యాదోంకి బారాత్-3

-వారాల ఆనంద్

వేములవాడ ఫిలిం సొసైటీ స్థాపన- దృశ్య చైతన్యం

          ఉత్తమ సినిమాల్ని ప్రజలకు చేరువ చేసే క్రమంలో నేను గత నాలుగు  దశాబ్దాలకు పైగా ఫిలిం సొసైటీ ఉద్యమంలో కృషి చేసాను. ఆ పని 23 ఆగస్ట్ 1981 రోజున ఆరంభమయింది. ఆ రోజు అప్పటికి మామూలు గ్రామమయిన వేములవాడలో ఫిలిం సొసైటీని ప్రారంభించాం. ఇక అప్పటి నుంచి అర్థవంతమయిన సినిమాల్ని చూడడం అధ్యయనం చేయడం, వాటిపైన రాయడం మొదలయింది. అందుకే వేములవాడ ఫిలిం సొసైటీ నాకు ఒక పునాది. ఓ చైతన్య వారధి. కేవలం అయిదారువేలమంది జనాభా గల వూర్లో రేకుల షెడ్డు లాంటి సినిమా హాల్లో సత్యజిత్ రే, మృణాల్ సేన్, గౌతం ఘోష్, బి.ఎన్.రెడ్డి లాంటి వాళ్ళ సినిమాలు ప్రదర్శించడంతో పాటు, పలు సెమినార్లు నిర్వహించడమూ గొప్ప అనుభవం.

***

          ‘కళలన్నింటి లోకీ చలన చిత్రకళ మహోత్కృష్ట మయినది’ అన్నాడు లెనిన్ ఒక చోట. అలాంటి అత్యంత ప్రభావవంతమయిన మాధ్యమాన్ని ప్రజలకు అందించాలనే ఆలోచనతో దేశవ్యాప్తంగానూ, ప్రపంచ వ్యాప్తంగానూ ఆరంభమయినవే ఫిలిం సొసైటీలు. సమాంతర సినిమాల మీద నాకయితే 80కి ముందు అంపశయ్య నవీన్  నేతృత్వంలో ఏర్పాటయిన  కరీంనగర్ ఫిలిం సొసైటీ లో కొన్ని సినిమాలు చూడ్డంతో మొదలయింది.

          ఇక 1980 ఏప్రియల్లో సిరిసిల్లా జూనియర్ కాలేజీలో ఉద్యోగంలో చేరడం, వేములవాడ తాతయ్య వాళ్ళ ఇంట్లో వుండి షటిల్ సర్విస్ చేయడం మొదలయ్యాక ‘లయ’ కవితా సంకలనం వచ్చింది. అప్పటికే వూర్లో నటరాజ కళానికేతన్ కార్యక్రమాలు వెనక్కి బట్టాయి. ఇక వేములవాడలో ఏదయినా చేయాలి కాలం ఇట్లా వృధాగా గడపడంలో అర్థం లేదని మిత్రుడు ఇట్టేడు కిరణ్ కుమార్ తో ఫిల్మ్ సొసైటీ పెడితే ఎట్లా వుంటుంది అన్నాను. కిరణ్ వెంటనే స్పందించాడు. ఏంచేయాలో నువ్వు చెప్పు బావా ఎట్లా చేయాలో నేను చూస్తాను అన్నాడు. మరో ఆత్మీయుడు పి.ఎస్.రవీంద్ర తో చర్చిస్తే బ్రహ్మాండంగా వుంటుంది పదండి ముందుకు అన్నాడు. నాకు లోపలెక్కడో ఇంత చిన్న వూర్లో మనతో అవుతుందా అనే మీమాంస పీకుతూనే వుంది కాని కిరణ్ రవీంద్రలు రెండు వైపులా వుండి అరె నువ్వు ప్రణాళిక వెయ్యి నడిపిద్దాం అన్నారు.

          మొదట కలిసివచ్చే వాళ్ళతో కార్యవర్గం రూపొందించాలి. గోకుల్ టాకీస్ యజమానితో మాట్లాడి ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు సినిమా వేసుకునే అవకాశం కల్పించమని అడగాలి, సభ్యత్వాలు చేయించాలి. ఇవీ మా ముందున్న పనులు. ఏ సినిమాలు వేయాలన్నది నా భాద్యత. అంతే వేములవాడ రోడ్లమీద పడ్డాము. నగుబోతు ప్రభాకర్ అధ్యక్షుడిగా, నల్ల ప్రభాకర్, డా కే.మనోహర్ ఉపాధ్యక్షులుగా, వారాల ఆనంద్ కార్యదర్శిగా, ఇట్టేడు కిరణ్ కుమార్ సంయుక్త కార్యదర్శిగా, నగుబోతు చంద్రమౌళి కోశాధికారిగా పి.ఎస్.రవీంద్ర, జింబో, వజ్జల శివకుమార్, ఎడ్ల రాజేందర్, యాద కిషన్, కృష్ణ చంద్ర తో పాటు ఇంకా పలువురు కార్యవర్గసభ్యులుగా కమిటీ రూపొందింది. సభ్యత్వ కార్డులు మిగతా పనులన్నీ పూర్తి  అయ్యాయి. ఇక సినిమా కోసం నేను మొట్టమొదటిసారిగా సికింద్రాబాద్ ఆర్పిరోడ్ లో వున్న సినిమా డిస్ట్రిబ్యూటర్ల  ఆఫీసుల చుట్టూ తిరిగి సత్యజిత్ రే ‘షత్రంజ్ కే కిలారీ’ సినిమా ప్రారంభ చిత్రంగా వేయడానికి బుక్ చేసాను. ఇక సొసైటీ ని ప్రారంభించడానికి FEDERATION OF FILM SOCIEITES OF INDIA Regional committee member ఎం.ఫిలిప్ ని సంప్రదించాను. వేములవాడ ఎక్కడుంటుంది, ఏ సినిమా వేస్తున్నారు అంటూ పలు ప్రశ్నలు వేసి తాను రావడానికి అంగీకరించాడు. ఇక స్థానిక ఏర్పాట్లల్లో కిరణ్ రవీంద్రలతో పాటు మిగతా సభ్యులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. అప్పుడు ఊర్లోకి హైదరాబాద్ నుండి సూపర్ పేర ఒకే బస్ వచ్చేది దాన్లోనే సినిమా బాక్సులు వేములవాడ చేరేవి. అట్లా 23 ఆగస్ట్ 1981 రోజున గోకుల్ టాకీస్ లో ఉదయం వేములవాడ ఫిలిం సొసైటీ ప్రముఖుల సమక్షంలో ప్రారంభమయింది. అప్పటి మండలాద్యక్షుడు ఆర్. పాపారావు, సర్పంచ్ ప్రతాప చంద్రమౌళి, డాక్టర్ ఎం. రఘుపతి రావుల సమక్షంలో ఫిలిప్ ప్రారంభ ఉపన్యాసంతో సొసైటీ షురూ అయింది. సభ బాగా జరిగి సినిమా మొదలయింది.

          ఆనాటి ప్రారంభ కార్యక్రమానికి కరీంనగర్ ఫిలిం సొసైటీ నుంచి నరెడ్ల శ్రీనివాస్, రేణికుంట రాములు, డి.నరసింహారావు, ఉప్పల రామేశం మమ్మల్ని అభినందించడానికి వచ్చారు, ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో మా అధ్యాపకుడయిన నరసింహా రావు గారు ఆనంద్ యు ఆర్ బిహైండ్ దిస్ అని మనస్పూర్తిగా అభినందించాడు. ఇక సిరిసిల్లా నుంచి ఆత్మీయులు రుద్ర రవి, ఫసి, జూకంటి జగన్నాధం ఒకే స్కూటర్ మీద వచ్చారు. అదొక పండుగ వాతావరణం. ఇదంతా బాగానే వున్నా సినిమా పై సభ్యుల ప్రతిస్పందన ఎట్లా వుంటుంది, appreciate చేస్తారా లేదా అన్నది నన్ను తొలుస్తున్న ప్రశ్న. అప్పటిదాకా సభ్యుల్లో అధిక శాతం వ్యాపార సినిమాలకు అలవాటుపడ్డ వాళ్ళే. నాకదో బెంగగా అనిపించసాగింది. సినిమా ముగిసేంత వరకు అది కొనసాగింది. కాని అనేక మంది టీచర్లు, టెంపుల్ ఉద్యోగులు కొందరు వ్యాపారవేత్తలూ బాగా స్పందించారు. మంచి సినిమా చూసే అవకాశం కల్పించారని అభినందించారు. మా అందరికీ బాగా ఉత్సాహం వచ్చింది. తర్వాత సిరిసిల్లా రుద్రరవి, ఫసి, జూకంటి అంతా కలిసి ఉడిపి హోటల్ లో కొంత సమయం గడిపి సెలవు తీసుకున్నాం.

          వేములవాడ లో మొదటి సమాంతర సినిమా– ‘షత్రంజ్ కే ఖిలారి’:         

          సత్యజిత్ రే తన జీవిత కాలంలో తీసిన రెండు హిందీ సిన్మాల్లో ఇది ఒకటి (రెండవది ‘సద్గతి’). ఇది ప్రేమ్ చంద్  కథ ఆధారంగా రూపొందించబడింది. ‘షత్రంజ్ కే ఖిలారి’  గొప్ప రాజకీయ వ్యంగ్యాత్మక మయిన సినిమా. ఈస్ట్ ఇండియా కంపనీ మన దేశంలోని అవధ్ లాంటి వివిధ రాజ్యాల్ని ఎట్లా కూలదోశాయో దానికిగాను స్నేహ ఒప్పందాల పేర తమ మిలిటరీని ఆయా రాజ్యాల్లో దింపి క్రమంగా ఆ ప్రాంతాల్ని ఎట్లా ఆక్రమించింది ఈ సినిమా గొప్పగా చూపిస్తుంది. ప్రేమ్చంద్ మూల కథకు కొంత కథనాన్ని జోడించి తీసిన ఈ సినిమా విశేష ప్రశంసలు అందుకుంది. ఇందులో ముఖ్యంగా అమ్జద్ ఖాన్ పాత్ర పోషణ ప్రశంసించదగింది.

          ఇది సత్యజిత్ రే తన సృజనాత్మక జీవితంలో తీసిన అత్యంత ఖరీదయిన సినిమా కూడా. బాంబే హిందీ సినిమా పరిశ్రమ కు చెందిన సంజీవ్ కుమార్, అమ్జాద్ ఖాన్, సయీద్ జాఫ్రీ, షబానా ఆజ్మి, ఫరిదా జలాల్, రిచర్డ్ అట్టెంబరో తదితరులు నటించారు ‘షత్రంజ్ కే ఖిలారి’లో. వేములవాడ ఫిలిం సొసైటీ సభ్యులకు ఆ రోజుల్లోనే బాగా నచ్చిందీ సినిమా. అట్లా దేవస్థానమూ జాతరాతో బిజీగా వుండే వేములవాడలో కళాత్మక సినిమాల ప్రదర్శన వాటిపైన చర్చలు,సెమినార్లు కూడా నిర్వహించాము. నాలుగు దశాబ్దాల క్రితం నాటి అనుభవాలివి..

          “మనం గొప్ప ప్రేక్షకులం అయినప్పుడే గొప్ప చిత్రాలు నిర్మించబడతాయి”- అండర్ మాల్రే

          అందుకే గొప్ప ప్రేక్షకుల్ని కాకున్నా మంచి ప్రేక్షకుల్నయినా తయారు చేయడానికే ఫిలిం సొసైటీలు  ఏర్పాటయ్యాయి. వాటి కార్యక్రమాల్లో కేవలం సినిమాలు ప్రదర్శించి ఊరుకోకుండా ఆయా సినిమాలపై చర్చలు సెమినార్లు నిర్వహించడం, ఆయా దర్శకులు రచయితలతో ముఖా ముఖి కార్యక్రమాలు రూపొందించడం చేసాయి. వేములవాడలో కూడా మొదట సినిమాలు చూపించడం తో మొదలయి గ్రామ పంచాయతి హాల్లో సినిమా సెమినార్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వేములవాడ ఫిలిం సొసైటీ తక్కువ కాలమే పనిచేసినప్పటికీ దాని బాధ్యతను అది నిర్వహించిది.

***

          సినిమా ప్రదర్శనల విషయానికి వచ్చినప్పుడు నెలకు కనీసం ఒక ప్రదర్శనను ఏర్పాటు చేసాం. సమాంతర సినిమా రంగానికి చెందిన అనేక మంది సినిమాలతో పాటు, మద్రాస్ లోని SOVEXPORT FILM నుంచి  బాటిల్ ఫర్ బెర్లిన్లాంటి సినిమాలు, బెంగళూరు లో వున్న CHILDREN FILM SOCIETY OF INDIA పిల్లల సినిమాలు తెప్పించి ప్రదర్శించాము. అయితే వూరు చిన్నది రవాణా సౌకర్యాలు అంతంత మాత్రంగా వుండడం చేత నిర్వాహకులుగా కష్టాల సంగతి ఎలా వున్నా Procurement of film boxes  మేము ఎదుర్కొన్న రెండు సరదా విషయాల్ని మీతో పంచుకోవాలని పించింది.

1) “ప్రత్యూష” సినిమా ఒక జ్ఞాపకం :

          ఒక మంచి ప్రయత్నం “ప్రత్యూష”. ఒక మంచి ప్రయత్నాలు చేయడానికి ధైర్యం కావాలి. చొరవ కావాలి,  గొప్ప ప్రతిభ వుండాలి అకుంఠిత దీక్షా కావాలి. ఒక్కోసారి అన్నీ వున్నా ప్రయత్నం పూర్తి కాకపోవచ్చు. మరోసారి అచంచలమయిన నిబద్దతతో ప్రయత్నం పూర్తి అయినా చివరికి రావల్సినంత గుర్తింపూ గౌరవమూ దొరక్కపోవచ్చు.  చరిత్రలో స్థానమూ అర్హమయినంత దొరక్క పోవచ్చు. కానీ ఆ ప్రయత్నం వెనకాల వున్నకృషీ దాని ప్రభావమూ చివరంటా ప్రభావం చూపుతూనే వుంటుంది. అలాంటి గొప్ప ప్రయత్నమే “ప్రత్యూష” సినిమా. జట్ల వెంకట స్వామి నాయుడు దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమాకు ఒక గొప్ప నేపధ్యముంది. ఆ ప్రయత్నం వెనకాల కొంత మంది యువకుల దీక్ష పట్టుదల వుంది, ఎక్కడో మారుమూల నిజామాబాద్ జిల్లా లోని ఆర్మూర్, అరసవెల్లి గ్రామాలకు చెందిన సాయిలు, నాగ భూషణం, నాగయ్య తదితరుల బృందం కష్టంగా నిధులు సమకూర్చుకుని ఈ సినిమా నిర్మాణానికి పూనుకున్నారు. తెలంగాణా జిలాల్లో నిజామాబాద్ లో ‘జోగిని’, మెదక్ లో బసివిని, కరీంనగర్లో శివసత్తులు లాంటి మూఢాచారాలున్నాయి. దేవుని పేర స్త్రీలను వూరిపరం చేయడం. వూరి ఆస్తిగా పరిగణించడం వుండేది. అలాంటి జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమ ఫలితమే ఈ ‘ప్రత్యూష’ సినిమా. తెలంగాణా కుత కుత ఉడుకుతున్న కాలంలో 1978లో ఈ సినిమా నిర్మాణం మొదలయింది. అప్పుడే పూనా FTIIలో  చదువుకుని వచ్చిన జట్ల వెంకట స్వామి నాయుడు ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టగా, కవి కే.శివారెడ్డి రచన, శీలా వీర్రాజు కళా రంగ బాధ్యతలు చేపట్టారు.

          వాస్తవిక దృక్పధం తో కళాత్మకంగా రూపొందిన ప్రత్యూష పూర్తి అయింది కాని వాణిజ్య పరంగా విడుదల కాలేదు. అప్పటికే సత్యజిత్ రే, మృనాల్ సేన్ లాంటి దర్శకుల సినిమాలను చూసివున్న సొసైటీ సభ్యులు ప్రత్యూష చూసి తెలుగులో ఇలాంటి సినిమాని ఊహించలేదని గొప్ప ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ సినిమా బాక్స్ కోసం నేను ప్రత్యేకంగా హైదరాబాద్ వెళ్లి ఖైరతాబాద్లో ఉంటున్న శివారెడ్డి గారి ఇంటి నుండి తీసుకొచ్చి గోకుల్ సినిమాలో ప్రదర్శించాం. అదే రోజు వేములవాడ గ్రామ పంచాయతీ హాల్లో ఏర్పాటు చేసిన సభలో కే.శివా రెడ్డి గారు ప్రసంగించారు. ఆ తర్వాత నెల పాటు ప్రింటు మా వద్దే వుండి పోయింది. ఒక రోజు శివారెడ్డి గారి నుంచి లాండ్ లైన్ కు కాల్. ఏమిటి ప్రింటు పంపరా అని. ఇంక ఏముంది ఆఘమేఘాల మీద మధ్యాన్నం బస్సు  టాప్ పైన ఫిలిం బాక్స్ వేసుకుని హైదరాబాద్ బయలుదేరా. అపుడు బస్సులు కామారెడ్డి మీదుగా వెళ్ళేవి. ఎల్లారెడ్డిపేట్ దాటుతూ వుండగా రోడ్డు మీదినించి ఏవో అరుపులు విని డ్రైవర్ బస్సును ఆపాడు. పైన బాక్స్ ఎగిరిపోతున్నదని  అరుస్తూ చేప్పాడా బాటసారి, పైన బాక్స్ ఎవరిదయ్యా అని డ్రైవర్ అరుపు. నా పై ప్రాణం పైనే పోయింది అసలు ప్రింట్ ఉందా లేదా ఎక్కడయినా పడిపోయిందా. గబా గబా దిగి బస్సు వెనకాల మెట్లు ఎక్కి చూస్తే ఏముంది బాక్స్ మూత ఎగిరి పోయివుంది అమ్మయ్య ప్రింట్ వుంది. అప్పటికప్పుడు వైరో తాడో కట్టి కిందికి దిగి వచ్చాను. జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ అంతా సానుభూతి సందేశాలిచ్చారు. మౌనంగా అంతా భరించి సికిందరాబాద్ రాష్ట్రపతి రోడ్డులో దిగి ఖైరతాబాద్లో శివారెడ్డి గారి ఇంట్లో ప్రత్యూష బాక్స్ ను దిగ బెట్టి. బతుకు జీవుడా అంటూ కరీంనగర్ బసేక్కాను. అది ఒక జ్ఞాపకం. అప్పటికి ఎందుకురా ఈ కష్టం అనిపించక పోలేదు కాని, మంచి ప్రయోగాత్మక సినిమా సభులకు చూపించ గలిగినందుకు ఎంతో ఆనందం వేసింది.

2) “మృగయా” –సీరియస్ సినిమా- సరదా అనుభవం:

          ఈ సినిమా విషయం లో ఓ గమ్మత్తయిన అనుభవమిది. ప్రదర్శనకు ముందు రోజు బాక్స్ తో  బస్సు నేరుగా రాత్రి పదిగంటలకల్లా వేములవాడకు వచ్చింది. అప్పటి వరకు టెంపుల్ ముందు ఎదురుచూసి నేనూ రవీంద్ర బాక్స్ బస్సు మీది నుంచి దించి శివరామ కృష్ణ టాకీస్ కి పంపించి, శ్రీ రాములు హోటల్ లో టీ తాగి ఇల్లు చేరుకున్నాం. అప్పుడు మామయ్యా వాళ్ళ ఇంట్లో లాండ్ ఫోన్ వుండేది. ఉదయం ఏడుగంటలకే ఫిలిం ఆపరేటర్ ఫారన్ చేసాడు. రాత్రి బాక్స్ వచ్చింది సార్ కాని ‘మేరిగాయ్’ అని ఎదో ఆవు సినిమా బాక్స్ వచ్చింది. మీరేమో మరింకేదో సినిమా అన్నారు. గుండెల్లో రాయి పడింది ప్రింట్ ఏమయినా మిస్ప్లేస్ అయిందా, సమయానికి సభ్యులు వస్తారు ఎం చెప్పాలి, ఎట్లా చెప్పాలి… కంగారు కంగారుగా నేనూ రవీంద్ర టాకీస్ కి ఆఘ మేఘాల మీద చేరుకున్నాం. తీర చూస్తె బాక్స్ మీద ఇంగ్లిష్ లో ‘ MRIGAYA’ అని రాసి వుంది. ఆపరేటర్ ఇంగ్లిష్ కి బలి  అయి ఎంతో టెన్షన్ పడ్డవాళ్ళం గొప్ప రిలీఫ్ గా ఫీల్ అయ్యాం. బయటకెళ్ళి టీ తాగుతూ పది నిముషాలు పడీ పడీ నవ్వుకున్నాం. తర్వాత మృగయా అందరికీ నచ్చింది.

          ఇట్లా అనేక అనుభవాలు అప్పటికి టెన్షన్లకు గురయినా తర్వాత అవన్నీ మదురమయిన అనుభవాలుగా. మిగిలిపోయాయి.

సెమినార్లు, సమావేశాలు:

ప్రధానంగా రెండు సమావేశాల గురించి ప్రస్తావిస్తాను. ఒకటి సుప్రసిద్ధ కవి కే.శివారెడ్డి గారితో జరిగింది. ప్రత్యూష  సినిమా నిర్మాణంలో రచయితగా పాలుపంచు కున్న ఆయన వేములవాడలో సినిమా ప్రదర్శన అనంతరం గ్రామపంచాత్ హాలు లో జరిగిన కరీంనగర్  జిల్లా ఫిలిం సొసైటీల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గోన్నారు.

ప్రత్యూష సినిమా నేపధ్యం, నిజామాబాద్ యువకుల చొరవ, జోగిని వ్యవస్థ, దర్శకుడు జట్ల వెంకట స్వామి గురించి సవివరంగా గొప్ప చైతన్య వంతంగా మాట్లాడారు

          ఇక మరో అతిథి కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ జాతీయ అంతర్జాతీయ ఫిల్మ్ సొసైటీ ఉద్యమ నేపధ్యం, లక్ష్యాలను వివరించారు.

          ఇక రెండవ సందర్భం బి.నరసింగ రావు ‘రంగుల కల’ నిర్మాణ సమయం. 9 అక్టోబర్ 1983  రోజున ద్వితీయ వార్షికోత్సవ సందర్బం. అతిథులుగా బి.నరసింగ రావు, ప్రముఖ చిత్రకారుడు వైకుంఠం, సుదర్శన్, ఉప్పల నరసింహం పాల్గొన్నారు. ఆ రోజున జరిగిన సెమినార్ లో అంతర్జాతీయ సినిమా నుంచి మొదలు ప్రాంతీయ సినిమా దాకా అనేక విషయాల్ని నరసింగరావు గారు సవివరంగా వివరించి ఉత్తేజ పరిచారు. 

***

“మృగయా”

          మృణాల్ సేన్ రూపొందించిన ఈ సినిమా బగబతి చరణ్ పాణిగ్రాహి రాసిన చిన్న కథ ఆధారంగా రూపొందింది. 1930 ప్రాంతపు కథ అయినా సమాజానికి అనేక ప్రశ్నల్ని సందిస్తుంది. ఒరిస్సా లోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు అడవిలో క్రూర జంతువుల సమస్యతో పాటు ఊర్లోని షాహుకార్లు పోలీసు ఇన్ఫార్మర్ లతో కష్టాలు పడుతుంటారు. ఇంత లో కొత్త బ్రిటిష్ అధికారి వస్తాడు. మంచి షికారి అయిన ఘినువా తో కలిసి ఒక ఒప్పందం చేసుకుంటాడు పెద్ద జంతువును చంపితే బహుమతి ఇస్తానంటాడు. ఆ వూరికే చెందిన విప్లవకారుడు శోల్పు తన తల్లిని కలవాదానికి వస్తాడు. పోలీసు ఇన్ఫార్మర్ వెంటపడతాడు. కాని శోల్పు తప్పించుకుంటాడు. వూర్లో దోపిడీ జరుగుతుంది, నేరం శోల్పు పైన వేసి అతన్ని చంపివేస్తారు. హంతకులకు ప్రభుత్వం ఇనాం ఇస్తుంది. అప్పుడే ఘినువా భార్యను ఓ వ్యాపారి కిడ్నాప్ చేస్తాడు. ఘినువా వెళ్లి అతన్ని చంపి భార్యను రక్షించుకుంటాడు. కాని బ్రిటిష్ అధికారి ఘినువా పై హత్యా నేరం మోపి అతన్ని వురి తీయిస్తాడు. అడవిలో మృగాన్ని చంపితే బహుమతి ఇస్తానన్న వాడు ఊర్లోని మానవ మృగాన్ని చంపితే నేరస్తుడన్నారు. శిక్ష వేసారు అన్న ప్రశ్న ఘినువా మనసులో ఉండిపోతుంది. అత్యంత వాస్తవికంగా రూపొందిన మృగయా లో తొలిసారిగా నటించిన మిథున్ చక్రవర్తి కి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సినిమాకి ఉత్తమ సినిమా అవార్డు లభించాయి.

***

కరీంనగర్ ఓ సమాంతర సినిమా చైతన్యం

“అలుముకున్న చీకటిని పారద్రోలడానికి ఎవరో ఒకరు ఓ చిరు దీపం వెలిగిస్తారు. ఆ దీపం మరో దివ్వె వెలగడానికి దోహదపడుతుంది. ఆ పరంపర ఎప్పటికీ కొనసాగుతుంది. లేకుంటే ఈ లోకం ఎప్పుడో చీకటి మయమయి వుండేది”.

          వ్యాపార, పలాయనవాద సినిమా రాజ్యం ఏలుతున్న సమయంలో సరిగ్గా అలాంటి పనే అంపశయ్య నవీన్, కోటేశ్వర్ రావు, డి.నరసింహా రావు లాంటి పలువురు 1978లో కరీంనగర్ ఫిలిం సొసైటీ స్థాపించి సమాంతర సినిమాను ప్రజల వద్దకు తెచ్చారు. ఆ స్ఫూర్తి తోటే ఆగస్ట్ 1981 లో వేములవాడ లాంటి ఒక మామూలు గ్రామంలో వేములవాడ ఫిలిం సొసైటీ ప్రారంభమయింది. ఆనాటి కార్యక్రమానికి హాజరయిన ఆత్మీయ మిత్రులు సాంస్కృతిక ప్రియులు సమాజం పట్ల కొంత బాధ్యతగా వున్న వాళ్ళు వేములవాడ స్పూర్తి తో తమ ప్రాంతాల్లో కూడా ఫిలిం సోసైటీల స్థాపనకు కృషి చేసారు. అద మొత్తంగా అప్పటి ఉమ్మడి జిల్లాలో దాదాపుగా ఉద్యమంగా నడిచింది.

సిరిసిల్ల ఫిలిం సోసిటీ (SIFISO)

          వేములవాడలో దాదాపు సొసైటీ ప్రతి సినిమా ప్రదర్శనకు హాజరయిన మిత్రులు రుద్ర రవి, హసన్ ఫసి ఉల్లాలు సిరిసిల్లాలో తామే ఎందుకు ఈ ప్రయత్నం చేయకూడదని నిశ్చయానికి వచ్చారు. నా వద్ద నుంచి బైలాస్ తదితర డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి ఎం.ముత్యం రెడ్డి సలహాదారునిగా జూకంటి జగన్నాధం తదితర మిత్రుల సహకారంతో 1982 లో ‘సిరిసిల్ల ఫిలిం సొసైటీ’ ని 19 ఆగస్ట్ 82 రోజున ప్రారంభించారు. నరసింహ రెడ్డి అధ్యక్షులుగా, ఫసి కార్యదర్శిగా, రుద్ర రవి సహాయ కార్యదర్శిగా, ప్రారంభమయిన సొసైటీ అవిశ్రాంతంగా సినిమాల్ని ప్రదర్శించింది. దానితో పాటు ‘చైతన్య చిత్ర లహరి’ పేర పత్రికను కూడా ప్రారంభించారు. సిరిసిల్ల ఫిలిం సొసైటీ కేవలం రెండు సంవత్సరాలలో సొంతంగా 16 ఎం.ఎం ప్రొజెక్టర్ ను సమకూర్చుకుని అప్పటికి ఆంద్ర ప్రదేశ్ లో దాదాపుగా 50 ఫిలిం సొసైటీలు పనిచేస్తున్న ఆ కాలం లో సిరిసిల్లా స్వంత ప్రొజెక్టర్ కలిగిన 7వ సంస్థగా నిలిచింది. సిఫిసో నిర్వహించిన సభల్లో జే.వి.సోమయాజులు, బి.నరసింగ రావు, గుడిపూడి శ్రీహరి, కపలేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. సిఫిసో 5 ఏళ్ళు విజయవంతంగా నడిచింది.

జగిత్యాల ఫిలిం సొసైటీ (JAFISO):

          వేములవాడకే చెందిన మిత్రుడు నరాల లక్ష్మీకాంతం అప్పుడు జగిత్యాల ఎల్.ఐ.సి.లో పనిచేసేవాడు. వేములవాడ ఫిలిం సొసైటీ ఆరంభ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత జగిత్యాలలో ఫిలిం సొసైటీ మొదలుపెట్టాలని బై లాస్ తో సహా ఇతర డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి 82 లోనే ప్రారంభించాడు. ఆ క్రమంలో తనకు మిత్రుడు ధరన్, రాయంచ ప్రభాకర్ తదితరులు బాగా సహకరించారు. అప్పటికి జగిత్యాలలో హిందీ సినిమాలే వారానికోసారి వచ్చే స్థితిలో జఫిసో లో మలయాళం, తమిళ, మరాఠీ సినిమాలని ప్రదర్శించడంతో గొప్ప ప్రతిస్పందన వచ్చింది. అయితే జగిత్యాలలో అప్పుడు సబ్ కలెక్టర్ మాత్రమే ఉండేవాడు. సినిమా సబ్జెక్ట్ కరీంనగర్ జాయింట్ కలెక్టర్ పరిదిలోనిది. ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా క్లరికల్ నిర్లక్ష్యం వల్ల అనుమతులు రాలేదు. అప్పుడు కరీంనగర్ ఫిలిం సొసైటీ భాధ్యులు అంపశయ్య నవీన్, నరెడ్ల శ్రీనివాస్ లు వ్యక్తిగతంగా జే.సి.ని కల్సి వివరిస్తే తప్ప అనుమతులు రాలేదని లక్ష్మికాంత్ చెప్పాడు. అట్లా జఫిసో 4 ఏళ్ల  పాటు విజయవంతంగా నడిచింది. ఎన్నో మంచి సినిమాల్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళింది.

హుజురాబాద్ ఫిలిం సొసైటీ (HUFISO):

హుజురాబాద్ ఫిలిం సొసైటీ ఏర్పాటులో ప్రధాన ప్రేరణ నరెడ్ల శ్రీనివాస్. ఆ వూరు ఆయన సొంతవూరు, తాను చదువుకున్న వూరు కావడంతో అప్పటికే సాంస్కృతికంగా ఆలోచించే అక్కడి మిత్రుల్ని ఉత్సాహపరిచి సంస్థ ఏర్పాటుకు ఎంతో దోహదంచేశారు. 

హుఫిసో లో ప్రధాన పాత్ర ఆవునూరి సమ్మయ్య గారిది. ఆయనకు కొండా వేణు, సినిమా టాకీస్ యజమాని అయిన కేతిరి సుదర్శన్ రెడ్డి ఎంతగానో సహకరించారు. ఇంకా పలువురు మిత్రుల సహకారంతో హుఫిసో విజయవంతంగా అనేక ఏళ్ళు నడిచింది. అక్కడి కార్యక్రమాలకు దేవిప్రియ, సాయిచంద్, ప్రాణ్ రావు మొదలయిన వారెంతో మంది వచ్చారు.

గోదావరిఖని ఫిలిం సొసైటీ (GOFISO):

          దాదాపుగా ఇదే సమయంలో పారిశ్రామిక ప్రాంతమయిన గోదావరిఖనిలో ఫిలిం సొసైటీ ఏర్పాటయింది. టి.జగన్ మోహన్ రావు కార్యదర్శిగా ఏర్పాటయిన గోదావరిఖని సొసైటీ అనేక ప్రదర్శనల్ని ఏర్పాటు చేసింది. అంతే కాకుండా FFSI కి అనుబంధ సంస్థగా నిలిచిన వాటిల్లో గోదావరిఖని ముందు వరుసలో ఉండింది. FFSI కి సంబంధించి ఒక ప్రాంతీయ సమావేశానికి మద్రాస్ కు నాతో పాటు జగన్మోహన్ రావు వచ్చారు. ఆ తర్వాత నేను గోదావరిఖని కాలేజీకి బదిలీ అయినప్పుడు కొంత కాలం ఆ సొసైటీ కార్యక్రమాలల్లో పాలు పంచుకున్నాను. అప్పుడు ప్రముఖ రచయిత తుమ్మేటి రఘోత్తమ రెడ్డి, జర్నలిస్టు బండారు కిష్టయ్య తదితరులు ప్రధాన భూమికను పోషించారు. అప్పుడే ప్రముఖ వైద్యులు డాక్టర్ సునీల్ సాయినాథ్ రెడ్డి కూడా కొంత ఆక్టివ్ గానే వున్నారు. గోదావరిఖని ఫిలిం సొసైటీ ఆదివారాల్లో సినిమాహాల్లో ప్రదర్శనలతో పాటు క్లబ్ లో కూడా స్ట్రైక్ లాంటి అనేక సినిమాల్ని ప్రదర్శించింది. పలు సంవత్సరాలు చాలా ఆక్టివ్ గా కృషి కొనసాగించింది గోదావరిఖని ఫిలిం సొసైటీ.

ఎల్లారెడ్డి పేట్ ఫిలిం సొసైటీ:

అత్యంత మారుమూల గ్రామం ఎల్లారెడ్డి పేట్. వేములవాడ కామారెడ్డి కి వెళ్ళే దారిలో వుండే ఆ గ్రామంలో ఫిలిం సొసైటీని ఆ రోజుల్లో ఊహించడమే కష్టం. అలాంటిది ఉపాధ్యాయుడు ప్రగతిశీల భావాలుగల కందుకూరి రమణ దానిని సుసాధ్యం చేసాడు. వేములవాడ, సిరిసిల్లా సంస్థల ప్రోత్సాహము ముఖ్యంగా రుద్ర రవి అందించిన సహకారంతో అది సాధ్యమయింది.

ఎల్లారెడ్డి పేట్ అనగానే రెండు సందర్భాలు గుర్తొస్తాయి. ఒకటి అప్పుడు కరీంనగర్ లో ఏ.పి టి.ఎఫ్. సభలు జరుగుతున్నాయి. ప్రధాన వక్తగా శ్రీ కాకరాల గారు వచ్చారు. రమణ, నారదాసు లక్ష్మణ రావు, రవి, నేను కలిసి హోటల్లో ఆయన్ని కలిసాం. తను నోట్స్ రాసుకుంటున్నారు. ఎల్లరెడ్డి పేట్ సొసైటీ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా కోరాం. ఆయన గొప్ప మనసుతో వెంటనే అంగీకరించారు కానీ, తర్వాత ఇతర పని భారం వళ్ళ ఆయన రాలేక పోయారు. తర్వాత ఎల్లారెడ్డి పెట్ సొసైటీకి జిల్లా నుంచి అనేక మంది హాజరయ్యాం. కరీంనగర్ నుంచయితే ఒక వాన్ తీసుకుని వెళ్ళాము. జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడ ఒకటేమిటి అందరమూ గొప్ప ఉత్సాహంతో వెళ్లాం. ఆ గ్రామంలో కూడా పలు సంవత్సరాలు సొసైటీ విజయ వంతంగా నడిచింది.

          తర్వాత పెద్దపల్లి కోరుట్లల్లో కూడా ఫిలిం సొసైటీలు ఏర్పాటయ్యాయి.

పరస్పర సహకారం:

          జిల్లాలోని ఫిలిం సొసైటీ లు కేవలం సాంస్కృతిక రంగంలోనే కాకుండా సామాజిక రంగంలో కూడా కలిసి పనిచేశాయి. ఒక సారి కరీంనగర్ జిల్లా పూడూరు లో వరదలొచ్చి విపరీతంగా నష్టం వాటిల్లింది. అప్పుడు కలెక్టర్ గా వున్న ఆర్, చంద్రశేఖర్ అన్ని స్వచ్చంద సంస్థలకు బాధితులకు సహాయం చేయమని విజ్ఞప్తి చేసారు. దానికి స్పందించి ప్రదర్శనల వద్ద జోలె పట్టి చందాలు వసూలు చేసి కలెక్టర్ ద్వారా బాధితులకు ఆర్ధిక సాయం అందించారు.

          జిల్లాలోని అన్ని సొసైటీల  నడుమ గొప్ప సమన్వయము వుండేది. దానికి ప్రధానంగా నరేడ్ల శ్రీనివాస్, నేను పూనుకున్నాం. బాలల సినిమాల ప్రదర్శనలయితే ఒక సారి కరీంనగర్ కు ప్లాన్ చేస్తే దాదాపు అన్ని కేంద్రాల్లో ప్రదర్శించి ప్రతి నవంబర్లో జిల్లా మొత్తం బాలల పండుగ వాతావరణం వుండేది.

          కరీంనగర్ ఫిలిం సొసైటీ గురించి వివరంగా రాయాల్సి వుంది ఎందుకంటే నాది కఫిసో తో మూడున్నర దశాబ్దాల అనుబంధం అందుకే పూర్తి వివరంగా రాస్తాను.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.