అమ్మ – నాన్న – ఒక జమున

-సాయిపద్మ

          జమునగారు వస్తున్నారు మేడమ్ వస్తున్నారు అని ఒకటే మా ఇల్లంతా హడావిడిగా ఉంది, అప్పుడు నాకు పదో పదకొండో ఏళ్లు వుంటాయి. ఇల్లు హాస్పిటల్ అంతా చాలా హడావిడిగా ఉండింది. నా భయం ఆల్లా.. ఆ జమున గారు ఎవరో వచ్చేస్తే నేను చూడ కుండానే వెళ్ళిపోతారేమో నన్నెవరూ ఆమెను చూడనివ్వరేమో అన్నదే అందుకే అమ్మని పిన్నిని బుర్ర తినేసే దాన్ని అమ్మ జమునొస్తే నాకు చూపించండి…అని..! అప్పటికి అమ్మమ్మ ఉంది.. నీకు అన్నిటికీ ఆత్రం ఎక్కువే అని నన్ను తిట్టేది.

జమున గారు రానే వచ్చారు.. అబ్బ ఏం మనిషి ఏం తెలుపు ఏం అందం.. పాలరాతి బొమ్మలా ఉండేవారు ఆవిడ. ఆవిడొస్తే అమ్మమ్మ మీగడ పెరుగు వేరేగా తోడు పెట్టేది మళ్ళీ అందులో మీగడ తీసి వేరేగా ఉంచేది. మీగడ అన్నంలో కలుపుకొని వేయించిన పేలాలు వడియాలు నంచుకొని చాలా ఇష్టంగా తినేవారు ఆవిడ…

అని ఆవిడ వెళ్లిపోయిన తర్వాత వారాల తరబడి అమ్మమ్మ అమ్మ మాట్లాడుకునేవారు. ఆవిడ నీళ్లు తాగుతుంటే చూసావా అమ్మ.. గొంతు దగ్గర పల్చగా కంఠంలో కనిపించినట్లు వుంటుంది.. అని అమ్మ అంటే.. నిజమేనే.. భానుమతి గారికి కూడా అంతేనట అని అమ్మమ్మ అనేది. అమ్మ మళ్లీ నా దగ్గరకు వచ్చి ఏదో పెద్ద అమ్మమ్మ భానుమతిని చూసేసినట్టు.. అనేది. ఇద్దరు నవ్వుకునేవాళ్ళం నాకు మా అమ్మకి మాత్రమే తెలిసిన రహస్యం అది.         

          తర్వాత రెండేళ్లకి మళ్లీ జమునగారు వచ్చారు రంగస్థల వృత్తి కళాకారుల సమాఖ్య అనేది స్థాపించి చాలా మంది పేద కళాకారులకి పెన్షన్ లా ఇచ్చేందుకు ఆవిడ ఊరూరా తిరిగి ప్రదర్శనలిచ్చారు ముఖ్యంగా సత్యభామ యాక్ట్ ఆవిడ చేస్తుంటే.. చూడాల్సిందే. మా ఊరు సుమారుగా 200 గ్రామాలకి చిన్న రాజధాని లాంటిది. హెల్త్ కేర్ కావాలన్నా ఇంకా ఏమైనా సినిమా చూడాలన్న ఏమైనా కొనుక్కోవాలి అన్నా కూడా ఇక్కడికి రావాలి. ఆ సారి జమునగారు వస్తున్నారు అని అందరికీ తెలిసిపోయింది. ఊళ్లు ఊళ్లు విరగబడి పోయారు జనాలు. మేము ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేవాళ్లం. నేను పట్టుకుని దిగడానికి నడవడానికి అదికాక ఇంట్లో మా పిన్ని పిల్లలు చిన్నవాళ్ళు ఉండేవారు వాళ్ళు మెట్లు దిగి పడిపోతారేమోనని ఒక చిన్న చెక్క గేటు లాంటిది ఒక పికెట్ గేట్ అనొచ్చు ఎవరు గబుక్కున రాకుండా ఉండడానికి అంతే కాకుండా పిల్లలు పడిపోకుండా ఉండడానికి. మొదటి రెండు మెట్లు అది పట్టుకుని జాగ్రత్తగా దిగేదాన్ని నేను. మా అమ్మమ్మ పెద్ద టాస్క్ మాస్టర్ ఎవరు దొరికినా పని చెప్పేసేది. నేను అప్పుడప్పుడే పోలియో కాలిపర్స్ వేసుకొని నడుస్తున్నాను అది కూడా కాస్త కాస్త నడక అమ్మమ్మ ఆ గేట్ కాసేపని నాకు అప్పచెప్పింది ఆ గేటుకి పక్కగా మెట్లు ఎక్కేటప్పుడు ఒక గట్టి పిట్టగోడ ఉండేది దాన్ని ఆనుకొని ఆ చిన్న కర్రగేటు డెడ్ బోల్ట్ వేసి జనాలు రాకుండా ఆపడం నా పని. కానీ జమున గారి పాపులారిటీ ముందు.. ముఖ్యంగా ఆవిడ హాల్లో ఉన్నారు రెండు అడుగులు వేస్తే ఆవిడ కనబడతారు అని తెలిసినప్పుడు పల్లెటూరు జనాల్ని ఆపడం అనేది ఒక కత్తి మీద సాము కంటే ఎక్కువ. అందరూ .. ఓలమ్మి నువ్వు ఒగ్గీ, నాను ఫలానా ఊరు సర్పంచ్ తెలుసా.. డాట్టర్ గారు నాకు సానా కోజు (క్లోస్ కి వచ్చిన పాట్లు). సందట్లో సడేమియా అని, నేను నా ఫ్రెండ్స్ ని లోపలికి వదిలేసే దాన్ని. తర్వాత స్కూల్లో నాది స్పెషల్ స్టేటస్ ఎంజాయ్ చేసేదాన్ని అది వేరే సంగతి. చాలామంది సీనియర్ క్లాసులో పిల్లలు కూడా నా దగ్గరకు వచ్చి..పద్మసాయి, ఈ సారి మీ ఇంటికి జమున వచ్చినా ఇంకా ఎవరైనా వచ్చినా మాకు ముందే చెప్పు మనందరం కలిసి చూద్దాం అన్నట్టు ఆవిడ నిజంగానే గులాబి రంగులో ఉంటారా లేకపోతే మేకప్పా..చెప్పు పిల్లా..మీ ఇంట్లో ఉన్నారు కదా అనేవారు.. ఇంక చూస్కో..నేను తెగ చెప్పేసే దాన్ని.

          ఊళ్లో పెద్దవాళ్ల ఇళ్లల్లో జమున గారితో వచ్చిన కళాకారులు అందరికీ విడిది ఏర్పాటు చేశారు. జమున గారు సూర్యకాంతం గారు జమున గారి భర్త రమణారావు అంకుల్ అందరూ మా ఇంట్లో ఉండేవారు. మా అమ్మ నాన్నగారు బెడ్ రూమ్ రెండో ఫ్లోర్లో ఉండేది. జమున గారు వచ్చేటప్పుడు అమ్మవాళ్ళు వాళ్ల రూము గెస్ట్ లకు ఇచ్చేసి కిందకి మా రూంలో పడుకునేవారు. జమున గారు వస్తే నాకు సరదా ఏంటంటే అమ్మ నాన్న గారు అమ్మమ్మ నేను చెల్లి అందరం ఒకటే రూమ్లో ఉండేవాళ్ళం.

          అప్పుడు మా ఊరి నుంచి జమున నాన్నగారు ఇంకా చాలామంది రకరకాల ఊర్లు తిరిగేవారు. అన్ని తిరిగి రాగానే నాన్నగారి కిందన హాస్పిటల్లో వెళ్లిపోయేవారు. జమున గారు మేడ మీదకు వెళుతూ ఆ మెట్లు పక్కనే మా రూమ్ ఉండేది. మా రూమ్ లోకి వచ్చి అమ్మమ్మతో నాతో ఒక రెండు మాటలు మాట్లాడి పైకి వెళ్లేవారు. జమున గారు అని పిలిస్తే అలా పిలవకూడదు మీ నాన్నగారికి నేను కూడా సిస్టర్ లాంటిదాన్ని ఆంటీ అనో అత్తా అనో పిలవాలి అప్పటి నుంచి జమున ఆంటీ అనటం అలవాటయింది. అలాగే ఏదైనా మాట్లాడడం కూడా ఆవిడతో..!!

          అప్పుడు వచ్చినప్పుడు, సత్యభామ నాటకం వేశారు. జమున ఆంటీ లిప్ స్టిక్ కనపడలేదు. అప్పుడు తిట్టారు జనాల్ని.. ఈవిడకి ఇంత కోపమా ఆనిపించింది. భర్తను ఆవిడ డాలీ (డార్లింగ్ కి షర్ట్ కట్) అని, అంకుల్ కూడా ఆంటీ నీ డాలీ అని పిలిచేవారు. మేకప్ అతన్ని లేదా ఎవర్నో తిడుతుంటే.. అంకుల్ నేను వెళ్లి తెస్తాను లిప్ స్టిక్ అన్నారు. అక్కడున్న అందరూ ఆశ్చర్య పోయారు. ఆయన వెళ్ళి తెస్తా అన్నందుకు.. ఎవరో గుర్తులేదు గాని అన్నారు మీరు తేవడం ఏంటండీ అయినా ఇంత చిన్న ఊళ్లో అలాంటివి దొరకవు. మగాళ్లు మీరు వెళ్లడం ఏంటి?? అంకుల్ చెప్పిన సమాధానం నాకు ఇప్పటికీ గుర్తుంది తప్పేముంది ఆవిడ షో కి ఇప్పుడు అది అవసరం కదా.. తన వృత్తిలో ఇవన్నీ కావాలి. తన అన్న తన వృత్తన్నా నాకు చాలా గౌరవం. తర్వాత లిప్స్టిక్ సంగతి ఎలా మేనేజ్ చేశారో నాకు తెలియదు కానీ, అంకుల్ దగ్గర మాత్రం ఏదో మ్యాజిక్ ఉంది అనిపించింది నాకు. అది నిజమైన రెస్పెక్ట్ అని చాలా పెద్దయ్యాక అర్థమైంది. మనల్ని 24 గంటలు ప్రేమించి పొగిడే వాళ్ళ కన్నా మనని, మన పనిని ఇష్టపడే వాళ్ళు ఉండాలి అని జమున అంటీ తర్వాత ఎందుకన్నారో నాకు ఇప్పుడు అర్థమైంది.

          అది 1980 సంవత్సరం. ఆ ఇయర్ ఆమె స్రవంతిని కడుపుతో ఉన్నారు. మా పిన్ని కూడా గర్భవతి. అంటే జమున ఆంటీ 50 ఏళ్ల వయసులో ఆ పాపని కన్నారు. అంత పని చేస్తూనే ఎంత జాగ్రత్తగా ఉండేవారు. అమ్మని అడిగి అంతా పర్వాలేదా బానే ఉంది కదా అని చర్చించేవారు సుమారు పది సంవత్సరాలు తర్వాత వచ్చిన గర్భం కదా.. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వంశీని కడుపుతో ఉండేటప్పుడు, నేను పని చేస్తూనే ఉన్నాను అది కూడా హీరోయిన్ ఓరియంటెడ్ రోల్స్ చాలా పని చేసేదాన్ని అనిచెప్పారని అమ్మ అనేది.

          అంతే కాకుండా రంగస్థలం వృత్తి కళాకారుల సమాఖ్య పనిచేసేటప్పుడు ఆవిడ నాన్నగారు చాలా ప్లేసుల్లో తిరిగేవారు కారులో వెళ్లేటప్పుడు నాన్నగారి కారులో గాని లేదా నాన్నగారి పక్కన గాని కూర్చొని వెళ్లేవారు. ఒకసారి ఎవరో రాజకీయ నాయకుడు పక్కన కూర్చున్నారని ఇంటికి రాగానే నాన్నగారికి కచ్చితంగా చెప్పారు డాక్టర్ గారు ఎవరు ఎలాంటి వాళ్లో, వాళ్ల బుద్ధులు ఎలాంటివో నేను ఇట్టే కనిపెట్టగలను. నేనుసేఫ్ అనుకునే వ్యక్తుల పక్కనే నేను కూర్చుంటాను అని.

          కట్ చేస్తే, మళ్లీ 1996 లేదా 97 ప్రాంతాల్లో జమున ఆంటీ స్రవంతిని హీరోయిన్గా పెట్టి డాక్టర్ మమత అని ఒక సీరియల్ తీశారు అది దూరదర్శన్ కోసం. స్రవంతికి 16 ఏళ్లు కూడా ఉండవు.  నేను అతి క్లిష్టమైన స్పైన్ సర్జరీ చేయించుకొని వచ్చేసరికి, జమున ఆంటీ, ఇంకా చాలా మంది వచ్చి వున్నారు. సీరియల్ షూటింగ్ సగం పైగా మా ఇంట్లోనూ హాస్పిటల్లోనూ మిగతాది చుట్టుపక్క గ్రామాల్లోనూ జరిగింది. వారితో పాటు రాజబాబు గారి తమ్ముడు అనంత్ కూడా ఆ సీరియల్ లో ఎక్ట్ చేసారు. కెమెరా మీర్ గారు అనుకుంటా.
స్రవంతి చాలా చిన్నపిల్ల. జమున గారు, ఆమెను యెంత జాగ్రత్తగా, చూసుకునేవారు అంటే, ఎక్కడికి వెళ్తాను అన్నా ఎవర్నో ఒకరిని తోడు ఇచ్చి పంపించేవారు ఎందుకలాగా ఇంత చిన్న ఊరిలో తనని ఫ్రీగా ఉండనివ్వచ్చు కదా అని అడిగాను. స్రవంతి కూడా వద్దు అంటే వెళ్ళేది కాదు, తోడు తీసుకునే వెళ్ళేది. ఒకసారి ఎందుకంటే అప్పుడు నేను స్పైన్ ఆపరేషన్ చేయించుకుని మంచం మీదే ఉన్నాను, షూటింగ్ కి వెళ్తూ వస్తూ నన్ను పలకరించి వెళ్లేవారు ఆవిడ ఒక్కోసారి కూర్చొని చాలాసేపు మాట్లాడేవారు. ఒక నేమ్ ఫేమ్ ఉన్నవాళ్లకి చాలా ఇబ్బందులు ఉంటాయి పద్మా.. వాళ్ళ చుట్టూ చాలామంది చేరుతారు నెమ్మది నెమ్మదిగా మన పర్సనల్ విషయాలు అన్నీ తెలుసుకుంటారు మనలో మనకే ఇబ్బందులు పెడతారు వంశీని కడుపుతో ఉండేటప్పుడు నేను ప్రెగ్నెన్సీ గాని మదర్ హుడ్ కానీ ఎంజాయ్ చేసింది లేదు ఇంచుమించు ఆరు నెలలు వచ్చేదాకా పనిచేస్తూనే ఉన్నాను తర్వాత డెలివరీ అయిన కొన్నాళ్లకే మళ్ళీ సినిమాలు ఒప్పుకున్నాను పెళ్లయిన తర్వాత మళ్లీ జీరో నుంచి నా జీవితం మొదలు పెట్టాను. అది కూడా రామానాయుడు గారు ఇచ్చిన అద్దె ఇంట్లో. ఈ వయసులో ఈ పాప నాకు వరం అని చెప్పేవారు. తనకి నాకు ఉన్న జనరేషన్ గ్యాప్ వల్ల మూడో వాళ్ళు చొరబడకూడదు అని నేను గమనిస్తూనే ఉంటాను అని చెప్పారు. బాబోయ్ ఎన్ని విషయాలు ఆలోచిస్తారు ఈవిడ అనుకునేదాన్ని. అంతే కాకుండా నాకు అప్పుడు 22, 23 ఏళ్లు ఉంటాయేమో..నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఆవిడకి లేదు కానీ ఎంతో ట్రాన్స్పరెంట్ గా నిజాయితీగా అన్ని విషయాలు చెప్పేవారు ఆవిడ కోపం గురించి కూడా. మనుషుల ఫేక్ నెస్ నాకు చాలా కోపం. అదే నా ఆయుధం కూడా అనేవారు నవ్వుతూ.

          నేను అన్ని పిచ్చి ప్రశ్నలు కూడా వేసేదాన్ని.. ఆంటీ మీరు మీగడ వేసుకొని అన్నం, పేలాల వడియాలు అరిసెలు ఇలాంటివన్నీ తింటారు కదా మీరు లావు అయితే కష్టం కదా అని అడిగాను ఒకసారి.. నేను ఏ డైటింగ్ లు చేయను. అలా తిన్నరోజు నేనింకేదన్నా తినటం చూసావా అని అడిగారు.. లేదంటే..చూసావా అదే ట్రిక్. కదలిక ఉండాలి, పని చేయాలి,నచ్చినది మితంగా తినాలి అనేవారు.

          జీవితం మీద డబ్బు మీద పట్టు వదిలేస్తే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మన జీవితాన్ని డిక్టేట్ చేస్తారు ఏ శారీరక పరిస్థితుల్లో మనం ఉన్నా మన జీవితం మీద నిర్ణయాధికారం మాత్రం మనకే ఉండాలి అని చెప్పేవారు. ఆ టైంలో నేను చాలా డిప్రెషన్లో ఉండేదాన్ని స్పైన్ ఆపరేషన్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి ఇంటి నిండా షూటింగ్ కి సంబంధించిన మనుషులు ఉండేవారు ఏ టైంలో ఎవరు వస్తారో తెలియదు. నేను సుమారు మూడేళ్లు మంచం మీద ఉన్నాను మంచం మీద అన్ని.. జమున గారు వచ్చే సమయానికి నేను అప్పుడప్పుడే వెనక ఒక నాలుగు పిల్లోస్ పక్కకి పడిపోకుండా మరికొన్ని తలగడాలు వేసుకుని కష్టపడి కూర్చునేదాన్ని. ఆ టైంలో ఆవిడ చెప్పిన మాటలు నాకు ఎంత ఉపయోగపడ్డాయో తర్వాత కానీ, తెలియలేదు. కానీ, అనిపించేది ఇంత అందంగా నవ్వే ఈ మనిషి వెనకాల ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారు కదా అని.

          సుమారు 80 ప్రాంతాల్లో మొదటిసారి ఆవిడ మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంట్లో సత్యసాయిబాబా ఫోటో చూసి ఏంటి డాక్టర్ గారు ఈ జుత్తుల మనిషిని మీరు పూజిస్తారా?? అని అడిగిన మనిషి 96- 97 టైమ్ లో వచ్చినప్పుడు సత్య సాయి బాబా గారికి పూర్తిస్థాయి భక్తురాలు. తనకి ఫుడ్ పాయిజనింగ్ వల్ల తల తిరిగేదని అప్పుడు బాబాగారు తనకి ఆయన కుటుంబ సభ్యులు వండిన భోజనం పది రోజులు పంపి ఆశ్రమంలోనే ఉంచిన తర్వాత, తనకు బాగా తగ్గిందని చెప్పారు.

మళ్ళీ మా నాన్నగారి ఆహ్వానం మీద మా చెల్లెలి పెళ్ళికి 2000 సం. లో వచ్చారు. మా చెల్లి పెళ్లి నాన్నగారు, అమ్మ, మా కుటుంబం అంతా కష్టపడి, ఒక రెండు వందల గ్రామాల వాళ్ళని పిలిచి భోజనాలు పెట్టి చేసారు. జమున ఆంటీ, అందరితో కలిసి పోవడమే కాకుండా ఒకటి రెండు బ్యాచులకి వడ్డన కూడా చేశారు. 

ఇంక చూస్కోండి, సినిమా స్టార్ జమున మాకు పెళ్లిలో భోజనం వడ్డించిందో తెలుసా అని కొంతమంది ఒకటే గొప్పలు చెప్పుకున్నారు. నేను మళ్ళీ నిలబడుతున్నాను అని జమున గారు ఎంత సంతోష పడిపోయారో ఎంత నొప్పి ఉన్నా నీ శరీరం చూసుకోవడం మాత్రం మానకు. ఆరోగ్యం ఉన్నంతవరకే ఏదైనా అని చెప్పారు. ఆ ఫోటో ఇది .

2012 సంవత్సరం వచ్చేసరికి అమ్మ వెళ్ళి పోయింది. ఆనంద్ తో మేరేజ్ తరువాత నేను వైజాగ్ షిఫ్ట్ అయిపోయాను. నన్ను ఆనంద్ ను చూసి ఎంత సంతోషపడి పోయారో.. అమ్మని ఆవిడ కూడా డాక్టర్ గారు అని పిలిచేవారు.  

డాక్టర్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు అమ్మ? ఎంత సంతోష పడుతూ ఉంటారు నీతోనే ఉంటారు. మీ స్నేహితుడిని పెళ్లి చేసుకున్నందుకు ఆమె ఎంతో హాయిగా ఉంటారు ఆని అన్నారు.ఆమెకి ఎలా గుర్తుందో ఏంటో నీకు శ్రీదేవి అంటే ఇష్టం కదా.. శ్రీదేవి వాళ్ళ అమ్మ కూడా ఎప్పుడు నాతో అనేది.. అమ్మా  మీలాగే చదువుకున్న అబ్బాయిని తీసుకొచ్చి పాప పెళ్లి చేయాలి ఈ ఫీల్డ్ లో వాళ్లు వద్దు అని. గంట సేపు అలా మాట్లాడుతూనే వున్నారు. మేము వింటూనే ఉన్నాం.         

          స్రవంతి వేసిన పెయింటింగ్స్ గురించి మనవడి గురించి, ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. అంకుల్ ఆరోగ్యం బాలేదమ్మా లేకపోతే నేను ఇలా తను లేకుండా వస్తానా? అన్నారు. మా అమ్మాయిని బాగా చూసుకోండి అని ఆనంద్ కి అప్పగింతలు పెడితే నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అదే మరి చివరి సారి చూడటం అని అప్పుడు తెలీదు.

నా జీవితంలో ఇంచుమించు ప్రతి పది పదిహేను సంవత్సరాలకి జమున ఆంటీనీ చూసాను నేను. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చాలా రకాల విషయాల గురించి ఇప్పటికే చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ, ఒక మేల్ డామినేటెడ్ సొసైటీలో ప్రొఫెషన్ లో తన మార్క్ తన విలువలు తన దర్జా, అదేవిధంగా ఒక ఆడదానిగా తన సున్నితత్వం కుటుంబం పట్ల ప్రేమ పిల్లలు అంటే ఎల్లలు లేని అనురాగం ఇవన్నీ కూడా ఎడం చేత్తో ఈజీగా చేసిన మనిషి జమునగారు.అన్నట్టు సూర్యకాంతంగారి లాగా జమున ఆంటీది కూడా ఎడంచేతి వాటం అనుకుంటా..!!

          స్రవంతికి, బాబుకి, వంశీగారికి నా హృదయపూర్వక సానుభూతి. జమున ఆంటీకి నా ప్రేమ పూర్వక నివాళి. ఈ రోజుకి చాలా విషయాలకి మాట్లాడడానికి భయపడి బాధపడి తమని తామే సెకండ్ రేట్ సిటిజన్స్ గా పరిగణించుకుంటున్న ఆడవాళ్లు ఉన్న ఈ సమాజంలో, మీరు నిజంగా సత్యభామ.. అనగా సత్యం మాత్రమే పలికే భామ..!!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.