అతిరాపల్లి జలపాతాలు

-డా.కందేపి రాణి ప్రసాద్

         కేరళ అంటే కొండలు కోనలు, నదులు, జలపాతాలు, పచ్చని చెట్లు, పడవల పోటీలు, లోయలు ఎన్నో అందమైన వనరులతో అలరారుతూ ఉంటుంది. కొబ్బరి చెట్లు అడుగడునా మంచి నీళ్ళ ఆతిధ్యం ఇస్తూ ఎదురు పడుతుంటాయి. కేర అంటే కొబ్బరి అని అర్ధం అళ అంటే భూమి కాబట్టి కొబ్బరి చెట్లకు నిలడైన భూమి కాబట్టి దీనికి కేరళ అనే పేరు వచ్చింది. వంద శాతం అక్ష్యరాస్యత సాధించిన రాష్ట్రంగా ఎంతో పేరు సంపాదించుకుంది. అంగుళం ఖాళీ లేకుండా అడుగడుగునా పచ్చదనంతో నిండి ఉండటంతో దీనిని ‘’గాడ్స్ ఓన్ కంట్రీ’’ అంటారు. భగవంతుని భూమి కాబట్టే ఆయన ఇంట్లో గార్డెన్ బాగా పెంచుకున్నాడు. అందంగా మొక్కల్ని క్రమ పద్దతితో పెంచు కున్నాడు. వీటికి చుట్టూరా పడమటి కనుమల్ని కాపలాగా పెట్టాడు. ఎన్నో రకాల జంతువు లతో పాటుగా ఏనుగులు ఇక్కడ ప్రాధాన్యత సంపాదించుకున్నాయి. జంతుసంపద వన సంపదలకు తోడుగా నిండుగా జలరాశుల్ని ఉంచాడు. నీటికి కరువు లేక పోవడం వలన చెట్లు చేమలు ఎప్పుడూ పచ్చగా కళకళలాడుతూ కనిపిస్తాయి. అరేబియా సముద్రం ఈ రాష్ట్రానికి తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది.

         మొదట తమిళ మలయాళ భాషలు రెండు కలిసే ఉండేది 8 నుండి 14 శతాబ్దం మద్య కాలంలోనే. మలయాళ భాష అభివృద్ధి చెంది ప్రత్యేకమైన భాషగా గుర్తింపు తెచ్చుకున్నది. స్వాతంత్ర సమయానికి కేరళ మద్రాసు ప్రెసిడెన్సిలోనే ఉండేవి. 1956 నాటికి గాని కేరళ మలయాళ భాష మాట్లాడేవారి రాష్ట్రంగా ఏర్పడలేదు. 1957 లో ఎన్నికల ద్వారా కమ్యూనిష్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇలా అధికారంలోకి రావడం ప్రపంచ చరిత్రలో ఏర్పడిన తొలి వాటిలో ఇది కూడా ఒకటిగా పేరు పొందిందట.
నేను అంతకముందు ఎర్నాకులం జిల్లా ,కోజికోడు జిల్లా ,కాసర్ గాడ్ , జిల్లాలను దర్శించి ఉన్నాను ఈ సారి కోయంబత్తూర్ కు దగ్గరలో ఉన్న పాలక్కాడ్ జిల్లాకు వచ్చాను. ఈ జిల్లాలో నెల రోజుల నుంచి ఉండటం వాళ్ళ దగ్గర ఉన్నవీ వీలైనవి కేరళలో చూస్తూ ఉన్నాం. ఈ పాలక్కాడ్ జిల్లాను పాలక్కోడ్ గ్యాప్ అంటారు. చుట్టూ పశ్చిమ కనుమలు ఎవరూ కాలు పెట్టకుండా కేరళకు దడి కట్టేశాయి. పాలక్కోడ్ జిల్లా ఉన్నప్రవేశం మాత్రమే రాష్ట్రానికి మిగతా రాష్ట్రంలలో అనుసాదించబడి ఉండటం వల్ల దీనిని ‘’పాలక్కోడ్ గ్యాప్ ‘’ అంటారు. తమిళనాడులోని కోయంబత్తూర్ ఈ జిల్లా అనుకోని ఉంది.

         మా అబ్బాయి పాలక్కోడ్ జిల్లా ఆసుపత్రి డాక్టరుగా ఉన్నందున నేను ఈ జిల్లాకు వచ్చాను. ఆసుపత్రి పరిసరాలు కూడా వైవిద్యమైన వృక్ష జాతులతో వచ్చిన వారందరి బాధలను మరిపించే విధంగా ఉంటుంది. ‘’కేరళ్ రాష్ట్రం’’ సుగంధ ద్రవ్యాలకు పేరు పొందింది. నేను చూసిన ప్రదేశాల్లో మిరియాలు ,వక్క చెట్లు ఎక్కువగా కనిపించాయి. నాకు మొక్కల మీదున్న అభిమానం వాటి గురించి వివరాలు తెలుసుకునేలా చేస్తుంది. నేను అనేక అరుదైన చెట్ల గురించి వ్యాసాలు రాశాను. అరుదైనా చెట్ల భాగాలతో అందమైన అలంకరణలు ,బొమ్మలు చేశాను. గత సంవత్సరం అరకు లోయ వెళ్ళి నప్పుడు అక్కడ నుంచి కాఫీ చెట్ల ఆకులు ,గింజలు తీసుకు వచ్చాను. ఆ ఆకులతో , గింజలతోనూ అనేక బొమ్మలు చేశాను. కాఫీ గింజల బాలికను తయారు చేశాను. అలాగే ఆకులను పుష్పా అలంకరణలో వాడుకున్నాను.

         కేరళ కొండలు , నదులు ఎక్కువనుకున్నాం కదా, మొత్తం రాష్ట్రంలో 44 నదులు ప్రవహిస్తున్నాయట. ఈ నదుల్లో భాతరపూజ ,పెరియార్ ,పంబ ,చలియార్ ,కదలుండి పుళ్ళ , అచన్ కోపిల్ వంటి ముఖ్యమైన నదులు వందల కిలో మీటర్లు ప్రవహిస్తున్నాయి. సంవత్సరంలో దాదాపు 120 నుంచి 140 రోజులు వర్షపు రోజులు కావడం వలన రాష్ట్రమంతా తేమగా ఉంటుంది. అందుకే అనేక చిన్నా పెద్ద చెట్లకు రాష్ట్రం నిలయంగా మారింది. ఎన్నో రకాల చెట్లకు నిలయమైనందునే ఆయుర్వేదం అబివృద్ది చెంది ఉంటుంది. మాములుగా బజారుకు వెళితే అడుగడుగుక్కి ఒక ఆయుర్వేద ఆసుపత్రి కనిపిస్తుంది . కొండల్లో నీలగిరి కొండలు ,పళని కొండలు అన్నామలై కొండలు , అగస్త్యమై కొండలు వంటివి ప్రాముఖ్యమైనవి. ఈ కోనల మీదనే తేయాకు రబ్బరు వంటి చెట్లు , అరటి ,కొబ్బరి బాదం ,మామిడి వంటి చెట్లు కుడా కనిపిస్తున్నాయి. ఇక్కడి కొండలు రాళ్ల మయం కాదు చెట్ల మయంగా ఉన్నాయి. దూరానికి కొండల మీద ఏమీ ఉన్నట్లుగా కనిపించదు దగ్గరయ్యే కొలది ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో అని అశ్చర్యపోవాల్సి వస్తుంది. ఇలా చూస్తున్నప్ప్పుడే నాకు ‘’దూరపు కొండలు నునుపు ‘’ అనే సామెత గుర్తుకు వచ్చింది. మన పూర్వులు ప్రకృతితో ఎంత మమేకమై ఉంటారు లేకపోతే, వారి నోటి నుండి ఇలాంటి సామెతలు ఉద్భవించేవి కావు. అందుకే ‘పెద్దల మాట చద్దనం మూట ‘’ అనుకోవచ్చు. ఎంతో అనుభవంతో వారు చెప్పిన మాటలు పెడ చెవిన పెట్టకూడదు.
కేరళ రాష్ట్రంలోనే అతి పెద్ద జలపాతమైన అతిరాపల్లి జలపాతాన్ని చూడాలనుకున్నాం. ఈ జలపాతాలను భారతదేశ నయాగర జలపాతాలని పిలుస్తారట. మేమింత వరకు ఎక్కువగా జలపాతాల్ని చూడలేదు. అందుకేనేమో అతి పెద్ద జలపాతాలన్నా భారత దేశ నయగారా అన్నా ఎక్కువ చలించలేదు. ఆ తర్వాత చెప్పిన ఒక్క మాటతో లేచి వెంటనే ప్రయాణ మయ్యాము. భాహుబలి సినిమా షూటింగ్ చేసిన జలపాతాలివే అని చెప్పిన వెంటనే వెళ్దామని అందరూ ఒప్పుకున్నారు. ఇది త్రిస్సూర్ జిల్లాలో ఉన్నది. త్రిస్సూర్ పట్టణానికి 60 కి.మీ దూరంలో ఉన్నది. మేమున్న పాల్గాట్ నుంచి 110 కిమీ దూరంలో ఉన్నది. పాల్గాట్ అన్నా పాలక్కోడ్ అన్నా ఒకటే.

         మేము ఉదయాన్నే కారులో బయల్దేరాం. త్రివెండ్రం వెళ్ళే హై వే గుండా మా ప్రయాణం సాగింది. దారిలో ఒక హోటల్ లో టిఫిన్ చేసి, కాఫీ తాగి మరల బయల్దేరాం ఇక్కడ మాత్రం మంచి నీళ్ళని అడిగితే వేడి నీళ్ళే ఇస్తారు. ఒక వేల లేదంటే మామూలు నీళ్ళు ఇస్తారు. తప్ప చల్లటి మంచి నీళ్ళు మాత్రం దొరకవు. కొద్ది దూరం వెళ్ళాక ఒక పెద్ద సొరంగం వచ్చింది. అరకు వ్యాలి లో రైలు వెళ్ళే సొరంగాలు చూశాను. మళ్ళి ఇక్కడే సొరంగం చూశాను. అయ్యో మర్చిపోయాను బ్రిటిష్ యువరాణి ప్రిన్సెస్ డయానా కారు ప్రమాదానికి గురైన పారిస్ లోని సొరంగం చూశాను. చాలా భాదపడిన సందర్బమది. ఇంకే దేశంలో నైనా కుడా చూశానేమో నా యాత్ర చరిత్రలో రాసి ఉంటాను. ప్రస్తుతమైతే భారత దేశంలో ఇంత పొడవైన సొరంగం చూసినట్లు గుర్తు రాలేదు.

కేరళ రాష్ట్రం వచ్చి యాత్రా చరిత్ర రాస్తూ మమ్మల్ని మా అందాల్ని వర్ణించకుండా ఏమేమో రాస్తున్నావు ? అంటూ కొబ్బరి చెట్లన్నీ నా వైపు కోపంగా చూస్తున్నాయి. కొన్ని కొబ్బరి చెట్లు’’ నన్ను జూడు నా పొడుగు జూడు ‘’ అంటూ దర్జాగా నిటారుగా నిలబడి తమ అందాల్ని చూపిస్తున్నాయి. మరి కొన్ని కొబ్బరి చేట్లేమో మా రాష్ట్రానికి వచ్చినందుకు మమ్మల్ని చూసి అనందిస్తున్నందుకు కృతజ్ఞతలు అంటూ వంగి నమస్కారం చేస్తున్నాయి. మరికొన్ని ఆకతాయి కొబ్బరి చెట్లు కొండల మీదెక్కి మేమింకా పొడుగ్గా ఉన్నాం అని గొప్పలు పోతూ చూపిస్తున్నాయి. మరి కొన్ని సైంటిస్ట్ కొబ్బరి చెట్లు సముద్రంలోని ఉప్పు నీళ్ళను తియ్యని నీళ్ళుగా మార్చేది మేఘాలు మాత్రమే అనుకుంటున్నారా ! మేము కూడా చెయ్యగలం అరెబియా సముద్రంలోని ఉప్పు నీళ్ళను తాగి తీపి కొబ్బరి నీరుగా మార్చి ఉట్టి మీద కుండల్లో దాచినట్లు మా బొండాల్లో దాచాం అంటూ కళ్ళజోడు సరిచేసుకుంటూ వివరిస్తున్నాయి.

         త్రిస్సూర్ జిల్లాలోకి ప్రవేశించాకా అడవి మార్గం వచ్చింది. కొద్ది ఎత్తులో కొండల దారి వచ్చింది. ఈ అడవి లో చాల చోట్ల ఏనుగులు ,జింకలు దాటే ప్రదేశం చూసుకొని వెళ్ళండి అనే బోర్డులు కనిపించాయి. కొద్దిగా ఘాట్ రోడ్డుకు రెండు వైపులా భారి వ్రుక్షాలున్నాయి. టేకు ,భాధం తో పాటు పేరు తెలియని ఎన్నో రకాల మహావ్రుక్షలు న్నాయి జలపాతాల దగ్గరకు వెళ్ళే సమయంలో అవేమి చెట్లో ఏమో గాని కొబ్బరి చెట్ల ఆకారంతోనే ఉన్నాయి గాని ఆకుపచ్చ రంగులో అకులున్నాయి కొబ్బరి చెట్టుకు ఏ డెనిమిది కన్నా మట్టలేక్కువ ఉండవు దీనికి 20 మట్టల కన్నా ఎక్కువే కనిపించాయి. కాండం కుడా విచిత్రంగా ఉంది అక్కడక్కడ పెద్ద పెద్ద వృక్షాలకు సంచులు కట్టబడి ఉన్నాయి. ఈ పెద్ద పెద్ద వృక్షాలకు అల్లుకొని మిరియాల తీగలు ఆకుపచ్చగా అల్లుకొని ఉన్నాయి.

         అతిరాపల్లి వాటర్ ఫాల్స్ అనే బోర్డ్ దగ్గర కారు దిగి కొండ మీదకు వెళ్ళాం దాదాపు కిలోమీటరు ఎక్కాక మరల కిందకు దిగాల్సి వచ్చింది. అప్పుడు కనిపించింది అద్భుత జలపాతం సముద్ర మట్టానికి వెయ్యి అడుగుల ఎత్తు నుండి పాలదారలా ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న అతిరాపల్లి జలపాతం. అయితే దీన్ని దూరం నుంచి చూసే విధంగానే అడ్డు కట్టలు కట్టారు. చాలకుడి నది యొక్క ప్రవాహమిది షోలయార్ శ్రేణుల ప్రవేశ ద్వారం నుంచి ౩౩౦అడుగుల వెడల్పుతో 80 అడుగుల వెడల్పుతో నీళ్ళు జాలువారు తున్నాయి. పిల్లలు వెనక నుంచి మెట్లెక్కి ముందుకు జర్రున జారే లాడర్ అండ్ స్లైడ్ ఆట గుర్తుకొచ్చింది. నదిలోని నీళ్ళు కొండ మీదకెక్కి అక్కడ నుంచి అత్యంత వేగంతో జారుతూ తుళ్ళి పడుతూ ఆడుకున్నట్లు అనిపించింది. ఇది చూస్తుంటే అత్యంత వైభవోపేతంగా తెరకెక్కించిన రాజమౌళి సినిమా బాహుబలి సినిమా గుర్తొచింది. ప్రభాస్ కింది నుంచి జలపాతాన్ని చూడటం శివ లింగాన్ని పెకిలించి ఎత్తు కోవటం ఎవ్వడంటా ఎవ్వడంటా పాట మొత్తం సన్నివేశం కళ్ళ ముందు మెదిలింది. ఎంత అపూర్వంగా అద్బుతంగా అనిపించిందో భారతదేశపు నయాగరా జలపాతల్ని కళ్ళారా కాంచినందుకు సంతోషపడ్డాం.

         చిన్నా పెద్ద బండరాళ్ళు నదీ ప్రవాహమంతా పరుచుకుని ఉన్నాయి ఆ రాళ్ళలో నడుస్తూ మద్యలో వచ్చే నీళ్ళల్లో కాళ్ళు తడుపుతూ కాళ్ళు నీటిలో పెట్టగానే అటూ ఇటూ పరిగెత్తే చేప పిల్లలను చూస్తూ అదో లోకంలో మునుగిపోయం. మేం వెళ్ళినప్పుడు స్పెయిన్ దేశీయులు చాలా మంది వస్తే వాళ్ళతో మాట్లాడి ఫోటోలు తీసుకున్నాం. పెద్ద జలపాతాలు కిందికి ప్రమాదం దృష్ట్యా పోనివ్వడం లేదు. కానీ, చిన్న చిన్న ప్రవాహాల దగ్గర చేరి చాలా మంది స్నానమడారు. మేమూ స్నానాలు చేసి సంతోషించాం అంతరించిపోతున్న జంతు వృక్ష సంపదకు ఆలవాలం ఇది హార్న్ బిల్ వంటి జాతుల అవశేషాలను కనుగొన్న జీవ వైవిద్యం కలిగిన ప్రదేశమిది. అక్కడ మాకు ‘’నీల్గామ్’’ జంతువులు కనిపిస్తే ఫోటో తీశాను. జాతీయ ,అంతర్జాతీయ వలస పక్షులకు కేంద్రంగా ఉన్నది జలపాతం. కేరళ రాష్ట్ర పక్షి హార్న్ బిల్ తో పాటు మలబార్ ఫైడ్ హర్న్ బిల్ , మలబార్ గ్రే హర్న్ బిల్ ,ఇండియన్ గ్రే హర్న్ బిల్ వంటి ఎన్నో అరుదైన పక్షులకు స్థానం కల్పించింది. 39 జాతుల క్షీరదాలు ,25 జాతుల సరిసృపాలకు నిలయమిది . కొండలు ,నీళ్ళు ,చెట్లు, బండరాళ్ళు ఒకటేమిటి అన్నీ కనువిందు చేసేవే . అవకాశం ఉంటే తప్పక చూడండి. అద్భుతమైన జలపాతాలను సందర్శించి తిరిగి పాలక్కాడ్ కు బయలుదేరాం.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.