కథా మధురం 

ఆ‘పాత’ కథామృతం-4

 -డా. సిహెచ్. సుశీల

  “ప్రథమ దళితోద్యమ కథా రచయిత్రి*”
పులవర్తి కమలావతీదేవి
         
         1930 లలో స్త్రీలు స్వాతంత్రోద్యమంలో పురుషులతో ధీటుగా పాల్గొని, జైలు కెళ్ళడం తో పాటు, రాజకీయ వ్యవహారాలలో తీర్మానాలు చేయడం ద్వారా తమ భాగస్వామ్యాన్ని నిరూపించుకున్నారు. అఖిల భారత స్థాయిలో ఎన్నెన్నో మహిళా మహాసభలలో చురుగ్గా పాల్గొన్నారు.
     
         స్త్రీలు చదువుకుంటే ఏ స్థాయి వరకు అయినా ఎదగ గలరని ఆ నాటి స్త్రీలు బలంగా నమ్మారు. స్వాతంత్రోద్యమంలో గాంధీజీ అడుగుజాడలలో నడుస్తూ,ఆయన ఆశయాలకు అనుగుణంగా ఉద్యమ స్ఫూర్తితో ముందడుగు వేశారు. ఉద్యమగేయాలను ఆలపించడం, ఉత్తేజ పూరితమైన ఉపన్యాసాలు ఇవ్వడం, చైతన్యవంతమైన వ్యాసాలు రాయటం ముమ్మరం చేశారు. స్త్రీ విద్యా  ప్రాధాన్యతను, దేశ స్వాతంత్య్ర  ఆవశ్యకతను తమ రచన లలో ఆవిష్కరించారు. స్త్రీ సమాజాలను, సంఘాలను స్థాపించి తమకు యాజమాన్య నిర్వహణ సామర్థ్యం ఉన్నదని నిరూపించుకున్నారు.
 
         బత్తుల కామాక్షమ్మ, దర్శి అన్నపూర్ణమ్మ, తూనుగుంట్ల వెంకటసుబ్బమ్మ, చిట్టూరి అన్నపూర్ణాదేవి, ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ, పరుచూరి భువనేశ్వరీదేవి, పేరి అన్న పూర్ణమ్మ, పరిమి సీతామణి, పాలపర్తి సరస్వతి, కొప్పర్తి కృష్ణవేణి, చిలుకూరి లక్ష్మీ నరసమ్మ, ఇల్లిందల సరోజినీ దేవి, జి. శ్యామలాంబ, గంటి శేషమ్మ వంటి మహోన్నత స్త్రీ మూర్తులు వితంతు పునర్వివాహం, రజస్వలానంతర విద్య, రజస్వలానంతర వివాహం, మొదలగు విషయాల పై  చైతన్యవంతమైన వ్యాసాలు రచించారు. సేవా సదనా లు నిర్మించి అభాగ్యులైన స్త్రీలకు ఆశ్రయం కల్పించడమే కాక వారికి విద్య మరియు చేతి వృత్తులు నేర్పించే అవకాశాలు ఏర్పరిచారు. ఏకార్యము చేపట్టినా బాధ్యతా యుతంగా నిర్వహించ గలమని నిరూపించారు. పత్రికా పఠనం, గ్రామ పునరుజ్జీవనంలో స్త్రీల భాగ స్వామ్యం గురించి స్త్రీలలో అవగాహన కల్పించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అంతేగాక గాంధీజీ ప్రబోధనలతో “అస్పృశ్యత” జాఢ్యం పై సమర శంఖం పూరించారు. 
 
         “సమాజంలో స్త్రీలు, హరిజనులు సమాన బాధితులే” అని భావించి స్వాతంత్ర ఉద్యమంలో హరిజనోద్ధరణ భాగం కావాలని తెలియజేశారు. సత్యాగ్రహ నిర్వహణతో పాటు అస్పృశ్యతా నివారణ ఉద్యమం కూడా ప్రధాన విషయకంగా రచనలు చేశారు.
 
         “స్వతంత్రత నుండి స్వాతంత్రయానికి” అన్న పరిశోధనా గ్రంథంలో డాక్టర్ జంధ్యా ల కనకదుర్గ ఇలా అంటారు…..
 
         ” మందా ముత్యాలమ్మ రాసిన “అస్పృశ్యతా నివారణము – స్త్రీల విధి కృత్యములు” (మే 1933, గృహలక్ష్మి) అనే వ్యాసంలో స్త్రీలు ప్రత్యేక సభలు జరుపుకొని పురుషులతో సమాన హక్కులకు కావాలని తీర్మానం చేస్తున్నారనీ, స్త్రీలు గురువులుగా, న్యాయవాదు లుగా, ఉపాధ్యాయులు గానే కాక రాజకీయ కార్యములకు ముందంజ వేస్తున్నారనీ, దేవదాసీ నిర్మూలనను, స్వదేశీ వృత్తుల వ్యాపకం, అస్పృశ్యతా నివారణము వంటి కార్యక్రమములలో జన సామాన్యంలో స్త్రీలు చైతన్యం కలిగిస్తున్నారని తెలిపింది. గృహ కృత్యములను నిర్వహించి తీరిక సమయాలలో రాట్నం తిప్పి నూలు వడికి, బట్టలు నేయించి  అమ్మటంలో కుటుంబ ఖర్చులకు సహాయపడుతున్నారని, స్త్రీలు నూలు వడకటమే దేశభక్తిలో భాగమనీ, స్త్రీలు విద్యావంతులై, బాలింత శిశు మరణాలను తగ్గించా లనీ,  బిడ్డలకు చేతి పనులన్నీ తల్లులే నేర్పిస్తున్నారని తెలిపింది. మానవులు ఎవరైనా వారి వృత్తిని ముగించి పరిశుద్ధంగా స్నానం చేసిన తర్వాత స్పృశ్యులే అగుదురని, పిల్లల మలమూత్రములు తీసే తల్లి అస్పృశ్యురాలిగా భావిస్తున్నామా అని ప్రశ్నించుకోవాలని తెలియజేసింది. అంతేకాదు తండ్రి చెప్పులు కుట్టేవాడు అయితే అస్పృశ్యుడిగా భావించి నా , అతని కొడుకు కలెక్టర్ అయితే స్పృశ్యుడి గానే భావిస్తున్నారని, హరిజనులను ఉద్ధరించటం – ముఖ్యంగా  ఇండ్లలో దేవాలయాలలో పాఠశాలలలో వారికి ప్రవేశం కల్పించాలని తెలియజేసింది ముత్యాలమ్మ.
 
         హరిజనోదరణకై హేతుబద్ధమైన అభిప్రాయాలు వెల్లడించడం స్త్రీల మేధాశక్తికి ప్రత్యేకంగా భావించి విజ్ఞానవంతులుగా ఆలోచింప చేయటం నేటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.”
 
         కేవలం వ్యాసాలు మాత్రమే కాక కథలలో సైతం “హరిజనుల” స్ధితిగతులను వివరిస్తూ, వారి పై జరిగే దౌర్జన్యాలను తీవ్రంగా ఖండించారు. కుల మత వర్గ బేధాలను, ప్రజలలో నెలకొన్న మూఢ నమ్మకాలను సవివరంగా చర్చించారు.
 
         సాంఘిక దురాచారాలు సంఘాన్ని తిరోగమన పాలు చేస్తున్నాయనీ, అది నాగరికంగా ఎదుగుదలకు అడ్డుకట్ట వంటిదని ఆ నాటి రచయిత్రులు భావించడం గొప్ప విషయం.
 
         పులవర్తి కమలావతీ దేవి వ్రాసిన “మిహిరున్నీసా బేగం” (జూన్, 1931, వాసవి) అనే కథలో హిందూ మహమ్మదీయుల మధ్య పరస్పరం ఉండవలసిన సత్సంబంధాలను,  కలిసి మెలిసి దేశాభివృద్ధికి పాటు పడాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది.  మత ఛాందసులు, ఉగ్రవాదులైన ఒక హిందూ ఒక మహమ్మదీయ కుటుంబాల మధ్య సఖ్యత పెంపొందడం ఇందలి ఇతివృత్తం. ఆమె రాసిన మరో అభ్యుదయ పంధా లోని కథ “మాదిగ వెంకడు”.
 
మాదిగ వెంకడు
 
         పులవర్తి కమలావతీ దేవి రాసిన ” మాదిగ వెంకడు”  ( జూన్, 1934, వాసవి) అనే కథ స్త్రీ రాసిన ప్రథమ దళితోద్యమ కథ అని చెప్పవచ్చు.
 
         ఒక డిప్యూటీ కలెక్టర్ గారి ఆఫీసులో మరుగుదొడ్డిని శుభ్రం చేసే దళిత కార్మికుడు ఒక రోజు అస్వస్థతతో పనికి రాలేకపోతాడు. ఆగ్రహోదగ్ధుడైన ఆ ఆఫీసర్ ముందు వెనుకలు  ఆలోచించక వెంకడి ఇంటికి కబురు చేస్తాడు. పనికి వెంటనే రావలసిందని హుకుం జారీ చేస్తాడు. అస్వస్థతతో బాధపడుతూనే వెంకడు ఆఫీసుకు వస్తాడు. అధికార మదంతో ఆఫీసర్ వెంకడిని ఆజ్ఞాపిస్తాడు మరుగుదొడ్డిని శుభ్రం చేయమని. చేయలేనని ఎంతగానో ప్రాధేయపడిన వెంకడిని ” ఎదురు చెప్తావా” అంటూ విచక్షణారహితంగా కొడతాడు ఆఫీసర్.
 
         శారీరక అనారోగ్యం, అందరి ముందు అవమానం, మానసిక దుఃఖంతో నిండిపోయిన ఆ సఫాయీ కార్మికుడు తిరగబడి డిప్యూటీ కలెక్టర్ ని కొడతాడు. అంతేకాక, ఆఫీసర్ మీద కోర్టులో కేసు వేయాలని ప్రయత్నిస్తాడు. కానీ ప్లీడర్లు ఎవరూ సహకరించలేదు. కేసు వేయకపోయినా, సఫాయీ కార్మికుడి చేతిలో దెబ్బలు తిన్న కలెక్టర్ గా అందరూ నవ్వు తున్నారని అవమానపడిన ఆ ఆఫీసర్ ఆ ఊరి నుండి బదిలీ చేయించుకొని వెళ్ళి పోతాడు. ఒక రకంగా ఇది మాదిగ వెంకడి విజయంగా భావించవచ్చు.
 
         దళితుడు తన పై ఆఫీసర్ మీద చేసిన తిరుగుబాటు కథ ఇది. “ప్రథమ దళితోద్యమ కథ” గా ఇది చరిత్ర లో నిలిచింది. పైగా దళితేతర రచయిత్రి రాసిన కథ. 
 
         ప్రథమ దళితోద్యమ కథ రాసిన దళితేతర రచయిత్రిగా పులవర్తి కమలావతీ దేవి అభినందనీయురాలు.

*****

వచ్చే నెల మరో ఆ’పాత’ కథామృతంతో కలుద్దాం

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.