మా శృంగేరి యాత్ర!-3

-సుభాషిణి ప్రత్తిపాటి

 
          కనులారా కమలభవుని రాణిని కాంచిన ఆనందం, కడుపునిండా కమ్మని దక్షిణాది భోజనం ఇచ్చిన తృప్తి మమ్మల్ని నిద్రలోకి జార్చగా…మా తులసీరాం అదేనండి మా డ్రైవర్, మమ్మల్ని మురుడేశ్వర్ చేర్చాడు. ఏడయిపోతోంది, త్వర, త్వరగా దర్శనానికి వెళ్ళండంటూ హడావుడి పెట్టేశాడు.
 
          వెళుతూ రాజగోపురాన్ని ఆగి, చూడలేకపోయాము. స్వామి వారిని పది నిమిషాల వ్యవధిలోనే దర్శించుకోగలిగాము. ఆ శివయ్య పై ఉంచిన పూవుల పేరేదో తెలియదు కానీ, భలే వింత వాసనతో తెల్లగా గుత్తులుగా మన వత్తుల మాదిరిగా ఉన్నాయి. భస్మోద్ధూళితుడైన ఆ ముక్కంటిని స్తుతిస్తూ… నెమ్మదిగా ఆలయ సౌందర్యాన్ని , శిల్పాలను పరిశీలిస్తూ ఆలయం వెనుక వైపుకు వెళ్ళాము.
 
          అతి పెద్ద ఈశ్వర విగ్రహం విద్యుద్దీపాల వెలుగులతో మెరిసిపోతూ అలౌకికమైన పారవశ్యాన్ని కలిగించింది.
 
          బంగారు గోపురం తో ఆలయం వెలిగిపోతోంది. ఆలయ వెలుపల భాగం భక్తులతో క్రిక్కిరిసిపోయింది. అక్కడ సెల్ఫోన్ లతో ఫోటోలు తీసుకోవటంతో మరింత కోలాహలంగా ఉంది.
     
          స్వామి వారి పవళింపు హారతిని చక్కగా చూసుకుని బయటకు వస్తుంటే…అప్పుడు ఆ ప్రక్కనే సముద్రాన్ని చూశాం…బోలెడంత ఆశ్చర్యంగా అనిపించింది. ఆ అలల పైగా ఒక రాంప్ కట్టి ఉంది. అలలు ఆలయ గోడల్ని తాకుతూ వెళ్ళడం, ఆ చీకటి దూరంగా వెలిగే దీపకాంతుల మెరుపులో అత్యద్భుతమైన ఆ దృశ్యం మదిని ఇప్పటికీ వీడ లేదంటే నమ్మండి. గీతోపదేశం శిల్పం, ఇంకా అనేక శిల్పాలు చెక్కబడి ఉన్నాయి ఆ ఆలయం లోపల. చాలా ఎత్తులో అనేక అంతస్తులతో ఉన్న రాజగోపురం గొప్ప ఆకర్షణ అక్కడ.
 
          ఆ రాత్రి సముద్రం ఎదురుగా ఉన్న సీ పార్క్ రిసార్ట్ లో విడిది చేశాం. వేకువనే లేచి అలా బయటకు వస్తే అరేబియా సంద్రం చల్లగా పలకరించింది. అయితే…ఆ పరిసరాలన్నీ చాలా అపరిశుభ్రంగా ఉండడం, విపరీతమైన చేపల దుర్వాసన వలన బీచ్లో నడవాలనుకున్న నా కోరిక తీరలేదు.
 
          మా ప్రయాణం మొదలైంది వెన్నదొంగ కృష్ణయ్య దగ్గరకు. సెట్ దోశల బ్రేక్ ఫాస్ట్ చేసి, మెల్లగా సాగాం.
 
          ఉడుపి అనగానే చిన్నప్పుడు మా ఊళ్ళో ఉండే ఉడుపిహోటల్ గుర్తుకు వచ్చింది. దాంతో పాటు, ప్రవచనాల్లో విన్న మహాభారతం కథా గుర్తుకు వచ్చింది.
 
          మహాభారత యుద్ధం లో ఇరుపక్షాలకు ఉడుపి రాజు తన సైన్యంతో వంటలు వండించి, తన వంతు సహకారాన్ని అందించారట. అదిగో అప్పటి నుంచి ఉడుపి భోజనాలకు పేరెన్నిక గన్నదన్నమాట.
 
          పదిగంటలకల్లా ప్రదక్షిణ వలయంలో కి ప్రవేశించాము.‌ కేరళ పద్ధతిలో అక్కడ ఆలయ నిర్మాణం ఉన్నట్లు అనిపించింది. ఆ వరుసలో దాదాపు గంటన్నర ఉండిపో వలసి వచ్చింది. ఆ ప్రక్కనే మధ్వ మఠం, స్వామి పుష్కరిణి కనిపించాయి. అక్కడ అనుష్టానం చేస్తున్న వేదవిద్యార్థులు కనిపించారు. ఎట్టకేలకు ఆలయ భవనంలోకి అడుగుపెట్టాము. ముఖద్వారం వైపు స్వామి వారి అంతరాలయ వెనుక భాగం ఉండడం ఇక్కడ ప్రత్యేకత. 
 
          దసరా వేడుకలు కనుక బంగారం, వెండితో మెరిసే ఆలయమంతా వన్నె పూలతో, తులసీదళాలతో , రంగు రంగుల దీపాలతో వెలిగిపోతోంది.
 
          బాలకృష్ణయ్య కవ్వంతో ఇచ్చే ఆ దివ్యదర్శనం కటకటాల నుంచే…అది నవగ్రహ కిటికీ అట. ఆ రోజు స్వామి సత్యభామ అవతారంలో చూసి పులకించిపోయాము.‌ దేవకీదేవి కోరిక మేరకు శ్రీ కృష్ణుడు ఆమెకు బాలకృష్ణునిగా కనిపించి , లీల చూపారట. ఆ రూపాన్ని రుక్మిణీ దేవి ఆరాధించదలచి, విశ్వకర్మ ను కోరగా సాలగ్రామం తో ఇపుడున్న స్వామి వారిని కల్పించారట. రుక్మిణీ చే పూజలందుకున్న ద్వారకనాటి విగ్రహమే కాలాంతరంలో నీట మునిగి, 13 వ శతాబ్దంలో వెలికి రావడం, మధ్వాచార్యుల చే పునఃప్రతిష్ట చేయడం జరిగినట్లు అక్కడి స్థల పురాణం పుస్తకాల ద్వారా తెలుసుకున్నాము. అక్కడి హనుమాన్ ను, గోడల పై చిత్రాలను అన్నీ తనివితీరా చూస్తూ…కళ్యాణమండపం/ వసంత మండపానికి చేరాము. మా భాగ్యం అక్కడ కృష్ణ కళ్యాణం ఆఖరి ఘట్టం చూడగలిగాము. ఆ మధ్వ పీఠాధిపతి వారి దర్శనం కూడా పొందగలిగాము.  
 
          హారతి తీసుకుని పై అంతస్తులో భోజనశాలకు నడిచాము. ఉల్లి లేని అత్యంత రుచికరమైన కమ్మని వేడి వేడి భోజన ప్రసాదాన్ని ఆస్వాదించాము. అక్కడ పుస్తకాలు, ప్రసాదం కొనడం మాత్రం మరచిపోలేదు సుమండీ!!
 
          కన్నుల పండువగా ఉన్న ఆ ఆలయ ఆవరణను సజీవచిత్రంలా మనసు పొరల్లో భద్రంగా దాచుకుని వెనుతిరిగాము. ఇప్పుడు మరలా ఆదిదేవుని దగ్గరకే….నేత్రావతి నది ఒడ్డున కొలువైన మంజునాథుని చూడాలనే.
 
          మరి మరో భాగంలో ఆ విశేషాలు ముచ్చటించుకుందాం! అందాకా హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే కృష్ణ!
*****
(సశేషం)

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.