నడక దారిలో-30

-శీలా సుభద్రా దేవి

జరిగిన కథ : తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న కుటుంబంలో నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీతో బాటు సాహిత్యం, సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటంతోను గడిపాను. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గారికి దేవి పేరుతో కలంస్నేహం , రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. డిగ్రీ పరీక్షల తర్వాత హైదరాబాద్ శాశ్వతంగా వచ్చేసాను. ఏడాది తిరగకుండానే మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహాలతో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయింది. ఉమ్మడి కుటుంబం విడిపోయి వేరు కాపురాలు అయ్యాయి. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, మాకు బాబు పుట్టటం తర్వాత—

***

 
          సభలకుగానీ సినిమాలకుగానీ ఎక్కడకీ వెళ్ళాలనే ఉత్సాహం తగ్గిపోయింది. ఇంటికి దగ్గరగా ఉన్న పరిషత్తు భవనంలో జరిగే యువభారతి మీటింగులకు కూడా వెళ్ళటం లేదు. వీర్రాజుగారు ఒక వైపు తన స్వంత కార్యాలయం వికాస్ కి వెళ్ళటం, వచ్చిన తరువాత కవులు రచయితల పుస్తకం ముఖచిత్రాలు, కుదిరినప్పుడు యథావిధిగా సభలూ, సమావేశాలతో బిజీగా ఉంటున్నారు.
       
          ఒకసారి తప్పని పరిస్థితుల్లో బంధువుల ఇంటికి ఏదో ఫంక్షన్ కి వెళ్ళాల్సి వచ్చింది. “ఇలాంటి అనారోగ్యపు మగపిల్లాడి కన్నా ఆడపిల్లలుండటం నయం” అని అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తోడికోడలు అంది. ఆమె మాటలు నిజానికి ఉన్న మాటలే అయినా మనసు బాధగా మూల్గింది. దాంతో నేను పూర్తిగా ఎక్కడికీ ఎవ్వరి ఇంటికీ వెళ్ళటం మానేసాను. మా యింటికి కూడా ఏడాదికో రెండేళ్ళకో నెలరోజులపాటు వచ్చి ఉండే మా పెద్దాడబడుచు కుటుంబం రావటం లేదు. మా మరుదుల కుటుంబాలూ రావటం మానేసారు.పెద్ద మరిది మాత్రం అవసరమైనప్పుడు పిల్లల ఫీజులకనో, ఇంట్లో ఎవరికో ఒంట్లో బాగాలేదనో అన్నగారిని డబ్బు అడగటానికి వస్తుంటాడు.
             
          పల్లవి బడికి వెళ్ళేక నేను వంటా, ఇతర పనులు పూర్తి చేసుకునే వరకూ బాబును ఆయన చూసుకునేవారు. ఆయన వికాస్ ఆఫీసుకు వెళ్ళాక టేప్ రికార్డర్ లో లలిత సంగీతం కేసెట్ లు పెట్టుకుని వచ్చిన పాటల్ని దానితో పాటూ మెల్లగా రాగాలు తీసు కుంటూ, విషాద పాటలు మనసుని మరింత భారం చేస్తే సజలాలైన కళ్ళతో బాబుని చూసుకుంటూ మౌనంలోకి జారిపోయే దాన్ని.
           
          వీర్రాజు గారి దగ్గరకు ముఖచిత్రాలు వేయించుకోవాలని వచ్చే కవులతోనో, వారి మిత్రులతోనో ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న కొత్తగా రాస్తున్న కవులు కూడా వచ్చేవారు. వాళ్ళని చూస్తే నాకు చదువుకోవాలనే కోరిక మళ్ళా తొలచటం మొదలైంది.
       
          ఒకరోజు ఆయనతో “నేను దూరవిద్య ద్వారా ఎమ్మే చదువుకోనా” అని అడిగాను. ఆయన ఆశ్చర్యపోయి “ఈ స్థితిలో బాబుతో….అయినా..కవిత్వం రాయటం తగ్గి పోతుందేమో” అన్నారు.
     
          “అందుకే చదవాలని ఉంది. చదువులో పడితే ఈ డిప్రెషన్ తగ్గుతుందేమో. తెలుగు ఎమ్మే అయితే ఎక్కువ కష్టం పడక్కర్లేదు కదా”అన్నాను. ఆయన ఏమీ మాట్లాడ లేదు.
     
          తన దగ్గరకు వస్తున్న చదువుతున్న కుర్రాళ్ళను అడిగారు. బహుశా వాళ్ళలో సిధారెడ్డి, శంకరం మొదలైన వారు ఉండే ఉంటారు నేను ఆ పరిస్థితుల్లో ఎవరితోనూ మాట్లాడేటంత వెసులుబాటు లేదు, మనసూ లేదు.
       
          ఏమైతేనేం వాళ్ళు అప్లికేషన్ తీసుకువస్తే నింపిన తర్వాత ఆయనవెళ్ళి ఫీజు కట్టి వచ్చారు. కానీ స్టడీ మెటీరియల్స్ తేలేదు. సిలబస్ మాత్రమే ఉంది. ఇంట్లో యువభారతి ప్రచురణలు ఉన్నాయి. ఆరుద్ర సమగ్రాంధ్ర సంపుటాలు ఉన్నాయి. బాబు పడుకున్న సమయంలో నాకు కావలసిన విధంగా సిలబస్ ని బట్టి నోట్సులు తయారు చేసుకున్నాను.
       
          కానీ తరుచూ అనారోగ్యం పాలు అవుతున్న బాబుతో చదవటం ఇబ్బందిగా ఉన్నా నేను సమయం దొరికినప్పుడల్లా పుస్తకం తిరగేస్తూనే ఉన్నాను.
     
          నాలుగింటికి పల్లవి స్కూలు నుంచి వచ్చాక ఏదో తినటానికి ఇచ్చి హోంవర్క్ చేయించటం, చదివించడం చేసేదాన్ని. బాబుని పడుకోబెట్టేటప్పుడు నేను లలిత గీతాలు పాడుకుంటూ రాగాలు తీస్తుంటే పల్లవి కూడా గొంతు కలిపేది. ఎక్కడా అపశృతి లేకుండా పాడుతున్న పల్లవిని చూసి సంగీతం నేర్పిస్తే బాగుండును అనుకునేదాన్ని. ఇంటికి దగ్గరలోనే సంగీత కళాశాల ఉన్నా తీసుకెళ్ళటం, తీసుకురావటం నాకు కష్టం అని ఊరుకున్నాను.
       
          దూరవిద్యలో ఎమ్మే పరీక్షలు రాసేవాళ్ళ కోసం యూనివర్సిటీ వాళ్ళు పరీక్షలకు ముందు పదిహేను రోజులు ఓరియంటేషన్ క్లాసులు ఏర్పాటు చేశారు. కాని పదిహేను రోజులపాటు పిల్లాడిని వదిలి రోజంతా క్లాసులకి వెళ్ళే పరిస్థితి లేదు కనుక వెళ్ళలేదు.
         
          పరీక్షలు సమయానికి అమ్మని సాయానికి రమ్మన్నాను. ఇంటికి దగ్గరలోనే ఉన్న రెడ్డి కాలేజీలోనే సెంటర్ పడింది. బాబుకి అన్నం తినిపించి నేను పరీక్షకు వెళ్ళాను.
         
          పరీక్ష హాలుకు వెళ్ళటానికి మెట్లు ఎక్కుతుంటే “చిన్నపాపాయీ నువ్వేనా” మెట్ల పైన ఒక ఆమె పలకరించింది.
       
          నన్ను చిన్నపాపాయీ అని పిలిచేదెవరా అని ఆశ్చర్యంగా చూసాను. నా చిన్ననాటి స్నేహితురాలు రోణంకి అప్పలస్వామి గారి చిన్నమ్మాయి లలిత.
     
          ఇద్దరం సంబరంగా చేతులు కలుపుకొని పరీక్ష సమయం అయిపోతుందని పరీక్ష అయ్యాక కలుద్దామనుకున్నాము.
       
          పరీక్ష రాసిన తర్వాత కాసేపు ఇన్నాళ్ళ కబుర్లు చెప్పుకొని మర్నాడు తొందరగా వచ్చి మాట్లాడుకుందామని వీడ్కోలు చెప్పుకున్నాము.
         
          లలిత కొత్తగూడెంలో ఉంటుందట. వాళ్ళాయన చిన్నప్పటి నుండి అనుకున్న మేనత్త కొడుకూ, అప్పట్లో మాకందరకూ తెలిసిన పెద్దబాబే. అతను రామగుండంలో ఇంజనీరుగా పనిచేస్తున్నాడనీ, లలిత కూడా అక్కడే స్కూల్ లో టీచరుగా పనిచేస్తున్నా నని చెప్పింది. మా బాబు సంగతి తెలిసి బాధపడింది.
     
          మొత్తం మీద ఎమ్మే మొదటి సంవత్సరం పరీక్షలు నిర్విఘ్నంగా పూర్తి చేసాను. పరీక్షలు అయ్యాక అమ్మ అక్కయ్య వాళ్ళింట్లో ఓ వారం రోజులు ఉండి విజయనగరం వెళ్ళిపోయింది.
           
          స్వాతి పత్రిక వాళ్ళు విజయవాడ వెళ్ళిపోవటంతో మా కాంపౌండ్ లోనే ఉన్న రంగారావు గారు ఆ గదిని తీసుకున్నారు. అయితే రంగారావు గారి మిత్రుడు భక్తవత్సలం అనే స్వర్గం నరకం ఫేం మోహన్ బాబు, అతని సహనటి అయిన సరోజ వగైరాలతో సహా ఆ గదిలో రాత్రి అయ్యేసరికి చేరి రాత్రంతా పార్టీలు చేసుకుని రచ్చరచ్చ చేసేవారు. ఆ గది మాకు పక్కనే ఉండటాన రాత్రంతా ఆ వాసనలు, ఆ గందరగోళాలూ మాకు న్యూసెన్స్ గా మారింది.
         
          ఒకరోజు సినిమాకు వెళ్ళొచ్చి “సినీమా చాలా బాగుంది. మంచిపాటలూ, డాన్సులు నీకు ఇష్టం కదా రేపు మనం వెళ్దామా” అన్నారు. బాబును తీసుకొని వెళ్ళటానికి నేను వెనకా ముందు అయ్యాను. కానీ పర్వాలేదంటూ తీసుకువెళ్ళారు. ఆ సినీమా శంకరాభరణం.
       
          కూనిరాగాలకే పరిమితమైన నా కంఠానికి ఒక ఊపును ఇచ్చింది శంకరాభరణం చిత్రం. బాబుని పడుకోబెడుతూ అందులో పాటలన్నీ పాడుకునే దాన్ని. నేను పాడగా విని పల్లవి కూడా ఆ పాటలన్నీ చక్కగా పాడేది. ఒక విధమైన దిగులు, నిస్తేజం అలుము కున్న ఇంటిలో మా రాగాలు సీతాకోకచిలుకల్లా అప్పుడప్పుడు ఎగురుతున్నాయి.
       
          అంతకు ముందు రాసిన కథలు ప్రచురితం అయిన రోజు ఉత్సాహం మనసు నిండా ఊపిరులూదుతుంది. నెలలు గడుస్తున్నా, ఏడాదులు దొర్లుతున్నా ఎదుగు బొదుగూ రెండేళ్ళు దాటినా బోర్లా పడటం తప్ప మరేమీ చేయలేని బాబుని చూసేసరికి దుఃఖం గుండెనిండా మబ్బులా కమ్మేస్తుంది.
       
          కవిత్వ రంగంలో ఒకవైపు విరసం ప్రభావంతో ఉరకలెత్తే ఉత్సాహంతో రాస్తున్న కవులకు కుందుర్తి పిలుపు అందుకొని వచన కవిత్వం కలగలిసి ఉవ్వెత్తున కవిత్వం వస్తోంది.
       
          వీర్రాజు గారు వేస్తున్న వచనకవిత సంపుటాల ముఖచిత్రాలు చూస్తుంటే మనసు మూగపోతోంది. నేను రాయటం మొదలు పెట్టిన రోజుల్లోనే సాహిత్యంలోకి వచ్చిన వాళ్ళంతా చకచకా ఎదిగిపోతున్నారు. నేను అంతకంతకూ నాలోకి నేను కూరుకు పోయి కకూన్ ను అయిపోతున్నానన్న భావం నన్ను కుంగదీస్తోంది.
             
          వీర్రాజు గారికి తనని తాను ఉత్సాహం పరచుకోటానికి తన పుస్తకాలు ప్రచురించు కోవటం ఒక అలవాటు. ఆ రకంగా నా లోకి నేను ముడుచుకు పోవటం చూసి నా కథలను పుస్తకంగా వేయాలని తలపెట్టారు. కథలన్నీ ఒకచోట చేర్చి అందులో అంతగా పరిణితి లేని కథలుగా అనిపించినవి తీసివేసాము. రంగు వెలిసిన బొమ్మ అని శీర్షికతో ఫైల్ చేసాము.
       
          ఈలోగా మేము ఆ ఇంట్లోకి వచ్చి పదేళ్ళు దాటిపోవటంతో ఇల్లు గల ఆయన మమ్మల్ని ఖాళీ చేయమని ఒత్తిడి తేవటం మొదలెట్టాడు. ముందు అద్దె ఇవ్వటం లేదని కోర్టుకు వెళ్తానని బెదిరించబోయాడు. తర్వాత ఎదురు డబ్బు ఇస్తానని కాళ్ళబేరంకి వచ్చాడు. కానీ వీర్రాజు గారు వికాస్ ఆఫీస్ దగ్గరలో ఉండటం, బాబు అనారోగ్య కారణాల వలన ఇల్లు దొరుకుతే ఏడాది లోపునే ఖాళీ చేస్తామని చెప్తే అంగీకరించాడు.
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.