స్తబ్ధత అడుగున…

హిందీ మూలం: అమృత భారతి

ఆంగ్లం: లూసీ రోజెన్ స్టీన్

తెలుగు సేత: ఎలనాగ

ఒక మట్టిపెళ్ళలా నన్ను విసిరేశాడతడు
నాకొక ఆత్మ ఉందనీ, నేను జీవం ఉన్న మనిషిననీ
తెలియదతనికి

అలా మట్టిపెళ్ళలా నన్ను తన మార్గంలోంచి
నా మార్గంలోకి విసిరేస్తూ పోయాడు
నా తోవ నిర్లక్ష్యానికి గురైంది
సొంతమార్గంలో ప్రయాణిస్తూ పోయాను నేను
ప్రతిసారీ నాలోని ఒక ముక్క విరిగి పడిపోయింది
కొంత మోహం, సుఖం పట్ల కొంత వ్యసనం,
కొంత ప్రాపంచిక అపేక్ష, పురుషుని గురించిన కొన్ని కలలు…
ఇలా ప్రతిసారీ నాలోని ముక్క విరిగింది
ఇక ఇప్పుడు నా వంతు
ఇసుకతుఫాను లోని ఎడారిలాంటి,
ఝంఝ ఆవరించిన సముద్రంలాంటి,
పాడుబడిపోయిన నగరంలాంటి
ప్రపంచాన్ని ఎప్పుడో వదిలేశాను
ఇక ఇప్పుడు నా వంతు
భూమిఅంచు మీద నిలబడి
ధైర్యాన్ని కూడగట్టుకుని
నన్ను నేను స్తబ్ధతలోకి విసిరేసుకున్నాను
పరీవ్యాప్తమయ్యే విశాలమైన నా మౌనం అది
ఇప్పుడు ప్రపంచం ఒక కల
లేదా సముద్రంలో తీరానికి దగ్గర
ఉన్నట్టు మనం ఊహించుకునే ఒక జలప్రాణి
కేవలం నా అడుగుల చప్పుడు వినపడే
స్తబ్ధత అడుగున నేను…

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.