దుబాయ్ విశేషాలు-1

-చెంగల్వల కామేశ్వరి

         దుబాయ్ గురించి రాయాలంటే నాకు తెలిసినది సరిపోదు. అందుకే నాల్గయిదు సార్లు దుబాయ్ వెళ్లినపుడు నేను తెలుసుకొన్నవి, అక్కడ మా పిల్లలు చూపించిన కొన్ని విశేషాలు రోజువారీగా పంచుకుంటాను.
 
         UAE అంటే యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ అబుదాబీ, రస్అల్ కైమా, దుబాయ్, అజ్మాన్, షార్జా, ఫ్యుజేరా, ఉమ్మ్ అల్ క్వయిన్, అన్న ఏడు అరబ్బు (చిన్న )దేశాల సమాహారం.
 
         వీటిలో అబూ దాభి ఎమిరేట్ రాజధానిగా సేవలనందిస్తున్నది. ఈ ఏడు ఎమిరేట్ లని కలుపుతూ 2 ఔటర్ రింగ్ రోడ్లు ఉన్నాయి. ఒక రోడ్డు పేరు ఎమిరేట్స్ రోడ్ కాగా, మరో పేరు షేక్ జాయేద్ రోడ్డు. సంయుక్త ఏమిరట్ ని ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ ఏర్పాటు చేసిన వ్యక్తి అధ్యక్షుడిగా పర్యవేక్షిస్తారు.
 
         అధ్యక్షుడిగా కింగ్ మహమ్మద్ ఖలీఫా ఉపాధ్యక్షుడిగా ఉన్న మహమ్మద్ షేక్ జాయ్దా ఇద్దరూ మంచి విజన్ ఉన్న వాళ్లు కావటంతో పలు అధ్బుతమయిన కట్టడాల నిర్మాణం ప్రణాళిక బద్దంగా కట్టి దేశ విదేశీయులను ఆకర్షించే విధంగా ఎమిరేట్స్ ను రూపొందించారు. తద్వారా పర్యాటకరంగాన్ని అభివృధ్ది చేసారు. బిజినెస్ లు చేసు కోవడానికి అనుమతి నివ్వడం ద్వారా సంపన్న దేశాల సముదాయంగా రూపొందింది. ఇస్లాం మతం యు.ఎ.ఇ. యొక్క అధికారిక మతంగా ఉంది, ఆంగ్లం కూడా విస్తారంగా వాడబడుతుంది. అరబిక్ అధికారిక భాష.
 
         నలభయ్యేళ్ల  క్రితం ఎడారిగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు ఇలా ఇంతగా అభివృధ్ది చెందిందంటే దుబాయ్ కింగ్ తీసుకున్న కొన్ని అద్భుతమయిన నిర్ణయాలు మాత్రమే! 
ఇక్కడి చట్టాలు చాలా కఠినమైనవి. మన భారతీయులు పాకిస్తాన్, పిల్లిప్పీన్స్ అధికంగా ఉంటారు. ఇక్కడ ఖర్జూరం విస్తారంగా పండిస్తారు.
 
         రాజధాని నగరాలను ఏ విభాగానికి తగినట్లు ఆ విభాగాలుగా డిజైన్ చేసి నిర్మించిన దేశాలు, అబుదాబీ, దుబాయ్, షార్జా చాలా అధునాతనంగా ఉంటాయి. ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి. టూరిస్ట్ లకు ఫుడ్ కొరత ఉండదు. రకరకాల నమూనాలతో తయారయిన బహుళ అంతస్తుల సముదాయాలు, రేయింబవలు పట్ట పగలులా ధగధగలాడే విద్యుత్ కాంతులు, సిక్స్ లైన్స్ రోడ్స్ మీద వేగంగా వెళ్లే కార్లు. కనిపిస్తూ ఉంటాయి. ముస్లిమ్స్ దేశం కాబట్టి ప్రతి ఏరియాలో మసీదులు ఉంటాయి. 
 
         అసలు ఈ ఎడారిలో సముద్రంలో చేపలు పట్టుకుంటూ జీవనం సాగించే నావికులు ఏ రకంగా ఈ ఏడు దేశాలకు అధిపతులుగా ఎలా ప్రగతి సాధించారో, ఆర్ధికంగా అంచెలంచెలుగా ఎంత బలపడ్డారో తెలుసుకోవాలంటే దుబాయ్ లో ఉన్న దుబాయ్ మ్యూజియమ్ తప్పనిసరిగా చూడాలి. బంగారం కొనుక్కోవాలనుకునేవారు దుబాయ్ కరామాలో ఉన్న” గోల్డ్ సూక్” అనే బంగారు దుకాణాల సముదాయానికి వెళ్లవచ్చు. కళ్లు మిరుమిట్లు కొల్పే మేలిమి బంగారు నగల దుకాణాలు మనకి విభ్రాంతి కల్గిస్తాయి. ఇంక ఇక్కడ దుబాయ్ లో చూడవలసిన ప్రదేశాలు- బుర్జ్ ఖలీఫా, దుబాయ్ ఫ్రేమ్, డాల్ఫినేరి యమ్, మిరకిల్ గార్డెన్ బటర్ ఫ్లై గార్డెన్, దుబాయ్ అక్వేరియమ్, జుమేరా బీచ్, పామ్ బీచ్ ( ఈతచెట్టు ఆకారంలో సముద్రం నడుమ కట్టిన ఐశ్వర్యవంతుల గృహ సముదాయం.) 
విశాలమయిన పార్క్ లు. రోడ్ కి ఇరుపక్కల రంగురంగుల పూవులు చెట్లు చూసి నప్పుడల్లా “ఇదేమి లాహిరి! ఇదేమి గారడి! ఎడారిలోన పూలు పూసే ఎంత సందడి ! అని పాడుకుంటూ ఉంటాను. ఇంక షార్జాలో, అబుదాభీలో చూడాల్సిన ప్రదేశాలు, తెలియ చేసి, ఆయా ప్రదేశాల ప్రత్యేకతల వివరాలతో తెలియచేస్తాను.

*****

  (సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.