కాళరాత్రి-17

ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌”

అనువాదం : వెనిగళ్ళ కోమల

          ఏదో పాడుబడిన పల్లెకు చేరాం. జీవమున్న ఏ ప్రాణి అక్కడ కనిపించలేదు. కుక్కల అరుపులు గూడా వినరాలేదు. కొందరు పాడుబడిన యిళ్ళలో దాక్కోవచ్చని వరుసలు వీడారు.

          మరో గంట ప్రయాణం తరువాత ఆగమన్నారు. మంచులో అలాగే పడిపోయాము. ‘‘ఇక్కడ వద్దులే, కొంచెం ముందుకెళితే, షెడ్డులాంటిది కనిపిస్తున్నది, అక్కడికి పోదాంలే’’ అంటూ నాన్న నన్ను లేపాడు.

          నాకు లేవాలనే కోరికగానీ, శక్తిగానీ లేవు. అయినా ఆయన్ని అనుసరించాను. అది షెడ్‌ కాదు. ఇటుకల ఫ్యాక్టరీ, కప్పు కూలిపోయి ఉన్నది. కిటికీ అద్దాలు పగిలి ఉన్నాయి. గోడలు మసిబారి ఉన్నాయి. లోనకు అంత తేలికగా వెళ్ళలేం. వందల మంది ఖైదీలు లోనకు పోవటానికి కుమ్ములాడుకుంటున్నారు.

          ఎలాగో లోనకు పోగలిగాం. లోనగూడా మంచు దట్టంగా పడి ఉన్నది. మంచు మీద ఒరిగాను. మంచు నా కింద మెత్తటి కార్పెట్‌లా అనిపించింది. నిద్రపోయాను. ఎంతసేపు పడుకున్నానో తెలియలేదు. నాకు మెలకువ రాగానే చల్లని నాన్న చెయ్యి నా బుగ్గ మీద తడుతుందని తెలిసింది.

          నిన్నటికంటె ఈ రోజు యింకా వార్థక్యం మీద పడినట్లు కనిపించాడు. ఆయన శరీరం ఆయనలోకి ముడుచుకుపోయింది. కళ్ళు గాజుకళ్ళలా ఉన్నాయి. శిథిలమైనట్లున్నాడు. పూర్తి అలసట తప్ప నాన్నలో మరేమీ కనిపించలేదు. దుఃఖంతో, చలితో గొంతు పూడుకు పోతున్నది.

          ‘‘నిద్ర ఆపుకో ఎలైజర్‌, మంచు మీద నిద్ర ప్రమాదకరం, అది శాశ్వత నిద్ర అయి పోతుంది. లే బాబూ, లే నాన్నా’’ అంటున్నాడు నాన్న.

          వెచ్చగా అనిపిస్తున్న పక్క వదిలి ఎలా లేవగలను. నాన్న గొంతు వినిపిస్తున్నా ఏమంటున్నాడో అర్థం కావడం లేదు.

          ‘లే బాబూ’ అంటే పళ్ళ బిగువున లేచాను. నాన్న నన్ను ఒక చేతితో పట్టి లేపి బయటకు తీసుకు వచ్చాడు. లోనకు పోవటం ఎంత కష్టమయిందో, బయటికి రావటం అంతే కష్టమయింది. మా కాళ్ళ కింద మనుషులు పడి నలిగిపోతున్నారు, చని పోతున్నారు. కాని ఎవరమూ మరొకరిని పట్టించుకోగల స్థితిలో లేము.

          గడ్డకట్టించే చలి నా ముఖాన్ని తాకింది. పెదాలు గడ్డయిపోతాయేమొ అని అనుకుంటున్నాను. నా చుట్టూ మృత్యుహేళ కనిపించింది. నేను స్మశానం గుండా నడుస్తున్నాను. తల తిరుగుతూ ఉన్నది.

          శవాలు బిగుసుకుపోయి ఉన్నాయి. మూలుగులు, ఏడ్పులు, నిట్టూర్పులూ ఏమీ లేవు. ఎవరూ మరొకరిని సాయం అడగటం లేదు. చావాలి గనుక చనిపోతున్నారు. మరొకరిని బాధించాలనీ ఎవరూ ప్రయత్నించలేదు.

          బిగిసిపోయిన ప్రతి శవంలో నన్ను నేను చూసుకున్నాను. కాసేపటిలో నేనూ వాళ్ళలో ఒకడినవుతాను. మహా అయితే కొన్ని గంటల వ్యవధిలో.

          ‘నాన్నా షెడ్‌లోకి పోదాం పద’ అన్నాను. నాన్న మాట్లాడలేదు, శవాలను చూస్తున్నట్లుగా గూడా లేడు.

          ‘‘పద నాన్నా, ఇక్కడి కంటె లోన నయం. నీవూ నడుం వాల్చవచ్చు. వంతు లేసుకుని ఒకరికొకరం నిద్రపోకుండా చూసుకుందాం’’ అంటే ఒప్పుకున్నాడు.

          ఎన్నో శరీరాలనూ, శవాలనూ తొక్కుకుంటూ షెడ్‌లోకి పోగలిగాము. మంచు మీద పడుకున్నాము. ‘నీవు నిద్ర పో బాబూ, నేను కాపలా ఉంటాను’ అన్నాడు నాన్న.

          తనని ముందు పడుకోమన్నాను. వద్దన్నాడు. నేను ప్రయత్నించినా నిద్ర రాలేదు. కొంచెంసేపైనా నిద్రపోవాలని ఎంతగానో కోరుకున్నాను. నిద్ర అంటే చనిపోవటమే అనుకున్నాను. చావుకు వ్యతిరేకంగా నాలో పట్టుదల పెరిగింది. నా చుట్టూ మృత్యువు చుట్టుముట్టి ఉన్నది. నిద్రపోతున్న వ్యక్తిలో ప్రవేశించి మృత్యువు అతన్ని ముక్కలు ముక్కలుగా కబళిస్తున్నది. నా పక్కన ఉన్న వ్యక్తి తన పక్కన ఉన్న వ్యక్తిని మేల్కొలుపుతున్నాడు. సోదరుడో, మిత్రుడో అయి ఉండాలి. కాని ఓడిపోయాడు. ఆ వ్యక్తి శవం పక్కనే అతనూ పడుకున్నాడు. నిద్రపోయాడు. అతనిని ఎవరు మేల్కొలుపుతారు? నేను చేయి చాపి ‘యిక్కడ నిద్ర పోకూడదు, లేవాలి’ అని అతన్ని తట్టాను. ‘సలహాలివ్వద్దు, అలసిపోయాను. నన్ను కదిలించ వద్దు, నీ పని నీవు చూసుకో’ అన్నాడు సమాధిలో నుండి మాట్లాడుతున్న వాడిలా.

          నాన్న గూడా కూనికి పాట్లు పడుతున్నాడు. కళ్ళ మీదకు టోపీ లాక్కున్నాడు. లేపితే ఉలిక్కి పడి లేచాడు. కూర్చుని చుట్టూ చూశాడు. నాన్న తానెవరో, ఎందుకు అక్కడకు వచ్చాడో, ఎలా వచ్చాడో, తన చుట్టూ ఏమి జరుగుతున్నదో తెలుసుకోవాలన్నట్లు చూస్తున్నాడు. చిన్న నవ్వు నవ్వాడు. ఆ నవ్వును ఎప్పటికీ మరువలేను. ఏ లోకం నుంచి వచ్చిందో ఆ నవ్వు.

          శవాల మీద మంచు ధారాళంగా కురుస్తున్నది. షెడ్‌ వాకిలి తెరిచి ఒక పెద్దాయన లోనకు వచ్చాడు. ఆయన రబీ ఎలియా హు. పోలండ్‌లో చిన్న ప్రార్థన గ్రూపుకు పెద్ద. దయాళువు, అందరికీ ప్రీతిపాత్రుడు ` కపోలు, బ్లాకల్‌ టెస్ట్‌లతో సహా. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రశాంత వదనంతోనే ఉండేవాడు. బ్యూనాలో అందరూ ఆయనను రబీ అని పిలిచేవారు. పురాతన కాలపు ప్రవక్తలలో ఒకడనిపించాడు. ఓదార్పు అవసరమైన వారి చెంతన నిరంతరం ఉండేవాడు. అతని మాటలు అందరికీ ప్రశాంతతనిచ్చేవి.

          కళ్ళు పెద్దవిగా చేసి ఎవరికోసమో వెతుకుతున్నాడు. ‘మా అబ్బాయిని ఎవరైనా చూశారా?’ అన్నాడు. గందరగోళంలో కొడుకు ఎటు వెళ్ళాడో చూడలేదు. చనిపోతున్న వారిలో వెతికాడు. మంచు తవ్వి కొడుకు పడి ఉన్నాడేమో అని చూశాడు.

          మూడేళ్ళుగా యిద్దరూ కలిసే ఉన్నారు. కష్టాలు పడ్డారు, దెబ్బలు తిన్నారు, రేషన్‌ కోసం వేచి ఉన్నారు. కలసి ప్రార్థించారు. ఒక క్యాంపు నుండి మరో క్యాంపుకి, ఒక సెలక్షన్‌ నుండి మరోదానికి కలిసే కదిలారు. చివరకొస్తున్నదనగా ఇప్పుడు విడిపోయారు.

          ‘‘ప్రయాణంలో అలసి నేను వెనకబడిపోయాను. మా అబ్బాయి అది గమనించ కుండా ఎటు వెళ్ళాడో, ఎక్కడని వెతకను. నీవుగాని చూశావేమొ అని అడుగుతున్నాను’’ అన్నాడు.

          ‘‘నేను చూడలేదు రబీ’’ అన్నాను.

          ఆయన ద్వారం దాటిన తరువాత నాకు జ్ఞాపకం వచ్చింది. వాళ్ళ అబ్బాయి నా పక్కనే పరుగెత్తుతున్నాడు. గుర్తు రాక రబీకి చెప్పలేదు.

          అతను తన తండ్రి వెనకబడటం చూశాడు. ఆగకుండా పరుగెత్తుతూనే ఉన్నాడు. ఇద్దరి మధ్య దూరం పెరిగింది.

          భయంకరమైన ఆలోచన వచ్చింది నాకు. ఆ అబ్బాయి తండ్రిని వదిలించు కోవాలనుకో లేదు గదా? తండ్రి శక్తి లేక పడిపోతున్నాడు. తండ్రి బరువును వదిలించు కోవాలని ముందుకెళ్ళి పోయాడా?

          మంచిదే, ఆ విషయం నేను మరచిపోవటం. రబీ తన కొడుకును వెతుక్కోవటం మంచిదే అనుకున్నాను.

          నేను దేవుడిని ప్రార్థించటం మానివేశాను. కాని యిప్పుడు అకస్మాత్తుగా ప్రార్థించాను` ‘‘దేవా, నేను రబీ కొడుకు మాదిరిగా ప్రవర్తించకుండా నన్ను కాపాడు’’ అని.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.