నిర్భయనై విహరిస్తా..!

(నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

– బి.కళాగోపాల్

         జలజకు హృదయమంతా కలచి వేయసాగింది. ఊరుతున్న కన్నీళ్లను మాటిమాటికీ తుడుచుకో సాగింది. ఆవేదనతో ఆమె మనస్సంతా కుతకుతలాడసాగింది. గుండె గూడుపట్లను కుదుపుతున్న దుఃఖాన్ని మోస్తూ ఆమె నిలువెల్ల శోకతప్తగా నిలబడింది. హాస్పిటల్ లో ఉరుకులు.. పరుగులు పెడుతున్న సిబ్బంది. తెల్లని డ్రెస్సులో నర్సులు లోపలికి వెళ్తూ బయటకు వస్తున్నారు. తమబిడ్డను అలా హాస్పిటల్ బెడ్ పై అచేతనంగా చూడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేక పోయారు జలజ, సుధాకర్ దంపతులు.

         విరిజ ఇరవై ఏళ్ల మల్లెమొగ్గ. సుధాకర్ దంపతుల ఏకైక పుత్రిక. చూడచక్కని రూపు.. మంచి ఛాయ.. ఆకర్షణీయమైన సోగకళ్ళతో చూపరులను ఇట్టే ఆకర్షించేది.

         సుధాకర్ అదే ఊర్లో కాంట్రాక్టు వ్యాపారం చేస్తుండగా.. జలజ దగ్గర్లోని ఒక ప్రైవేటు కాలేజీలో లెక్చరర్ గా పనిచేసేది. తమ గారాలపట్టిని బాగా చదివించి, ఒక మంచి సంబంధం చూసి ఘనంగా పెళ్లిచేయాలని ఆ దంపతుల యోచన. విరిజ వాళ్ల అంచనా లకు తగ్గట్టే క్లాసులో ఎప్పుడూ ఫస్టే! యం.బి.ఎ. చేసి సిటికి కాస్త దూరంగా ఉండే యం.ఎన్.సి. లో మంచి ఉద్యోగం సాధించింది. తన కూతురు జాబ్ లో చేరిన తొలిరోజును గుర్తు తెచ్చుకుంది జలజ!

***

         ఉదయం ఐదున్నరకు అలారం మోగసాగింది. కళ్ళు విప్పింది విరిజ. ఎదురుగా జలజ “వేడి నీళ్ళు సిద్ధం చేశాను.. లేమ్మా!” అంటూ.. ఆరోజు ఉదయమే లేచి తలారా స్నానం చేసి కుంకుమ రంగు చుడిదార్ లో.. తాజా గులాబీలా తొందరగా రెడి అవసాగింది విరిజ.

         “అమ్మా! ఈ రోజు స్నేహితులు జాయినింగ్ పార్టీ అడిగారు..అట్నుంచటే వాళ్లకు మంచి డిన్నర్ ఇచ్చి.. అందరం కల్సి ఐమాక్స్ కు వెళ్లి వస్తాం. లేట్ అవుతుందని టెన్షన్ పెట్టుకోకు. మధ్యలో ఫోన్ చేస్తాలే” అంది నవ్వుతూ.. “కాని జాగ్రత్త.. ఎలా వెళ్తారు?” అంది జలజ ఆర్థోక్తిగా..

         “చూడండి నాన్నా! అమ్మకన్నీ భయాలు.. సందేహాలే.. ఒట్టి అపనమ్మకాల పుట్ట. ప్రతీదానికి కంగారు పడుతుంది. బయటకు వెళ్తానని చెప్తానో లేదో సవాలక్ష సూచనలు చేస్తుంది” అంది ఇడ్లీ తుంచి నోట్లో వేస్కుంటూ.. నవ్వాడు సుధాకర్.. “అమ్మకు చెప్పమ్మా” అన్నాడు భరోసాగా.. “ఓహో! ఇది మీ ముగ్గురి ప్లాన్ అన్నమాట! మరి ముందే చెప్పవేం అల్లరిపిల్లా!” అంటూ మొట్టికాయ వేసింది జలజ.

         “ముందే చెప్తే ఏం మజా..! అందుకనీ.. అరరే! టైం అవుతోంది. మాధురి మెసేజ్ పెట్టింది. క్యాబ్ వచ్చేసినట్టుంది. ఒకటే హారన్ ఇస్తున్నాడు. లేట్ అవుతే కష్టం. దాన్ని పికప్ చేస్కొని వెళ్ళాలి.. బై అమ్మా!” అంటూ తల్లి చేతిని ముద్దాడి బయటకు వేగంగా నడిచింది విరిజ.. వెయిట్ చేసిన క్యాబ్ వాలా వెళ్లిపోవడంతో.. తన హ్యాండ్ బ్యాగు నుండి స్కూటీ ‘ఈ రోజు తీయక తప్పదన్నట్లుగా.. తాళాలు తీసి స్కూటీ స్టార్ట్ చేసి రివ్వున దూసుకు కెళ్ళిన కూతురు కనుమరుగయ్యే వరకు చూసి.. లోనకు నడిచింది జలజ..

         ఎందుకోగానీ ఆమె మనసు కీడు శంకించసాగింది..

***

         ఎంతటి దుర్దినం..! జరుగబోయే ఘోరాన్ని ఎవరు మాత్రం ఏం ఊహిస్తారు? ఊహకందని ఈ దారుణాన్ని ఎలా మాటల్లో వర్ణించడం..? మానసిక క్షోభను తట్టుకోలేక ఆమె కళ్ళు అప్రయత్నంగా వర్షించసాగాయి. ఇలాంటి కడుపుకోత ఏ తల్లిదండ్రులకు రావద్దు. ధారాపాతంగా కారుతున్న కన్నీటిని అదిమిపెట్టలేక పోయింది జలజ..!

         పచ్చిపుండు లాంటి దేహంతో.. ఒళ్ళంతా గీరుకు పోయిన గాయాలతో దిగంతాల నుండి వినపడుతున్న దుఃఖపు జీరలాంటి మూలుగుతో విరిజ బెడ్ పై చిన్నగా  కదల సాగింది. పేగులు మెలిపెట్టే బాధను అనుభవిస్తున్న విరిజను చూసి జలజ మరోమారు కళ్ళనీళ్ళ పర్యంతం అయింది. వాడిన గులాబీలా,,! చలనం ఉందో? లేదో? అన్నట్లుగా జీవచ్చవంలా పడిఉన్న కూతురును చూసి చలించిపోయిన సుధాకర్ విరిజ చేయి పట్టు కున్నాడు అనునయంగా. జలజ.. విరిజ తలపై చేయివేసి ప్రేమగా నిమరసాగింది. ఆమె ఇంకుతున్న కళ్ళనీళ్ళలా సైలెన్ బాటిల్ నిశ్శబ్దంగా తనపని తాను చేసుకుపోసాగింది.

ఓ నాలుగుగంటలు అత్యంత కఠినంగా గడిచాయి. పంటి బిగువున బాధను నొక్కిపట్టి కళ్ళు తెరిచింది విరిజ. ఆమె కళ్ళలో ఆ రోజు రాత్రి జరిగిన దుర్ఘటన తాలూకు నీలినీడలు కదలాడసాగాయి..!

***

         “ఏయ్ విరిజా! ఆరవుతోంది. ఐమ్యాక్స్ కు లేటవుతుందా? ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేశావా?” సెల్ లో మాధురి మెసెజ్ చదువుకొని బదులిచ్చింది విరిజ. అమ్మాయిలంతా కులాసాగా ఐమ్యాక్స్ వద్ద కలిసి షో చూశారు. రాత్రి తొమ్మిదింటికి అంతా కల్సి ముందే ప్లాన్ చేసుకున్న హోటల్ కు బయలుదేరారు. 

         “ఏమైంది విరీ! ఏమిటా పరధ్యానం..?” అంది మాధురి అన్యమస్కంగా ఉన్న ఫ్రెండ్ ను చూస్తూ..

         “ఏం లేదే.. కళ్యాణ్ వస్తానన్నాడని అమ్మకు అబద్దం చెప్పా! ఎంత ఎదురు చూస్తుందో ఏమో?!” అంది “డిన్నర్ కాగానే తొందరగా వస్తున్నానని మెసెజ్ పెట్టు” అంది మాధురి. స్నేహితులంతా కాసేపు కులాసా కబుర్లతో.. నవ్వుకుంటూ.. నవ్విస్తూ ఆహ్లాదంగా కాలం గడిపారు. రకరకాల భవిష్యత్ ప్రణాళికలను చర్చించుకున్నారు. సరదాగా ఒకర్నొకరు ఆటపట్టించుకున్నారు. డిన్నర్ అవగానే మాధురిని ఎప్పట్లా వాళ్ళింట్లో దింపేసి, తమ కాలనీ వైపు బయలుదేరింది విరిజ. దార్లో ఆటో ఒకటి తననే వెంబడి స్తున్నట్లుగా గమనించలేక పోయింది. ముందే రచించుకున్న పథకం ప్రకారంగాఆటోలోని ఐదుగురు యువకులు ఆమె స్కూటీని డీకొట్టి, కిరాతకంగా విరిజ బతుకును బుగ్గి చేశారు. అత్యంత హేయంగా రేప్ చేసి నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్ళు.. చేతులు కట్టేసి రోడ్డుపక్కన పడేసి పోయారు..!

***

         రాత్రి పన్నెండయినా.. ఇంటికిరాని కూతురి కొరకై సుధాకర్ దంపతులు ఆందోళన పడసాగారు. మాధురికి ఫోన్ చేశారు. “అప్పుడే బయలు దేరింది అంకుల్” అంది మాధురి అంతే టెన్షన్ గా..! “ఏమైనా ఆక్సిడెంట్ జరిగిందా? కారు తీయండి.. మాధురి ఇంటినుండి అంటే మాధురి ఇంటికి వెళ్ళే తోవనుండి వెదుకుతూ వెళ్దాం..!” అంది ఆదుర్దాతో కూడిన హీనస్వరంతో జలజ. గబగబా కారెక్కి రోడ్లవెంబడి వెదుకుతూ బయల్దేరారు ఇద్దరు అదురుతున్న గుండెలతో ప్రతివీథి మలుపు తిరుగుతూ.. ఆందోళనతో ‘ఎక్కడైనా స్కూటీ కనపడకపోదా? విరిజకు ఏం జరిగి ఉంటుందో’నన్న తెలీని భయం ఆవహించగా.. సుధాకర్ వణుకుతున్న చేతులతో స్టీరింగ్ తిప్పసాగాడు. కాస్త చీకటిగా ఉండి వీధిలైటు పడనిచోట తుప్పల్లో.. కుంకుమరంగు చున్ని కనిపించింది. కారు ఆపి.. ఒక్క ఉదుటున అటువైపు పరుగెత్తారు!! 

         తమ కన్నకూతురు నిర్జీవంగా పడి ఉంది. గాయాల కుంపటిలా ఉన్న తన బిడ్డను చూడగానే భోరుమంది జలజ. సిటిలో పేరున్న పెద్ద నర్సింగ్ హోంలో చేర్పించారు. ఇంటి నుండి లంచ్ ప్యాక్ చేసి తీసుకువచ్చాడు కళ్యాణ్. “ఆంటీ! ప్లీజ్ ఏడవకండి. మనమంతా ఇప్పుడు విరిజకు సపోర్ట్ గా ఉండాలి. తనను మళ్ళీ మామూలు మనిషిని చేయాలి. అంకుల్! మీరుకూడా ఇలా ఐతే ఎలా? జరిగిన దాంట్లో విరి తప్పేమీ లేదు. ఇదంతా ఆ రాస్కెల్స్ చేసిన పైశాచిక నేరం. వాళ్ళంతా అండర్ గ్రౌండ్ కు వెళ్ళి పోయారు. ఏదో ఒకరోజు పట్టుబడకపోరు?” కళ్యాణ్ కళ్ళలో ఆవేశం. 

         “ప్లీజ్! మీరు రెండు రోజులుగా ఏం తినటం లేదు. చాల నీరసపడి పోయారు. విరికి మెలకువ వచ్చింది? హాస్పిటల్ బిల్లు పే చేసి వస్తాను. విరిని డిశ్చార్జి చేసుకొని వెళ్దాం..!” అంటూ కౌంటర్ కేసి నడిచాడు కళ్యాణ్.

***

         ప్రాణమున్న బొమ్మలా కూర్చుంది విరిజ బెడ్ రూంలో. ఆ అమ్మాయిని పలకరించా లంటే ధైర్యం చాలటం లేదు వాళ్లకు. అక్కడక్కడ గీరుకుపోయిన గాయాలతో.. సజల నయనాలతో చైతన్య రహితంగా ఉన్న విరిజను చూస్తుంటే కడుపు తరుక్కుపోయింది జలజకు. ఇంకా కొన్ని నెలల్లో.. పెళ్లికళతో కళకళలాడాల్సిన విరిజ విషాద వదనంతో.. పోగొట్టుకున్న దానిలా ఇలా తమ ముందు నిలబడుతుందని వారూహించని చేదునిజం.. ఐనా.. సరే! తమ కూతుర్ని ముందుగా గతం తాలూకు బాధామయ సందర్భం నుండి బయటపడవేయాలి. బయటకు చెప్పుకోలేక తమలో తామే కుమిలి పోతూ.. విరిజ ఎప్పుడు ఏ అఘాయిత్యం చేస్తుందోనని బెదిరిపోతూ.. ఆమెను కంటికిరెప్పలా కాపాడుకో సాగారు వారు. దానికితోడు అప్పుడప్పుడు కళ్యాణ్ వస్తూ.. పోతూ.. వారికి తన హిత వచనాలతో ధైర్యం చెప్పసాగాడు. విరిజతోకూడా ఎప్పట్లాగే.. చనువుతో.. అనునయ పూర్వకంగా.. ప్రేమగా మెదల సాగాడు. ఐనా.. ఉద్దీపనారహితంగా.. సుషుప్తితో.. మానసిక అచేతనత్వం ఆవహించిన విరిజను ఈ కల్లోల స్థితి నుండి బయటకు రప్పించాలంటే..? అందుకు ఏకైక పరిష్కారం తన మిత్రుడైన సైక్రియాటిస్ట్ నిరంజన్ ను కలవడమే మేలను కున్నాడు.

         వచ్చే ఆదివారం నిరంజన్ అప్పాయింట్మెంట్ తీసుకొని విరిజను నెమ్మదిగా బుజ్జగించి.. క్లినిక్ కు బయలుదేరదీశాడు.. ఒక చల్లని సాయంత్రం వారిరువురూ.. క్లినిక్ లో అడుగుపెట్టారు.

***

         “నిజమే! ఆడదానికెపుడూ సమాజం సవాళ్ళను విసురుతుంది. గ్యాంగ్ రేప్,  అవిటి తనం, కడుపేదరికం, ఇలాంటి దిక్కుతోచని స్థితి నుండి ఆమె జీవితాన్ని జయించింది. ఇది ఓ రాధ కథ! మనందరి కథ! ఈ జర్నల్ చదివితే అద్దంలో.. మనం కన్పించక మానము. చక్రాల కుర్చీలో కూర్చున్న రాధను చూడండి..! గ్యాంగ్ రేప్ చేయబడిన తూట్ల దేహం, తల్లి నిరాదరణ, రైలుచక్రాల క్రింద పడదోయగా..రెండుకాళ్ళను కోల్పోయిన వైకల్యం.. ఐనా.. సరే ఆమె ఆ కేసు వాపసు తీసుకో లేదు. ఆ ఊరి దుర్మార్గుల మీద వేసిన కేసు వాపసు తీసుకుంటే ఇస్తామన్న పెద్దమొత్తపు ప్రలోభాలకు లొంగలేదు. ‘వారి బెదిరింపు లకు అదిరేది.. బెదిరేది లేదు’ అన్న రాధలో గొప్ప గుండెదిటవు చూశాను.” అన్నాడు నిరంజన్ విరిజ ముఖకవళికల్ని గమనిస్తూ..

         “ఈ రాధకథనాన్ని ఓ ఇంటర్నేషనల్ మ్యాగజిన్ లో ఇంటర్యూగా ప్రచురించాన్నేను. ఓ జర్మన్ ఆమె ధైర్యానికి చకితుడయ్యాడు. ఆమె ఆశ్రయం పొందుతున్న ఆవాస్ సంస్థకు వచ్చి జర్మన్ ఫీట్ ను బహుమతిగా ఇచ్చాడు. అలా కృత్రిమ కాళ్ళతో.. ఇప్పుడామె నడక నేర్చింది. గడపదాటింది. తన లాంటి మరెందరికో నడత నేర్పసాగింది. వాట్ ఎన్ఆ టిట్యూడ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హర్..! రేపటి ఆత్మహత్యల నివారణా దినోత్సవం సందర్భంగా..  నేను రాసిన ఆర్టికల్ ఇది!” అన్నాడు నిరంజన్.. రాధ ఫోటోతో ప్రచురిత మైన కథనాన్ని విరిజ ముందుంచుతూ..! “చర్విత చరణంలా సమస్యల చట్రం కింద నలుగుతున్న ఆడబ్రతుకు.. ఐనా ఎదురొడ్డి నిలబడాలి.. పోరాడాలి.. ఫీనిక్స్ లా నింగి కెగరాలి. ఆడదాని మనసు అర్థం కాదెన్నటికీ! కొద్దిగా మారిస్తే.. నిజమే! ఆమె మానసిక శక్తికి ఎదురే లేదు. విధి రోడ్డున పడేసినా.. ఎందరో అభాగినులు తమ జీవితాలను సవాల్ గా స్వీకరించి తమ ఎక్స్ ట్రా బిట్ ఆఫ్ కరేజ్ తో విధిని సైతం జయిస్తున్నారు. ఈ మిలీనియం గొప్ప ఆవిష్కరణ ఏ జినోమో.. నానోనోకాదు.. అణుశక్తికన్నా గొప్పది.. మానవ అంతరంగం అదే సైకాలజీ.. మన ఆలోచనలే మనల్ని మలిచే సాధనాలు.. సానుకూలమా? లేక ప్రతికూలమా? అన్న నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది! కుంగు బాటు నుండి మనలను బయటపడవేసే ఒకే ఒక్క గీతావాక్యం బి ఫియర్ లెస్ ఇది అర్థం అవుతే కార్యరంగంలో కర్తవ్యోన్ముఖులు అవుతారు. ముళ్ళలాంటి సమస్యలనెదుర్కొని విచ్చిన గులాబిలా.. నీ సామర్థ్యాలతో అభివృద్ధి పథాన దూసుకెళ్ళడమే నీముందున్న ఏకైక లక్ష్యం.. ఆల్ ది బెస్ట్” అంటూ నిరంజన్ అలజడిగొన్న విరిజ మనసును చదివినట్లుగా.. ఆమెలో ఆశావహాన్ని ప్రోది చేశాడు. విరిజకు సాంత్వననిస్తున్నట్లుగా.. భరోసాతో ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని చనువుగా నొక్కాడు కళ్యాణ్.

         రోజులు గడిచేకొద్దీ.. నెమ్మదిగా మానసిక స్థైర్యాన్ని కూడగట్టుకోసాగింది విరిజ. స్థంభించిపోయిన కాలం ముందుకు జరుగలేనట్లుగా.. క్యాలెండర్ లో ఓ నెల బరువుగా మారింది..!

***

         మేడమెట్లు దిగి కిందికి వస్తున్న విరిజను చూసి నమ్మలేక పోయింది జలజ.

         “ఏమండీ! అటు చూడండి..!” అంది సుధాకర్ వైపు తిరిగి, పేపరు మడచి కూతురివైపు చూసి ఆశ్చర్యపోయాడు సుధాకర్. ముదురు పసుపురంగు కుర్తీ..  గులాబీ రంగు లెగ్గిన్ లో తలారా స్నానం చేసి వదిలేసిన కురులతో.. పొద్దున్నే విచ్చిన తాజా కాశ్మీరీ గులాబీలా.. కుదుటపడ్డ మోముతో చకచకా మెట్లు దిగుతున్న కూతురివంక ఆ దంపతులు ఆనందంగా చూశారు..

         “అమ్మా! విరీ! ఎలా ఉందమ్మా? ఈ రోజేమిటి విశేషం? ఎటైనా వెళ్తావా తల్లీ!” అనునయంగా అడిగాడు సుధాకర్.

         “అవున్నాన్నా! ఈ రోజు నుండి ఆఫీస్ లో జాయిన్ అవ్వాలని అనుకొంటున్నాను. నాకు జరిగిన అన్యాయాన్ని తలచుకొని ఎన్నాళ్ళు కుమిలినా లాభం లేదు. నా గాయం శరీరానికేగానీ.. మనసుకు కాదని సర్దిచెప్పుకున్నా! నాలో నేను కుములుతూ మీకూ, కళ్యాణ్ కు మనస్తాపం కల్గించలేను. ఎప్పట్లాగే ఉండటానికి ప్రయత్నిస్తున్నా నాన్నా! ఇది నా జీవితం పూర్తిగా నా చేతుల్లోనే ఉంది. నిత్యం పేపరు తిరగేస్తే..  ముక్కుపచ్చ లారని పసిమొగ్గల నుండి.. ముదివగ్గుల వరకు కామాంధుల కాటుకు బలి  అవుతున్న వారే! ఎవరో చేసిన విషప్రయోగానికి మేమెందుకు ఆత్మన్యూనతాభావంతో కుములుతూ.. చీకటిగదిలో ఒంటరిగా మమ్మల్ని మేము బందీ చేసుకోవాలి? మేమెందుకు సిగ్గుపడుతూ.. చితికిపోవాలి? ఎందుకు అపరాధభావనతో మమ్మల్ని మేము శిక్షించుకోవాలి? జీవితంలో ఉన్నతంగా ఎదగాలన్న మా ఆశయాలకు.. ఆశలకు ఎందుకు సంకెళ్ళు బిగించుకోవాలి? మానసికంగా.. శారీరకంగా.. స్త్రీని లైంగిక వేధింపులకు గురిచేసే వారికి ఉరే సరి!ఇన్నాళ్ళు నిస్సహాయతతో.. బేలతనంతో.. నాలుగు గోడల నడుమ మగ్గుతూ నేను అనుభవించిన మానసిక చిత్రహింస ఇకచాలు నాన్నా! నేను ఎప్పటిలా ఆఫీసుకు వెళ్లి నా పూర్తిస్థాయి శక్తి సామర్థ్యాలతో పనిచేస్తూ.. నేనెంచుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాను. నన్ను నేను బిజీగా ఉంచుకొని తిరిగి పనిలో ఆనందాన్ని వెతుక్కుంటాను. నా గురించి మీరేమీ వర్రీ అవ్వొద్దు. మెల్లిగా నా దైనందిన జీవితాన్ని గడపాలనుకుంటున్నాను. అమ్మా టిఫిను పెట్టు..!” అంటున్న కూతురి ఉత్తేజపూరిత మాటలకు.. కంటతడి తుడుచుకుంది జలజ.. తన బిడ్డ ఆత్మనిర్భరత్వానికి పులకించి పోయినది ఆ మాతృహృదయం!

***

         ఆఫీస్ లంచ్ అవర్లో మాధురి మెసెజ్ చూసుకుంది విరిజ. తాము ఎప్పుడూ వెళ్ళే హోటల్ లో టేబుల్ బుక్ చేశానని.. సాయంత్రం స్నాక్స్ కు రమ్మని మెసెజ్. ఆఫీసు అయిపోగానే రోజూ కళ్యాణ్ వస్తున్నాడు పికప్ చేసుకునేందుకు! ఎప్పట్లాగే కళ్యాణ్ తో పాటుగా బయల్దేరింది విరిజ. బైక్ పార్క్ చేసి లోనకు అడుగు పెట్టారిద్దరూ. “ఆగండి. టేబుల్ బుక్ చేసింది మీకోరకే ఐతే ముందు బయటకు నడవండి” అన్న యాజమాన్యం నుండి ఊహించని ప్రతిఘటన వారికి ఎదురైంది. “ఏం ఎందుకు?” గట్టిగా నిలదీశాడు కళ్యాణ్.

         “ఎందుకంటే ఈ అమ్మాయి రేప్ కు గురైంది. పలు టీ.వీ. చానళ్ళలో.. పేపర్లలో నిత్యమూ మేం చూసి పోల్చుకున్నాం.. మా హోటల్లో ఇలాంటి వారికి పర్మిషన్ లేదు.. నలుగురూ ఏం అనుకుంటారు? మా హోటల్ ప్రతిష్ట మసకబారుతుంది..!” అన్నారు అడ్డుకుంటూ..

         అప్పటికే వచ్చిన మాధురి, విరిజ చేయి పట్టుకుంది గట్టిగా.. “ఏమండీ! మీరు అసలు మనుషులేనా? రేప్ కు గురైన అమ్మాయి ఏం పాపం చేసిందని? ఆమెనలా సాంఘికంగా వెలేస్తు న్నారు” శిక్షించాల్సిన మృగాళ్ళను మరచి వంచితల నెందుకు బాధిస్తారు? ఐనా.. గాయం వారి శరీరానికేగాని, మనసుకు కాదు.. వారందరూ మాలిన్యం అంటని అగ్ని-పుత్రికలే! సమాజంలో నిత్యం ఏదోమూల అభాగినులు దాడికి గురవుతున్నవారే! కొన్ని కేసులు వెలుగులోకి వస్తే.. చీకట్లో అంత మయ్యే మనకు తెలియని కేసులెన్నో! వారిపట్ల ఎంతో హుందాగా వ్యవహరించాల్సిన యాజమాన్యం మీరేనా.. ఇలాంటి పాపపు మాటలంటున్నది? అంతేగాక మనసున్న మనుషులుగా ఇది మనమంతా ఖండిం చాల్సిన అంశం” అంటూ తన తీవ్రమైన ఆవేశంతో నిప్పులు చెరిగాడు కళ్యాణ్. మరి కొంతమంది అక్కడ పోగయ్యి, జరుగుతున్న దానికి తమ వత్తాసును పలికారు. ఇదేదో పెద్దగా ముదరక ముందే క్షమాపణలు చెప్పాలనుకొని తోకముడిచారు హోటల్ యాజమాన్యం. నీకేం ఫర్లేదు నేనున్నానంటూ.. షాక్ కు గురయిన విరిజ చేతిని తన చేతి లోకి తీసుకున్నాడు కళ్యాణ్.. మరెన్నటికీ వీడని తోడంటూ..!

***

         మాధురి తన ఫ్రెండ్ కు జరిగిన అవమానాన్ని ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. ఆమెకు సామాజిక మద్దతుగా ఎంతోమంది నిలిచారు. విష సంస్కృతిని ఎండగడుతూ.. ఎన్నో నిరసనలు వెల్లువెత్తాయి. విరిజ ఇప్పుడు వట్టి బేలకాదు. తనకెదురైన అవమానానికి ధీటుగా బదులిచ్చింది. తన దాస్య శృంఖలాలు తెంచుకొని.. అరచేతిలో గోరింట పూతలకు బదులుగా.. ఆత్మసంరక్షణ విద్యలను నేర్చుకొని ‘నిన్నటి చరిత్రను తిరగ రాస్తూ..నిర్భయనై విహరిస్తా’నంటూ.. అగ్నిపుత్రిలా.. కణకణ మండుతూ నింగిని దూసుకు పోయే తారక ఆమె! నిబిడాశ్చర్యంతో ఈ మూఢ జనాల నోళ్ళు మూయిస్తూ.. నచ్చినా.. నచ్చకపోయినా.. ఇప్పుడిక మనసును చంపుకొని జీవించక.. కొత్తదారిలో పయనిస్తున్న ఆశాకిరణం ఆమె!! కొత్త పుట్టుక నాదంటున్న ఈ తరానికి ప్రతినిధి ఆమె!!

*****

Please follow and like us:

12 thoughts on “నిర్భయనై విహరిస్తా (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)”

 1. ఈ కాలం లో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను చూపించి, రేపు గురైన ఆడపిల్ల తప్పు ఏమీ లేదు ఆమె బాధను మరిచి ఈ ప్రపంచంలో నిర్భయ విహరించాలి అని చాటి చెప్పారు.
  మంచి సందేశం అందించిన కథ చాలా బాగా రాశారు

 2. కథ చాలా బాగా రాశారు. జీవితంలో ఎప్పుడు ఏం జరిగినా, మనం కృంగిపోకుండా ధైర్యంగా ముందుకు అడుగేయ్యాలని చెప్పిన తీరు చాలా బాగుంది.

 3. వార్తల్లో వచ్చినప్పుడు చర్చల్లో నిలిచి, తరువాత నిజ జీవితంలో మాట్లాడుకోకుండా వదిలేసే అంశాన్ని అటు బాధితురాలి కోణం నుంచే కాకుండా ఇటు సమాజపు కోణం నుంచీ కూడా స్పృశించే ప్రయత్నం చేసారు రచయిత్రి. ఒక సకారాత్మక ముగింపుతో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేసిన రచయిత్రికి అభినందనలు.

 4. నిర్భయనై విహరిస్తా,” బి. కళాగోపాల్ గారు రచించిన కథ చాలా బాగుంది. జరిగి పోయింది జరిగి పోయింది. జీవితాంతం మనము అదే పట్టుకొని కుమిలి పోయి , మనము ప్రేమించే వారిని క్రుంగి పోయేలా చేయకుండా , మానసిక దైర్యం తో గతం ఎలా వున్నా , తన ఫ్యూచర్ తాను మలచు కొని , మరల జీవితాన్ని అనుభవిస్తూ , సమస్యలు ఎదురుకొంటూ ముందుకు సాగిన స్త్రీ కథ చాలా పెద్ద ప్రేరణ . పెద్ద ఆశ ఇతరులకు . సమాజం లో ఇలాంటి వారికి లభించే సపోర్ట్ కూడా ఆశాజనకం గా వుంది

 5. నేటి సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా నడిచిన కథ, ఒక స్ఫూర్తిదాయక ముగింపుతో. ఊహించని మలుపులు లేకున్నా, భాష కథను ఆద్యంతం చదివేలా చేసింది.

 6. నిర్భయనై విహరిస్తా..!

  బి కళాగోపాల్ గారి కథ టైటిలే చాలా బాగుంది.

  ఆడవాళ్ళ మీద సామూహిక అత్యాచారం ఇది అనాది అత్యాచారం.  దాన్ని సహజంగా కథలో  చెప్పి తద్వారా
  బలైపోయిన ఆడది విరిజ మానసిక సంక్షోభం ఎదుర్కొ న్నప్పటికీ..  తాత్కాలికంగా ఆ శారీరిక నష్టాన్ని పక్కన పెట్టింది.

  అయితే చాలామంది ఆడవాళ్లు వలె జీవితాన్ని అంతం చేసుకోకుండా మానసిక  బలంతో సమాజంలో ఎద గాలి అని ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం నేటి అభా గినులకు ఒక మంచి ధైర్యాన్ని ఇచ్చే నిర్ణయం.

  జీవితం అంతం చేసుకుంటే ఏముంది అప్పటితో అయి పోతుంది.  అప్పుడు అది కథ కాదు. సమాజంలో ఎదిగి తన సత్తా చూపించాలి అని తీసుకున్న నిర్ణయం  ఎవ రెస్టు శిఖరం అధిరోహించినంత మేలుకొలుపు నిర్ణ యం.  అలాంటి నిర్ణయం తీసుకోవడానికి చాలా ధైర్యం,తెగువ కావాలి.  ప్రస్తుతం స్త్రీ జాతికి అదే అవసరం.

  ఇది అసాధారణమైన కథ.  అయితే మాధురి,కళ్యాణ్ లాంటివారు ప్రతి విరజకు సహకరించవలసిన అవ సరం సమాజంలో ఉంది..  అంటూ మరో విషయాన్ని కూడా ఎత్తి చూపారు రచయిత్రి… గ్రేట్.

  నల్లబాటి రాఘవేంద్రరావు
  9966212386

  ఆ చిరునవ్వు ఆగిపోయింది

  పారుపల్లి అజయ్ కుమార్ గారి ఈ కవిత చదువు  తుంటే ప్రస్తుత సమాజంలో జరుగుతున్న దారుణ పరిస్థితులపై మనిషికి ఒక రకమైన  జుగుప్స కలుగు తుంది.

  నిజమే  తూటాలు లాంటి మాటలతో కూడా ఎదుటి వారిని హత్య చేసేయవచ్చు.

  మనిషి బ్రతికున్నాడు మానవత్వం చచ్చిపోయి…
  గొప్ప వాక్యం. తప్పుడు మనుషులు ఈ కవిత్వం  చదవరు కానీ చదివితే సన్మార్గులు కావడం ఖాయం.

  కవికి  నిండు మనసుతో అభినందనలు

  నల్లబాటి రాఘవేంద్రరావు
  9966212386

 7. నిర్భయనై విహరిస్తా..!

  బి కళాగోపాల్ గారి కథ టైటిలే చాలా బాగుంది.

  ఆడవాళ్ళ మీద సామూహిక అత్యాచారం ఇది అనాది అత్యాచారం.  దాన్ని సహజంగా కథలో  చెప్పి తద్వారా
  బలైపోయిన ఆడది విరిజ మానసిక సంక్షోభం ఎదుర్కొ న్నప్పటికీ..  తాత్కాలికంగా ఆ శారీరిక నష్టాన్ని పక్కన పెట్టింది.

  అయితే చాలామంది ఆడవాళ్లు వలె జీవితాన్ని అంతం చేసుకోకుండా మానసిక  బలంతో సమాజంలో ఎద గాలి అని ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం నేటి అభా గినులకు ఒక మంచి ధైర్యాన్ని ఇచ్చే నిర్ణయం.

  జీవితం అంతం చేసుకుంటే ఏముంది అప్పటితో అయి పోతుంది.  అప్పుడు అది కథ కాదు. సమాజంలో ఎదిగి తన సత్తా చూపించాలి అని తీసుకున్న నిర్ణయం  ఎవ రెస్టు శిఖరం అధిరోహించినంత మేలుకొలుపు నిర్ణ యం.  అలాంటి నిర్ణయం తీసుకోవడానికి చాలా ధైర్యం,తెగువ కావాలి.  ప్రస్తుతం స్త్రీ జాతికి అదే అవసరం.

  ఇది అసాధారణమైన కథ. అయితే మాధురి,కళ్యాణ్ లాంటివారు ప్రతి విరజకు సహకరించవలసిన అవ సరం సమాజంలో ఉంది..  అంటూ మరో విషయాన్ని కూడా ఎత్తి చూపారు రచయిత్రి… గ్రేట్.

  నల్లబాటి రాఘవేంద్రరావు
  9966212386

 8. కథ చాలా బాగుంది.తాను తప్పు చేయక పోయినా దుర్మార్గుల చేతిలో శీలాన్ని పోగొట్టుకుని కొన్నాళ్ళు బాధ పడింది. నెమ్మదిగా ఆత్మ విశ్వాసంతో ధైర్యంగా ముందుకు వచ్చి ఉద్యోగంలో చేరింది. నిర్భయ విహరిస్తానంటు.. సంతోషంగా బ్రతకడానికి నిర్ణయించుకుంది. విరిజ…స్త్రీ లందరికీ మార్గ నిర్దేశనం చేసే కథ.రచయిత్రికి అభినందనలు.

 9. కళ గారు వ్రాసిన “నిర్భయనై విహరిస్తా ” కథ బాగుంది. అత్యాచారానికి గురైన నారీమణులెందరో జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకుంటున్నారు లేదా జీవచ్ఛవల్లా కాలాన్ని వెళ్లదీస్తున్నారు. అటువంటి వారికి ధైర్యానిచ్చే కథ. ఆడదైతే చాలు అనుభవించేద్దాం అని రోడ్ల మీద తిరుగుతున్న పశువులను ఖండఖండాలుగా నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా నరికే రోజులు రానంతవరకూ ఇలాంటి ఆగడాలు తప్పవేమో! మంచి కథ అందించిన కళ గారికి అభినందనలు.

 10. “నిర్భయనై విహరిస్తా,” బి. కళాగోపాల్ గారు రచించిన కథ చాలా బాగుంది. ప్రస్తుతం సమాజంలో చిన్న బాలికల దగ్గర నుండి వృద్ద మహిళల వరకు అత్యాచారాలకు గురవుతూనే వున్నారు. అత్యాచారాలకు కారకులయిన వారిని శిక్షించాల్సిన సమాజం అది స్త్రీల తప్పేనని, వారు వేసుకున్న బట్టల వల్లో, వారి నడకలో, వారి ప్రవర్తనలో తప్పుండటం వల్లే ఈ అత్యాచారాలు జరుగుతున్నాయని నిందిస్తుంటారు, చెడిపోయిన ఆడపిల్ల అనే ముద్ర వేసి అసలే వారు శారీరక, మానసిక సంఘర్షణకు గురవుతున్న వారిని మరింత మానసిక చిత్రహింసలకు గురి చేస్తుంటారు.

  ఈ కథలో విరిజ పాత్ర ద్వారా అత్యాచారానికి గురయిన అమ్మాయి, ఆమె తల్లితండ్రులు ఎలాంటి సంఘర్షణకు గురవుతారు అనే విషయాన్ని తెలియజేస్తూనే అలాంటి పరిస్థితిలో వున్న అమ్మాయికి కావాల్సింది సానుభూతి ఒకటే కాదు ఆమె ఆ దుర్ఘటన నుండి మానసికంగా బయటపడడానికి ఎలాంటి సహకారం కావాలి, కుటుంబం, స్నేహితులు, కౌన్సిలింగ్ ఇచ్చేవారు ఎలా అర్ధం చేసుకుని ఆమెకు అండగా నిలబడి ఆమె తన జీవితాన్నిసంతోషంగా మలచుకోవడానికి ప్రతి ఒక్కరూ వీలయినంతగా సాయం చేయాలి అనే సందేశం ఇచ్చారు రచయిత్రి ఈ కథలో. అంతే కాదు తనలాగే అత్యాచారాలకు గురయిన బాలికలకు, స్త్రీలకు స్ఫూర్తిగా నిలబడుతూ ముందుకు సాగుతున్న పాత్ర విరిజది.
  “విరిజ ఇప్పుడు వట్టి బేలకాదు. తనకెదురైన అవమానానికి ధీటుగా బదులిచ్చింది. తన దాస్య శృంఖలాలు తెంచుకొని.. అరచేతిలో గోరింట పూతలకు బదులుగా.. ఆత్మసంరక్షణ విద్యలను నేర్చుకొని ‘నిన్నటి చరిత్రను తిరగ రాస్తూ..నిర్భయనై విహరిస్తా’నంటూ.. అగ్నిపుత్రిలా.. కణకణ మండుతూ నింగిని దూసుకు పోయే తారక ఆమె!”
  “నిర్భయనై విహరిస్తా,” మంచి స్ఫూర్తిదాయకమైన కథ.

 11. దాస్య శృంఖలాలు తెంచుకొని.. అరచేతిలో గోరింట పూతలకు బదులుగా.. ఆత్మసంరక్షణ విద్యలను నేర్చుకొని ‘నిన్నటి చరిత్రను తిరగ రాస్తూ..నిర్భయనై విహరిస్తా’నంటూ.. అగ్నిపుత్రిలా.. కణకణ మండుతూ నింగిని దూసుకు పోయే తారక ఆమె!
  స్త్రీల సమస్యలకు సాటి స్త్రీలు అండగా నిలబడి పోరాడుతూ, ఐకమత్యంతోో సాగితేనే పరిష్కరిచుకోవడం సులభమని, ధైర్యం గా పోరాడే సాహసం వీడకూడదని చక్కని కథద్వారా తెలిపారు రచయిత్రి. అభినందనలు.

 12. మగువలను మేలుకొలిపే కథ.చాల చక్కగా రాశారు .అత్యాచారానికి గురి అయిన ప్రతి మహిళా ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని సూచించారు .అత్యాచారం ఒక శారీరక గాయమే తప్ప మరేమీ కాదనీ తేల్చి చెప్పారు .ఉపకథలా ఉన్న రాధ ఉదంతం చైతన్యానికి ప్రతీకలా నడిపారు .మంచికథను రాసినందులకు రచయిత్రి గారి కి అభినందనలు …

Leave a Reply

Your email address will not be published.