నా జీవన యానంలో- రెండవభాగం- 31

-కె.వరలక్ష్మి

          తన చిన్నప్పుడంతా నాకు స్కూల్లోనూ ఇంట్లోనూ సాయం చేస్తూ ఉండిన దుర్గ అనే అమ్మాయి నేను రాసుకుంటూంటే దీక్షగా చూస్తూ ఉండేది. తనకి చదువు నేర్పాలనే నా ప్రయత్నం ఫలించలేదు. ఎక్కువ జీతం వస్తుందని వాళ్ళమ్మ తనని కాకినాడలో రొయ్యల ఫేక్టరీలో చేర్పించింది. ఎప్పుడైనా వాళ్ళూరికి వెళ్తున్నప్పుడో, వచ్చేటప్పుడో జగ్గంపేటలో దిగి నా దగ్గరకి వచ్చేది. 

          ఒకసారి అలా వచ్చినప్పుడు నా కథ రాయొచ్చు కదా అంది. అదే ‘ఖాళీ సంచులు’ కథ. వాడ్రేవు పతంజలి రచన పోటీలో బహుమతి పొందింది. 2002 ఫిబ్రవరి రచనలో
ప్రచురింపబడింది. అదే సంవత్సరం డిశంబర్ లో ఆ కథ రంగవల్లి పురస్కారం పొందింది. తర్వాత చాలా సంకలనాల్లో చోటు చేసుకుంది.

          ‘జీవరాగం’ లో వచ్చిన నా కథ ‘స్వస్తి’ సాహిత్య అకాడమీ సంకలనంలో చోటు చేసుకుంది. అప్పటికే నాకు అర్థమైంది జీవితంలోని కష్టాలేవీ రచనా వ్యాసంగాన్ని ఆపలేవని. ఆటా (అమెరికా తెలుగు అసోసియేషన్) పోటీ లో బహుమతి పొందిన ‘పిల్లి’ కథ మార్చి- ఏప్రిల్ 2002 అమెరికా భారతిలో వచ్చింది. రచన-సిలికానాంధ్ర పోటీలో ‘జాలి’ కవిత బహుమతి పొంది ఎనిమిది 8.4.02 న అటు సిలికానాంధ్ర పత్రికలోనూ; ఇటు ఏప్రెల్ 2 ఉగాది రచనలోనూ వచ్చింది. ప్రచురింపబడిన కథలకు పెట్టిన R.S.కృష్ణమూర్తి పోటీలో ‘మట్టి- బంగారం’ కథ మళ్ళీ బహుమతి పొందింది. 13.4.02 లీడర్ పేపర్లో ‘చైత్రోదయవేళ’ కవితతో పాటు నా ఇంటర్వ్యూ వచ్చింది.

          నా పెళ్లయిన కొత్తలో శాంతి ఆశ్రమం దగ్గర ఉన్న ధార కొండ పైకి ఎక్కిన సాహసం స్కెచ్ మే-జూన్ 02 భూమిక లో వచ్చింది. 22. 7.02 ఆంధ్రభూమి సాహితీలో ‘పల్లె బంధం’ కవిత వచ్చింది.

25. 8.02 ఆంధ్రభూమి తూర్పుగోదావరి స్పెషల్ లో ‘రచనా రంగంలో రాణిస్తున్న వరలక్ష్మి’ అంటూ నా పరిచయం వచ్చింది.

డిశంబర్ 7 న తెలుగు యూనివర్సిటీ నుంచి ఓ టెలిగ్రామ్ వచ్చింది. 23 న జరగబోయే పురస్కార సభలో నాళం కృష్ణారావు పురస్కారం అందుకోవడానికి రావాలని. వాళ్ళడిగిన ఫోటో, బయోడేటా కొరియర్ లో పంపించేను. కానీ, ఇంట్లో పేషెంట్ ని వదిలి హైదరాబాద్ ఎలా వెళ్లాలి? అనే మథన.  అంతకు ముందే నా రెండవ కథల పుస్తకం వేయాలని అనుకొని కొన్ని కథలు సెలెక్ట్ చేసి పంపిస్తే మా అబ్బాయి రవి, గీత ఆ పని పూర్తి చేశారు. ముఖచిత్రం చంద్ర వేశారు. దానికి నేను చెక్కు పంపిస్తే చంద్ర దాన్ని మార్చుకోనే లేదు. దాన్ని ఓ జ్ఞాపకంగా దాచుకున్నాను అన్నారు తర్వాత.  ‘మట్టి-బంగారం’ ముఖచిత్రం చూస్తే అర్థమౌతుంది చంద్ర ఎంతమనసు పెట్టి వేశారో!

నా జీవితపు గందరగోళంలో పడి నేను గుర్తించాల్సిన ఎందరినో సరిగా గుర్తించనే లేదు.

అంతలో డిశంబర్ 31న రంగవల్లి పురస్కార సభకు వచ్చి పురస్కారం అందుకోమని లెటర్ తో పాటు ఫోన్ వచ్చింది. 25న గీత పొయెట్రీకి అజంతా పురస్కారం ఇవ్వబోతున్నట్టు తెలిసింది. తెలుగు యూనివర్సిటీ రంగవల్లి పురస్కారాలు అందుకోవడానికి నేను వెళ్ళక తప్పదు. ఆ సందర్భంగా గీత పురస్కారం అందుకోవడం కూడా చూడచ్చు. అంతలో ఎవరో పంపినట్టు మా చిన్నల్లుడు తన ఆఫీసు పని మీద రాజమండ్రి వచ్చారు . 14న తిరిగి వెళ్తానని, ఆయన్ని తీసుకుని హైదరాబాద్ వెళ్దామని అన్నారు. వెంటనే రిజర్వేషన్స్ కూడా చేయించారు. అలా డిసెంబర్ 15 ఉదయానికి హైదరాబాదులో ఉన్నాం. మోహన్ కి కోనసీమ రాజు గారి ఇచ్చిన ఆయుర్వేదం సరిగా పనిచేయడం లేదేమో అనిపిస్తుంది అప్పటికే.

          మౌలాలిలో పెరాల్సిస్ పేషెంట్లకి వైద్యం చేసే సెంటర్ ఉందంటే తీసుకెళ్ళేం. తీరావెళ్తే అది ఓల్డ్ ఏజ్ హోమ్. నాకు నచ్చలేదు. ఈ నిస్సహాయ స్థితిలో ఒక్కణ్ణీ అక్కడ వదిలేయడం మానవత్వం కాదనిపించింది. తిరిగి తీసుకొచ్చేసాం. వెళ్లినప్పటి నుంచి తిరిగి జగ్గంపేటకు బయలుదేరే వరకు మా అబ్బాయి, గీత నన్నంటి పెట్టుకునే ఉన్నారు. పిల్లలు చిన్నవాళ్లు కావడంవల్ల మా చిన్నమ్మాయికి, కేంపుల ఉద్యోగం కావటం వల్ల వాళ్ళ ఆయనకి కుదిరేది కాదు.

          తెలుగు యూనివర్సిటీ పుస్తకం వేసుకోవడానికి 3వేలు ఆర్థిక సాయం చేసింది.
అందుకని వాళ్ళకి 20 పుస్తకాలు ఇవ్వవలసి వచ్చింది. పుస్తకానికైన మిగిలిన ఖర్చు మా అబ్బాయి పెట్టాడు. ఎలాగూ వచ్చాం కాబట్టి ‘మట్టి-బంగారం’ ఆవిష్కరణ కూడా చేసేద్దాం అన్నారు పిల్లలు. ఎక్కడా ఏ హాలూ ఖాళీ లేక తిరిగి తిరిగి చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ హాలు బుక్ చేసాం. దూరమైనా, మోహన్ ని వైద్యం కోసం బేగంపేటలో MELA సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ చేసాం.

          23న తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి
Md.ఫరూక్ , V.C. జి.వి. సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా పురస్కారం అందుకున్నాను.
రచయితలు, కవులు చాలా మంది వచ్చి ఉన్నారు కాబట్టి పుస్తకావిష్కరణ ఆహ్వాన
పత్రాలు పంచేం.

          25న ప్రెస్ క్లబ్ లో జరిగిన అజంతా అవార్డ్ ఫంక్షన్ సభలో గీత అజంతా పురస్కారం అందుకుంది. 26న అస్మిత వాళ్ళ ఈస్ట్ మారేడ్ పల్లి ఆఫీస్ లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందుకి అటెండయ్యాం. 27న అబ్బూరి ఛాయాదేవి గారి చేతుల మీదుగా ‘మట్టి-బంగారం’ పుస్తకావిష్కరణ జరిగింది. చేరా, ఓల్గా, ప్రధాన వక్తలుగా చాలా బాగా మాట్లాడేరు.

          31న సుందరయ్య కళాక్షేత్రంలో అద్భుతంగా జరిగిన సభలో హైకోర్టు జడ్జి చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మకమైన రంగవల్లి పురస్కారం అందుకున్నాను. 2002 వ సంవత్సరం అలా ముగిసింది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.