పాతసీసాలో కొత్తనీరు

(నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

– గొర్తివాణిశ్రీనివాస్

          బయట ఆడుకుంటున్న పిల్లల్ని  గమనిస్తూ కూర్చుంది రమణి.

          వాళ్లలో ఎంత నిష్కల్మషత్వం! ఆటల్లోపడితే సమస్తాన్నీ మర్చిపోతారు. ఒక ఆట ముగిసేసరికి మరో సరికొత్త ఆటకు సిద్ధమైపోతారు. ఎప్పుడూ కొత్తదనాన్ని వెతుక్కుంటారు. ఏ ఆట ఆడినా అందులో పూర్తిగా లీనమైపోయి మజాని చవిచూస్తారు.

          అలిసిపోయిన పిల్లలు మామిడి చెట్టు కింద కూర్చుని నీళ్లు తాగుతూ వాళ్ళ ఆటల్లోని లోటుపాట్ల కంటే తృప్తి తాలూకు స్థాయిల్ని గతంతో బేరీజు వేసుకుంటున్నారు.

          సెలవుల్లో మధ్యాహ్నం వచ్చి ఆడుకోవాలిరా. క్రితం ఆదివారం విఠల్ వాళ్లొచ్చి మన ఆటను పాడుచేశారు.  వాడి గ్యాంగ్ ఉట్టి తొండిగాళ్ళు. అన్నాడు ఒకడు.

          “తొండాడినా లాస్ట్ లో మనతో కలిసిపోయారుకద రా. వాళ్ళ ఇంటి దగ్గర గ్రౌండ్ లేదుట ప్రతిసారీ మన దగ్గరకే వచ్చి ఆడుకుంటాం మీ జట్టులో కలుపుకుంటారా అని ఆడిగారుగా. ” అన్నాడు ఒక పిల్లాడు

          పిల్లల మాటలు వింటున్న రమణి చిన్నగా నవ్వుకుంది. గొడవలు పడినా ఇట్టే కలిసిపోతారు. 

          రమణి వదిన పుష్ప కూడా వచ్చి అరుగుమీద కూర్చుంది. “పిల్లల్లో ఆ  సర్దుబాటు ధోరణి చూశావా? విసుగు రాకుండా  కొత్త ఆటలు కనిపెట్టి మరీ ఆడుకుంటారు. కబడ్డీ ఆట నిన్నొకలా ఆడారు. ఇవాళ కూత మార్చి తలకి రంగు రిబ్బన్లు కట్టుకుని తమాషాగా ఆడుతున్నారు. ” అంది పుష్ప పిల్లల వైపు చూసి నవ్వుతూ.

          “తలనొప్పిగా వుంది. కాసేపు పడుకుంటానొదినా” అనిచెప్పి తన గదిలోకి వెళ్లి తలుపేసుకుని పడుకుంది రమణి. నిద్ర పట్టట్లేదు. ఫ్యాన్ రెక్కల్లా ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి.

          పెళ్ళిచూపుల్లో నీరజ్ రమణికి నచ్చాడు. మంచి సంప్రదాయమైన కుటుంబం. అబ్బాయికి ఎటువంటి దురలవాట్లూ లేవు. పిల్లవాడు బుద్ధిమంతుడు. అని రమణి పిన్నీ బాబాయిలు చెప్పారు.

          పిన్నీ వాళ్ళు నర్సీపట్నంలో వున్నప్పుడు వీళ్ళ పక్కింట్లోనే నీరజ్ వాళ్ళు ఉండే వాళ్ళు. ఒంచిన తల ఎత్తని యోగ్యుడు. ఈ కాలంలో ఇలాంటి కుర్రాళ్ళు అరుదు. సంప్రదాయాలను పాటించే మనుషులు. అని రెండువైపులా వాళ్లే మాట్లాడి పెళ్లి చూపులకి ఏర్పాట్లు చేశారు.

          రమణి స్నేహితురాళ్ల భర్తల్ని చూశాక పధ్ధతి గల అబ్బాయికే ఓటేసింది రమణి.
పెద్దవాళ్ళ అదుపాజ్ఞలలో పెరిగిన మగపిల్లలు భార్య మనసు తెలుసుకుని మసలు కుంటారని, వేరే అమ్మాయిల్ని కన్నెత్తైనా చూడరని, విడిపోవాలన్నఆలోచన కలలోనైనా చేయరని బాగా ఆలోచించి నీరజ్ తో పెళ్లికి ఒప్పుకుంది .

          ఇద్దరూ ఎం బీ ఏ చేశారు. ఇద్దరూ ఉద్యోగస్తులే. నీరజ్ ఒక్కడే కొడుకు. ఇంకేం కావాలి మంచి సంబంధం దొరుకిందని  ఇద్దరికీ పెళ్లి జరిపించారు.

          ఇద్దరూ హైదరాబాద్ లో కొత్త కాపురం మొదలుపెట్టారు. అంతా బాగున్నా వంట దగ్గరే అసలు సమస్య ఎదురైంది. నీరజ్  వర్క్ ఫ్రమ్ హోమ్. రమణి ఉదయం ఎనిమిది గంటలకు ఆఫీస్ కి బయలుదేరాలి. నీరజ్ పొద్దున పదింటికి నిద్రలేస్తాడు.

          రమణి సాయంత్రం ఆరింటికి ఇంటికి వస్తుంది. నీరజ్ రాత్రి ఏడుకి టీమ్స్ లో లాగిన్ అవ్వాలి. వాళ్ళిద్దరి మధ్యా  ఊరిస్తూ ఒక గంట మాత్రమే టైం మిగిలుంది.

          ఉన్న ఒక్క గంటా వంట చేస్తూ టైం వేస్ట్ చేయడం  ఎందుకని ఇద్దరికీ ఫుడ్ ఆర్డర్ పెట్టేది రమణి. వాళ్ళకి ఆ గంటా క్షణ క్షణం ఎంతో అమూల్యంగా గడిపేవారు.

          వాళ్ళ కాపురం అలా కొన్నాళ్ళు సంతోషంగా సాగిపోయింది.

          ఒకరోజు నీరజ్ అమ్మా నాన్నా, అతని బామ్మా వచ్చారు. రమణి వాళ్ళ రాకకి ఎంతో సంతోషించింది. ఇంట్లో పెద్దవాళ్ళుంటే కొన్ని పనులు వాళ్ళు చూసుకుంటారు. అదో భరోసా. నీరజ్ కి పచ్చళ్లంటే ప్రాణం. అత్తగారు రోజుకో కొత్త పచ్చడి చేసి పెడతారు.
నీరజ్ ఫుడ్ విషయంలో తను ఎక్కువ ఆందోళన పడక్కర్లేదనుకుంది.

          కానీ తను అనుకున్నదానికి విరుద్ధంగా జరిగింది.

          పొద్దున లేవగానే అందరికీ కాఫీలు తనే ఇవ్వాలి. వంట కూడా చేసి ఉంచాలి. సాయంత్రం రాగానే మళ్లీ టీలు, స్నాక్స్ తనే చెయ్యాలి. పోనీ బయట నుంచి తెచ్చి పెడదామంటే వాళ్ళకి బయట చేసినవి పనికిరావు.

          “మా వాడికి సాయంత్రం పూట బయటవి తెప్పించి పెడుతున్నావుటగా. అవి ఆరోగ్యానికి అంత మంచివి కావు” అంది నీరజ్ బామ్మ.

          అంటే ఇక్కడ జరిగేవి అక్కడకి చేరేసాడన్నమాట. అందుకే పటాలం దిగింది అనుకుంది.

          వచ్చినందుకు వంట చేయరు సరికదా వాడు సంపాదిస్తున్నాడుగా నువ్వెందుకు హైరానా పడతావ్. ఉద్యోగం మానేయరాదా అంటున్నారు వీళ్ళు..

          ఇంత చదువు చదువుకుని మళ్లీ ఆ కాలం వాళ్ళలా ఇంటికే పరిమితంకావాలా?
అంటే..

          “ఎంత చదువుకున్నా ఆడది ఆడదేగా. పిల్లల్ని కనాల్సింది వాళ్లేగా. అంతా మారి పోయిందని మీరనుకోడమే గానీ అనుకుంటున్నారుగానీ  సృష్టి ఎక్కడైనా మారుతుందా” అని పై మాటలెన్నో మాట్లాడారు.

          సమస్య ఎక్కడుందో తెలీక గందరగోళంలో పడింది రమణి.

          అదే విషయం భర్త దగ్గర ఫిర్యాదు చేసింది.

          “అసలు వీళ్ళ ప్రాబ్లెమ్ ఏంటండీ? వాళ్లే ఇంత వండుకుతిని నాకూ పెట్టొచ్చుగా. అంటీ ముట్టనట్టు కూర్చోడం దేనికి?”అంది.

          “అన్నీ అవే సర్దుకుంటాయ్. కాస్త ఓపికపట్టు. వాళ్ళు పాతకాలం మనుషులు. ఆ కాలంలో భార్యాభర్తల్లా మనం వుండట్లేదని వాళ్ళ బాధంతా. ఈ కాలంలో భార్య సేవలు ఆశించడం ఎంత వరకూ సబబో వాళ్లే మెల్లిగా  అర్ధంచేసుకుంటారు” అన్నాడు.

          “ఎన్నాళ్లు ఓర్చుకోమంటారు? ఇల్లూ ఆఫీసూ తప్ప మరోలోకం తెలియని మీరింతే అని సర్దుకుపోతున్నాను. నా స్నేహితురాళ్లలా చెలో పొలో మంటూ ఊరేగకపోయినా పోన్లే అనుకుని సరిపెట్టుకుంటున్నాను. స్విగ్గిలో ఫుడ్ ఆర్డర్ పెడితే తప్పు. ఉద్యోగం చేయడం తప్పు. నా ఇష్టాఇష్టాలకి విలువలేదా? అసలు కొత్త దంపతుల మధ్యకు వాళ్ళెందు కొచ్చినట్టు?

          అబ్బాయికి పెళ్లయ్యేదాకా అవలేదని బాధ. అమ్మాయి దొరికితే చాలని మొక్కు కుంటారు. మా సొంత కూతురిలా చూసుకుంటాం అని నమ్మబలుకుతారు. చివరికి ఇలా చేస్తారు. అసలు ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం నేనే కాబట్టి నేనే వెళ్లిపోతాను. మీ వాళ్ళతో కలిసి మీరే హాయిగా వుండండి”అని రమణి ఇల్లు విడిచి వచ్చేసి నెలయ్యింది.

          సంధులూ రాయబారాలూ నడుపుతున్నారు. తనని వాళ్ళు అర్ధంచేసుకోనందుకు కోపం వచ్చింది. వాళ్ళు తనని సాధించినందుకు తనూ దూరంగా ఉంటూ వాళ్ళని సాధించాలనుకుంది. అందుకే అదే ఊళ్ళో వుంటున్న తన  అన్నయ్య ఇంటికి వచ్చేసింది రమణి.

          విడిపోతారా అనే ప్రశ్నకి తన దగ్గర సమాధానం లేదు. విడిపోయేంత కారణాలేం లేకపోయినా కలిసుండాలనే కోరిక రోజు రోజుకీ పోతోంది. విడాకులు మాత్రం ఇవ్వకూడదు అనుకుంది.

          చీకటి పడింది. పిల్లల ఆటలు సర్దుమణిగాయి. వదిన పిల్లలకి స్నానాలు చేయించి కూర్చోబెట్టి చదివిస్తోంది. ఒక ఆడ ఒక మగ. మేనకోడలు శ్రద్ధగా చదువుకుంటోంది. ఎంత గొప్పగా చదివినా సర్దుకుపోవడం అమ్మాయి వంతేగా అనుకుంది రమణి.

          “మీ ఆటల్లో చూపించే తెలివి చదువులో కూడా చూపించండి. మీ ఆటగాళ్లలో ఎవర్ని ఏ చోట్లో నిలబెడితే ఆటగెలుస్తారో, ఎవరి బలాలూ బలహీనతలేంటో తెలుసుకునే ఆడతారుగా. ఆ సూత్రమే అన్నిట్లో ఉపయోగపడుతుంది. లెక్కలు సైన్సు సోషల్ తెలుగు మీ స్నేహితులనుకోండి. దేనితో ఎలా జతకట్టి ఈజీ చేసుకోవాలో ఆలోచించండి.”
ఒదిన పిల్లలికి చెబుతున్నదంతా రమణి వింటోంది.

          నీరజ్ రమణికి ఫోన్ చేశాడు. తన వాళ్ళని తను ఎప్పుడూ వదిలి వుండలేదని, నీకు ఇష్టం లేకపోతే తిరిగి నర్సీపట్నం పంపేస్తాను. నువ్వు ఇంటికి తిరిగిరా’ అన్నాడు.
అతని గొంతులో బాధ ధ్వనించింది.

          రమణి ఆ రాత్రంతా బాగా  ఆలోచించింది.

          మర్నాడు ఇంటికెళ్లింది. తనని చూసిన నీరజ్ మొహం సంతోషంతో విచ్చుకుంది.

          అత్తగారూ మామగారూ బామ్మగారూ యుద్ధంలో గాయపడ్డ సైనికుల్లా నిస్సహాయంగా చూసారు.

          రమణి వాళ్ళందర్నీ నవ్వుతూ పలకరించింది. ఆటోలోంచి దింపిన పెద్ద బస్తాని లోపలికి లాక్కొచ్చి పడేసింది. తిరుపతి పెద్ద హుండీ చుట్టూ తిరిగే భక్తుల్లా సంచీని రౌండప్ చేశారు.

          మూట విప్పి ముందుగా రోలూ రోకల్నీ బయటకు తీసింది. బామ్మగారు సంభ్రమంగా దాన్ని అందుకున్నారు.

          “రోట్లో కందిపచ్చడి చేస్తే నోట్లో నీళ్ళూరాలి. సాయంత్రం దీంట్లో పచ్చడి నూరతా” అంది సంచిలో ఇంకేవేం వున్నాయో అని తొంగి చూస్తూ.

తిరగలి తీసింది.. “కందిసున్ని, మినపసున్ని తిరగట్లో విసురుకుంటే ఆ రుచేవేరు. ఎంత ముద్దొస్తోందో బుజ్జిముండ. మా రోజుల్లో ఆవపొడి విసిరి పచ్చడి పెట్టుకునేవాళ్ళం” అని లొట్టలేస్తూ సంచీ లోపలికి తలపెట్టి చూసి అందులోంచి కత్తిపీటని తీసింది బామ్మగారు
గుప్త నిధిని బయటకు వెలికితీసినంత ఆనందంగా.

          అప్పడాల కర్ర, ఇనప పెనం, అట్లకాడ, చెవుల్లేని బోడి ఇత్తడి బూరెల మూకుడు, దుప్పి కొమ్ముల్లాంటి పట్టకార, బొగ్గుల కుంపటి, ఇత్తడి కాఫీ ఫిల్టర్ నర్సీపట్నంలో వాళ్ళు వాడుకునే సామానంతా హైదరాబాద్ లో ప్రత్యక్షమైంది.

          కుక్కర్లో వంట చేయడం అలవాటు లేదు వాళ్ళకి, మిక్సీలు, గ్రైండర్లూ తిప్పితే ఆ శబ్దానికి తల గిరగిరా తిరిగినట్టుంటుంది. దబరా గిన్నెతో గంజి వార్చటంలో  వుండే సుఖం మరెందులోనూ కానరాదు. మిక్సి, గ్రైండర్, కుక్కర్ ముసుగు కప్పుకుని మూల చేరాయి.

          వంటింటి సామ్రాజ్యాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు బామ్మగారు. అత్తగారు స్టోరూమ్ ని కబ్జా చేశారు. నవనవలాడే కూరలు తెమ్మని మామగారికి పురమాయింపులు కూడా అయిపోయాయి.

          సమస్య ఎక్కడుందో కనిపెట్టడంలో తలెత్తిన ఇబ్బందులు తప్ప తనవి పెద్ద సమస్యలు కావని అర్ధం చేసుకుంది రమణి. తను కోరుకున్న జీవితాన్ని ఆనందంగా అనుభవించొచ్చన్న భరోసా చిక్కింది. 

          ఎవరిక్కావాల్సింది వాళ్ళకిచ్చేస్తే కంఫర్ట్ దానంతటదే వస్తుందని ఆలస్యంగానైనా తెలుసుకుంది  రమణి. బామ్మగారు వంటింట్లో, మనవరాలు పడకింట్లో ఇద్దరూ సంతోష  సామ్రాజ్యాలనే ఏలేస్తున్నారు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.