అమ్మాయి గెలుపు

(నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

-శ్రీనివాస్ లింగం

“శ్రీ గణేశ ! వేడచేరితినయ నిన్ను

కార్యసిద్ది పొందు ధైర్యమొసగి

పరమకరుణతోడ సరియగు వృత్తికై

చక్కగన్శ్రమించు శక్తినిమ్ము”

 

అనుచూ ఆ వినాయకునికి మ్రొక్కి చదువు ప్రారంభించింది.

ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో చెప్పలేదు కదూ…..

          ఈమె పేరూ ఈనాటిది కాదు, తత్వమూ అలోచనలూ నేటితరానివి కావు, ఈమె ఊరూ ఇనాటిది కాదు. పేరు జానకి, ఆదిశక్తియే స్వయముగా నడయాడు నేల, అదేనండీ పిఠాపురం ఈమె ఊరు.

          ఈ పిల్ల తాతగారు రామయ్య, పురపాలకసంఘ కార్యాలయములో బిళ్ళబంట్రోతుగా ఉద్యోగం చేసి పదవీవిరమణ పొందారు. తండ్రి, త్రిచక్ర ధూమశకట వాహనాన్ని నడుపుతారు.

          చిన్నతనము నుంచీ తన తాత పక్కన నులకమంచము పై ఆరుబయట పాకవెనక తోటలో పడుకోవడమూ, ఆయన చెప్పే కథలూ, పద్యాలూ వినడం, విని వదలక, వాటిని ఆచరణలోపెట్టే ఆలోచనలు కూడా నిండి ఉన్న పిల్ల మన జానకి.

          వారితో అలా అనేక సంవత్సరాలు గడిపిన కారణంగా, శాస్త్రాలు చదవకపోయినా, సావాస ఫలంగా, ఇతిహాస, పురాణాలూ వాటి విలువలూ బానే వంటపట్టాయి. దానికితోడు ఏదో వచ్చీరాని ఆటవెలదులూ తేటగీతులతోనే స్వామిని వేడుకోవడం కూడా అలవడింది. ఆ మాటకొస్తే, రామయ్యగారు కూడా యజ్ఞోపవీతధారణ చేసిన బ్రాహ్మడూ కాదు, వేదాధ్యయనమూ చేయలేదు. ఐతేనేం, వేదసారమూ, పురాణసారమూ , ధర్మ మార్గమున ప్రయాణమూ తెలుసు. పద్యరచనలూ తెలుసు, కానీ, ఏనాడు బాహ్య ప్రపంచానికి వాటిని చూపుకొనే ప్రయత్నమూ, అమ్ముకొనే ఆలోచనా చేయలేదు. చేసింది బిళ్ళబంట్రోతు ఐనా ఏనాడూ, నమ్మిన మార్గము వీడలేదు. ఉన్నంతలో నెట్టుకొచ్చారు. అందుకే అన్నారు, బ్రాహ్మడనగా కేవలం పుట్టుకతో మాత్రమే వచ్చే కులము కాదు. జగతిన, జీవన విధానము ద్వారా కూడా ఈయనలా ఎంతోమంది బ్రాహ్మణులయ్యారు. నన్నడిగితే అదే అసలైన బ్రాహ్మణత్వం, అదే బ్రహ్మము.

          ఇప్పుడు మన జానకి, కాకినాడలో, సాంకేతిక విద్యలో నాల్గవ సంవత్సర పరీక్షలు ముగించుకొని, వచ్చేవారంలో జరిగే విశ్వవిద్యాలయ ఉద్యోగ ముఖాముఖీ , మౌఖిక, లిఖిత పరీక్షలకు సిద్దమౌతోంది.

          ఆ వారము రానేవచ్చింది, చక్కని ఉద్యోగము కూడా మహానగరం గురుగ్రాములో వచ్చింది. రాదామరి, పరిశ్రమ అలాచేసింది, దానికి దైవిక కృప కూడా అలా తోడైంది.  ఎంత పద్దతిగా, చిన్నఊళ్ళో, చిన్నఇంట్లో పెరిగిందో అంతే ఆత్మవిశ్వాసమూ, పెద్ద అలోచనలూ ఉన్న జానకివాళ్ళపెద్దలు,  ఎంత మాత్రం విముఖత చూపక పోవడంతో వెంటనే ఆ ఉద్యోగానికి సుముఖత పత్రాన్నిఅంతర్జాల తంత్రిద్వారా పంపి, ఆపై 2 వారాల తర్వాత , ఆలోచనల నందుకొను ప్రయత్నములో భాగంగా పీఠికాపురము నుంచి విశాఖపట్నమొచ్చి, విమానమెక్కి మహానగరాన్నిచేరింది.

          హస్తినలో దిగగానే ఒళ్ళు పులకరించింది , ఒక్కసారి భారతరామయాణాలన్నీ కళ్ళ ముందు తిరిగాయి. ద్రోణాచార్యుల వారిని మనసార తలచుకొని, గురుగ్రాములో అడుగిడె మన జానకి. వడివడిగా ఉద్యోగంలో చేరడం, తలలో నాలుకగా పదిమందితో సాగడమూ శ్రీరాముని పాటలా చక్కగా సాగిపోయాయి.

          కళ్ళుతెరచి చూచేసరికి 2 సంవత్సరాలు గడిచాయి. ఈ రెండేళ్ళలో ఏ నాడు తను నమ్మిన గీత దాటలేదు, తన కర్తవ్యమును, ఆలోచనలనూ వీడలేదు.

          ఇక తాతగారు పెళ్ళి సంబంధాలు చూసే పనిలో ఉన్నారు. ఈలోగా పండుగకి వూరొచ్చిన జానకి తన మనసులోని మాట , కాదుకాదు అన్యులకు అది పిడుగులాంటి వార్త బయటపెట్టింది. నాకు 2,3 సంవత్సరాలు ఉద్యోగమున విరామము తీసుకొని వచ్చి ఇక్కడ మన ఊరిన ఉండాలని ఉందనీ, ఉండి రాబోవు ఎన్నికలకు మన పురపాలక సంఘమునకు సభ్యురాలిగా, మన 3వ శ్రేణి సలహాదారునిగా పోటీకి బరిలో దిగాలని ఉందనీ చెప్పింది. ఒక్కసారి అందరూ హతాశులాయ్యారు. అవ్వరా మరి, ఐతేనేం. చదువులు లేకపోయినా,పెద్ద కులాలూ వారివికాకపోయినా మనిషికీ, మనిషి మాటకీ, అందులోనా ఆడపిల్ల ఆలోచనకీ అందలమెత్తడం వారి సంస్కారానికి నిదర్శనం. కనీసము కారణం కూడా అడగకుండా వెంటనే సరే అన్నారు.

          అందునా వారి తాతగారి పెంపకం మీద వారికీ, తల్లి తండ్రులకూ అపారమైన నమ్మకం ఉంది.  మనిషి ధర్మమార్గమున ఉంటూ చేసే ప్రయత్నానికి భగవంతుని సాయము ఎప్పుడూ ఉంటుందని వారి నమ్మకం. 

          ఎదో చుట్టపు చూపుగా కాకుండా , 6 మాసాల ముందే తగు ప్రణాలిక రచించి, తద్గనుగుణంగా కార్యాసాధన చేయనారంభించిది. ఎంతో మంది ఈ నాటి తరమువారు ఈమెకు అండగా నిలిచారు. ఇతరత్రా పనులకు పూనుకోకుండా నమ్మిన సిద్దాంతాన్నే జనుల ముందుంచి, ఈశ్వరకృప, జనమద్దతుతో కాక్షించిన విజయాన్నిఅందుకొంది.

          జగన్మాత శ్రీ పురుహూతికా దేవి మరియు సతీసమేత శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి ఆశీర్వచనాలు పొంది కార్యాలయమునడుగిడెను. జనులకిచ్చిన మాటను నిలుపుకొని, వాటిని సత్వరమే చేసుకుంటూ ముందుకి సాగి, అనతి కాలములోనే అందరి మన్ననలూ పొందింది. మరీ ముఖ్యంగా వారి తాతగారు బిళ్ళబంట్రోతుగా చేసిన కార్యాలయాన మనుమరాలే సభ్యురాలిగా ప్రశంసలు అందుకుంటుంటే ఆయన పరమ ప్రీతిపొందారు. 

          ఒకనాడు తన ముఖ్య మరియు అంతిమ లక్ష్యాన్ని సభ్య సమావేశమున ముందు పెట్టింది.

          మనకు అనేక మంది మహాపురుషులు అన్నీ త్యాగంచేసి, కేవలం జనత కొరకే, ఈశ్వర కైంకర్యముగా సేవ చేసారు, ఒక పోతనగారనగా, గౌతమ మహర్షనగా, ఇలా అనేక మంది , కానీ వారికి మనము మన కనీస బాధ్యతగా ఎంత గౌరవము చూపుతున్నాము ఎన్ని వూళ్ళలో వారి విగ్రహాలున్నాయి అని చిన్న తనంలో పదేపదే తాతగారు చెప్పి, నాటిన ఆ విలువైన బీజాలు ఈ నాడు మహావృక్షమై ఆ పళ్ళునిచ్చే ఆలోచనా సువాసన వెదజల్లింది.

          మన ముఖ్యకూడళ్ళలో ఎంతో మంది ప్రముఖుల శిలా విగ్రహాలున్నాయి. కానీ, మనకు తీయని గోదారి నీరిచ్చిన మహానుభావుడు గౌతమమహర్షి విగ్రహము జిల్లాలో బహుశా అతి తక్కువ చోట్ల ఉన్నాయి, అందునా మన ఊళ్ళో ఒక్కటి కూడా లేదు. కాటన్ గారినే మనము దొర అని విగ్రహము కట్టుకున్నామే, మరి ఆ నదినే తెచ్చిన మహాపురుషుడు శ్రీ గౌతమమహర్షికి మనము ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలి. ఇందులో రాజకీయము, మతమూ , మరే ఇతర అంశమూ లేదు, ఇది సామాజిక స్పృహ , కృతజ్ఞతా భావము చూపు ఒక సిద్దాంతము, ఆయన నీటిని అన్ని కులమత వర్గాలు వారు కొన్ని వేల సంవంత్సరాలుగా అనుభవిస్తూ, మన జీవనాధారముగా చేసి బ్రతుకుతున్నాము కదా అని తన చక్కని వాగ్దాటితో పెద్దలందరినీ మంత్ర ముగ్ధులను చేసింది. వెంటనే వారంతా ఏ రాజకీయరంగూ పులమకుండా అంగీకరించారు. ఐతే జానకి మాత్రము ఒక షరతు పెట్టింది, ఇది తన 2సంవత్సరాల జీతములో పొదుపు చేసిన ద్రవ్యమునే వాడాలనీ ఆ పై తన మన్ననను అంగీకరించి ఈ విగ్రహ ప్రారంభోత్సవం తన, మన పూర్వపు బిళ్ళ బంట్రోతు శ్రీ రామయ్య చేతుల మీదుగా సాగాలని కోరింది. అందరూ ఎంతో సంతసించి, 2మాసాలలో కోటగుమ్మము వద్ద శ్రీ గౌతమమహర్షి విగ్రహాన్ని జానకమ్మ కష్టార్జితంతో ఎంతో ఘనంగా రామయ్యగారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. 

          ఇలా మొక్కవోని దీక్షతో ఎంతో ముందరి ప్రణాలికతో అందరినీ ఒప్పించి, మెప్పించి కార్యాన్ని, తన లక్ష్యాన్నిచేరి, పదవికి రాజీనామ చేసి, వచ్చిన పని ఐనదని, రాజకీయము తన వృత్తి కాదని అవసరమైనచో అది ఒక ప్రవృత్తి మాత్రమేనని, తిరిగి ఇంతకు మునుపు చేసిన ఉద్యోగములోవారు ఎంతో ఆదరంగా ఆహ్వానించగా వెళ్ళి చేరి, తాతగారు చూసిన వరునిని వివాహం చేసుకుని పలువురకీ ఎంతో ఆదర్శంగా నిలిచి తన జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకుంది జానకి.

          ఇతిహాస పురాణాల పై నమ్మకమూ, భగవంతుని పై విశ్వాసమూ, స్వయంకృషీ , పెద్దల పై గౌరవమూ , సామాజిక స్పృహ వీటన్నిటితో పాటు ఆడపిల్లలకు సరియైన గౌరవమూ  , ఆ పై వారికి సరియైన తోడ్పాటునిచ్చిన రోజున యావత్ప్రపంచమూ సుఖసంతోషాలతో నిండి మన మధ్య మరెందరో జానకిలూ, అన్నపూర్ణలూ , ద్రౌపదిలూ, డొక్కా సీతమ్మలూ , రుద్రమదేవిలూ , మధర్ థెరీసాలూ, చిన్నమాంబాదేవిలూ (పిఠాపుర ప్రభువు శ్రీ రాజారావు వేంకట కుమార మహీపతి సూర్యారావు బహదూర్ పట్టమహిషి) పుట్టిపెరిగి, ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని ఆశిస్తూ…

సర్వేజనః సుఖినోభవంతు!  

*****

Please follow and like us:

One thought on “అమ్మాయి గెలుపు (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)”

  1. మీకు హృదయ పూర్వక అబినందనలు.
    అచ్చమైన తెలుగు లో మన చరిత్రను చాలా చక్కగా వివరించారు. గౌతమ మహర్షి గురించి , మన భారత దేశం గొప్ప తనాన్ని , మన సంస్కృతి, సంప్రదాయాల గురించి అద్భుతం గా చెప్పారు.👏👏👏👏🙏🙏🙏🙏🙏

Leave a Reply

Your email address will not be published.