ప్రొ.కె.రాజేశ్వరీమూర్తి

 -నీలిమ వంకాయల

తెలుగు మహిళల ఉన్నత విద్యా కలల స్ఫూర్తి – పద్మావతి మహిళా కళాశాల రూపశిల్పి  ప్రొఫెసర్. కె.రాజేశ్వరీ మూర్తి

          వేలాది మంది అమ్మాయిలకు నడక, నడత నేర్పి, భవిష్యత్తును తీర్చిదిద్దిన ప్రొఫెసర్. రాజేశ్వరీ మూర్తి ఆంధప్రదేశ్ లో తొలి మహిళా కళాశాల అయిన శ్రీ  పద్మావతి మహిళా కళాశాల రూపశిల్పి. 

          అది ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతం కలిసి ఉన్న కాలం. అబ్బాయిల కళాశాలలో అమ్మాయిలను చేర్చుకోరాదని మద్రాసు విశ్వవిద్యాలయం సిండికేట్ 1951లో తీర్మానించింది. అప్పటికి స్వాతంత్రం వచ్చి నాలుగేళ్ళు. కందుకూరి చేపట్టిన సంఘ సంస్కరణలో ముఖ్యమైన స్త్రీ విద్య అనే లక్ష్యం నెరవేరకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. తిరుపతిలో అప్పటికే డిగ్రీ కాలేజీ ఉన్నా, అమ్మాయిలు దానిలో చదువుకునే అవకాశం లేకుండా పోయింది. 

          అయితే అతి త్వరలోనే ఆ కళాశాలకు శరవేగంతో దూసుకు పోయే అస్త్రం వచ్చింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా లక్ష్యం వైపు దూసుకుపోయే తిరుగులేని అస్త్రం అది. ఆమే ప్రొఫెసర్ రాజేశ్వరీ మూర్తి. తన ఆలోచనలను ఆదర్శాలకు జోడించి ఆ కళాశాలను అన్ని రంగాల్లో నిలదొక్కుకునేలా  చేసింది.  

          స్త్రీల కళాశాల వచ్చిన రెండేళ్ళకు తిరుపతిలో ఎస్వీయూనివర్సిటీ వచ్చింది. అందులో రసాయన శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్ గా చేరిన కే.సూర్యనారాయణ మూర్తి సతీమణే రాజేశ్వరి మూర్తి. అదే సంవత్సరం మహిళా కళాశాలకు ప్రిన్సిపాల్ గా ఆమె పగ్గాలు చేపట్టారు. ఇక ఆ కళాశాల వెనుతిరిగి చూడకుండా దూసుకుపోయింది. అప్పటికింకా కళాశాలకు సొంత భవనాలులేవు. ప్రాక్టికల్స్ కోసం అబ్బాయిల కళాశాలకు వెళ్ళాల్సి వచ్చేది. శ్రీ వేంకటేశ్వర స్త్రీల కళాశాల కాస్తా ‘శ్రీ పద్మావతి మహిళా కళాశాల’ (ఎస్పీడబ్ల్యూ) గా మారింది. మరో రెండేళ్ళకు 1956లో డిగ్రీ కళాశాలయ్యింది.

          మహిళా కళాశాలకు భవనం ఎలా ఉండాలి? తరగతి గదులు ఎలా ఉండాలి? లేబొరేటరీలు ఎలా ఉండాలి? హాస్టళ్ళు ఎలా ఉండాలి? ప్రహరీ గోడ ఎంతెత్తుండాలి? చివరికి టాయిలెట్లు ఎక్కడుండాలి? వంటివన్నీ రాజేశ్వరీ మూర్తి ఆలోచనలకు అనుగుణంగా ఎస్పీడబ్ల్యు కళాశాలలో రూపుదాల్చాయి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వంద ఎకరాలను ఆమె సేకరించారు.

          మహిళా కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టాక విద్యార్థినులందరికి ఆమె తల్లిగా మారిపోయింది. రాత్రి, పగలు తేడాలేకుండా  కళాశాల కోసం అహర్నిశలు శ్రమించారు. ఆమె ఉద్యోగ జీవితమే వ్యక్తిగత  జీవితంగా మారిపోయింది. విద్యార్ధినుల వికాసం కోసం క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్విజ్ పోటీలు వంటి వాటిని తరచూ నిర్వహించేవారు. వివిధ రాష్ట్రాల నుంచి ప్రతిభావంతులైన అధ్యాపకులను ఎంపిక చేశారు. కళాశాలకు విదేశాలతో ముఖ్యంగా అమెరికాతో విద్యాపర సంబంధాలను నెలకొల్పారు. ఆమె నిరంతర కృషి వల్ల శ్రీ పద్మావతి మహిళా కళాశాల రాష్ట్రంలోనే అత్యుత్తమ స్థానానికి చేరుకుంది. ఆ కళాశాల తొలి బ్యాచ్ విద్యార్థినులు పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగానే అధ్యాపకులుగా చేరడానికి వారికే తొలి అవకాశం ఇచ్చారు.

          టీటీడీ హాస్టళ్ళలో మాంసాహారం వండడం నిషేధం. రాజేశ్వరీ మూర్తి పూర్తిగా శాఖాహారిణి. అందువల్ల మాంసాహారాన్ని బైట వండించి విద్యార్థినులకు పెట్టించేవారు. ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి వచ్చినప్పుడు “మన పిల్లలు కింద కూర్చుని భోజనం చేస్తుంటే మనకు అవమానం కదండి” అని సున్నితంగా చెప్పారు. అంతే! ఆయన వెంటనే డైనింగ్ హాలులో బెంచీలు, కుర్చీలు వేయించారు.

          తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్, తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, మలి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహామహులను కళాశాలకు రప్పించారు. కళాశాల కోసం నిత్యం పోరాడేవారు. సమస్యవస్తే పై అధికారులతో అయినా సరే పోట్లాడేవారు. ఎస్పీడబ్ల్యూ కళాశాల ఎదురుగా, రైలు పట్టాల పక్కన ఉన్న కళాశాలకు చెందిన రెండు భవనాలను టీటీడీ అధికారుల నివాసాల కోసం ఈవో స్వాధీనం చేసుకున్నారు. 

          అంతే, రాజేశ్వరి మూర్తికి కోపం వచ్చింది. “కనీసం ప్రిన్సిపాల్ గా ఉన్న నన్ను అడగకుండా మా కాలేజీ భవనాలు ఎలా స్వాధీనం చేసుకుంటారు?” అంటూ టీటీడీ ఈవో పై అపర కాళికలా విరుచుకుపడ్డారు. ఈవో ఆమె పై అధికారి. అయినప్పటికి కళాశాల ప్రయోజనం కోసం భయపడకుండా అతన్ని ప్రశ్నించడం ఆమె నిబద్ధతను తెలియ జేస్తుంది.

          SPW కళాశాల రెండవ ప్రిన్సిపాల్‌గా, డాక్టర్ రాజేశ్వరి మహిళా సాధికారతకు చిహ్నంగా నిలవడమే కాకుండా పేరు, కీర్తిని సంపాదించి కళాశాలతో తన జీవితాన్ని విడదీయరానిదిగా మార్చుకుంది. 21 ఏళ్లపాటు ప్రిన్సిపాల్‌గా పనిచేసిన ఆమె మరొక ఈవో తో ఏర్పడిన భిన్నాభిప్రాయాల వల్ల రాజీనామా చేసి 1975లో న్యూయార్క్‌కు వెళ్లి ఇప్పటి వరకు అక్కడే నివాసం ఉంటున్నారు.

          ఒక ఆడ బిడ్డను తల్లి తీర్చిదిద్దినట్టు ఎస్పీడబ్ల్యూ కళాశాలను ఆమె తీర్చిదిద్దారు. అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరారు. అయినా తన మానస పుత్రికను ఒదులుకోలేదు. తరచూ తిరుపతి వస్తూనే ఉన్నారు. వచ్చినప్పుడల్లా ఎస్పీ డబ్ల్యూ కళాశాలకే కాదు, ఎస్వీయూనివర్సిటీకి కూడా లక్షల రూపాయలు ఇస్తూనే ఉన్నారు. కొలంబియా విశ్వవిద్యాలయానికి పరిపాలనాధికారిగా పనిచేశారు. అమెరికా పౌరులకు మాత్రమే ఇచ్చే అత్యుత్తమ పాలనాధికారి అవార్డు రాజేశ్వరి మూర్తికి లభించింది. తనకొచ్చిన ఆ అవార్డును ఎస్పీడబ్ల్యూ కాలేజీకి ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆమె దగ్గర చదువుకున్న అనేక మంది దేశ విదేశాలలో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు.

          ఆమె సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. ఆమె రాష్ట్రంలో మొదటిసారిగా హోమ్ సైన్స్ కోర్సును, దేశంలోనే మొదటిసారిగా పాపులేషన్ స్టడీస్ కోర్సును ప్రారంభించారు. డాక్టర్ రాజేశ్వరి కళాశాలలోని ప్రతి విభాగానికి ఒక ఆకృతిని ఇవ్వడంలో చాలా శ్రద్ధ వహించారు. మౌలిక సదుపాయాలను అందించారు. ఆమె దూరదృష్టితో కళాశాలకు మంచి హాస్టల్ సదుపాయం లభించింది. ఇది నేటికీ విద్యార్థినులు విద్యను అభ్యసించడానికి సురక్షితమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఈ కళాశాల భారతదేశంలో యునైటెడ్ స్టేట్స్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (USEFI) గుర్తింపును పొంది, ప్రపంచ ఖ్యాతిని సంపాదించింది.

          రాజేశ్వరి ప్రస్తుత కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో ఒక సంప్రదాయ కుటుంబంలో 1921 డిసెంబర్ 10వ తేదీన జన్మించారు. ఒక మహిళగా తన విద్యను కొనసాగించడానికి అనేక అడ్డంకులను ఎదుర్కొన్నారు. అయితే వివాహం తరువాత భర్త ప్రోత్సాహంతో ఉన్నత విద్యను అభ్యసించారు. గణిత శాస్త్రంలో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. వారికి పిల్లలు లేరు. ఇప్పటికీ ఆమె ఎస్పీడబ్ల్యూ కాలేజీ విద్యార్థినులను తన పిల్లలనే అంటారు. ఆమె తొలి బ్యాచ్ విద్యార్థులు ఇప్పటికే ఎనభై ఏళ్ళకు పై బడ్డారు.

          93 ఏళ్ళ వయసులో చివరిసారిగా తిరుపతి వచ్చినప్పుడు ఆలిండియా రేడియో కోసం ఆమెను ఇంటర్వ్యూ చేసిన శ్రీ రాఘవశర్మ ఆమెను గూర్చి ఇలా వ్రాసారు.  

          “గంభీరమైన భాష ఆమె నోటి వెంట జలజలా జాలువారుతుంటుంది. ఆ వయసులో కూడా ఉరకలేసే ఉత్సాహం! ఎంత చలాకీగా మాట్లాడారో! ఎన్ని విద్యా సంబంధ విషయాలు సంభాషించారో! న్యూయార్కులో ఉంటూ, నూరేళ్ళ వయసులో కూడా ఇప్పటికీ ఆమె తన వంట తానే చేసుకుంటారు!”

          డాక్టర్ రాజేశ్వరి సేవలను సముచితంగా గుర్తించేలా టీటీడీ చొరవ తీసుకోవాలని పూర్వ విద్యార్థులు కోరుతున్నారు. ఆమె ఎనలేని సేవలను దృష్టిలో ఉంచుకుని ‘పద్మ’ అవార్డుకు నామినేట్ చేయాలని కోరుతున్నారు. మహిళా విద్య కోసం, ఆమె పుట్టినరోజును ‘బాలిక విద్య గుర్తింపు దినోత్సవం’గా జరుపుకోవాలి అని వారు భావిస్తున్నారు.  

          “ఆమె గ్రాడ్యుయేట్‌లను అదే కళాశాలలో పిజి కోసం నమోదు చేసుకునేలా ప్రోత్సహించింది, తన లక్ష్యాన్ని శాశ్వతం చేయడానికి ముప్పై మంది పోస్ట్ గ్రాడ్యుయేట్‌లను ఉపాధ్యాయులుగా చేరమని ప్రోత్సహించింది. ఈ విధంగా, SPW మా రక్తంలో ఉండటానికి వచ్చింది,” అని ఆమె విద్యార్థిని, 80 ఏళ్ల డాక్టర్ ప్రేమావతి అంటారు. ఇక ఈ ప్రేమావతి మేడమ్ తన ఆస్తి మొత్తాన్ని తిరుపతిలోని ఎస్‌వి యూనివర్శిటీ, ఎస్‌వి ఆర్ట్స్ కాలేజీతో సహా వివిధ సంస్థలకు సింహభాగం ఎస్‌పిడబ్ల్యు కాలేజీకి ఇచ్చేలా వీలునామా వ్రాయడం విశేషం. 

          ప్రొఫెసర్ రాజేశ్వరీ మూర్తి నూరు వసంతాల జన్మదిన వేడుకల సందర్భంగా  ఎస్పీడబ్ల్యూసీ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఆమెకు ప్రేమతో అంకితం చేసిన కవిత

రాజేశ్వరి మూర్తి మేడమ్ కలల ప్రాకారం

శ్రీ పద్మావతి మహిళా కళాశాలకు తానే మణిహారం

వెన్నెల కన్న చల్లని మనసుకు మల్లెపూల హారం

కన్నెర్ర చేశారంటే కాళిక అవతారం

రంగంలోకి దూకారంటే రాముడి శర వేగం

నడిచొచ్చే నారీశక్తి కి తను కాదా ప్రతిరూపం

“మరి మేడమ్ ఎక్కడ ఉంటారు? ఎవరిని అడగాలి?”

మన ప్రహరీ గోడను అడుగు

గోడలోని రాయిని అడుగు

సెమినారు హాలుని అడుగు చెబుతాయిలే

మూడు అంతస్థులన్న భవనాన్ని అడిగి చూడు 

హోమ్ సైన్స్ లైబ్రరీని తట్టి చూడు 

శ్రీ దేవి, భూదేవి శ్రీనివాస బ్లాకుని అడుగు

గాంధీ, నెహ్రూ, వకుళ పరిధిని అడిగి చూడు 

వీచేటి గాలిని అడుగు, పూచేటి పూవుని అడుగు

పూర్వపు విద్యార్థిని అడుగు ప్రేమావతి మేడమ్ ను అడుగు

మేడమ్ అమెరికాలో ఉన్నా ఆవిడ మనసు మన కాలేజీలోనే ఉంది.

మన కళాశాల అణువణువునా ఉన్న ఆవిడ ఋణం మనం తీర్చుకోగలమా? 

తీర్చుకోలేమే మేము మీ ఋణము 

ఉండిపోతారే గుండె మీదేనని 

ఎన్నో జ్ఞాపకాలు మీతో మేము పంచుకున్నాం 

ఎస్పీడబ్ల్యుసి కాలేజీ అంటే భువిలో స్వర్గమే 

మీ వల్లే మాకీవరము అందిందంటే అది మా అదృష్టమే 

మళ్ళీ జన్మే ఉంటే మీతో కలసి పయనం చేస్తాం 

ఇదే కదా ఇదే కదా మీ కథ

ముగింపు లేకుండా సదా సాగదా!

వివిధ ఆడపిల్లల భవిష్యత్ తీర్చిదిద్దగా 

కదం తొక్కి ముందుకడుగేసి కదలినారుగా 

మనుష్యులందు మీ కథ మహర్షిలాగా సాగదా!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.