కాళరాత్రి-19

ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌”

అనువాదం : వెనిగళ్ళ కోమల

          మాకు తిండిలేదు మంచు మా ఆహారం. పగళ్ళు, రాత్రిళ్ళు మాదిరిగా ఉన్నాయి. మధ్య మధ్య ఆగుతూ ట్రెయిన్‌ పోతూ ఉన్నది. మంచు కురుస్తూనే ఉన్నది. రాత్రిం బవళ్ళు అలా ఒకరి మీద ఒకరం వొరిగి గడిపాం. మాటా పలుకూ లేదు. గడ్డకట్టిన శరీరాల్లా ఉన్నాం. కళ్ళు మూసుకునే ఉన్నాం. రాబోయే స్టాప్‌లో శవాలను ఈడ్చివేస్తారని వేచి ఉన్నాం.

          జర్మన్‌ పట్టణాలగుండా గూడా ట్రెయిన్‌ ప్రయాణం సాగింది. పొద్దున్నే జర్మన్‌ కూలీలు పనికి పోతూ కనిపించారు. వాళ్ళకు మమ్మల్ని చూస్తున్నా ఆశ్చర్యం కలగలేదు.

          ఒకనాడు బండి ఆగి ఉండగా ఒక కూలీ ఇంత రొట్టె మా బోగీలోకి విసిరాడు. ఆ రొట్టె కోసం తొక్కిసలాట జరిగింది. బోగీలో డజన్లమంది ఆ రొట్టెముక్క కోసం పోరాడారు. ఆ కూలీ సంభ్రమంగా జరుగుతున్నది చూస్తున్నాడు.

          కొన్నేళ్ళ తరువాత అలాంటి దృశ్యమే నేను చూశాను. మా ఓడలోని ప్రయాణీకులు అక్కడి జనం (నేటివ్స్‌) కోసం నాణాలు విసిరారు. వాళ్ళు నీట మునిగి వాటిని ఏరుకున్నారు. ఒక అందమైన ప్యారిస్‌ స్త్రీ ఆ ఆటలో ఉత్సాహంగా పాల్గొన్నది. ఇద్దరు చిన్నపిల్లలు నీట మునిగి నాణాల కోసం ఒకరి గొంతు ఒకరు నులుముకోబోతుంటే దయచేసి నాణాలు విసరకండి అని ఆమెను అర్థించాను.

          ‘‘ఎందుకు విసరకూడదు? నేను దానం చేస్తున్నాను’’ అన్నది ఆమె.

          రొట్టెపడిన చోట జనం తన్నుకు చస్తున్నారు అది అందుకోటం కోసం. ఒకరినొకరు తోసుకుని, గిచ్చుకుని, తొక్కుకుని కుమ్ములాడుకుంటున్నారు. ఆకలి వారిని మృగాలుగా మార్చింది. ఎక్కడ లేని పశుబలం వారినావహించింది. పళ్ళకీ, గోళ్ళకీ పని కల్పించారు. ట్రెయిన్‌ బారునా ఆ కుమ్ములాట చూడటానికి కూలీలు, దారిన పోయేవాళ్ళూ చేరారు. ఇలాంటి సరుకుని మోసుకొచ్చిన రైలుబండిని లోగడ వారెన్నడూ చూసి ఉండరు. అందరూ రొట్టె ముక్కలు బండిలోకి విసురుతున్నారు. చిన్న రొట్టెముక్క కోసం ఒకరి నొకరు చంపుకోడం వింతగా చూస్తున్నారు, వినోదిస్తున్నారు.

          మా బోగీలోకి రొట్టె పడింది. నేను లేవగలిగి లేను. దానికోసం వెంపరలాడలేదు. ఒక పెద్దాయన డేకుతూ రొట్టెవైపు రావటం చూశాను. తన గుండె మీద చేయి పెట్టుకుని ఉన్నాడు. దెబ్బ తగిలింది కాబోలనుకున్నాను. అప్పుడర్థమయింది, రొట్టెముక్కను అక్కడే దాచిపెట్టుకున్నాడని. అతివేగంగా రొట్టె నోట్లో పెట్టుకున్నాడు. ముఖంలో ఓ వింత వెలుగు ఒక క్షణం కనిపించింది. పక్కన నీడలా కనిపిస్తున్న ఆకారం అతని మీద దాడి చేసింది. దెబ్బలకు తట్టుకోలేక ఏడుస్తున్నాడు.

          ‘‘మేర్‌, నా చిన్న మేర్‌, నన్ను గుర్తు పట్టలేదా? మీ నాన్ననే చంపేస్తున్నావు. నీ కోసం గూడా రొట్టె మిగిల్చాను’’ అంటూ పడిపోయాడు. కాని గుప్పెట్లో యింకా చిన్న రొట్టెముక్క బిగుసుకొని ఉన్నది. నోట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటే కొడుకు దాడి చేశాడు. ఏదో గొణుగుతూ పెద్దాయన పడి చనిపోయాడు. అతని కొడుకు రొట్టెను వెతికి తీసి తినసాగాడు, అది చూచిన యిద్దరు అతని మీదకు దూకారు. మరి కొందరు అదే పని చేశారు. క్షణంలో నా పక్కన తండ్రి కొడుకుల శవాలు పడి ఉన్నాయి. నా వయసు 16 సంవత్సరాలు.

          మా బోగీలో నాన్న స్నేహితుడు మేర్‌కట్జో ఉన్నాడు. బ్యూనాలో తోట కూలీగా పని చేశాడు. అప్పుడప్పుడు మాకు కొన్ని కూరగాయలిచ్చేవాడు. ఆయన అంత తిండి దొరకనందున నిరాశగా కనిపించేవాడు కాదు. మా అందరికంటే బలం కలిగి ఉన్నాడని అతనికి మా బోగీ పెత్తనం ఇచ్చారు.

          మూడోరోజు రాత్రి నా గొంతు పట్టి పిసుకుతుంటే ఉలిక్కిపడి లేచాను. ‘నాన్నా’ అని అతికష్టం మీద పిలవగలిగాను. నాన్న లేచి నా మీద దాడి చేస్తున్నవాడిని పట్టుకున్నాడు. బలం చాలకపోతుంటే మేర్‌కట్జ్‌ని సాయానికి పిలవాలనుకున్నాడు.

          ‘‘తొందరగారా, నా కొడుకుని ఎవరో చంపుతున్నారు’’ అని అరవగా కొన్ని నిముషాలకు నన్ను వదిలేసాడు. అతను నన్ను ఎందుకు చంపాలనుకున్నాడో తెలియలేదు. తరువాత మేర్‌కట్జ్‌  తను ఎక్కువ కాలం బ్రతకననీ, శక్తి ఉడిగిపోతున్నదని నాన్నతో చెప్పాడు. నాన్న అతనికి ధైర్యం చెప్పాడు. అలా దిగజారిపోవద్దు, నీలో నమ్మకం పెంచుకో అని. కాని మేర్‌కట్జ్‌  ‘‘షోమొ, ఇక నా వల్ల కాదు’’ అని ఏడ్చాడు. నాన్న అతని చేయి పట్టుకొని ఓదారుస్తున్నాడు. అతని కొడుకుని ఎప్పుడో వేరు చేశారు, అతని నుండి. అతని కోసం ఇప్పుడు దుఃఖిస్తున్నాడు, అతని ఆఖరిక్షణాలు దగ్గరపడ్డాయి.

          మా ప్రయాణం ఆఖరి రోజున భరించలేని చలిగాలి, మంచు మమ్ములను కుదిపేశాయి. ఇదే ఆఖరు మా జీవితాలకు అనిపించింది. మాలో ఒకరెవరో  ‘లేవండి, కదలండి, కూర్చుంటే గాలి, మంచు మనల్ని మింగేస్తాయి’ అని అరిచారు. అందరం లేచాం. దుప్పట్ల మీద మంచును విదిలిస్తూ కొన్ని అడుగులు వేశాము. భయంకరమైన కేక వినిపించింది., ఎవరో చనిపోయారు.

          చావబోతున్నవారంతా అతనిలా అరిచారు, ఆ అరుపులు స్మశానంలో నుండి వస్తున్నట్లున్నాయి. అందరూ ఏడుస్తున్నారు. మూలుగుతున్నారు. వారి రోదనలు గాలి, మంచులో కలిసిపోయాయి.

          బోగీలన్నిటికీ ఆ ఏడుపు పాకింది అంటువ్యాధిలా. మృత్యుగంట వినిపిస్తున్నది. మేర్‌కట్జ్‌  గొణుగుతున్నాడు. ‘‘మమ్మల్ని ఎందుకు కాల్చి చంపటం లేదు?’’ అని. అదేరాత్రి మేము గమ్యం చేరాం. గార్డులు మమ్మల్ని దిగమన్నారు. శవాలు బండిలోనే ఉండి పోయాయి. మేర్‌కట్జ్‌ అందులోనే ఉండి పోయాడు. ఆఖరి రోజు మరీ దారుణంగా ఉన్నది. 100 మందిలో కేవలం 12 మంది మాత్రమే మిగిలాం. నాన్న, నేనూ కలిసి బుకెన్‌వాల్డ్‌ చేరాం.

          క్యాంపు దగ్గర ఎస్‌.ఎస్‌.లు మా కొరకు వేచి ఉన్నారు. మమ్మల్ని లెక్కించి, అపెన్‌ ఫ్లాట్‌కి పదమన్నారు. లౌడ్‌స్పీకర్లలో ఆర్డర్లు వినిపిస్తున్నాయి. 5గురు చొప్పున వరుసలో 100 మందిమి ముందుకు నడవాలి. నాన్న చెయ్యి గట్టిగా పట్టుకున్నాను విడిపోకూడదని ఆశతో. మా దగ్గరలోనే ఫర్నేసు మండుతున్నది. అది చూస్తున్నా మాకెలాంటి భావం కలగలేదు.

          బుకెన్‌వాల్డ్‌ లోని ఒక పెద్దమనిషి మమ్మల్ని షవర్‌ చేయమన్నాడు, వేరు వేరు బ్లాక్స్‌లోకి పంపుతారన్నారు. వేడినీళ్ళ స్నానం నాలో ప్రాణాన్ని మేల్కొలిపింది. నాన్న ఏ శబ్దం చేయలేదు. ఊపిరి బరువుగా పీలుస్తున్నాడు. ‘‘నాన్నా కాసేపు ఓపికపట్టు, పడుకుందాం’’ అన్నాను. స్నానం ముగించి మంచం మీదకు చేరటమే ధ్యేయం ఇప్పుడు.

          స్నానానికి వందలమంది ఖైదీలు వేచి ఉన్నారు. మమ్మల్ని మల్లేయలేక కొడుతున్నారు. కొందరు తాళలేక మంచం మీద కూలిపోయారు.

          ‘‘ఇక తాళలేను, ఇక్కడే మంచు మీద నా ప్రాణం పోతోంది’’ అని నాన్న మూలిగాడు.

          ‘‘స్నానానికి వీలు చిక్కితే నన్ను తీసుకెళ్ళు, అంతదాకా ఇక్కడే ఉంటాను’’ అన్నాడు.

          సహనం చచ్చిపోయి అరిచాను ‘‘లే నాన్నా, యిక్కడ చచ్చిపోతావు’’ అని.

          ‘‘అరవబోకు బాబూ, మీ నాన్న మీద కనికరం చూపు. నన్నిక్కడ ఉండనీయి’’ అని బ్రతిమాలాడు. పసివాడిలా భయపడు తున్నాడు,  ఓపిక బొత్తిగా లేదు.

          అక్కడి శవాలను చూసి నీవిక్కడ ఆగకూడదని చేయి పట్టిలేపాను. ‘వాళ్ళు అలసి విశ్రాంతి తీసుకుంటున్నారు. వారి జతన నన్ను కూడా విశ్రాంతి తీసుకోనివ్వు’ అన్నాడు.

          వాళ్ళు చనిపోయారు. వారిక ఎన్నటికీ లేవలేరు అన్నాను. నేను వాదిస్తున్నది నాన్నతో కాదు, మృత్యువుతో ` నాన్న దానినే కోరుకుంటున్నాడనిపించింది.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.