క ‘వన’ కోకిలలు – 15 : 

చైనా దేశ సనాతన మహాకవి వాంగ్-వీ (701-761 C.E.)

   – నాగరాజు రామస్వామి

మానవ మస్తిష్కాన్ని నిదుర లేపేది కవనం, మనిషిని పరిపూర్ణున్నీ చేసేది సంగీతం. – కన్ఫూస్యస్.

          చైనా సాహిత్య సంప్రదాయం 3000 సంవత్సరాల సనాతనం. 4 వ శతాబ్దానికి చెందిన చైనాదేశ సాహిత్య జాతిపిత (Father of Chines poetry) క్యూయాన్ (Qu Yuan), 15 వ శతాబ్దపు తాత్విక కవి కన్ఫూస్యస్ (Confucius) ప్రసిద్ధలేకాని, సనాతన చైనా మహా కవులుగా గణన పొందిన వారిలో అగ్రగణ్యులు 8వ శతాబ్దికి చెందిన కవులు వాంగ్-వీ (Wang Wei), లీ-పో (Li Po), తు-ఫూ (Tu Fo). చైనా దేశ సాహితీ స్వర్ణయుగమైన తాంగ్ సామ్రాజ్య కాలం (Tang Dynasty) నాటి సమకాలీనులు. 

          8వ శతాబ్దపు నాటి చైనా మహాకవి వాంగ్-వీ గొప్ప చిత్రకారుడు, సంగీతజ్ఞుడు, రాజకీయవేత్త, మహాకవి. ఆ కాలపు ప్రసిద్ధ మేధావి. ప్రాంతీయ ప్రకృతి పర్యావరణం (Landscape) నుండి స్ఫూర్తి పొందిన అతని అనేక కవితలు లాండ్స్కేప్ కవితలుగా పేరు తెచ్చుకున్నవి. Three Hundred Tang Poems సంకలనంలో అతని 29 కవితలకు చోటు దక్కింది. 

          అతను రచించిన ప్రకృతి చిత్రణాత్మక ప్రతిబింబ కవిత్వం (Imagistic Landscape Poetry) భావి తరాలకు మార్గదర్శకమయింది. భాషాతీతమైన అతని కవిత్వం బౌద్ధ (జెన్) ప్రశాంతతను ప్రతిబింబిస్తుంది. 

          వాంగ్ వీ రచనలలో నేడు లభిస్తున్న కవితలు కేవలం 420 మాత్రమే. వాటిని రాజు గారి ఆదేశం మేరకు అతని తమ్ముడు వాంగ్ జిన్ ఒక సంకలనంగా తెచ్చాడు. నేటి వరకు ఆంగ్లంలోకి అనువదించబడిన కవితలు 150. అతని పెయింటింగ్స్ గాని,  సంగీతంగాని అలభ్యమనే చెప్పాలి. మంచి ప్రభుత్వ ఉద్యోగిగా పేరు తెచ్చుకున్నాడు. కాని, బౌద్ధ గురువు దావోగువాంగ్ (Daoguang) శిష్యరికంలో జెన్ మతాన్ని స్వీకరించాడు.  

          వాంగ్ వీ ‘హాన్’ కులీన సంపన్న కుటుంబంలో జన్మించాడు. ఐదుగురు సహోదరు లలో పెద్దవాడు. చదువులో చురుకైనవాడు. 19వ ఏట సివిల్ పరీక్షలు రాసి ప్రథమశ్రేణి లో ఉత్తీర్ణుడై, 22వ ఏట ప్రభుత్వ ఉద్యోగంలో చేరాడు. చేరాడే కాని, అనేక ఆటుపోట్లకు లోనయ్యాడు. తిరుగుబాట్లు, అంతఃకలహాలు పేట్రేగుతున్న కాలంలో ప్రభుత్వ ఉద్యోగిగా ఎన్నోఅవస్థలు పడ్డాడు. దుర్మార్గులైన ‘యాన్’ ప్రభుత్వాన్ని కూల్చాలని ‘తాంగ్’వంశీయు లు చేసిన తిరుగుబాటు (An-Shi rebellion) అల్లరులలో వాంగ్ వీ బంధీ అయ్యాడు. రాజ ద్రోహం పేరున అరెస్ట్ అయ్యాడు. తుదకు, సొంత ప్రాంతంలో కొనుక్కొన్న ఎస్టేట్ లో స్థిరపడి, జీవితాంతం తన కళాతృష్ణను కొనసాగించాడు. అతని ఆఖరు రోజుల్లో ప్రశాంత ఏకాంత జీవితం గడుపుతూ అనేక రచనలుచేశాడు. కళాకృతులను చిత్రించాడు. ప్రియ మిత్రులకు, ప్రియతముడైన తమ్మ్మునికి ఉత్తరాలు రాశాడు. తన ప్రియాతి ప్రియమైన కవితా వ్యాసంగాన్ని సాగిస్తూ, బౌద్ధాన్ని ఆచరిస్తూ 60వ ఏట మరణించాడు. 

          వాంగ్ వీ కి ఉన్న మరికొన్ని పేర్లు – Youcheng, Mojie, Wang Youcheng, Mo-chieh. 

          వాంగ్ వీ ప్రకృతి ప్రియుడు. కొండలు, నదులు అతని పంచప్రాణాలు. అందుకే  అతని పెయింటింగ్ లలో ప్రకృతిశోభ అంతగా పల్లవించింది. ఆతని కవితలలో అంతగా పరిమళించింది. 

మచ్చుకు కొన్ని అతని కవితలకు నా తెలుగు సేతలు: 

1. కృష్ణ వనం (Lu Zhai – Deer Park – లు చాయ్)

చెట్టూ చేమా లేని వట్టి ఖాళీ కొం

అక్కడ 

మానవ కంఠ స్వరమేదో మార్మోగుతుంటుంది

ఓ ఏటవాలు లే కిరణం అడవి గుండెల్లోకి దిగి

ఆకుపచ్చని నాచు పాచిని వెలిగిస్తుంటుంది.

 

2. ప్రత్యుత్తరం (In Reply to P’ei Ti)

ఎల్లలు దాటి పరచుకున్నది పారుతున్న ఏరు 

నీలి లోతుల నింగిని కారు మేఘాలు కమ్ముకున్నవి

ఆ హోల్ సౌత్ మౌంటెన్ గురించేగా నీ ప్రశ్న:

మెదడుకు తెలుసు తెలి మబ్బుల అవతలి 

అసీమ సంగతి.

 

3. పరితాపము (Mourning Yin Yao)

నివురు ఛాయల హరిత తరువుల నడిమి

శిలాపూర్ణ శిఖరాలను నీ కిచ్చేసాకే

విడిపోయాం మనం. 

ఇప్పుడు ఇంటికొచ్చాక తెలిసింది

నీ అస్థికలు కప్పిన తెలిమేఘ చిరుశకలం 

చిరస్థాయిగా మిగిలి పోయిందని;

మానుష సీమలలోకి  కూలిపోతూ 

కుప్పపడుతున్నవి కొండ వాగులు. 

 

4. కొండ కోనలలో ( In the Mountains)

పొడుచుకొస్తున్నవి

ముళ్ళ తీగలను ముడుచుకున్న సెలయేర్లు,

మొనదేరిన తెలతెల్లని శిలలు.

భయపెడుతున్నవి

ఆకాశ శైత్యాలు, అరుణ పత్రాలు.

ఈ కొండదారి చివరన ఏ వాన జాడా లేదు; 

మలిన పరస్తున్నది ఆకాశం 

కింగ్ఫిషర్ రెక్కల నీలి వన్నె దుస్తులను.

 

5. చక్ర చట్ర క్రమ గమనం ( Wheel- Rim River Sequence)

ఆప్రికాట్ కలపతో కట్టిన కుటీరం,

కమ్మని తావుల రెల్లు కప్పిన చూరు.

ఎవరికీ తెలియదు 

మానుషదేశ రాచరిక వృష్టిని కొనితెచ్చే  

ఈ లోకప్పు కింద కదలాడే మేఘాల సంగతి. 

తేటతెల్లని కంక పొదల కొండ మీద 

నిటారుగా నిలిచిన వెదురు గడల నీలిజ్వాల 

డొంక తిరుగుడు కొండదారుల సంచరించే 

భ్రాంత దిమ్మరి …

పచ్చని ఈకల నీటిపక్షి తొణకించిన నీల నిమ్నగ.

ఏ దారుశిల్పికీ అంతుపట్టదు

చలికారు కులికిన తారు రోడ్ల మీది ఈ చీకటి. 

 

6. మంగోలియా పార్క్ (Magnolia Park)

హేమంత హిమగిరులు 

అంతిమ దినకాంతులను కూడగట్టుకుంటున్నవి, 

సాయంసంజ పక్షులు 

గగన విహారంలో బారులు తీరుతున్నవి, 

లకుముకి పిట్టల పచ్చల రెక్కల తళుకులు

విస్తరిస్తున్నవి.

ఏవీ మరి దినాంత తుహిన తుషారాలు! 

          వాంగ్ వీ విశ్వ కవులను ప్రభావితం చేశాడనడంలో సందేహం లేదు. జపనీస్ హైకూ మాస్టర్ యోసా బూసన్ ఒక శీతకాలపు పక్షిని చూచి, Death poems సంకలనంలో ఇలా రాసుకున్నాడు: 

హేమంత పక్షిణి; 

ఇది వాంగ్ వీ కంచె మీది

అలనాటి పాటల పిట్ట. 

          వాంగ్ వీ ని తలచుకుంటూ, అతడు రాసుకున్న వీడ్కోలు గీతంతో ముగిస్తాను. 

ఇక్కడే, 

ఈ పర్వత ప్రాంతంలోనే 

మనం వీడ్కోలు చెప్పుకున్నాం.

వచ్చే వసంతంలో 

గడ్డి తిరిగి చిగురిస్తుందా?

మనుమడా! 

మరోసారి చూస్తానా నిన్ను? 

     చైనా దేశ సనాతన మహా కవి వాంగ్-వీ. “The Buddha of the Poets” వాంగ్-వీ.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.