మిట్ట మధ్యాహ్నపు మరణం- 19

– గౌరీ కృపానందన్

         వాకిట్లో రెండు కార్లు ఉన్నాయి. పైజామా ధరించిన యువకుడు మాధవరావుని విచిత్రంగా చూశాడు. డ్రైవర్ సిద్దంగా ఉన్నాడు కారు స్టార్ట్ చేయడానికి. వెనక సీట్లో ఇద్దరు స్త్రీలు బురఖాలో ఉన్నారు. ఇంకొక సీటు ఖాళీగా ఉంది.

         “కౌన్ చాహియే ఆప్ కో?”

         “మిస్టర్ ఇంతియాస్?”

         “ఇంతియాస్! కోయి పోలీస్ వాలే ఆయే హై.”

         ఇంతియాస్ కి పాతికేళ్ళు ఉంటాయి. తెల్లగా, దృడంగా ఉన్నాడు.వేళ్ళకి ఉంగరాలు. మణికట్టు దగ్గర డిజిటల్ వాచ్!

         “యస్! వాట్ డు యు వాంట్ సార్?”

         “మిమ్మల్ని చూడడానికే వచ్చాను.”

         “ఏమిటీ విషయం? సినిమాకి బయలు దేరుతున్నాను.”

         “ఇంతియాస్! ఆవోనా. దేర్ హో రహీ హై.” కారు నుంచి కేక వినిపించింది.

         “కాన్ ఐ సీ యు టుమారో?”

         “నో!” అన్నారు మాధవరావు కఠినంగా.

         “ఏమయ్యింది? ఏదైనా అర్జంట్ విషయమా?”

         “అవును. ఒక హత్య గురించి ఎంక్వయిరీ చేస్తున్నాను.”

         అతని కళ్ళలో కొంచం భయం కనబడింది. “ఎవరు?” అన్నాడు.

         “కూర్చుని మాట్లాడ వలసిన విషయం.”

         తటపటాయిస్తున్నట్టుగా చూశాడు. “ఒక్క నిమిషం.” కారు దగ్గిరికి వెళ్లి తగ్గు స్వరంతో వాళ్ళతో మాట్లాడాడు. మరో నిమిషం తరువాత కారు బయలు దేరి వెళ్లి పోయింది.

         అతను తిరిగి వచ్చి, “పావు గంటలో ముగిసి పోతుందా?” అన్నాడు.

         “మీరు సహకరించే దాన్ని బట్టి ఉంటుంది. సారీ. మీ సినిమా ప్రోగ్రాంకి అంతరాయం కలిగించి నందుకు.”

         “లోపలికి రండి.”

         లోపల టోపీ ధరించిన ఒక ముసలాయన కూర్చున్నాడు. మాధవరావుని చూసి ఎవరూ అన్నట్లు కళ్ళతోనే అడిగాడు.

         ఇంతియాస్ ఆయన చెవి దగ్గర వంగి, “పోలీస్ ఆయే హై కుచ్ పూచ్  నే కే లియే” అన్నాడు.

         “ఇన్ కం టాక్స్ క్యా?” అడిగాడు ముసలాడు.

         “నహీ నహీ” అని నవ్వాడు. “ఈ వయస్సులో కూడా తాతయ్యకి ఇన్ కం టాక్స్ గురించిన చింత. కూర్చోండి” అన్నాడు.

         మాధవరావు కూర్చున్నారు.

         “చెప్పండి.”

         అంతలో టీ వచ్చింది.

         “మిస్టర్ ఇంతియాస్ అహ్మద్! సూటిగా అడుగుతున్నాను. మీరు మల్లేశ్వరం యూత్ అసోసియేషన్ తరపున క్రికెట్ ఆడేవారు కదా?”

         “అవును. పోయిన సంవత్సరం. అప్పుడు మంచి టీం ఉండింది. ఇప్పుడు కార్నెట్టు కోసం ఆడుతున్నాను, ఫస్ట్ డివిషన్.”

         “మల్లీశ్వరం క్లబ్బుకి ఆడినప్పుడు మీతో ఆడిన వాళ్ళు గుర్తున్నారా?”

         “చారి, బాబు, విజయ కుమార్, రాకేష్, మార్లి… ఎందుకు అడుగుతున్నారు?”

         “చెప్తాను. పోయిన నెల 17వ తారీఖున మీరు ఎక్కడ ఉన్నారు?”

         “వెయిట్ ఎ మినిట్! విషయం ఏమిటో మీరు ఇంకా చెప్పనే లేదు.”

         “చెప్తాను. మొదట మార్చ్  17వ తేదీన ఎక్కడ ఉన్నారో చెప్పగలరా?”

         “బెంగళూరులోనే. ఎందుకు?’

         “ఆ రోజు ఎక్కడెక్కడికి వెళ్ళారో చెప్పగలరా?”

         “ఓ మై గాడ్! ఎలా గుర్తు ఉంటుంది. ఇంపాసిబిల్!”

         “గుర్తు తెచ్చుకోవడం మీకే మంచిది.”

         “ఏదో మర్మంగా మాట్లాడుతున్నారే? సిగరెట్?”

         “నో థాంక్స్. మార్చి పదిహేడున ఒక హత్య జరిగింది. ఆ హత్యని చేసింది ఆ క్రికెట్ టీం మెంబర్లలో ఒకడై ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్కరినీ ఎంక్వయిరీ చేస్తూ వస్తున్నాము.”

         “హత్యా?”

         “అవును. పేపర్లలో చదివే ఉంటారు, హనీమూన్ కి వచ్చిన జంటలో భర్త హత్య చేయబడ్డాడు అన్న విషయాన్ని.”

         “యెస్. చదివినట్లే గుర్తు. అదేనా ఇది. ఏ తారీఖు అని చెప్పారు?”

         “మార్చి పదిహేడవ తేదీన మీరు ఎక్కడ వున్నారు?”

         “లెట్ మి సీ. మార్చ్ పదిహేడున మా షాప్ లోనే ఉన్నాను.”

         “మీ షాప్ ఎక్కడ ఉంది?”

         “కమర్షియల్ స్ట్రీట్ లో పెద్ద షాప్. అహ్మద్ అండ్ సన్స్. మీరు చూసే ఉంటారు.”

         ‘చూశాను. రెండంతస్థుల బిల్డింగ్. బట్టల దుకాణం.”

         “డిపార్ట్మెంట్ స్టోర్ లాగా, డ్రెస్ మెటీరియల్స్, రెడిమేడ్స్ అన్నీ ఉన్నాయి.”

         “పదిహేడవ తారీఖున ఎక్కడ ఉన్నారు?’

         “మాకు అన్ని తారీఖులు ఒకటే. ఆ రోజు ఏ వారం?”

         “మంగళవారం.”

         “శుక్రవారం మా షాప్ కి సెలవు. పదిహేడున ఖచ్చితంగా షాప్ లోనే ఉన్నాను. ప్రొద్దున ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిదిన్నర దాకా.”

         “షాపులో ఇంకా ఎవరైనా ఉంటారా?”

         “నేనూ, మా తమ్ముడు. అతను బిజెనెస్ విషయంగా ముంబైకి వెళుతూ ఉంటాడు. నేనే ఎప్పుడూ షాపులోనే ఉంటాను.

         “ఆ రోజు పూర్తిగా దుకాణంలోనే ఉన్నారు అన్నదానికి ఏదైనా ఆధారం చూపించ గలరా?”

         “ఇప్పుడా?”

         “ఇప్పుడు కాదు. రేపు… ఎల్లుండి.”

         అతను కాస్త ఆలోచించి, “ఇన్వాయిస్ లలో సంతకం పెట్టి ఉంటాను. ఎవరికైనా ఉత్తరం వ్రాసి ఉంటాను. షాప్ లో ఉన్న సిబ్బంది సాక్ష్యం చెప్పవచ్చు” అన్నాడు.

         “ఈ ఫోటోను చూడండి.”

         ఇంతియాస్ చూశాడు. “ఇతనేనా హత్య చేయబడింది?” అడిగాడు.

         “అవును. చెట్టు వెనకాల చూడండి.”

         “చెట్టు వెనకనా? యా… ఒక వ్యక్తి ఉన్నట్లు కనబడుతోంది. కొంచం క్లియర్ గా ఉండే ఫోటో లేదా?”

         “అతన్ని గుర్తు పట్టగలరా?’

         “సారీ. చాలా కష్టం. మా క్రికెట్ టీం లో ఉన్న అందరికీ ఆ పోలికలు ఉన్నట్టు అనిపిస్తోంది. నిశ్చయంగా నేను కాదు. అది మాత్రం చెప్పగలను.”

         “మాయా టీ షర్ట్ మీకు ఇచ్చారా?”

         “మీ ప్రశ్న అర్థం కాలేదు.”

         “ఆ క్లబ్ తరపున అందరికీ మాయ అన్న అక్షరాలు ప్రింటు చేసి అమ్మారట. మీ దగ్గర ఉందా?”

         “ఇండియన్ సరుకును కొనే అలవాటు లేదు.”

         “కానీ అమ్ముతారు కదూ.”

         నవ్వేశాడు. “అవును” అన్నాడు. “వెల్.. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?”

         “ఇంకొక్క ప్రశ్న.  ఆ క్రికెట్ టీం లో ఎవరైనా విచిత్రమైన ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉన్నారా?”

         “సరిగ్గా చెప్పలేను. ఆ టీం లో ఆరు నెలలు మాత్రమే ఉన్నాను. ఎవరితోనూ ఎక్కువ పరిచయం లేదు.”

         కాస్త ఆగి మాధవరావు అన్నాడు. “మీరిక సినిమాకి వెళ్ళవచ్చు.”

         ఇంతియాస్ రెండో కారు దగ్గరికి వెళ్లి డ్రైవింగ్ సీటు లో కూర్చుంటూ, “క్షమించాలి. నా వల్ల మీకు ఎక్కువ హెల్ప్ దొరక లేదనుకుంటాను” అన్నాడు.

         “ఫరవాలేదు” అన్నారు మాధవరావు.

         కారు బయలు దేరింది.

         “ఇంతియాస్! నేను అడగని ఇన్ఫర్మేషన్ ఏదైనా మీరు నాకు ఇవ్వ గలరా?”

         “దేని గురించి?”

         “క్రికెట్ టీం గురించి.”

         “మ్…  గ్రూప్ ఫోటో ఒకటి ఉందనుకుంటాను.”

         “మై గాడ్! అదే నాకు కావాలి. నేను ముందే అడిగి ఉండాల్సింది.”

         “ఆల్బంలో ఉంది. మహమూద్!” గొంతెత్తి పిలిచాడు.

         పైజామా యువకుడు రాగానే అతనితో ఉర్దూలో ఏదో చెప్పాడు.

         “ఇఫ్ యు డోంట్ మైండ్… నేను బయలుదేరుతాను. ఇతను మీకు ఆల్బం చూపిస్తాడు.”

         “సరే. వెళ్ళండి.”

         మాధవరావు ఆల్బంని తిరగేసారు. ఇంతియాస్ చిన్నప్పటి ఫోటోలు. ఆఖరున గ్రూప్ ఫోటో కనబడింది.

         M.C.C. MAYA క్రికెట్ క్లబ్ గ్రూప్ ఫోటో. దాని క్రింద ప్లేయర్స్ పేర్లు

         స్టాండింగ్ లిస్టు లెప్ట్ టు రైట్

         విజయకుమార్, నారాయణరావు, శంకర మూర్తి, రాకేష్, మాడప్ప.. ప్రక్క పేజీలో వాళ్ళ సంతకాల కలెక్షన్. “గొప్ప విజయానికి చిహ్నంగా” అన్న శీర్షిక క్రింద.

         ఒక్క సంతకం మాత్రం ఆకుపచ్చ రంగు సిరాలో ఉంది. రాకేష్ అన్న సంతకం.

         ఆ  పేజీని పర్రుమని చింపారు మాధవరావు. పక్కనే నిలబడ్డ మహమూద్ బిత్తర పోయి చూశాడు.

         మాధవరావు జీపు దగ్గిరికి పరిగెత్తినట్లే వెళ్ళాడు.

***

         రాకేష్ కాఫీ కలుపుతున్న ఉమ వేళ్ళనే చూస్తూ ఉన్నాడు. ఆనంద్ అటూ ఇటూ తిరుగుతూ వచ్చీ పోయే జనాన్నిచూస్తూ మధ్య మధ్యలో గడియారాన్ని చూస్తూ కూర్చున్నాడు.

         “ఏమయ్యింది ఆనంద్? కంగారుగా ఉన్నావు.” అడిగింది ఉమ.

         “కాస్త క్షమించాలి. నేను లైబ్రరీకి వెళ్ళాలి. ఆరు గంటలకల్లా మూసేస్తారు.”

         “అలాగైతే వెళ్లి పోదాం.” లేచింది ఉమ.

         “ఛ…ఛ.. మీరు మాట్లాడుతూ ఉండండి. నేను పుస్తకం రిటర్న్ చేసి వచ్చేస్తాను” అన్నాడు.

         ఉమ కాస్త తటపటాయించి, “సరే” అంది.

         రాకేష్ ఆమె చేతుల వైపే చూస్తున్నాడు.

         “లెటర్ చదివారా?”

         “చదివాను.”

         కాస్త ఆగి అన్నాడు. “కొన్ని సార్లు నిజం తెలిస్తే షాక్ తగిలినట్లు అనిపిస్తుంది కదూ.”

         “ఆ లెటర్ మీకు ఎలా దొరికింది?”

         “అది మాత్రం అడగకండి. ఎవరికైనా చూపించారా ?”

         “ఇంకా లేదు. కానీ పోలీసులకి పంపించాలనుకుంటున్నాను.”

         “వెరీగుడ్! మన ఇద్దరి ఆలోచనలు ఒకే బాటలో పయనిస్తున్నాయనుకుంటాను. ఆ లెటర్ జెరాక్స్ ప్రతిని బెంగళూరు పోలీసుకు పంపించేశాను.”

         “అలాగైతే నేను మళ్ళీ పంపించాల్సిన అవసరం లేదా?”

         “లేదు. ఏమైంది ఎలాగో ఉన్నారే?”

         ‘ఏమీ లేదు. ఏవో ఆలోచనలు.”

         “మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చింది ఆ అమ్మాయి గురించిన వివరాలు తెలుసు కోవడానికే కదా?”

         “అవును.”

         “మరి ఏమీ అడగకుండా కూర్చున్నారే?”

         “మీరు ఇంతకు ముందు అన్నారే నిజం ఒక్కోసారి షాకింగ్ గా ఉంటుందని. ఇంత వరకు మాయ అని ఎవరూ లేరని, వట్టి భ్రమ అని అనుకున్నాను. మూర్తికి నా మనసులో పవిత్రమైన స్థానం ఉండేది. అప్పుడు అది కలుషిత మయ్యింది.”

         “దాంట్లో మీకు రిలీఫ్ దొరకలేదా?”

         “రిలీఫా?”

         “అవును ఉమా! ఇక మీరు దేనికీ సంశయించ వలసిన అవసరం లేదు కదా?”

         “దేనికీ అంటే?”

         “మీ భవిష్యత్తును మీ యిష్టం వచ్చినట్లు రూపొందించు కోవడానికి. మానసికంగా మీరు తయారు అవడానికి.”

         “మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు.”

         “ఉమా! మూర్తి జీవితం తాలూకు చీకటి కోణాలను మీకు చూపించడం నాకు యిష్టం లేదు. చనిపోయిన వ్యక్తి గురించి చెడుగా మాట్లాడటం సభ్యత కాదు. కానీ మీకు అసలు విషయం తెలియాలని, పెళ్ళికి ముందు మూర్తి ఎటువంటి వంటి మనిషో మీరు గుర్తించాలని ఆ ఉత్తరం మీకు ఇచ్చాను. అతని గత జీవితపు తాలూకు పాపాలు అతన్ని వెంటాడాయి. అతను హత్య చేయబడింది నైతికమా, అనైతికమా అని మనం ఆలోచించాల్సిన అవసరం లేదనుకుంటాను.”

         “ఏమని చెప్పను? అంతా అయోమయంగా ఉంది.”

         “ఉమా! ఆనంద్ రాక ముందే మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగేయాలని అనుకుంటున్నాను.”

         “ఏమిటది?”

         “నన్ను పెళ్లి చేసుకుంటారా?”

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.