బరువైన బంధం

(నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

-ప్రమీల శర్మ

          “అయ్యో! తాతగారూ… పడిపోతారు… జాగ్రత్త” చెయ్యి అందిస్తూ, మెట్ల మీద కాలు మడతపడి పడిపోబోయిన నారాయణకి ఆసరాగా నుంచుంది శారద. 
 
          “పర్వాలేదు తల్లీ! నాకేమీ కాదు. అలవాటైపోయింది. ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు… ప్రతీ గురువారం గుడికి వచ్చి భక్తితో ప్రదక్షిణాలు చేస్తున్నావు… ఏదైనా మొక్కు ఉందా?” గుడి ఆవరణలో చెట్టు కింద ఉన్న సిమెంటు గట్టు మీద కూర్చుని, శారద ఇచ్చిన కొబ్బరి ముక్క తింటూ అడిగాడు నారాయణ. 
 
          “ప్రత్యేకించి మొక్కు ఏదీ లేదు తాతగారూ! నాన్న నా కోసం సంబంధాలు చూస్తున్నారు… మంచి కుటుంబంలో పడేలా చూడమని దేవుడికి దణ్ణం పెట్టుకుంటాను, అంతే” కల్మషం లేకుండా చెప్పింది శారద. 
 
          మాటల మధ్యలో ఆమె వివరాలన్నీ తెలుసుకున్న నారాయణ… “నా మనవడు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు, మంచివాడు… తల్లి అన్నా, చెల్లి అన్నా వాడికి విపరీతమైన ప్రేమ. నిన్ను కూడా చాలా మంచిగా చూసుకుంటాడు. పెళ్లి చేసుకుంటావా?” ఆమె ఏమంటుందోనని ముఖంలోకి చూస్తూ అడిగాడు.
 
          “నేనేం చెప్పగలను తాతగారూ… నా పెళ్లి నిర్ణయం పూర్తిగా మా నాన్నగారిదే. నాన్న ఎవరిని చేసుకోమంటే వారిని చేసుకుంటాను. మీ అడ్రస్సు ఇవ్వండి. వచ్చి కలుస్తారు” సిగ్గుపడుతూ చెప్పింది శారద. 
***
          సినిమా యాక్టర్ లా ఆరడుగుల ఎత్తుతో, యాపిల్ పండు రంగులో అందంగా ఉన్న సంతోష్ ని చూసి, నేను చాలా అదృష్టవంతురాలిని అనుకుంది శారద. 
 
          పెళ్లయి అత్తవారింట్లో సంతోషoగా అడుగుపెట్టింది. 
 
          “ఎలా ఉన్నాడు నా మనవడు” అన్నట్టు కళ్ళెగరేసిన నారాయణని చూసి, సిగ్గుతో తలదించుకుంది శారద. 
 
          వారం గడిచేసరికి అందరితోనూ బాగా కలిసిపోగలిగింది. 
 
          “మా కోడలు వచ్చాక, నేనింక రిటైర్మెంట్ తీసుకుంటున్నాను. వంటిల్లు మా కోడలికి హ్యాండోవర్ చేసేస్తున్నాను” అంటూ కొత్త కోడలిని చూడడానికి వచ్చిన వాళ్ళతో అత్తగారు చెబుతుంటే మురిసిపోయింది శారద. 
 
          మావగారు మినిస్ట్రీలో ఉద్యోగం… అడుగు బయటపెట్టాలంటే జీపు, పోలీసు బందోబస్తు, వీధి చివరి షాపుకి వెళ్లాలన్నా కూడా బాస్కెట్ మోసేందుకు పనిమనిషి… చాలా గర్వంగా అనిపించేది శారదకి. 
 
          “నువ్వు చాలా అదృష్టవంతురాలివి” అని స్నేహితురాళ్లు అంటుంటే పొంగి పోయేది. వారాంతాల్లో ఇల్లు పెద్ద క్లబ్ మాదిరిగా ఉండేది. వచ్చి పోయేవాళ్ళు, లంచ్, డిన్నర్ ఏర్పాట్లలో కిందా మీదా అయిపోయేది. హై క్లాస్ కుటుంబాలు ఇలాగే ఉంటాయి, అని సరిపెట్టుకునేది. 
 
          “ఏమ్మా! అలా నీరసంగా కనిపిస్తున్నావు… ఏమీ తినలేదా?” కూతురి ఇంటికి చూడ్డానికి వచ్చిన నారాయణ కళ్ళు… మనవడు సంతోష్ కోసం వెదుకుటుండగా అడిగాడు. 
 
          “అదేం లేదు తాతగారూ! పని ఒత్తిడి వల్ల కొంచెం అలసటగా ఉంది. అంతే!” కప్పి పుచ్చుకుంది శారద. 
 
          “నువ్వు చెప్పకపోయినా, నేను అర్థం చేసుకోగలను. నా కూతురు… అదే, నీ అత్తగారు నిన్నేమైనా అందా? నిజం చెప్పు” బుజ్జగింపుగా అడిగేసరికి శారదకి దుఃఖం ఆగలేదు. 
 
          “ఆయన రోజూ రాత్రి పన్నెండు దాటేదాకా పడుకోవట్లేదు తాతగారూ… అత్తయ్యా, ఆయనా కలిసి అర్థరాత్రి వరకూ పేకాడటం, కబుర్లు చెప్పడంతోనే గడిపేస్తున్నారు. నాకేమో చిన్నప్పట్నుంచీ పది దాటకుండా పడుకోవడం అలవాటు. ఒక్కోసారి ఆయన అసలు మా గదివైపే రావడం లేదు” ఎలా చెప్పాలో తెలీక తలదించుకుంది శారద. 
 
          నారాయణకి సమస్య అర్థమైంది. కొత్తగా పెళ్ళైన జంటకి ఏకాంతం అవసరమని కూతురికి తెలియదా? కానీ కూతురికి, మనవడికీ తనెలా చెప్పగలడు? ఆలోచిస్తూ ఉండిపోయాడు. 
 
          “అదేం లేదమ్మా! మెల్లగా నువ్వే సంతోష్ కి చెప్పి చూడు… అర్థం చేసుకుంటాడు.  నీ అత్తగారు, నలుగురు అన్నదమ్ముల మధ్యన ఒక్కతే ఆడపిల్ల కావడం వల్ల చాలా గారాబంగా పెరిగింది. ఆమెకి ఎవరూ ఎదురు చెప్పేవారు కాదు. నువ్వే సర్దుకుపోవాలి” అన్న పెద్దాయన మాటలకి శారద కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. 
 
          కొద్ది రోజులకే మావగారికి తీవ్రమైన అనారోగ్యం చెయ్యడం, మూడు నెలలు తిరక్కుండానే మావగారు చనిపోవడం జరిగింది. శారద జీవితం పూర్తిగా యాంత్రికమై పోయింది. 
 
          వేరు కాపురం పెట్టాలన్న ఆలోచన ఉన్నా… జీవితాంతం అత్తగారితో కలిసే ఉండక తప్పదని ఆమెకి అర్థమైంది. 
 ***
          “వంట చేసి, టేబుల్ మీద పెట్టి వెళిపొమ్మని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నా చేత్తో వడ్డిస్తే కానీ మా అబ్బాయి తినడు. వెళ్లి మిగిలిన పనులు చూసుకో” హుకుం జారీ చేసింది అత్తగారు. 
 
          “నా భర్తకి నా చేత్తో అన్నం వడ్డించుకోవాలని నాకు మాత్రం ఉండదా? నేనేమైనా ఈ ఇంటి వంట మనిషినా లేక పనిమనిషినా? నాకూ ఆప్యాయతలు పంచుకోవాలని ఉంటుంది కదా!” అత్తగారిని గట్టిగా నిలదీసి అడగాలని ఎన్నోసార్లు అనుకున్నా… ఎదిరించి మాట్లాడే ధైర్యం లేక నోరు నొక్కుకునేది శారద. 
 
          “మా అమ్మ దేవత! ఆమె చేత్తో వడ్డిస్తే నాకు అమృతం తిన్నట్టే ఉంటుంది” అన్న భర్త మాటలకి ఒళ్ళు మండిపోయేది శారదకి. 
 
          వడ్డించేది మీ అమ్మే అయినా, వండింది నేనేకదా అని అడగాలని ఎన్నోసార్లు అనుకునేది. కానీ అడగలేకపోయేది. కడుపు పండినప్పుడు కూడా భర్త ఆదరణ లేదు. తిన్నావా? అని ఎవరూ అడిగిన పాపాన పోలేదు. కూతురి నామకరణం అప్పుడు కూడా తన ఇష్టాన్ని అడిగినవారు లేరు. 
 
          కూతురు మైథిలికి పదమూడేళ్ల వయసప్పుడు జరిగిందా సంఘటన….
 
          ఎదుగుతున్న వయసులో పిల్లలకి కోపం, పెంకితనం సహజం. వారిని బుజ్జగించి మార్చుకోవాలే తప్ప, వారిపట్ల కఠినంగా ఉండకూడదు. 
 
          “ఏవండీ! అత్తయ్యగారు, మైథిలిని హాస్టల్ లో జాయిన్ చేసేస్తానంటున్నారు. వద్దని చెప్పండి… ఈ వయసులో ఆడపిల్లకి తల్లి సంరక్షణ చాలా అవసరం” భర్తని ప్రాధేయపడుతోంది శారద. 
 
          “అమ్మ సంగతి నీకు తెలిసిందే కదా! ఒక్కసారి ఏదైనా నిర్ణయం తీసుకుంది అంటే… మార్పు ఉండదు. తప్పదు శారదా. అయినా అదేమన్నా చిన్నపిల్లా? బయటకి వెళితే బతకడం ఎలాగో దానికీ తెలుస్తుంది” తల్లి నిర్ణయాన్ని సమర్థించాడు సంతోష్. 
 
          “ఇంత ఐశ్వర్యం ఉండీ, హాస్టల్ లో ఉండి చదవాల్సిన అవసరం దానికే మొచ్చిందనీ? ఏదో చిన్న వయసులో, పెంకితనం వల్ల చెప్పిన మాట వినకపోవచ్చు… అంతమాత్రం చేత హాస్టల్ కి పంపేస్తానంటే ఎలా? పద్ధతిగా ఎలా ఉండాలో దానికి నేను నేర్పించుకుంటాను. అయినా దాని పెంకితనం, తల బిరుసుతనం మీ అమ్మనుంచేగా వచ్చింది” శారద మాట పూర్తి కాకుండానే ఆమె చెంప చెళ్ళుమనిపించాడు భర్త.
 
          “తాతగారూ! మీ అమ్మాయి సంగతి మీకు ముందునుంచే తెలుసు కదా. మరి నన్నెందుకు బలి పశువుని చేశారు?” ఓ రోజు నారాయణ తమ ఇంటికి వచ్చినప్పుడు సూటిగా ప్రశ్నించింది శారద.
 
          ఆ ప్రశ్నకి సమాధానం చెప్పేందుకు ఊపిరాడక, కుమిలిపోయిన తాతగారు నారాయణ కొంతకాలం మౌనంగా ఉండిపోయారు. ఆ మౌనం వెనుక పశ్చాత్తాపాన్ని అర్థం చేసుకోగలిగింది శారద.
 
          ఆమె కష్టాలు విని తట్టుకునే శక్తి లేని ముసలి గుండె కొద్దికాలానికి ఆగిపోయింది. 
 
          అప్పుడే నిర్ణయించుకుంది… తనను అభిమానించేవారికి తన కష్టాన్ని చెప్పి బాధపెట్టకూడదని… వీలైతే తాను పొందిన సంతోషాన్ని మాత్రమే పంచుకోవాలని. 
 
          పుట్టింటి వాళ్ళు తాను ఐశ్వర్యం అనుభవిస్తున్నాను అన్న సంతోషంలో వున్నప్పుడు, ఇవన్నీ చెప్పి వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక సర్దుకుపోవడం అలవాటు చేసుకుంది శారద. 
***
          “అమ్మా! మైథిలికి ఇరవై నాలుగేళ్లు నిండాయి. ఉద్యోగంలోనూ స్థిరపడింది. సంబంధాలు చూడడం మొదలు పెడదామనుకుంటున్నాను” ఉయ్యాలలో కూచుని, శారద కలిపి ఇచ్చిన కాఫీ తాగుతూ, తల్లితో చెప్పాడు సంతోష్. 
 
          కూతురి పెళ్లి విషయంగా తనతో ఒక్క మాటైనా అనలేదని శారద మనసు నొచ్చుకుంది. పిల్లకి సంబంధాలు వెదికే విషయంలోనూ అత్తగారిదే నిర్ణయం. 
 
          “మా అమ్మ దేవత! ఈ ఇంట్లో ఎవరికి ఏం కావాలో అన్నీ మా అమ్మకి తెలుసు” తన తల్లి పట్ల వల్లమాలిన ప్రేమతో సంతోష్, తన భార్య కూడా ఆ ఇంటి మనిషేనని మర్చి పోయాడు. 
 
          మైథిలికి మంచి సంబంధం కుదిరినందుకు సంతోషించింది శారద. కానీ తాను కోరుకున్నట్టుగా, కూతురి పెళ్లి బట్టల విషయంలో కూడా తనకి సెలెక్ట్ చేసే అవకాశం ఇవ్వలేదు సరికదా… పెళ్లి ఏ కళ్యాణ మంటపంలో చెయ్యాలి? ఎవరెవరిని పిలవాలి? ఇలా అన్ని విషయాల్లోనూ ఆ ఇంటి ఆడపడుచే పెత్తనం తీసుకుంది. 
 
          “మైథిలిని పెళ్లి కూతురిని చేసిన దగ్గర నుంచీ కార్యం బట్టల వరకూ అన్నీ మా అమ్మాయే సెలెక్ట్ చేసి తీసుకొస్తుంది. కన్యాదానం వేళా, తర్వాతా నువ్వు కట్టుకునే చీరలూ, పెళ్లి వాళ్ళకి పెట్టే బట్టలూ… సంతోష్, వాళ్ళ చెల్లెలూ వెళ్లి షాపింగ్ చేసి తీసుకొచ్చేస్తారు. టైలర్ ని రేపు బ్లౌజులు కుట్టడానికి వచ్చి తీసుకెళ్లమని ఫోన్ చేసి చెప్పు” హుకుం జారీ చేసింది అత్తగారు. 
 
          ” ఉన్నది ఒక్క బిడ్డ. నా బిడ్డ పెళ్లి నాకు నచ్చినట్టు చేసుకునే అవకాశం కూడా లేదా?” మౌనంగా రోదించింది శారద.
 
          చెల్లెలి మీదా, తల్లి మీదా ఉన్న ప్రేమతో, అంతా వారు  చెప్పినట్టే కూతురి పెళ్లి జరిపించాడు సంతోష్. 
 
          పెళ్లి జరిగిందన్న సంతోషంలో అందరూ ఉంటే, శారద ఆలోచన మరొకలా ఉంది. 
అక్క కూతురి పెళ్లికని వచ్చి, ఆ ఇంట్లో పదిరోజులు ఉన్న శారద చెల్లెలు భావనకి అక్క పరిస్థితి అర్థమైంది.
 
          “అక్కా! ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు… ఇక్కడికి వచ్చాక ఈ ఇంట్లో నీ స్థానం ఏంటో నాకర్థమైంది. ఇలాంటి జీవితం నీకు అవసరమా? నాన్నగారు నీ పెళ్ళికి కట్నంగా ఇచ్చిన ఫామ్ హౌస్, అరవై లక్షలు నగదు, బంగారం నీకున్నాయి. ఇక్కడ అందరికీ ఊడిగం చేస్తూ బ్రతకాల్సిన అవసరం నీకేంటి?”  ధైర్యం చేసి తన మనసులో మాట, అక్క శారద ముందుంచింది భావన. 
 
          “అవన్నీ ఎప్పుడో వాళ్ళ హస్తగతమైపోయాయి భావనా! మీ బావగారు ఏదో బిజినెస్ మొదలు పెడతానంటే, మా అత్తగారు బలవంతంగా అవన్నీ ఆయన పేరున రిజిస్టర్ చేయించింది. నేను అంగీకరించకపోతే సంతకాలు పెట్టే వరకూ చిత్రహింసలు పెట్టేవారు. ఆస్తి వాళ్ళ పరమయ్యాక, నన్ను ఒక పనిమనిషిలా చూసేవారు. అనారోగ్యంతో బాధపడుతున్నా, నా చేత వెట్టి చాకిరీ చేయించుకునేవారు. నాన్నగారికి తెలిస్తే బాధపడతారని ఈ విషయాలేవీ నేను తెలియనివ్వలేదు. నేను సంతోషంగా ఉన్నాను, అన్న భ్రమలోనే నాన్న ఈ లోకం విడిచి వెళ్లిపోయారు. అమ్మకి నా కష్టాలు చెప్పి బాధ పెట్టలేను… మైథిలి మొదట్నుంచీ దూరంగా ఉండి చదువుకోవడం వల్ల, దానికీ నా పరిస్థితి చెప్పుకోలేకపోయాను” ఏడిచేందుకు కూడా నీళ్లు రాక, ఇంకిపోయిన కళ్ళల్లో రక్తం చారలు కడుతుంటే, చెల్లెలి వంక నిర్లిప్తంగా చూసింది శారద. 
     
          అక్క పరిస్థితి పూర్తిగా అర్థమైన భావనకి రక్తం మరిగిపోయింది. అప్పుడే దృఢంగా నిర్ణయించుకుంది. 
 
          “ఇక నుంచీ నువ్వు మాతోపాటే ఉంటావు అక్కా! నా భర్త దివాకర్ ఎంత మంచివాడో నీకు తెలుసు. నీకు అండగా మేముంటాము. అవసరమైతే లాయర్ ని పెట్టి కేసు వేయిద్దాం. నీ మామగారి ఆస్తిలో నీకూ వాటా వస్తుంది. భరణంగా బావ చేత ఇప్పించే పూచీ మాది. మానవత్వం లేని ఈ మనుషుల మధ్యన శవంలా బ్రతికే కన్నా, మైథిలి పెళ్లి అయిపోయింది కాబట్టీ… నీ దారి నువ్వు చూసుకోవడం మంచిది. నీకు మేమున్నాం” ధైర్యం చెప్పింది భావన. 
 
          “వద్దు భావనా! గొడవలు వద్దు. కోర్టులూ… కేసులూ అంటూ ఈ ఇంటి పరువు తియ్యడం నాకిష్టం లేదు. మా మావగారు బ్రతికి ఉన్నన్నాళ్ళూ నన్ను కన్న కూతురిలాగే చూసుకున్నారు. ఆయన వంశానికి చెడ్డపేరు తేలేను. నాకు లీగల్ గా ఏ అవసర మొచ్చినా, అండగా నువ్వూ, దివాకర్ ఉన్నారన్న ధైర్యం చాలు నాకు. 
 
          ఈ ఇంట్లో, ఈ మనసులేని మనుషుల మధ్య మరబొమ్మలా బ్రతికే కన్నా… ఏ ఆశ్రమంలోనో సేవలు చేసుకుంటూ బ్రతకడం నయం” చెల్లెలితో శారద ఈ మాటలు అంటున్నప్పుడు, చాటుగా నుంచుని విన్న సంతోష్ నిర్ఘాంతపోయాడు. 
 
          “బయటకి వెళ్లి బ్రతకడం అంత సులభం అనుకుంటున్నావా? ఈ ఆస్తిలో చిల్లిగవ్వ కూడా నీకు దక్కనివ్వను. చూస్తా… ఎవరి అండతో బ్రతుకుతావో నేనూ చూస్తాను” రోషంగా భార్య వంక చూసి, బుసలు కొడుతూ అన్నాడు సంతోష్. 
 
          “భార్య ఆస్తిని బలవంతంగా లాక్కున్న నాడే, హీనమైన మీ వ్యక్తిత్వం నాకర్థమైంది, నా మనసులో మీకు స్థానం లేకుండా పోయింది. పిల్ల పెళ్లి కోసం ఇన్నాళ్లూ ఓపిక పట్టాను. ఇకనైనా స్వేచ్ఛగా నా బ్రతుకు నేను బ్రతకాలనుకుంటున్నాను” స్థిరంగా సమాధానం చెప్పి, చెల్లెలి చెయ్యి పట్టుకుని, ఆ ఇంటి గడప దాటి, అడుగు బయట పెట్టడానికే నిశ్చయించుకుంది శారద. 

*****

Please follow and like us:

One thought on “బరువైన బంధం (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)”

  1. చాలా బాగా రాశారు. వాస్తవానికి దగ్గరగా ఉంది. అమ్మని అర్థం చేసుకున్న మనసు , భార్య ని అర్థం చేసుకోలేకపోయింది.
    ఎంత చేసినా కొంతమంది మారరు. వాళ్ళని మార్చటం వృధా ప్రయాస.
    హృదయా నికి హత్తుకునేలా చాలా సున్నితం గా రాశారు.

Leave a Reply

Your email address will not be published.