జీవితం అంచున -6 (యదార్థ గాథ)

(…Secondinnings never started)

-ఝాన్సీ కొప్పిశెట్టి

          అనారోగ్యంలో మనిషిని వైరాగ్య భావన అమాంతం ఆవహించేస్తుంది. అప్పటి వరకూ వున్న ఉత్సాహాన్ని చప్పగా చల్లార్చేస్తుంది.

          మనిషిలో అనారోగ్యం కన్నా అనారోగ్యంగా వున్నామన్న ఆలోచన పెనుభూతంలా కబళించేసి మానసికంగా కృంగదీసేస్తుంది.

          క్వాన్టిఫెరాన్ TB పరీక్ష ఫలితాలు కాళ్ళ కింద భూమిని కదిలించేసాయి. లో లెవెల్ పాజిటివ్.

          ఎమర్జెన్సీ అటెన్షన్ అంటూ GP నుండి పిలుపు వచ్చింది.

          ఒక్కసారిగా నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. నా నర్సింగ్ ఆశ కుప్పకూలిపోవటమే కాకుండా నా జీవితమే ముగిసిపోతోందన్న పెనుభూతం విలవిలలాడించేసింది.

          అమ్మాయి ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ డాక్టరు దగ్గరికి తీసుకు వెళ్ళింది.

          నాకేదో జరుగబోతోందని, నన్నేదో మహమ్మారి రోగం పీడిస్తోందని ఒక ఫోబియా  ఆవహించేసింది.

          అసలు నాలో TB లక్షణాలేమీ లేకుండా లో-పాజిటివ్ ఏమిటి ?

          సన్నటి కన్నీటి పొరలోంచి అలికేసినట్టు కనిపిస్తున్న రిపోర్టులోని అక్షరాలను చదివాను.

          “లో లెవెల్ పాజిటివ్.. నాన్ స్పెసిఫిక్.. కన్సిడర్ రీ-టెస్టింగ్”

          “దగ్గు ఎప్పుడయినా వస్తుందా…” డాక్టరుగారి మొదటి ప్రశ్న.

          “లేదు… ఇప్పుడు అస్సలు లేదు..” నా ఖచ్చితమైన జవాబు.

          “ఇప్పుడు లేదంటే ఎప్పుడైనా వుండేదా…” డాక్టరుగారి అనుమానం.

          “గత సంవత్సరం జూలైలో ఇండియాలో వుండగా కోవిడ్ వచ్చినప్పుడు దగ్గు వుండేది. కోవిడ్ వారం లోపే తగ్గిపోయినా దగ్గు దాదాపు నెల పైనే సతాయించింది” డాక్టరుగారు సిస్టంలో నోట్ చేసుకున్నాడు.

          “ఆకలి మామూలుగానే వేస్తోందా, ఆహారం ఇష్టంగానే తింటున్నారా లేక ఏమయినా సహించక పోవటం వుందా”

          “ఆకలి విపరీతంగా వేస్తోంది, శుభ్రంగా కడుపు నిండా తింటున్నాను”

          “ఈ మధ్య ఏమయినా బరువు తగ్గుతున్నారా…”

          “తగ్గాలని వున్నా తగ్గలేకపోతున్నాను”

          డాక్టరుగారు తల పంకించి “మీ కుటుంబంలో వెనుక, ముందు తరాల్లో ఎవరికైనా TB వుందా”

          “నాకు తెలిసినంతవరకు లేదు”

          “పోనీ మీ స్నేహితుల్లో, మీ సర్కిల్లో ఎవరికైనా వుందా.. మీరు వారికి సన్నిహితంగా గడిపారా”

          “లేదు.. ఎవరికైనా వుందేమో తెలియదు”

          “ఆసుపత్రి వాతావరణంలో రోగుల మధ్య ఎప్పుడయినా ఉద్యోగం చేసారా”

          “ఎప్పుడూ లేదు. ఇప్పుడు చేయాలనే ప్రయత్నంలోనే ఈ పరీక్షలు చేయించు కుంటున్నాను”

          “మీరు ఆఖరుసారిగా ఇండియా నుండి వచ్చి ఎంతకాలం అయ్యింది..”

          “ఆరు నెలలు అవుతోంది”

          “చూడండి, ఇండియా ప్రపంచ దేశాలు మొత్తంలోనూ హైఎస్జ్ ఇన్సిడెన్స్ ఆఫ్ TB గల దేశం. మొత్తం ప్రపంచ దేశాల TB రోగుల్లో ఇరవై ఏడు శాతం రోగులు భారత దేశం నుండే. మొత్తం ప్రపంచ దేశ TB చావుల్లో ముప్పయి నాలుగు శాతం చావులు భారత దేశం నుండే. మీరు ఇండియా నుండి ఆఖరుగా వచ్చి ఆరు నెలలే అయ్యిన్దంటున్నారు కాబట్టి లో-పాజిటివ్ అయినప్పటికీ ఇండియన్ ఇమ్మిగ్రంట్ కావటం వలన పాజిటివ్ గానే గ్రహించి మరికొన్ని పరీక్షలు చేయాల్సి వుంది” 

          నాకేమీ అర్ధం కాలేదు. ఇండియన్ అవటం వలన అంటూ ఈ వివక్షత ఏమిటి ?

          నా మొహంలోని భావాన్ని చదివినట్టుగా డాక్టరుగారు “ఏ దేశంలోనైనా ప్రతి లక్ష మంది జనాభాకి నలభై కన్నా ఎక్కువ TB వ్యాధిగ్రస్తులు వుంటే ఆ దేశాన్ని హై ఇన్సిడెన్స్ ఆఫ్ TB కంట్రీగా పరిగణిస్తారు. WHO గణాంకాల ప్రకారం ఇండియాలో ప్రతి లక్షమంది జనాభాకి మూడు వందల పదహారు TB  వ్యాధిగ్రస్తులు వున్నారు. ఆ రకంగా ఇండియా అగ్ర స్థానంలో వుంది. ఆస్ట్రేలియాలో ప్రతి లక్ష జనాభాకి ఐదు TB  కేసులు వుంటాయి”

          నేను కళ్ళప్పగించి వింటున్నాను.

          “TB అంటువ్యాధి కనుక ఇక్కడ ఒక్క కేసు ఐడెంటిఫై అయినా ఎవరికీ సోకకుండా అరికట్టే ప్రయత్నం జరుగుతుంది. మీకు సింప్టమ్స్ లేవు కనుక TB లేటెంట్ దశలో వుండవచ్చును.  TB లేటెంట్ దశలో మరొకరికి సోకదు. ఆ దశలో వున్న వారిలో, ఐదు నుండి పదిశాతం రోగులలో ఆక్టివ్ దశకి మారి అంటువ్యాధిగా మారవచ్చును. ఏ విషయమూ నిర్ధారణకి రావాలంటే మీరు చెస్ట్  ఎక్స్రే గానీ స్పూటం పరీక్ష గానీ చేయించు కోవాల్సి వుంటుంది”

          నాకు వెన్నుపూసలో నుండి వణుకు మొదలయ్యింది.

          నా బాడీని ఎక్స్రేకి ఎక్స్పోస్ చేయటం, మళ్ళీ డయాగ్నొస్టిక్ సెంటరుకి వెళ్ళటం ఇష్టం లేని అమ్మాయి స్పూటం పరీక్ష చేయించుకుంటామంది.

          మూడు చిన్న వేలెడంత బాటిల్స్ ఇచ్చి, వరుసగా మూడు రోజుల పాటు వేరు వేరు సమయాల్లో ఫ్లెం వేసి ఏ రోజుదారోజు తెచ్చి ఇమ్మన్నారు.

          డాక్టరు దగ్గర సెలవు తీసుకుని బయటపడ్డాము.

          అమాంతం నీరసం ఆవహించి నా కాళ్ళల్లో సత్తువ సన్నగిల్లిపోయింది. పది లంఖణాలు చేసినట్టుగా అడుగులు పడటం లేదు. నా పరిస్థితిని గమనించిన అమ్మాయి నన్ను పొదివి పట్టుకుని నడిచింది.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.