వ్యాధితో పోరాటం-17

కనకదుర్గ

          ఫోన్ తీసుకొని, “బూస్టర్ షాట్ తీసుకున్నాను డాక్టర్,” అని చెప్పాను. ఏం జరుగు తుందోనని నాకు భయం పట్టుకుంది.

          “ఓ.కే, నౌ డోంట్ మూవ్, జస్ట్ టేక్ ఇట్ ఈజీ అండ్ ప్లీజ్ రెస్ట్. నువ్వు ఇపుడు ఒకసారి చెకప్ కి రావాలి, రాగలవా?”

          ” డాక్టర్ ఈజ్ ఎనీధింగ్ రాంగ్? నాకు భయం వేస్తుంది….” నాకు ఏడుపొస్తుంది. చైతు వచ్చి నా చెయ్యి పట్టుకుని కూర్చున్నాడు.

          ” ఒకసారి చెక్ చేస్తే తెలుస్తుంది. భయపడాల్సింది ఏమీలేదు. త్వరగా వస్తే చూసి చెబ్తాము, ఇట్స్ బెటర్ టు బి సేఫ్, మేము ఇంకా ఇక్కడ ఉన్నాము. రాత్రి మేమంతా వెళ్ళి పోయాక ఎక్కువయితే ఎమర్జన్సీకి వెళ్ళాలి. జస్ట్ ఒకసారి చెక్ చేయాలి అంతే. ఒకే సీ యూ సూన్.” అని ఫోన్ పెట్టేసింది.

          కళ్ళలో నుండి నీళ్ళు జల జలా రాలిపోయాయి. ఎందుకు లేచాను, ఎందుకు పని చేసాను? అని తిట్టుకున్నాను.

          “అమ్మా ఏమయింది? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా?” అని అడిగాడు చైతు.

          “నాన్నకి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పు డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి,” అని చెప్పి మంచం పై వాలి పోయాను.

          చైతు ఫోన్ చేసి చెప్పాడు. శ్రీని వెంటనే బయల్దేరాడు. 

          లివింగ్ రూమ్ లోనే సోఫా బెడ్ వేసారు, ఎడమ వైపు డైనింగ్ టేబుల్ వుంది, అక్కడే చిన్న హాల్ వే నుండి బాత్రూమ్ కి, బెడ్రూంలోకి వెళ్ళొచ్చు. బెడ్ కి ఎదురుగా టీ.వి, బెడ్ కి కుడివైపు నొప్పులు ఎంత సేపటికోసారి వస్తున్నాయని చూసి డాక్టర్ కి పంపించే మానిటర్ వుంది. అక్కడే మందులు, మంచినీళ్ళు వున్నాయి. 

          శ్రీని రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ అడిగింది ఏం చేసావని, “నేను కొన్ని కూరలు కట్ చేసి పెట్టాను, రెండు కూరలు చేసాను. కిచెన్ క్లీన్ చేసాను.”

          శ్రీని, చైతు ఆశ్చర్యపోయారు. “ఎందుకు చేసావమ్మా?” చైతు బాధగా అన్నాడు.

          “మీరు కూర్చోండి. నేను తనని టెస్ట్ చేయాలి,” అని లోపల రూంలోకి తీసుకెళ్ళింది డాక్టర్ ఆన్నా.

          చెకప్ అంతా చేసాక, “నిన్ను మేము కాసేపు మానిటర్ చేయాలి. లోపల అబ్జర్వేషన్  రూంకి వెళ్దాం రా.” అని తీసుకెళ్ళింది.

          అక్కడ ఒక మానిటర్ కి కనెక్ట్ చేసి, ఐ.వి కూడా పెట్టి, “నేను అరగంటలో వస్తాను. నొప్పులు మాములుగా వుంటే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ” అని వెళ్ళింది.

          నేను పక్కకు తిరిగాను, కళ్ళలో నుండి ఆగకుండా కన్నీళ్ళు కారుతూనే వున్నాయి.

          “ఎందుకు ఈ పనులన్నీ చేయాలి. బెడ్ రెస్ట్ అంటే పనులు చేయకుండా వుంటేనే కదా దాని ఫలితం బాగుంటుంది. ఇపుడు చూడు ఎంత కష్టం అవుతుందో.” అన్నాడు శ్రీని.

          చైతు నా చెయ్యి పట్టుకుని కూర్చున్నాడు. వాడి మొహం దిగాలుగా అయ్యింది.

          నా వెర్రితనం గురించి చెప్పనా, చెపితే ’ఎవరో ఏదో అంటారు అందుకని నీ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసుకుంటావా,’ అని అంటారు.

          నా ప్రవర్తనతో లోపల బిడ్డకు ఏం బాధ కల్గుతుందో, ఏ హాని జరుగుతుందో అని మనసు విలవిలలాడి పోయింది.

          “అమ్మ ఏం పరవాలేదమ్మా, కొన్ని రోజులు నాన్న పని చేస్తే, నేను హెల్ప్ చేస్తున్నాను కదా! బేబి పుట్టేదాక నువ్వు పనులు చేయకమ్మా ప్లీజ్!” అన్నాడు చైతు.

          “మేమేమి అరిగిపోవటం లేదు పని చేసుకుంటే కొన్ని రోజులు రెస్ట్ గా వుంటే, నీకు, బేబికి మంచిది.” శ్రీని అన్నాడు.

          నేనేమి మాట్లాడలేక పోయాను. అరగంట సేపు విపరీతమైన టెన్షన్ తో చచ్చి పోయాను.

          30 నిమిషాలు, 30గంటల్లా అనిపించాయి.

          డాక్టర్ వచ్చి అన్నీ చూసి, చిరునవ్వుతో, “అంతా బాగుంది. మీరు ఇంటికివెళ్ళొచ్చు. కానీ మళ్ళీ ఇంకోసారి ఇలా చేయకు. ఒక నెల తర్వాత ఈ బ్రెధిన్ పంప్ తీసేస్తాము. అపుడు నార్మల్ గా అన్ని చేసుకోవచ్చు డెలివరీ అయ్యేదాక. కానీ ఈ నెల రోజులు జాగ్రత్తగా వుండాలి తెలిసిందా? సారీ, ఇఫ్ ఐ టాక్ రూడ్లీ. టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్,” అని వెళ్ళింది. నర్స్ వచ్చి అన్ని డిస్ కనెక్ట్ చేసిన తర్వాత ఇంటికి వచ్చాము.

          ఇంటికి వచ్చేపుడు కాంతం ఫోన్ చేసినప్పట్నుండి మూర్ఖంగా నేను చేసిన పనుల గురించి బాధపడ్తూ చెప్పి, మరెప్పుడూ ఇలా చేయనని ఏడ్చాను.

          “అమ్మా ఏడవకమ్మా! పొద్దున్నుండి అలసిపోయావు. మళ్ళీ ఎక్కువవుతుంది.” అని నా చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు చైతు.

          “బేబి పుట్టే వరకు ఇంక అస్సలు ఏ పని చేయను కన్నా. నాకు చాలా భయం వేసింది.”

          ఇంటికి వచ్చి పడుకున్నాను. నేను చేసిన పిచ్చి పనికి నన్ను నేను చాలా తిట్టు కున్నాను.

          మర్నాడు మధ్యాహ్నం ఏదో కామెడి సినిమా పెట్టుకుని చూస్తుంటే కళ్ళు మూసుకు పోసాగాయి. ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది. మెల్లిగా లేచి వెళ్ళి చూసాను. మనవరాలిని ఎత్తుకుని, 75 ఏళ్ళ ఆవిడ, “కైసీ హో దుర్గా? కల్ ఆస్పతాల్ గయే తే క్యా? క్యాహువా?” అని ప్రశ్నల వర్షం కురిపించడం మొదలు పెట్టింది. నేను పక్కకు తప్పుకుంటూ, “అందర్  ఆయియే ఆంటీ,” అని ఆవిడ లోపలికి రాగానే తలుపేసి లోపలికి వెళ్ళి నా మంచం పై కూర్చున్నాను.

          వచ్చింది పక్క బ్లాక్ లో వుండే ఒక పంజాబీ జంటకి పాప పుడితే కానుపు చేయడానికి వచ్చింది ఆంటీ. ఆ తర్వాత కోడలు పనికి వెళ్తుందని పాపని చూసుకోవడానికి ఆమె ఇక్కడే వుండిపోయింది. మేము వచ్చిన కొత్తలో ఇండియా నుండి రెండు, మూడు కంపెనీ ల నుండి వచ్చిన వారుండేవారు. కానీ గత ఏడాది అందరూ వెళ్ళిపోయారు. కొంత మంది వేరే రాష్ట్రాలలో ఉద్యోగాలు చూసుకుని వెళ్ళారు, కొంత మంది ఇండియాకి వెళ్ళిపోయారు ప్రస్తుతం స్ట్రాఫర్డ్అపార్ట్మెంట్స్ లో మాతో పాటు ఓ నాలుగు ఇండియన్ కుటుంబాలున్నా యేమో.  కొడుకు, కోడలు ఆఫీస్ కి వెళ్ళిపోతే ఈ పెద్దావిడకి తోచేది కాదు, అదీకాక దేశం కాని దేశంలో ఒక్కతే ఉండాలంటే కూడా భయమే ఆమెకి. ఇందులో ఆవిడ తప్పేమి లేదు. ఇండియాలో పెద్ద కుటుంబం నుండి వచ్చి ఇక్కడ బయట ఒక్క మనిషి కూడా కన్పించక, కనిపించినా అంతా అమెరికన్స్, వాళ్ళ భాష రాదు మాట్లాడాలన్నా, కొడుకు, కోడలు ఆఫీస్ లకు వెళ్ళిపోతే ఆవిడ ఒంటరిగా ఉంటుందని నన్ను అపుడపుడు చూస్తూ ఉండమన్నారు. నాకు మాట్లాడే మనుషులు లేరు కదా, అపుడపుడు పలకరించడం పెద్ద పనేం కాదు కదా! అప్పటికి శ్రీనివాస్ కోలీగ్స్ అందరూ వెళ్ళిపోయారు, వీళ్ళొచ్చాక ఒకరి కొకరం తోడుగా వుండొచ్చు, సాయం చేసుకోవచ్చు అనుకున్నాం.

          నేను ఇంట్లో పనయ్యాక ఈ సమస్యలన్నీ రాక ముందు రోజు వెళ్ళి కాసేపు ఆమెతో మాట్లాడి వచ్చేదాన్ని. పాప పనులన్నీ చేసి ఆమె భోజనం చేసేది. ఒకరోజు కబుర్లు చెబుతూ కంచంలో భోజనం తెచ్చుకుని కూర్చుంది. అందులో రెండు చపాతీలు, కొద్దిగా కూర, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ పెట్టుకుని తింటుంది. నేను అది చూసి, ” అయ్యో ఇంకాస్త కూర కానీ, పప్పుకానీ వేసుకోక పోయారా? పచ్చిమిరపకాయతో తింటే మంచిది కాదు……,” ఆమె ఎడమ చేయి పైకి ఎత్తింది నన్ను మాట్లాడటం ఆపమని. మంచినీళ్ళు త్రాగి, “కోడలు నా కోసం మరో కూర చేస్తానని అంటుంది, కానీ నేనే వద్దని అంటాను. నాకిట్లా తినడం అలవాటే. అనవసరంగా నా కోసం కూరలు కొనడం, వండడం ఇష్టం లేదు. వాళిద్దరు కష్టపడి పని చేస్తున్నారు, వచ్చిన డబ్బులు అన్నీ ఖర్చు పెట్టేస్తే ఎట్లా?” నేను నోరు తెరిచాను.

          “కోడలు పిల్ల, చంటి పిల్లకి పాలివ్వాలి కాబట్టి ఇపుడు మంచి ఆహారం తినాలి. నా కొడుకు మొగపిల్లాడు, కడుపు నిండా వాడికిష్టమైన తిండి తినాలి. నేను ఏది తిన్నా ఏం కాదు. నా టికెట్ కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. నేనేం పని చేయటం లేదిక్కడ, అనవసరంగా ఖర్చు పెట్టించడం నాకిష్టం లేదు,” అన్నది ఆవిడ.

          ఇంతలో పాప లేచి ఏడవడం మొదలు పెట్టింది. నేను లేచి,”మీరు తినండి నేను చూస్తాను,” అన్నాను.

          “ఏం పర్వాలేదు, నువ్వు కూర్చో. నేను చూస్తాను.” అని తిండి వదిలేసి మనవరాలి దగ్గరికి వెళ్ళింది. అక్కడే హాల్ లో కింద చిన్న పక్కవేసి పడుకోపెట్టింది. డయ్పర్ వేసి లేదు, పక్కమీద కూరలు, సరుకులు తెచ్చుకునే ప్లాస్టిక్ బ్యాగ్ లు వేసి వున్నాయి. అందుకే నన్ను దగ్గరికి వెళ్ళనీయ లేదు. 

          నేనున్నానని పాపకి క్లీన్ చేసి ముందు వాడిన డయ్పర్ వేసి పడుకోబెట్టింది. కోడలు బ్రెస్ట్ పంప్ తో పాలు పంప్ చేసి బాటిల్స్ లో పోసి ఫ్రిజ్ లో పెడ్తుంది. అవే మనవరాలికి తాగిస్తుంది ఈవిడ.

          నేను హాస్పిటల్ లో వున్నపుడు కోడలు వచ్చి శ్రీనివాస్ ని నేనెలా వున్నానని అడిగి వెళ్ళిందట. ఒకరోజు కూర చేసి తీసుకొచ్చి ఇచ్చిందట.

          నేను ఇంటికి వచ్చాక ఇదిగో ఈవిడ ఇపుడే వచ్చింది. నేను వెళ్ళలేను కదా! మొన్నోసారి కోడలు ఫోన్ చేస్తే అడిగాను ఎలా వుంది మీ అత్తగారు అని. నిన్ను చాలా మిస్ అవుతుంది అని చెప్పింది. 

          మనవరాలిని ఒక బొమ్మల షీట్ వేసి పడుకోబెట్టింది. కొన్ని బొమ్మలు ముందర పడేసి నా సోఫా బెడ్ కి దగ్గరగా కుర్ఛీ జరుపుకుని కూర్చుని.

          “అబ్బతావో, తుమ్హారితబియత్కైసీ హై? కల్ ఆస్పతాల్గయేతేక్యా? సబ్ టీక్ హై నా?” అని అడిగింది.

          ఇంకేం పని కోడలు ఆఫీస్ నుండి వచ్చాక లివింగ్ రూమ్ లో వున్న గ్లాస్ డోర్ నుండి బయటికి చూస్తూ ఎవరు బయటకు వెళ్తున్నారు, ఎవరు ఇళ్ళకు వస్తున్నారు అని చూడడమే కదా మీ పని అనుకున్నాను.

          “హా! సబ్ టీక్ హై. చెకప్ కే లియే గయే తే.” అన్నాను.

          “బస్ భగవాన్ కి దయాసే సబ్ కుచ్ టీక్ హో జాయేగా. తుమ్ఘబ్రానానహీ! హమ్లోగ్ హై నా! మై ఆవుంగీ డెలివరీ కే సమయ్, మై రాత్ కో ఆకే తుమ్హారే పాస్ రవుంగీ.” అని ధైర్యం చెప్పింది.

          నాకు నమ్మకం లేదు వీళ్ళు చేస్తారని. ఏమో చూద్దాం అనుకున్నాను.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.