విత్తనాల విలాపం

-కందేపి రాణి ప్రసాద్

          అదొక పండ్ల బజారు. అక్కడ పండ్ల దుకాణాలన్నీ వరుసగా ఉంటాయి. మామిడి, బత్తాయి, సపోటా, కమలా, బొప్పాయి, ద్రాక్ష యాపిల్ వంటి అన్నిరకాల పండ్లు అక్కడ కొలువు దీరి ఉన్నాయి. ఆ ప్రదేశమంతా సువాసనతో కూడిన తీపిదనం వ్యాపించి ఉంది. ఆడా, మగా, పిల్లలు, వృద్ధులు ఎంతో మంది ఆ బజారుకు వస్తారు. పండ్లు బావున్నాయని కొనుక్కుంటున్నారు. సంచుల్లో వేసుకొని ఇంటికి తీసుకెళ్లి అందరూ కూర్చొని ఫలాలను అరగిస్తున్నారు. ఎంతో మధురంగా ఉన్నాయని మెచ్చుకుంటూ అహో! ఓహో! ఏమి రుచి. ఏమి తీపి, అని లొట్టలేసుకుంటూ తింటున్నారు. పండ్లను తిని విత్తనాలను పారేస్తున్నారు. సహజమే కదా! కానీ విత్తనాలకు ఇది నచ్చలేదు. ఫలాలు తీపిగా ఉన్నాయని, పుల్లగా ఉన్నాయని, పచ్చిగా ఉన్నాయని ముదరు పండిపోయాయని పండ్లను ఇలా రకరకలుగా వర్ణిస్తారు కదా! విత్తనాలను అలా వర్ణించకపోయిన ఫరవాలేదు కానీ అది కూడా పండులోని ఓ భాగమే కదా! ఇప్పటి దాకా పండు కడుపులోనే ఉన్నది కదా అని ఎవరు పలకరించట్లేదు. కనీసం వాటి గురించి ఎవరు మాట్లాడుకోవడం లేదు సరి కదా విత్తనాలన్నింటినీ తెచ్చి చెత్తకుప్పలో పారబోస్తున్నారు.
 
          విత్తనాలకు చాలా దుఖం వచ్చింది. ఏడుపు తన్నుకొచ్చింది. ఇప్పటిదాకా మధురమైన ఫలాల లోపల, తీపి వాసనల మధ్య గడిపిన వాటికి చెత్తకుండీ అగ్గర దుర్గంధం భరించలేక వాంతి వచ్చినట్లు అనిపించింది. ఒక్కక్క విత్తనం చెత్తకుప్ప నుంచి దూరంగా జరిగిపోయి అవి ఒకచోట గుమికూడాయి. ‘పండును తిన్నట్టు మనల్ని కూడా తినమన్లేదు కానీ, కాస్త గౌరవంగా చూస్తే ఏం బోయింది’ అంది మామిడి టెంక చిన్నబుచ్చుకుని. ‘నీ పని ఇంకా నయం పండు నోట్లో పెట్టుకుని గుజ్జునంత జుర్రేసి నన్ను “థూ” అని బయటకు ఊసేస్తారు’ అంది ద్రాక్ష గింజ విచారంగా. కాస్త మర్యాదగా నోట్లోంచి తీసి బయటపెట్టొచ్చు కదా అంటూ కమాలకాయ, బత్తాయికాయ విత్తులు వంత పాడాయి. వేరుశనగ కాయలకు ఎంత అదృష్టమో! కాయలు వలుచుకొని మరి విత్తనాలు తింటారు. నిష్టూరంగా అంది సపోటా విత్తనం. వేరుశనగ కాయలేనా! మొక్కజొన్న కంకి కూడా! వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రతివారి చేతిలో కంకే ఉంటుంది. దాని విత్తనాలను వేడివేడిగా కొరుక్కు తింటుంటారు అన్నాయి బొప్పాయి గింజలు. ఏంటో! మనకే ఈ కష్టాలన్నీ అనుకుంటూ దిగాలుగా కూర్చున్నాయి విత్తనాలన్నీ.
 
          ‘ఏంటి! మీకేనా బాధలు! పాత బట్టలు విడిచేసినట్లు మా చర్మం వలిచి విసిరి పారేస్తారు’ అంటూ అరటి, బత్తాయి, కమలాపండు తొక్కలు తమ గోడు వెళ్లబోసు కున్నాయి. అందరూ కలిసి తల ఒక మాట మాట్లాడుకున్నాక తొక్కలు వెళ్లిపోయాయి. ‘ఎవరు పట్టించుకోని ఈ బతుకు మనకెందుకు’ అని బాధపడిన విత్తనాలన్నీ తీవ్రంగా ఆలోచించి ఆత్మహత్య చేసుకోవాలి అనే మూకుమ్మడి నిర్ణయానికొచ్చాయి. ఇది వెంటనే అమలు పరచాలి అనుకున్నాయి.
 
          ఏ విత్తనంకా విత్తనం తనున్నచోటే చిన్న గొయ్యి తవ్వుకొని అందులో పడి చావాలనుకున్నాయి. వెంటనే విత్తనాలన్నీ గోతిలో పడి చచ్చిపోయాయి. ఇక అక్కడ మట్టి తప్ప విత్తనాలు ఎవరికీ కనిపించలేదు. కొన్నాళ్ళకు వర్షం వచ్చింది. మట్టి కిందున్న విత్తనాలు మొలకెత్తాయి. మట్టిలో నుండి తల పైకెత్తి తొంగిచూశాయి. మొలకలు రోజు రోజుకూ పెరగసాగాయి. ఇప్పుడు దారిన పోయే వాళ్ళ దృష్టి వీటి పై పడుతున్నది. మొక్కలు తమ దేహాలను గర్వంగా చూసుకున్నాయి. మరి కొంతకాలం గడిచింది. మొక్కలు చెట్లయ్యాయి. ఇప్పుడవి ఆ దారి వెంట వెళ్ళేవాళ్ళకు నీడనిస్తున్నాయి. ఎండకు గొడుగులయ్యాయి. వానకు అమ్మకొంగులా అడ్డుపడ్డాయి.
అంతలో వసంత మాసం వచ్చింది. ప్రకృతి పరవశించి పోతున్నది. చెట్లన్నీ పువ్వుల మీదే. పూలతో నిండిన చెట్లు మహారాణుల్లా శోభిస్తున్నాయి. అందరూ ఆ పూల సోయగానికి దాసోహం అంటున్నారు. భూమాత ఆ పూల చెట్లను తను ఇంత అందమైన ఫ్లవర్ వేజ్లుగా అమర్చినానని మురిసిపోతున్నది.
 
          కొంత కాలం తరవాత పూలన్నీ కాయలుగా మారాయి. కాయలు పండి పండ్లయ్యాయి. పండ్లు కమ్మని సువాసనలు వెదజల్లుతున్నాయి. ప్రజలంతా చెట్లనూ, చెట్లకున్న పండ్లనూ చూసి మెచ్చుకోసాగారు. ఆహా! ఏమి రంగు? ఏమి సువాసన? ఏమి రుచి అంటూ పండ్లను ఆరగించి మైమరిచిపోయి మనసారా ప్రశంసిస్తున్నారు. ఆ పొగడ్తలను పండ్ల చెట్ల హృదయాలు ఉప్పొంగిపోయాయి. మన జీవితం ధన్యుమను కున్నాయి. మనల్ని తక్కువగా చూసి బయటపారేశారని బాధపడ్డం. కానీ ఒక చెట్టును పుట్టించే శక్తి మన దగ్గరున్నదని గ్రహించలేకపోయాం. ఒక మహావృక్షాన్ని కనగల అమ్మలమని ఊహించలేకపోయాం. ఆత్మవిశ్వాసం లోపించినపుడు, మనలో గల శక్తిని మనమే తక్కువగా అంచనా వేసుకొని భగవంతుడు ప్రసాదించిన అందమైన జీవితాన్ని అంతం చేసుకోవాలనుకుంటాము. కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు.
 
          కష్టసుఖాలు అనేవి ప్రతి వారి జీవితంలోనూ తప్పవు. మనం ఉత్పత్తి చేసే పండ్లు నలుగురు తినటమే మనకు కావలసినది. వాళ్ళ కడుపు నిండి బావున్నాయంటే అదే మనకు ఆశీర్వాదం. మనం పుట్టినందుకు పది మందికి మేలు చేయాలి. ఏదో చిన్న కష్టం వచ్చిందని విచారపడకూడదు. తెలివి ధైర్యంతో సమస్యను పరిష్కరించుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని ఎల్లప్పుడు పోగొట్టుకోకూడదు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.