సందడి-40

-డి.కామేశ్వరి 

 కావమ్మ  కబుర్లు -13

          ఆయనకి పప్పు అంటే కందిపప్పు వేయించి పప్పు వండడం కాదు, కందులు వేయించి పప్పులు విసిరి, పొట్టు  తీసి వండాలి. పప్పు సన్నని సెగ మీద కుంపటి మీద ఉడికిన ఆ పప్పు రుచి తల్చుకుంటే ఇప్పటికీ నోరు ఊరుతుంది.  అలాటి కమ్మని పప్పు అన్నంలో నెయ్యి వేసుకుని తినే ఆ రుచి సామిరంగా ఉంటుంది.  అలా ఒకో ముద్దకి ఒకో నేతి  గరిటెడు నెయ్యి వేసుకు సావకాశంగా తినేవారు.

          మనం కుక్కర్ లో కూర, పప్పు, అన్నం కలిపి ఓ దానిలో ఉడికిస్తే ఆ రుచి ఎలా వస్తుంది? మా రోజుల్లో పెద్ద కుక్కర్లో  ఒక్కో దానికి  ఒక గిన్నె, అన్నీ కలిసి ప్రెస్టేజ్  కుక్కర్ అని వచ్చేది. అప్పుడు అదే మాకు గొప్ప! తొందరగా వంటయి పోతుందని సంతోషమే కానీ ఆలా పప్పు సన్నని సెగమీద వండిన  రుచి ఎలా ఉంటుంది? మా వాడు ‘అమ్మమ్మ గారింట్లో పప్పు అంత  బాగుంటుంది మన ఇంట్లో ఎందుకిలా ఉంది?’ అనేవాడు  ‘ఆవిడకి ఓపికెక్కువ. ఇపుడు కాదు వేయించి విసరమన్నావా?’ అనేదాన్ని. ఇప్పుడు రైస్ కి ప్రత్యేకము కుక్కర్లు, ప్రెషర్ పేన్లు విడివిడిగా వండుకోడానికి వచ్చాయి కానీ మా టైములో ప్రెస్టేజ్ కుక్కరుని చూసి ఎంత సంబరపడ్డామో! మా అమ్మ చేతి వంటే  రుచి. మా నాన్న హెచ్చు తగ్గులు వస్తే తినరు కనక ఇంకా శ్రద్ధగా చేసేది. మా నాన్న వల్లే మాకు కంచంలో నాలుగైదు  రకాలు లేందే ముద్ద  దిగదు.  మీకు ఆ జనరేషన్లో మొగుడంటే ఎంత భయ భక్తులుండేవో చెప్పడానికి ఇంత చెప్పాను. ఇప్పుడయితే పెళ్ళం ఓ చూపు చూసి ‘గో అండ్ గెట్ ఇట్. అర్ధరాత్రి అప్పడమా?’ అంటుంది.

          ఈ జనరేషన్ పిల్లలయితే కప్పు కాఫీ అడిగితే ‘అబ్బా! నీవు చేసుకో ఆ చేత్తో నాకు చేసి పట్టుకురా!’ అనే చనువు. అండర్స్టాండింగ్ ఉందో లేదో నాకు తెలియదు కాని, ఆ జవాబులు వస్తున్నాయి. మా అమ్మలంత  ఘోరం కాదు కాని మేము వంటింటి పనులు బాగానే చేసేవారం. భర్తలకు వేళ వేళకి బాగానే వండిపెట్టాం.  మేమెప్పుడూ ఇటు పుల్ల అటు పెట్టి ఎరగం.  బయటి పనులకి బంట్రోతులు, ఇంట్లో వంటకి అమ్మ, అత్తయ్య ఉండేవారు. ఇంట్లో మడులు తడులు ఉండేవేమో, వంటింటి ఛాయలకి మమ్మల్ని రానిచ్చేవారు కాదు. అమ్మ ఎప్పుడైనా  అత్తయ్య లేనపుడు బయట చేరితే ఆ మూడు రోజులు చచ్చీ చెడీ అమ్మ చెప్పినట్టు అన్నం పడేసి, పప్పు కుంపటి మీద పడేసి, బంగాళాదుంపలు మూకుట్లో వేయిస్తే వంట అయి పోయేది. పెళ్లి అయ్యాక ఒక్కోటీ నేర్చుకుని వచ్చీరానట్టు వంటచేసి, కాస్త ఊహ జోడించి ఏదో వండి పెట్టి బాగుందంటే పొంగిపోయి, తగలేసావని తిట్టిన నాడు కోపాలు, అలకలు, బతిమాలుకోడాలు అన్నిటి మధ్య  వంటల్లో ఎక్స్పర్ట్స్ మైపోయాం.

          మా తరువాత తరం అంటే మా పిల్లల తరం వచ్చేసరికి ఆడవారు ఉద్యోగాలు, ఇంటా బయటా  చాకిరీ తప్పక, ఆడపని, మగ పని చేస్తూ నలిగి పోయారు. మగ అహంతో పెళ్ళాన్ని కాల్చుకు తినడం, సర్దుబాటుతనం లేక పాతమొగుళ్ళలా సతాయించితే భరించేవారు. అలా భరించచడం వల్ల కాకపోతే డైవోర్సులు మొదలయ్యాయి. ఇప్పుడైతే సగం సగం పని. ‘మేము ఉద్యోగాలు చేస్తున్నాం, జీతాలు తెస్తున్నాము. పనికూడా సగం పంచుకోవాల’న్న ధోరణి మొదలైపోయింది.

          మా నాన్న సంగతి చెప్పుకుంటే మహాభారతాలు అవుతాయి. ఆ రోజుల్లోనే అంటే 1945 ప్రాంతాల నాకు ఐదారేళ్లు ఉన్నప్పుడే మా నాన్నకి ఓ ఫోర్డ్ కారు ఉండేది.  ఇంకెక్కడి కన్నా వెళ్లినా లేకపోయినా ఆయన జ్యూరిస్ డిక్షన్ లో ఉన్న గుళ్లూ, గోపురాలు తీసుకెళ్ళే వారు. మా అమ్మా నాన్నలకి ఇద్దరికీ దేముడి భక్తి ఉండేది.         

కావమ్మ కబుర్లు – 14

‘మా నాన్నతో ప్రయాణం’ (మొదటి భాగం)

          మా నాన్నకి, అమ్మకి దైవ భక్తి ఎక్కువ ఉండేది. కనుక కొత్త ఊరు ట్రాన్సఫర్ అయినప్పుడల్లా ఆయన జ్యూరిస్ డిక్షన్ లోని ఊళ్లలో ఉండే పేరున్న గుళ్ళు, గోపురాలకు తీసుకెళ్లేవారు, ప్రయాణం కట్టి. ఆ ఫోర్డ్ కారు పుష్పక విమానంలా అందరినీ దాన్లో కూరేవారు. డ్రైవర్, ఆయన ముందు సీట్లో కూర్చుంటే మధ్యన మా అన్నయ్య కూర్చునేవాడు. వెనకసీట్లో మా అమ్మ, అత్తయ్య,  నలుగురు పిల్లలం. ఫోర్డ్ కార్ కి ఆ రోజుల్లో ఇటూ అటూ ఫుట్ బోర్డ్ లుండేవి.  వాటి మీద ఇటూ అటూ ఒక్కో డవాలా బంట్రోతు నిల్చునేవారు.   అలా ‘రాజు వెడలెఁ రవి తేజంబులదరగా’ – అన్నట్టు మా ప్రయాణం మొదలు. వెళ్ళేది ముప్ఫయి నలభయి మైళ్ళే అయినా  రెండు గంటలు పట్టేది. ఆ రోజుల్లో కంకర రోడ్లు. సిటీస్ అయితే తారు రోడ్లు ఉండేవి. అవి కూడా వెడల్పు లేకుండా రోడ్ మీద ఒకే వెహికిల్ వెళ్లేంత ఉండేవి. అటునించి ఏదన్నా బండి వచ్చిందంటే తప్పుకుని దారి ఇవ్వాల్సిందే. ప్రయాణంలో ఎడ్లబండి  ఎదురుగా వస్తే బండి వాడు భయపడి కిందికి దిగి, భయభక్తులతో దారి ఇచ్చేవారు. అలా ఎవడన్నా దిగడం, దారి ఇవ్వడం ఆలస్యం చేసాడంటే ‘ఒరేయ్ గాడిదా, అడ్డు తీయరా. కళ్లు కనిపించడంలేదా?  బండి తీయి’ అని ఒక్క కేక పెడితే భయంతో దండాలు పెడుతూ, పక్కకి ఎద్దులు లాగేవారు. ఆ రోజుల్లో కారు అరుదుగా ఏ దొరగారో వస్తే కనపడేది. జీప్ అయితే ఏ గవర్నమెంట్ ఆఫీసరో వస్తే కనపడేది. ఈయన బంట్రోతులు ఆయన కాకీ డ్రెస్ చూసి ఏ పెద్ద దొరో అనుకునేవారు. ఈయన అధారిటీ జులుం అలా ఉండేది. ఇప్పుడైతే  చీఫ్ ఇంజనీరయినా, చీఫ్ సెక్రెట్రీ, ఎమ్మెల్యే, మినిస్టర్ వచ్చినా నిలబెట్టి జాడిస్తున్నారు ప్రజలు. బ్రిటిష్ రాజ్యంలో గవర్నమెంట్  ఉద్యోగికి అంత పవర్ ఉండేది. అప్పుడే కాదు ఎప్పుడుయైనా చేస్తుంది ఏ పోలీసు ఇన్సపెక్టర్ అయినా జడ్జిగారు, కలక్టర్ అయినా అవసరమొస్తే లక్షాధికారైనా ఎంత పెద్ద బిజినెస్ మెన్ అయినా చేతులు కట్టుకు నిలబడాల్సిందే కదా!   వాళ్ళ జీతాలని బట్టి కాదు, వాళ్ళ కుర్చీకున్న పవర్ అది. అంత  పవర్ చేతిలో ఉంటుంది కనకే అంతా  గవర్నమెంట్ ఉద్యోగాలు జీతభత్యాలు తక్కువయినా ఎగబడతారు.

*****

( సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.