ఆకతాయి కుక్కపిల్లలు 

-కందేపి రాణి ప్రసాద్

          హైవేకు పక్కగా ఒక కుక్క కుటుంబం నివసిస్తున్నది. ఒక కుక్క తన భార్య నలుగురు పిల్లలతో కాపురముంటున్నది. రోడ్డుకు పక్కనే అయినప్పటికీ అక్కడ పెద్ద చెత్త కుప్ప అడ్డుగా ఉన్నది. అంతేకాకుండా పక్క పొలాలకు అవసరమయ్యే గడ్డివాము ఉన్నది. పిల్లల్ని మరుగున దాచటానికీ, మెత్తగా గడ్డి పరుపు పరచటానికీ ఈ స్థలం అనువుగా ఉందని తల్లికుక్క భావించింది. పిల్లల్ని కనక ముందే మంచి స్థలం ఎక్కడ ఉన్నదా అని వెతుక్కుంటునపుడు ఈ స్థలం కనిపించింది. తల్లి కుక్క ఈ స్థలం బాగా నచ్చింది. తన పిల్లలకు ఏ ప్రమాదమూ రాకుండా మరుగ్గా ఉందని అనుకున్నది. 
కానీ, మనసులో ఒకే అనుమానం ఉన్నది. పసిపిల్లులుగా ఉన్నపుడు తెలియక హైవే మీదకు వెళ్ళిపోతాయేమో అని భయం ఎక్కువగా ఉన్నది. ‘ సరేలే అప్పుడు సమస్య వస్తే దానిని పరిష్కరించుకోవచ్చులే, అని అప్పటికి సర్దుకుపోయింది. అలా ఆ కుక్క కుటుంబం ప్రస్తుతం అక్కడ నివసించసాగింది. 
 
          పిల్లలు పెద్దగా అవుతున్నాయి. గడ్డివాము చెత్తకుప్పలు దాటి రోడ్డు మీద వేగంగా వెళ్ళే కార్లను, లారీలను, ట్రక్కులను, వ్యాన్లను చూసి ఆశ్చర్యంగా చూస్తుండేవి. అంత వేగంగా ఎలా వెళతాయి అని చూస్తూనే ఉండేవి. నున్నగా జారిపోయేలా ఉన్న రోడ్లను విచిత్రంగా చూస్తూ నోరు వెళ్ళబెట్టేవి తామున్న స్థలమంతా రాళ్ళూరప్పలు, ముళ్ళ చెట్లు గుడ్డ పేలికలు చెత్తా చెదారంతో నిండి ఉంటాయి. శుద్ధంగా శుభ్రంగా ఉన్న పెద్ద రోడ్డును చూడటం వాటికి వింతగా ఉండేది. 
 
          ఇలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండటం చూసిన తల్లి కుక్క పిల్లల్ని హెచ్చరించింది. ” రోడ్డు మీదకు వెళ్ళకండి. వేగంగా వచ్చే వాహనాలు మనుషుల్నే గుద్దేసి వెళతాయి. జంతువుల్ని అయితే ఆసలే పట్టించుకోరు. అందుకే రోడ్డు మీదకు వెళ్ళవద్దు చాలా జాగ్రత్తగా ఉండండి. 
 
          పిల్లల కెప్పుడూ వద్దన్నపనులే చేయాలని అనిపిస్తుంది కదా! అప్పటి వరకు రోడ్డు మీదకు వెళ్ళాలని ఆలోచించలేదు. అమ్మ హెచ్చరించే సరికి ఏమిటో చూడాలను కున్నాయి.
 
          ఒక రోజు నాజగు పిల్లలూ కట్టకట్టుకొని రోడ్డు మీదకు మెల్లగా వెళ్ళాయి. ఆ సమయంలో వాహనాలేమీ రాలేదు ఇంకొద్దిగా ముందుకు వెళ్ళాయి. కాసేపటికి కారు హారన్ వినిపించింది. గబగబా పరిగెత్తుతూ రోడ్డు పక్కకు వచ్చేశాయి. మరల కొద్దిసేపు తర్వాత మెల్లగా రోడ్డు మీదకు నాలుగూ కలిసి వెళ్ళాయి. కొద్ది సేపటికి హారన్ మోత విని పరిగెత్తు కొచ్చేశాయి. 
 
          కుక్కపిల్లలకు ఇదొక ఆటగా మారింది. రోడ్డు మధ్య దాకా వెళ్ళడం, వాహనాల హారన్ మోతకు రోడ్డు పక్కకు వచ్చేయడం చేస్తున్నాయి. ఏదో సాహసం చేస్తున్నట్లుగా థ్రిల్లింగ్ గా ఉంది. ఇలాంటి ఆటలు మధ్యాహ్నం సమయంలో ఆడుతూ ఉండేవి. ఆ సమయంలో తల్లి కుక్క ఇంట్లో ఉండదు దానికీ విషయం తెలీదు. 
 
          ఉదయం, సాయంత్రాలు ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల ధైర్యం చెయ్యలేదు. ట్రాఫిక్ లో కూడా సాహసం చేద్దమనుకున్నాయి. ఉదయమైతే తల్లి ఇంట్లో ఉంటుంది కాబట్టి సాయంత్రం ప్రయత్నిద్దామనుకున్నాయి. 
 
          ‘బాగా రష్ గా ఉన్న టైములో వెళ్దాం. వెహికిల్ దగ్గరకు వచ్చేటపుడు పరిగెత్తేద్దాం’ అని ప్లాన్ వేసుకున్నాయి. సరే అంటే సరే అనుకున్నాయి. ‘మనమెంత వేగంగా పరిగెత్తుతామో కార్ల వాళ్ళకు తెలియాలి ‘ అని నవ్వుకున్నాయి. 
 
          సాయంత్రం రోడ్డు మధ్య దాకా వెళ్ళి కూర్చున్నాయి. కొన్ని వాహనాలు వాటిని తప్పుకొని పక్కకు వెళ్ళిపోయాయి. కుక్కపిల్లలకు ధైర్యం వచ్చింది. ‘ఓహో ! మనల్ని చూసి భయ పడుతున్నారు’ అనుకున్నాయి. తమ సామర్థ్యాన్ని చూసి గొప్పగా నవ్వు కున్నాయి. 
 
          కార్లు దగ్గరగా వచ్చాక గబుక్కున పక్కకు పరిగెత్తుదాం” అన్నదో కుక్కపిల్ల. దూరంగా ఓ కారు రావటం చూశాయి పిల్లలన్నీ. ధైర్యంగా కూర్చున్నాయి అలాగే. పక్కకు కదల లేదు. కొంచెం దగ్గరకు వచ్చాక పక్కకూ గెంతాయి. అయితే ఆ పక్కనే వస్తున్న మరో కారును అవి గమనించలేదు. డ్రైవర్ సడన్ బ్రేక్ తో కారును ఆపాడు. అప్పటికి తమ ప్రాణాలు పోయాయనే అనుకున్నాయి. గుండెలు ధన ధనా కొట్టుకున్నాయి. చిన్నచిన్న దెబ్బలతో ప్రాణాలు నిలబడ్డాయి. 
 
          తల్లి కుక్క పరిగెత్తుకు వచ్చే పిల్లల్ని తీసుకు పోయింది. పెద్దలు చెప్పే మాటలు పిల్లలు తప్పక వినాలి ప్రాణాలతో చెలగాటాలు ఆడకూడదు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.