ప్రమద

సియాటెల్ (అమెరికా)లో కుల వివక్ష నిషేధాన్ని తెచ్చిన భారతీయ మహిళ

క్షమా సావంత్

-నీలిమ వంకాయల

         సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలలో కుల వివక్ష కూడా ఒకటి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలతో పాటు ఎందరో మహనీయులు అనేక దేశాల్లో కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు జరిపారు.

         ప్రపంచ దేశాల్లో అభివృద్ధిలో  అగ్రగామిగా నిలిచే అమెరికాలో కుల వివక్ష, జాతి వివక్ష, వర్ణ వివక్ష రాజ్యమేలుతుంటాయంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. కులాల కుమ్ములాటలు భారత్ లోనే కాదు అమెరికాలో కూడా ఉంటాయనేది నమ్మితీరాల్సిన విషయం. ఈ వివక్ష ఎంతగా ఉంటే దీనికి వ్యతిరేకంగా అమెరికాలోని ఓ నగరం కుల వివక్షకు వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలంటుంది? మొట్టమొదటగా కుల వివక్షకు వ్యతిరేకంగా చట్టం తీసుకొచ్చింది అమెరికాలోని ‘సియాటెల్’ నగరం.

         అమెరికాలో వర్ణ వివక్షకు లెక్కలేనంత మంది బలయ్యారు. వర్ణ వివక్ష అనగానే ప్రపంచ ప్రజల మదిలో మెదిలేది అత్యంత క్రూరమైన ‘జార్జ్ ఫ్లాయిడ్’ హత్య. వర్ణ వివక్ష వైరస్ కంటే ప్రమాదం అనేలా జరిగిన అత్యంత క్రూరమైన హత్య ‘జార్జ్ ఫ్లాయిడ్’ పై జరిగిన దాడి. ఆ దాడి అమెరికా వాసులలో వణుకు పుట్టించింది. దాంతో  అమెరికా పాలన ప్రపంచ దేశాల విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది.

         ఇక అమెరికాలో వర్ణ వివక్షే కాదు, కుల వివక్ష కూడా ఉందని దానికి వ్యతిరేకంగా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని భావించింది ‘సియాటెల్’ నగర పాలక వర్గం.

         దీని వెనుక భారత సంతతికి చెందిన క్షమా సావంత్ కృషి వుంది. కుల వివక్షను నిర్మూలించేందుకు ఆమె ఎంతో కృషి చేశారు.

క్షమా సావంత్ జీవిత నేపథ్యం:

         2014లో  సియాటల్‌ నగర కౌన్సిల్‌కి సోషలిస్టు ఆల్టర్నేటివ్ పార్టీ నించి ఎన్నికైన తొలి మహిళ క్షమా సావంత్‌. ఆమె భారతీయ సంతతికి చెందినవారు కావడం విశేషం. ఆమె పూణెలో స్థిరపడిన కుల వివక్షకు, కులతత్వానికి పేరుమోసిన తమిళ బ్రాహ్మణ సమాజంలోని ఓ కుటుంబంలో 50 ఏళ్ల క్రితం జన్మించారు.

         క్షమా ఆరేళ్ల వయసులోనే పూణెలోని సొంత ఇంట్లో కుల వివక్ష అంటే ఏమిటో రుచి చూసింది. తన తాతగారు ఆ ఇంట్లో పనిచేసే కింది కులానికి చెందిన పనిమనిషిని పేరుతో కాకుండా కులం పేరుతో– అదీ కించపరిచే రీతిలో పిలవడం క్షమాను బాధ పెట్టింది. అందుకే ఆమె, ‘మీరెందుకు ఆమె పేరుకు బదులు తిట్టు పదంతో ఆమెను పిలుస్తారు?’ అని తన తాతను ప్రశ్నించింది. దానికి ఆయన ‘నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు’ అని కసురుకున్నారు.

         మధ్యతరగతి తమిళ బ్రాహ్మణుల ఇంట ఆమె పుట్టినా, మరాఠీ అయిన వివేక్‌ సావంత్‌ను పెళ్లాడి, అమెరికా వెళ్లి స్థిరపడ్డారు.

         భారతదేశంలోని పేదరికం, అమెరికాలోని ఆర్థిక అసమానతలు క్షమాను సోషలిస్టుగా మార్చాయి. ఆమె అమెరికాలోని డెమొక్రాటిక్, రిపబ్లికన్‌ పార్టీల్లో చేరకుండా సోషలిస్టు ఆల్టర్నేటివ్‌ అభ్యర్థిగానే మూడుసార్లు సియాటల్‌ సిటీ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు.

         తన తాత చూపిన కుల వివక్షకు సంబంధించిన చిన్నప్పటి అనుభవమే ప్రపంచంలో అత్యంత గొప్ప ప్రజాస్వామ్య దేశం, ధనిక దేశం అయిన అమెరికా వచ్చాక కూడా మరో రూపంలో ఆమెకు కనిపించింది.

         భారతదేశం 1948లోనే కుల వివక్షను నిషేధించి, 1950లో మన రాజ్యాంగంలో ఆ విధానాన్ని పొందుపరిచిన విషయం మనందరికి తెలుసు. ఇండియాలో మాదిరిగానే కుల వివక్షను, కులదూషణను శిక్షార్హ నేరంగా చేయాలని క్షమా  పట్టుదలతో పోరాడారు. చివరికి 2023 ఫిబ్రవరి 21న సియాటల్‌ నగరంలో కులవివక్ష శిక్షార్హ నేరంగా సియాటల్ సిటీ కౌన్సిల్ చట్టం చేసింది.

         2013 ఎన్నికల ప్రచారం సందర్భంగా తాను తన భర్త వివేక్‌ నుంచి విడిగా జీవిస్తున్నట్టు ఆమె వెల్లడించారు. 2016లో వివేక్‌ నుంచి విడాకులు తీసుకుని, స్థానిక అమెరికన్‌ కాల్విన్‌ ప్రీస్ట్‌ ను పెళ్లాడారు. 2012 ఎన్నికల్లో వాషింగ్టన్‌ స్టేట్‌ ప్రతినిధుల సభకు పోటీచేసి ఓడిపోయినా క్షమా రాజకీయాల నుంచి విరమించుకోకుండా, 2014 నుంచీ విజయపథంలో పయనించారు. 2023 చివరిలో ప్రస్తుత పదవి అయిన సిటీ కౌన్సిల్‌ సభ్యత్వం నుంచి కూడా వైదొలుగుతానని గతంలోనే క్షమా ప్రకటించారు. భారత మహిళలకు క్షమా ఆదర్శం అవుతుందనడంలో సందేహం లేదు.

         “అమెరికాలో అమలవుతున్న ‘వివక్ష వ్యతిరేక చట్టంలో’ కులాన్ని కూడా చేర్చిన మొదటి నగరంగా సియాటెల్‌ నిలిచింది. దీనికి సంబంధించి స్థానిక సభలో ప్రవాస భారతీయురాలు, సియాటెల్‌ నగర కౌన్సిల్‌ సభ్యురాలు క్షమా సావంత్‌ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు.

         జాత్యహంకారం కంటే కుల వివక్ష భిన్నంగా లేదని అందువల్ల దీనిని కూడా చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరారు. సియాటెల్‌ సిటీ కౌన్సిల్‌ 6-1 ఓట్లతో ఈ తీర్మానాన్ని ఆమోదించింది. దీంతో “అమెరికాలోని స్థానిక ప్రవాస భారతీయుల్లోని కొన్ని కులాలకు వివక్ష నుంచి విముక్తి లభిస్తుందని కౌన్సిల్‌ వెల్లడించింది.” అని అక్కడి పత్రికలుపేర్కొన్నాయి. ఈ సందర్భంగా క్షమా సావంత్‌ మాట్లాడుతూ ఈ స్ఫూర్తి అమెరికా అంతా  విస్తరించేలా కృషి చేయాలన్నారు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.