నడక దారిలో-28

-శీలా సుభద్రా దేవి

జరిగిన కథ : తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కు కుంది. నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీలో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్యం, సంగీతంతోనూ, బాపూ బొమ్మలు చూసి వేయటంతోను గడిపాను. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గారికి దేవి పేరుతో కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. డిగ్రీ చదువు పూర్తిచేసుకుని మేలో పరీక్షల తర్వాత హైదరాబాద్ శాశ్వతంగా వచ్చేసాను. ఏడాది తిరగకుండానే మా జీవన గీతానికి పల్లవి చేరింది. మా ఆడబడుచు, మరుదులు వివాహాలతో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో సారి పుట్టిన పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయింది. ఉమ్మడి కుటుంబం విడి పోయి వేరు కాపురాలు అయ్యాయి. తర్వాత—

***

          వీర్రాజు గారు, తన స్నేహితుడితో కలిసి మొదలు పెట్టిన వికాస్ అడ్వర్టైజింగ్ ఆఫీసు కోసం ఇంటికి దగ్గర్లోనే రూమ్ తీసుకున్నందున మధ్యాహ్నం ఇంటికే భోజనానికి వచ్చేసే వెసులు బాటు కలిగింది. ఆ పనితో బాటు ముఖచిత్రాల పనీ ఉండటం వలన తీరిక మాత్రం కరువయ్యింది. ఆఫీసుకు అయిదేళ్ళు సెలవు పెట్టినందు వలన అంతకు ముందు లాగ నెల మొదటి రోజునే వచ్చే జీతం లేదు. ప్రైవేటుగా చేస్తున్న పని ద్వారా వచ్చిన సొమ్ములో ఆఫీస్ రూము అద్దే మొదలగు వాటిని మినహాయించగా మిగిలినది ఇద్దరు మిత్రులూ చెరిసగం తీసుకునేవారు. వీర్రాజుగారికి చేసిన పనికి డబ్బు అడగటం మొగమాటం కనుక ఆర్ధిక విషయాలు మిత్రుడు చూసుకునేవారు.
 
          మాకు పొదుపుగా బతకటం అలవాటు కనుక పెద్దగా మా కేమీ ఇబ్బంది అనిపించ లేదు.
 
          అప్పట్లోనే తన నిర్మల్ ఆర్ట్ ప్రకటన కోసం వచ్చిన నిర్మల్ ఆర్టిష్టుని వీర్రాజు గారు ఆఫీసు రూములో అడ్వర్టైజ్ ఏజెన్సీగా పెట్టటం వలన ఇంటీరియర్ అందంకోసం సజీవం గా ఉండే నెమలి బొమ్మని తయారు చేయమని దానికి తాను విడిగా డబ్బు ఇస్తానని కోరారు. అదే విధంగా ఆ నిర్మల్ ఆర్టిష్టు నిజంగా ఏ అడవి లోంచో దారి తప్పి వచ్చిందేమో అనిపించేలా అందమైన నెమలిని తయారుచేసి ఇచ్చాడు. అదిచూసి వీర్రాజుగారు ఎంత గానో మురిసిపోయి నాతో చెప్పారు.” మనింట్లోకి కూడా మరోటి చేయించితే బాగుంటుంది. కానీ ఈ చిన్న అద్దె ఇంట్లో ఎక్కడ పెట్టుకుంటాం” అని నిట్టూర్చారు.
 
          ప్రభుత్వం నుండి వస్తున్న ఒత్తిడి వలన అయిదేళ్ళు సెలవు తర్వాత వికాస్ నుండి బయటకు వచ్చేసి ఆఫీసును మిత్రుడికి అప్పగించారు. ఆ సందర్భంలో నెమలి బొమ్మ ఆఫీసులో ఉండటం వలన అభివృద్ధి చెంద లేదని అది తిరిగి అమ్మేస్తానని మిత్రుడు అనే సరికి ఆ నెమలి బొమ్మ ఎగిరొచ్చి మా యింట వాలి ఇప్పటికీ ఇంటికి వచ్చిన వాళ్ళని ఆకర్షిస్తూనే ఉంది.సెలవు పెట్టిన స్వంతంగా మొదలు పెట్టిన వికాస్ కంపెనీ వలన మా కేమీ లాభించ లేదు. మనసును ఆహ్లాద పరిచే ఆ నెమలి బొమ్మ తప్ప.
 
          ఆ తర్వాత కొన్నాళ్ళకే ఆ నిర్మల్ ఆర్టిష్టుకి కళా రంగంలో జాతీయ బహుమతి వచ్చిందని తెలిసి వీర్రాజుగారు తనకే వచ్చినంతగా సంతోషపడి పోయారు. ఆ నెమలిని చూసి దాని గురించి అడిగిన వారందరికీ ఆ నెమలి బొమ్మ తయారు చేసిన నిర్మల్ ఆర్టిష్టు కి జాతీయ బహుమతి వచ్చిందని గొప్పగా చెప్పేవారు.
 
          అప్పట్లోనే దేశ రాజకీయాలలో పెను సంచలనం ఏర్పడింది. ముఖ్యంగా ఆధునిక భావాలు ఉన్న సాహితీ వేత్తలలోనూ, విరసం పట్ల సానుభూతి ఉన్న కవులలోనూ ఎమర్జెన్సీ చాలా భావ సంచలనం కలిగించింది. ఆ నేపధ్యంలోనే నగ్నముని గారు రాసిన కొయ్యగుర్రం సాహితీ ప్రపంచంలో కూడా చాలా సంచలనం కలిగించింది.
 
          ఇందిరాగాంధీ చేసిన అతి పెద్ద తప్పిదం అయిన ఎమర్జెన్సీ వలన జనం కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెంచుకున్నారు. ఆ ఏడాది జరిగిన ఆరవ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయం పొందటమే కాకుండా 1977 ఎలక్షన్లలో జనతా పార్టీగా ఏర్పడ్డ ఐక్య ప్రతిపక్షం కాంగ్రెసును ఓడించి, మొట్ట మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పరచింది భారత స్వాతంత్య్రం తర్వాత తొలిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వంగా మొరార్జీ దేశాయ్ ప్రధానిగా జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ఎమర్జెన్సీ తొలగింపులో సాహిత్యం తిరిగి ఊపిరి పోసుకుంది.
 
          కానీ ఆంధ్రప్రదేశ్ లో పెద్ద విపత్తు సంభవించింది. 1977 లో దివిసీమ ఉప్పెన ఆంధ్ర ప్రదేశ్ లో సముద్ర తీరంలో విధ్వంసాన్ని సృష్టించిన అతి భయంకరమైన తుఫాను. 1977, నవంబరు 19న ఈ తుఫాను సముద్రతీరాన్ని తాకటంతో ఏర్పడిన విషయంలో అధికారికంగా పద్నాలుగు వేలకు పైగా అని ప్రభుత్వం ప్రకటించినా అనధి కారికంగా సుమారు యాభై వేలకు పైగానే ప్రాణాలు కోల్పోయి ఉంటారు.
 
          ఆరు మీటర్ల ఎత్తున అలలు ఎగసి పడ్డాయిట. తుఫాను తర్వాత వందలాది శవాలు నీళ్ళలో తేలుతూ కనిపించాయని. గుర్తు పట్టలేని అనేక శవాలను సామూహిక దహనం చెయ్యాల్సి వచ్చిందని పేపర్లన్నీ రాసాయి. 
 
          రాష్ట్రమంతా ఒక దీన స్థితిలోకి వెళ్ళి పోయింది.అప్పుడు దృశ్య మీడియా లేక పోయినా రేడియోలో పదేపదే వచ్చే వార్తా విశేషాలు, వార్తా పత్రికల్లో వచ్చే ఛాయా చిత్రాలు, వార్తలు జనాల్లో కలవరం పెంచాయి.
 
          బాపట్లలో ఒక చర్చిలో తల దాచుకున్న దాదాపు వంద మంది ప్రజలు అది కూలడంతో మరణించారని పేపర్లో చదివి అక్కడే ఉన్న పెద్దక్క కుటుంబం గురించి కంగారు పడ్డాము. అప్పట్లో ఫోన్లు లేవు. వాళ్ళ నుండి ఉత్తరం వచ్చే వరకూ మనసు మనసులో లేదు. 
 
          ఇప్పుడు మా కుటుంబమే కనుక పల్లవి స్కూలుకి వెళ్ళాక నాకు కొంచెం తీరిక చిక్కటంతో మళ్ళా మధ్యాహ్నం పూట పుస్తకాలు చదవటం, రచనలు చేయటం మొదలు పెట్టాను.
 
          చిన్నప్పటి నుండి ఎక్కువగా చిన్నన్నయ్య సేకరించిన రావిశాస్త్రి, బీనాదేవి రచన లే కాక తర్వాత కూడా ఆంధ్రజ్యోతి వార పత్రికలలో వచ్చిన పుణ్యభూమి కళ్ళుతెరు, రత్తాలు రాంబాబు మొదలైనవి చదవటం, నాకు ఇష్టమైన రంగనాయకమ్మ రాసిన ధారావాహికలు నా ఆలోచనలు మళ్ళా పదునుగా తయారవుతున్నాయి. కవిత్వం నన్ను ఎక్కువగా ఆకర్షిస్తుంది. అందులోనూ సమాజాన్ని, రాజ్యాన్ని ప్రశ్నించే వామపక్ష భావ జాలం ఉన్న కవిత్వం మరింతగా ఇష్టపడేదాన్ని. 
 
          అప్పట్లోనే ఒకసారి మా యింటికి తురగా జానకీరాణి గారు వచ్చారు. తురగా జానకీ రాణి గారు మాకు అత్యంత ఆత్మీయులు. వీర్రాజు గారు ఆకాశవాణిలోని ప్రోగ్రాం అధికారి అన్న మాటకు నొచ్చుకొని ఆకాశవాణి మెట్లు ఎక్కనని నిర్ణయించు కున్నారు. చివరి వరకూ అదే మాటమీద నిల్చున్నారు. ఆ విషయం తెలిసిన జానకీరాణి గారు “నేను సుభద్రకి ప్రోగ్రాంలు ఇస్తాను. ఆమె ఇలాంటి ప్రతిజ్ఞలు చేయలేదు కదా” అని సరదాగా అన్నారు. అంతే కాకుండా అప్పటి నుండి ఏడాదికి నాలుగు సార్లు ప్రోగ్రాములు ఇచ్చేవారు. అందు వల్లనే ఆ సమయంలో చాలా కథలు రాసాను. కవితలు కూడా ఎక్కువగానే రాసాను. ఆకాశవాణి ప్రోగ్రాములకు డబ్బు కూడా రావటంతో నా మొదటి సంపాదనగా నాకు ఆనందం కలిగించింది.
 
          నాకు తెలిసిన ఒక కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక నవల రాయాలని తలపెట్టి చాప్టర్లుగా కథని సినాప్సిస్ గా రాసుకొని అప్పుడప్పుడు రాయటం మొదలు పెట్టాను. కానీ వీర్రాజు గారు “కవిత్వం బాగా రాస్తున్నావు దాని మీద దృష్టి పెట్టు కవిత్వ సంపుటో, కథల సంపుటో వచ్చాక నవల రాయొచ్చులే” అనే సరికి అది పక్కన పెట్టేసాను.
 
          ఇంతలో పెద్ద ఆడబడుచు భర్త అల్సర్ ట్రీట్మేంటు కోసం కుటుంబ సహితంగా వచ్చి నెల రోజుల పై గానే ఉన్నారు. మళ్ళా నాకు ఊపిరి ఆడని పని మొదలైంది. చిన్నాడబడుచుకి నిండు నెలలు కావటంతో రెండవ కాన్పుకి ఆమె కూడా వచ్చింది. ఆమెను హాస్పిటల్ కి తీసుకు వెళ్ళి చూపించటం,పెద్దాడబడుచు భర్తకి ఆమెకీ భోజనం తయారు చేయటం మధ్యలో పల్లవి చంటిపిల్ల కావటంతో ఆ పిల్లని పట్టించుకోలేక పోయాను. మళ్ళా నేను పని వత్తిడితో నలిగి పోయాను. ఇంకా పథ్యాలేవో సరీగా చేసి పెట్ట లేదనో, పంప లేదనో మూతి విరుపులూ మామూలే. ఏమైతేనేం వాళ్ళందరూ తిరిగి శుభంగా వారి వారి ఇళ్ళకు వెళ్ళేక ఊపిరి తీసుకున్నాను. మధ్య తరగతి జీవితాల్లో మామూలు ఖర్చులకు భిన్నంగా ఇటు వంటి అనివార్య ఖర్చులు మీద పడేసరికి అంతంత మాత్రంగా దాచుకున్నవి కాస్తా ఆవిరైపోతూ ఉంటాయి. వాటిని కూడదీసుకునే సరికి చాలా కాలమే పడుతుంది. ఇవన్నింటితో మానసికంగా, శారీరకంగా నేను కుంగి పోయినట్లయ్యాను.
 
          ఇంతలో నాకు మళ్ళా నెల తప్పింది. చిన్నాడబడుచు పురిటికని వచ్చిన అమ్మ వెళ్ళేటప్పుడు ” ఈసారి అయినా ఆరోగ్యం బాగా చూసుకో. ఇప్పుడు మీ కుటుంబమే కనుక నీకు నచ్చినవి బలమైన ఆహారం తింటూ ఉండు” అంటూ బోలెడు జాగ్రత్తలు చెప్పింది.
 
          ఒకరోజు కుమారీ వాళ్ళు ఆడబడుచు లక్ష్మిని తీసుకుని వచ్చింది. లక్ష్మి బీయిడీ చదువుతుంది. టీచింగ్ ప్రాక్టీస్ కోసం నాకు చార్టులు వేస్తావా అని అడిగింది. పల్లవి బడికి వెళ్తుండటం వలన పగలు ఖాళీగానే ఉంటున్నాను కదా అని సరే అన్నాను.
 
          లక్ష్మి చార్టులు తీసుకు వచ్చి ఇచ్చేది. తెలుగు పాఠాలు, సాంఘిక శాస్త్రం పాఠాలు కనుక బొమ్మలు ఎక్కువగానే ఉండేవి. ఇంట్లో రంగులు ఉంటాయి కాబట్టి వర్ణ చిత్రాలు వేసేదాన్ని. అవి చూసి లక్ష్మి క్లాస్ మేట్ లు కూడా వచ్చి మాకూ వేస్తారా అని అడిగి డబ్బు లు కూడా ఇస్తామన్నారు. ఆ విధంగా నాకు చిరు సంపాదన మొదలైంది.
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.