జ్ఞాపకాల సందడి-43

-డి.కామేశ్వరి 

 కావమ్మ కబుర్లు -18

          ఆ రోజుల్లోనే రామచంద్రాపురంలో మంచి లైబ్రరీ ఉండేది. శరత్ బాబు, చలం, కొవ్వలి, జంపన, బకించంద్ర ఛటర్జీ, అడవి బాపిరాజు వగైరా పుస్తకాలుండేవి. నాకు పన్నెండేళ్ళు వచ్చిన దగ్గర నుండి పుస్తకాలు చదివే అలవాటు అబ్బింది. దానికి కారణం మా అక్క అనిచెప్పాలి. లైబ్రరీకి అపుడపుడు నన్ను దొంగతనంగా పంపేది. అపుడు చలం, కొవ్వలి పుస్తకాలు ఇంట్లో పెద్దవాళ్ల చదవనిచ్చే వాళ్ళు కాదు. అక్కకి ఒక ఫ్రెండ్ కృష్ణవేణి అని ఉండేది. ఇద్దరూ కలిసి పుస్తకాలు దొంగతనంగా వాళ్ళ ఇంట్లో డాబా మీద చదివేవారు. మాములు శరత్ బాబు నవలలలాటివి వాళ్ళు తెచ్చుకునేవారు. చలం, కొవ్వలి లాంటివి తేవడానికి నన్ను పంపించి పరికిణీలో దాచి తెమ్మనేవారు. వాళ్ళు తెచ్చిన పుస్తకాలు నెమ్మదిగా వాళ్ళు చదివాక, నేను చదవడం ఆరంభించా. చలం మైదానం లాటివి చదివి దాచేసేవారు నాకు కనపడకుండా. అక్క లేనపుడు వెతికి తీసి చదివేదాన్ని. శరత్ బాబు పుస్తకాలు నాకు భలే నచ్చేవి. మైదానాన్ని చదివి మాత్రం, ‘ఏమిటీ ప్రేమ? తన కోసం కాపురం వదిలి వచ్చినదాన్ని నాలుగు రోజులు వాడుకుని ఇంకో దాని మీద మోజుపడి దానిచేత పిలిపించుకుని అది రూమ్ బయట కాపలావుంటే లోపల కులకడం’ ఏమిటో అనిపించి ‘ఛీఛీ ఇలాటి పుస్తకాలు చదవకూడద’నుకున్నా కోపంతో. అపుడు నా వయసు 14. ఈ రాసిన మాటలు అప్పటివి కావు. నాకు ఆ వయసులో ఏదో చెప్పలేని అసహ్యం వేసింది. తరువాత పెద్దయ్యాక చదివితే అభిప్రాయం మారకపోగా, ఏముందని, ఎందుకు చలాన్ని, ఈ మైదానాన్ని అంత పొగుడుతారు? ప్రేమంటే నాలుగు రోజుల ముచ్చటా? మోజుపడ్డ ఆడదాన్ని రెండు రోజులు అనుభవించడమా ? అందులో శరత్ బాబు నవలలు చదివాకా ఎంత పవిత్రంగా ఉంటాయి స్త్రీ పాత్రలు అనిపించేది. అపుడే కాదు ఇప్పుడుకూడా చలాన్ని నేనెందుకో  లైక్  చేయను. బహుశా చిన్నపుడు పాతుకుపోయిన అభిప్రాయమేమో… ఇది చదివి చలం ప్రేమికులు నా మీద వాదనలకు దిగద్దు. ఇది నా అభిప్రాయం. ఇపుడు మారదు. వాదించే ఓపిక నాకు లేదు. చలం ఇంకో పుస్తకం బిడ్డల పోషణో, సంరక్షణో చదివి మా అక్క అది అక్షరాలా పాటిస్తూ అప్పుడే పుట్టిన పిల్లాడికి మూడు గంటలకి ఓసారే పాలు ఇచ్చేది. వాడు గోడు గోడున ఏడుస్తూండే వాడు. ‘నీ గోల తగలెయ్య పిల్లాడికి మూడో నెల వచ్చేకా కాని ఇప్పుడు కాదు. ఇప్పుడు వాడు చెంచాడు కూడా తాగలేడు. మూడుగంటకోసారి అంటే నోరెండిపోతుంది. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోతాడు…’ అని అమ్మ తిట్టినా వినేదికాదు. అమ్మ చెమ్చాతో పాలు కలిపి పట్టేది, వాడి ఏడుపు చూడలేక. ఆడది పిల్లలని కనే యంత్రమా? అన్న సూత్రం చదివి మా బావగారిని పస్తులు ( ఆకలి పస్తులు కాదు) పడుకోబెట్టేదిట. మా బావ ఎప్పుడూ, ‘చలం భక్తురాలు మీ అక్క, చలం బాధితుడిని నేను’ అని హాస్యంగా పెద్దయ్యాక అనేవారు. అదో కారణం చలం నచ్చకపోవడానికి. రాసినవి రాసి ఆఖరున పోయే ముందు నేనలా రాయకపోతే బాగుండేదన్నాట్ట. అలా అన్నాడో లేదో నాకు తెలియదు కానీ చలం గురించి ఎంతమంది పొగిడినా నాకు నచ్చదు. ఇంతకీ చలాన్ని కంఠతా పట్టిన ఆ స్నేహితురాలికి ఐదుగురు పిల్లలు, రెండు అబార్షన్లు. మా బావగారు పోయే వరకూ దెప్పుతూనే ఉండేవారు హాస్యంగా. అంటే సాహిత్యం మనిషిని ప్రభావితం చేస్తుందా అన్న ప్రశ్నకి జవాబు. ఏమయితేనేం పన్నెండు పదమూడేళ్లకే సాహిత్యం చదవడం అలవాటయింది. మంచో చెడో ఏది దొరికినా చదివేయమే. మా నాన్న క్లబ్ నించి భారతి, ఫిలిం ఇండియా అనే సినిమా మ్యాగజిన్ తెచ్చేవారు. అసలు హిందీ సినిమాలకై బీజం నాటింది ఆ పత్రికే. దిలీప్ కుమార్, రాజ్ కపూర్., దేవానంద్ లు అప్పటి హీరోలు. అందులో దేవానంద్ అంటే విపరీతమైన క్రేజ్. నా కలల హీరో దేవానందే. తరువాత తరువాత నచ్చడం మానేసాడు. క్రాపు మార్చిన దగ్గరనించీ అనుకోండి. ఫిల్మ్ ఇండియా ఎడిటర్ బాబురావు పటేల్ అని ఉండేవాడు ఎంత బాగా రాసేవాడో. ఆ బొమ్మలు చూసుకోడం, ఆ రాతలు చదివి హిందీ సినిమాల క్రేజ్ లో పడిపోయాను పదమూడేళ్లకే. కాకినాడ సెలవలకి వెళ్ళినపుడు చూసిన మొదటి హిందీ సినిమా, డాక్టర్ కోట్నిస్ కి అమర్ కహానీ. శాంతారాం సినిమా. అదో, శాంతారాం తీసిందే శకుంతల, బారా ఆంఖే  ఏది మొదట అనేది గుర్తులేదు. శాంతారాం మంచి యాక్టర్, డైరెక్టర్. జైలర్, ఝణక్ ఝణక్ పాయల్బాజే, దో హాత్ బారా ఆంఖే, నవరంగ్ లాటి సినిమాలు ఆ రోజుల్లో ఎంత బాగుండేవో. ఏదో చెప్పబోయి ఎటో వెళ్ళింది నా కలం.

కావమ్మ కబుర్లు – 19

          ఆ రోజుల్లో సినిమాకెళ్ళడమంటే ఎంత సరదా! ఎప్పుడు కాకినాడ సెలవలకి వెళ్లినా హిందీ సినిమాలు చూసేవాళ్ళం. అప్పటికి రామచంద్రపురంలో హిందీవి వచ్చేవి కావు. నాలుగు గంటలకల్లా  పిల్లలందరం ఉన్నవాటిలో బట్టలు మంచివి కట్టుకు ముస్తాబయి కూర్చునే వాళ్ళం. అమ్మమ్మ, అమ్మ, పిన్ని అందరూ తయారయి, పిల్లలకి పాలు కలిపి సీసాల్లో పోసి, ఎడపిల్లకి ఆకలేస్తే పెట్టడానికి చిరుతిండి చిన్నపొట్లం, నీళ్లకి మరచెంబు రెండు చాపలు, పిల్లలకి పరవడానికి గుడ్డలు పెట్టుకునేవారు. ఎద్దుల బండివాడికి ముందే చెప్పి ఉంచేవారు. రిక్షాలున్నా, అందరూ కలిసి వెళ్ళడానికి రెండుమూడన్న కావాలి. గదా! అందుకు ఎడ్లబండి. 

          అపుడు సింగల్ ప్రొజెక్టర్ లు ఉండేవి. రీలు మార్చటానికి పదిహేను నిముషాలు పట్టేది. ఈ లోగా టాయిలెట్ కెళ్ళి కొంచం ఏదో నోట్లో వెసుకుని నీళ్లు తాగే వాళ్ళం. సినిమా మొత్తం పూర్తి అయేలోగా మూడునాలుగు సార్లు రీలు మార్చేవారు. మొత్తం సినిమా పూర్తి అవటానికి నాలుగు గంటలయ్యేది. అసలే మూడు గంటలు సినిమాలు ఉండేవి. అమ్మమ్మ వాళ్ళెపుడూ నేల టికెట్ కొనుక్కునేవారు. ఎందుకంటే చక్కగా కాళ్ళుజాపుకుని, చంటి పిల్లని ఒళ్ళో కూర్చో పెట్టుకోవచ్చు. చాప మీద పక్కవేసి పడుకోపెట్టచ్చు. ఎప్పుడూ ఎవరికో ఒకరికి. చంటిపిల్లో, ఎడపిల్లో ఉండేవారు. 

          అప్పుడు నేల అణా, బెంచి పావలా, కుర్చీ అర్ధరూపాయి ఉండేది. 

          బాల్కనీ, అందులో సోఫాలు ఉండేవి. 

          ఏ వీఐపీలకో, ఆఫీసర్లలకో, డబ్బున్న వాళ్లకో ఇచ్చేవారు. కానీ, అవెపుడూ టికెట్ కొనే బాపతుకాదు.

          మేము పెద్దపిల్లలం కుర్చీలో కుర్చునేవాళ్ళం. ఆ రోజుల్లో మగ, ఆడ వేర్వేరు సీట్ లు ఉండేవి. మధ్యన పిట్టగోడ అడ్డు ఉండేది. ఆ రోజుల్లో హిందీ అందరికి అర్థం కాదని  ట్రాన్సలేటర్ ఒకడు హాలు మధ్యలో నిల్చుని సంభాషణలు తెలుగులో చెప్పేవాడు.  వాడిష్టం వచ్చినట్టు చెప్పుకుపోయేవాడు స్వంత కవిత్వం జోడించి, సంభాషణలతో సంబంధం లేకుండా. తరువాత పెద్దయ్యాక అది తల్చుకుంటే నవ్వు వచ్చేది. అపుడే మేలా, అందాజ్, డీదార్, బర్సాత్  లాటివి చూసా. తరువాత్తరువాత రామచంద్రపురంలో కూడా హిందీవి రావడం ఆరంభమయయ్యాయి. సీత కష్టాలు, చంద్రమతి వేలం, శకుంతలని మొగుడు వదిలిపెట్టి పోవడం, సావిత్రి భర్త చనిపోవడం చూసి… ఆడవాళ్ల  చీర కొంగులన్నీ తడిసిపోయేవి, కళ్ళు వాచిపోయేవి, ముక్కులు చీదేసేవారు. ఏమిటో ఆ రోజులు అల్పసంతోషాలు. 

          అలా హిందీ సినిమాలు చూసి, ఫిలిం ఇండియా చదివి పదిహేనేళ్ల పిల్ల హీరోయిన్ స్థానంలో ఊహించుకుంటూ కలల్లో తేలిపోయే అమాయకపు రోజులు. ఎటునించి ఎటెళ్ళాను? మా నాన్న కబుర్లు ఇంకా అవలేదు. అవి రేపు…

*****

( సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.