కొత్త అడుగులు – 40

“మరో గ్రహం”కవయిత్రి హిమబిందు 

– శిలాలోలిత

         హిమబిందు కొత్త అడుగులతో మన ముందుకు వచ్చింది. సైన్స్ ను, ఎంతో ప్రయోగాత్మకంగా వివరించడానికి గ్రహాల ఆంతర్యాలను విప్పడానికి “మరో గ్రహం” పేరుతో కవిత్వ రూపంలో వచ్చింది. పిల్లలకీ పెద్దలకు కూడా జ్ఞాన సముపార్జనగా పనికొస్తుంది. గ్రహాల ఆంతర్యాలతో పాటు భూమి చలనాలు, ప్రకృతి, పర్యావరణం, మానవ జీవన మూలాలు ఇలా ఒకటేమిటి అనేక రూపాలతో సైన్స్ తో అభివర్ణిస్తూ నడిచింది కవిత్వం.

         దీనిని రూపనిర్మాణంలో కవిత్వమని చెప్పినప్పటికీ, తాను తెలియజేయాలనుకున్న విషయాలకు కవిత్వాన్ని ఒక వాహికగా ఎన్నుకొన్నదనిపించింది.

         సృష్టికి మూలమైన జగతి జననికి ప్రణమిల్లి సమర్పిస్తున్న వినతి పత్రం ఈ మరో గ్రహ కవితా సమాహారం. ఒక్కో కవిత ఒక ఖండికగా కథ ఆయా అంశాలను వివరిస్తూ రూపొందింది. ఆలోచనను రేకెత్తించే శైలిలో సాగింది ప్రతి కవిత. ఇందులో గాఢతను మనం ఆశించలేం. విషయం గురించిన అవగాహన ను కలిగించడం కోసం హిమబిందు ప్రయత్నం చేశారు. ఇప్పుడున్న స్థితిని వివరించడం ఆ తరువాత ఆశిస్తున్న మార్పును తెలపడం ఈ సంపుటి ప్రధాన ఉద్దేశం అని ముందుమాట రాసిన కవి యాకూబ్ గారు అభిప్రాయపడ్డారు.

         ఒక అదనపు జ్ఞానాన్ని కలిగించటానికి ఎంతగానో తోడ్పడుతుంది. హిమబిందు పరిశీలన దృష్టి, పనిపట్ల గల శ్రద్ధ తన పరిజ్ఞానాన్ని అందరికీ పంచాలన్న తాపత్రయం కనిపిస్తోంది.

         అధిక జనాభా, సహజ వనరుల తరుగుదల, వాతావరణ మార్పు, అధిక భూతాపం, పర్యావరణ కాలుష్యం, తరుగుతున్న భూగర్భ జలాలు, పెరుగుతున్న ప్లాస్టిక్ అవశేషాలు, కరువులు, వరదలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. ఇవన్నీ మానవ మేధా పరికల్పనల ఫలితాలే. రాను రాను త్రాగునీరు, గాలి, ఆహారం అత్యంత కలుషితమై మానవ జీవితం దుర్భరమవుతుంది అనేది తప్పక నివారించుకోవలసిన సత్యం.

         ఇక హిమబిందు గురించి పరిచయం చేయాలంటే ఆమె ఊరు భద్రాచలం, ఉమ్మడి ఖమ్మం. ఆమె తల్లితండ్రుల పేర్లు ఇందిరా, సిద్దులు. ఎమ్మెస్సీ సైకాలజీ చేశారు. పర్యావరణ శాస్త్రం పై పీహెచ్ డీ చేశారు. ప్రస్తుతం టీచర్ గా చేస్తున్నారు .

ఆమె ఇతర రచనలు:
1. విశ్వమిత్ర (పర్యావరణం పై వ్యాసాలు)
2.వరేణ్యం (పర్యావరణం పై వ్యాసాలు)
3.సుస్థిరోత్సవం (పండుగలు-పర్యావరణం)
ఇతరాలు. వ్యాసాలు, కవితలు పత్రికల్లో, కవితా సంపుటాల్లో వచ్చాయి.

‘మరో గ్రహం’ కవితలో అంటుందిలా

సింధువులో బిందువుగా
చంద్రునికో నూలు పోగుగా
ప్రకృతి కో పరామర్శగా
భువనానికో బోనంగా
విశ్వశక్తి కో విన్నవింపుగా
ఈ మరో గ్రహ కవితా సమాహారం అని ప్రకటించింది.

         ‘మనిషి నైజం మారుతున్నది’ – కవితలో సమాజ స్థితితో పాటు స్త్రీలు ఎదుర్కొంటున్న హింసలను గురించి స్పష్టం చేశారు. ‘మేలుకో మానవా మేలుకో’ – కవిత కూడా సమాజంలోని వ్యక్తులు మారాల్సిన స్థితిని మానుకోని దుస్థితిని గురించి ఆవేదన పూర్వకంగా రాసింది.

         ‘పక్షుల పాఠాలు’ మంచి కవిత. మన చుట్టూ ఉన్న ప్రకృతి నేర్పే పాఠాలను చాలా బాగా వివరించింది.

         కవిత్వంలో తొలి అడుగు ఇది. విషయం పట్ల ఎంత అవగాహన, పట్టుదల ఉందో అలాగే కవిత్వ శైలి పట్ల కొంత జాగ్రత్తలు తీసుకుంటుందని భావిస్తాను. ఇదొక భావ వీచిక. ఇతర కవిత్వాలు కూడా ఎక్కువగా చదవాల్సిన అవసరం ఉందనిపించింది.

         కానీ ఆమె ఎత్తుకున్న అంశం, చేసిన కృషి, తెలిపిన విషయాలను సైన్స్ విషయా లెన్నో ఉపయోగకరంగా ఉన్నాయి. అందుకు హిమబిందును ఎంత గానో అభినందించవచ్చు.

*****

Please follow and like us:

5 thoughts on “కొత్త అడుగులు-40 “మరో గ్రహం”కవయిత్రి హిమబిందు”

  1. డా.శిలలోహిత మేడం గారికి, కొత్త అడుగులో మరోగ్రహం పుస్తకం గురించి చాలా చక్కగా విశ్లేషించి రాసినందుకు, నేను ఈ దిశలో వేసిన తొలి అడుగును ప్రోత్సహిస్తూ ముందడుగు వేయడానికి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించినందుకు సర్వదా కృతజ్ఞురాలను. చాలా చాలా ధన్యవాదాలు అండి.
    నెచ్చెలి మాసపత్రిక సంపాదకురాలు డా. కె గీత గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

  2. కవయిత్రి హిమబిందు గారి “మరో గ్రహం” కవితల గురించి చక్కగా వివరించారు. భువనానికో బోనంగా అన్న మాట చాలా బాగుంది.

  3. మరో గ్రహం కవయిత్రి హిమబిందు అంటూ వారిగురించి ఎంతో వివిరంగా తెలియజేసారు ఈ కొత్త అడుగు లో. వారి రచనలను చదవాలని ఆకాంక్షిస్తూ,

Leave a Reply

Your email address will not be published.